• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - వివిధ కమిటీల సిఫార్సులు

పరస్పర సహకారంతో పరిపూర్ణ సమాఖ్య!
 

భారతదేశాన్ని పరిపాలనా పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార విధులు, వాటి పరిధులను నిర్దేశించింది. మారుతున్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇరు ప్రభుత్వాల మధ్య వివాదాలు పెరుగుతూ వస్తున్నాయి. అధికారాల విభజన, నిధుల పంపిణీ, గవర్నర్‌ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులపై నియంత్రణ వంటి అంశాల్లో స్పర్థలు ఎక్కువయ్యాయి. ఆ విభేదాలను తొలగించి, ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం కుదిర్చేందుకు ఇటీవల కాలంలో పలు కమిషన్‌లు ఏర్పాçయ్యాయి. రాజ్యాంగ లక్ష్యాలను సాధించేందుకు కీలక సిఫార్సులు చేశాయి. వాటిపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి.

భారతదేశం పరిపాలనాపరమైన సమాఖ్యగా కొనసాగాలంటే కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు అవసరం. వీటి మధ్య అభిలషణీయ బంధాలను పెంపొందించేందుకు అవసరమైన సిఫార్సులను వివిధ కమిటీలు చేశాయి.

మదన్‌ మోహన్‌ పూంచీ కమిషన్‌:  కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసి, తగిన సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ మోహన్‌ పూంచీ నేతృత్వంలో 2007, ఏప్రిల్‌ 28న ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో సభ్యులు 1) వినోద్‌ కుమార్‌ దుగ్గల్‌ 2) ధీరేంద్ర సింగ్‌ 3) అమరేష్‌ బాగ్చి 4) ఎన్‌.ఆర్‌.మాధవ మేనన్‌

పూంచీ కమిషన్‌ ఏడు అధ్యాయాలతో కూడిన నివేదికను 2010, ఏప్రిల్‌ 20న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో 273 సిఫార్సులున్నాయి.

* మొదటి అధ్యాయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిణామ క్రమం వివరించారు.

* రెండో అధ్యాయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 19, 355, 356, 263 లకు సంబంధించిన అంశాలపై సిఫార్సులు ఉన్నాయి.

* మూడో అధ్యాయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు, ఆర్థిక వనరుల పంపిణీ, ప్రాంతీయ అసమానతల తొలగింపునకు అవసరమైన ప్రణాళికా నమూనాను వివరించారు. 

* నాలుగో అధ్యాయంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం(1992), 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ల అమలు తీరుకు సంబంధించిన అంశాలు, 4వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన సిఫార్సులు ఉన్నాయి.

* ఐదో అధ్యాయంలో జాతీయ ఆంతరంగిక భద్రతకు విఘాతం కలిగిస్తున్న నక్సలిజం, తీవ్రవాదం, మతకల్లోలాలు, హింస మొదలైన అంశాల ప్రభావం, నియంత్రణకు చేపట్టాల్సిన సిఫార్సులు వివరించారు.

* ఆరో అధ్యాయంలో పర్యావరణ సమస్యలు, సహజ వనరుల విభజనకు సంబంధించిన అంశాలపై సిఫార్సులున్నాయి.

* ఏడో అధ్యాయంలో సామాజికాభివృద్ధి, సుపరిపాలనకు సంబంధించిన సిఫార్సులు ఉన్నాయి.


కీలక సిఫార్సులు:

 * ఆరోగ్యం, ఇంజినీరింగ్, విద్య, న్యాయ అంశాలకు సంబంధించి కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి.

* రాష్ట్రాల జనాభా, విస్తీర్ణంతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యం కల్పించాలి.

* అంతర్గత సంఘర్షణల నేపథ్యంలో మొత్తం రాష్ట్రానికి ఆర్టికల్‌ 356 ప్రకారం కేంద్రపాలన విధించే బదులు పరిమిత ప్రాంతానికి ‘స్థానిక కేంద్ర పాలన’ను విధించాలి. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356(3)ను సవరించాలి.

* ఆర్టికల్‌ 355 ప్రకారం దేశంలోని రాష్ట్రాలను సంరక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. ఈ ఆర్టికల్‌ను సమర్థంగా వినియోగిస్తే ఆర్టికల్స్‌ 352, 356లను ఉపయోగించే పరిస్థితులు ఉండవు.

* రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు ఆర్టికల్‌ 356ను కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు 1994లో ఎస్‌.ఆర్‌.బొమ్మై కేసు సందర్భంగా ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలి. తద్వారా కేంద్ర, రాష్ట్ర సంబంధాలు పటిష్ఠమై అపోహలు తొలగుతాయి.

* గవర్నర్‌లను సరైన కారణం లేకుండా తొలగించ కూడదు. గవర్నర్‌ పదవీకాలం కేంద్రం (రాష్ట్రపతి) అభీష్టసూత్రంపై ఆధారపడటం సరైన విధానం కాదు. గవర్నర్‌లను తొలగించడంలో రాష్ట్ర శాసనసభలు మహాభియోగ తీర్మానాన్ని అనుసరించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి.

* వివాదాస్పదం కాని, రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తినే గవర్నర్‌గా నియమించాలి. రాష్ట్ర ప్రథమ పౌరుడిని నియమించేటప్పుడు సంబంధిత ముఖ్యమంత్రిని సంప్రదించాలి.

* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి.

* దేశ అఖండత, సమగ్రత, సాంఘిక, ఆర్థికాభివృద్ధికి పరిష్కారంగా సహకార సమాఖ్యను ఏర్పాటు చేయాలి.

* గవర్నర్‌ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరించే సంప్రదాయాన్ని తొలగించాలి.

 

పూంచీ కమిషన్‌ కొత్తగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినవి:

 * సామాజిక రంగంలో ప్రమాణాలు కాపాడటానికి ‘జాతీయ ప్రమాణాల సంస్థ’.

* ఆర్థిక సంఘానికి ‘ప్రత్యేక సచివాలయం’.

* ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ‘ప్రాంతీయ మౌలిక వసతుల సలహా మండలి’. 

* బొగ్గు, చమురు, గ్యాస్‌లకు ఉమ్మడిగా ఒకే రెగ్యులేటరీ అథారిటీ. 

* అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్య మండలి 

* సమీకృత ఈశాన్య జలవనరుల అథారిటీ 

* ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాంతీయ భద్రత ఏజెన్సీ’. 

* అంతర్రాష్ట్ర మండలికి మరిన్ని అధికారాలతో ‘ప్రత్యేక సచివాలయం’.


మతకల్లోలాల నియంత్రణకు సిఫార్సులు:  

* బలవంతపు మతమార్పిడులను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

* జాతీయ సమైక్యతా మండలికి మరిన్ని అధికారాలు కల్పించాలి. దీనికి కేంద్ర హోంమంత్రి డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించాలి.

* మతకల్లోలాలు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని 48 గంటల్లోగా జాతీయ సమైక్యతా మండలి బృందం సందర్శించాలి.

* దేశ ప్రజల మధ్య మత సామరస్యాన్ని సాధించేందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కన్వీనర్‌గా ఆరు (ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య, ఈశాన్య) ప్రాంతాల హోం మంత్రులు రొటేషన్‌ పద్ధతిలో సభ్యులుగా ఉండే స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలి.

* జాతీయ సమగ్రతా మండలికి రాజ్యాంగ హోదా కల్పించాల్సిన అవసరం లేదు.

 

హంగ్‌ అసెంబ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అనుసరించాల్సిన నియమాలు: 

* శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం మెజార్టీ పార్టీని లేదా మెజార్టీ పార్టీల కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. 

* ఎన్నికల కంటే ముందే ఏర్పడిన కూటమిని ఒక పార్టీగా భావించి, ఎన్నికల్లో ఈ కూటమి మెజార్టీ సాధిస్తే దాన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి.

 * ఒకవేళ ఎన్నికలకు ముందే ఏర్పడిన ఏ పార్టీకి లేదా సంకీర్ణ కూటమికి సంపూర్ణ మెజార్టీ రాకపోతే ముఖ్యమంత్రిని నియమించడానికి గవర్నర్‌ కొన్ని ప్రాధాన్యాలు అనుసరించాలి. అవి 

ఎ) ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటముల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన కూటమిని ఆహ్వానించాలి. బి) అత్యధిక స్థానాలు పొంది, ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన పార్టీని పిలవాలి. 

సి) ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడి, ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన కూటమిని పరిగణనలోకి తీసుకోవాలి. డి) ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడి, కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో చేరి స్వతంత్రులతో సహా మరికొన్ని రాజకీయ పార్టీలు బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఆ కూటమిని స్వాగతించాలి. 

 

ఇతర సిఫార్సులు: 

* ఆర్థిక సంఘానికి, ప్రణాళికా సంఘానికి సమన్వయం ఉండాలి. 

* కేంద్ర జాబితాలోని వివిధ అంశాలు కేంద్ర, రాష్ట్ర అధికార పరిధిలో అతివ్యాప్తి ఉండే అవకాశం ఉన్న కారణంగా జాతీయ ప్రయోజనార్థ  ఏకరూపత సాధించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. 

* వృత్తి పన్నుపై గరిష్ఠ పరిమితిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలి.

* ప్రధాన ఖనిజాల రాయల్టీని ప్రతి మూడేళ్లకు సవరించాలి. అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే రాష్ట్రాలకు సముచిత నష్టపరిహారం చెల్లించాలి.

రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌:  రాజ్యాంగాన్ని పునఃసమీక్షించేందుకు 2000 సంవత్సరంలో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య అధ్యక్షతన కమిషన్‌ ఏర్పాటైంది. ఈ కమిషన్‌ రాజ్యాంగ పునఃసమీక్షలో భాగంగా కేంద్ర, రాష్ట్రాల సంబంధాల మెరుగుదలకు పలు సూచనలతో 2002లో నివేదిక సమర్పించింది.


సిఫార్సులు: * అంతర్రాష్ట్ర మండలి సమావేశాలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలి. * జలవనరుల ట్రైబ్యునల్‌ వెలువరించిన తీర్పులను రెండు నెలల్లోగా అమలుచేయాలి.* గవర్నర్‌ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నియమాన్ని నిర్దేశించాలి. * పార్లమెంటు ఆమోదం తర్వాతే ఆర్టికల్‌ 356ను ప్రయోగించి, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి.* రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్‌ ఆరు నెలల్లోగా నిర్ణయాన్ని వెలువరించాలి.


రెండో పరిపాలన సంస్కరణల సంఘం:  దేశ పరిపాలనలో రావాల్సిన మార్పులు సూచించేందుకు 2007లో వీరప్ప మొయిలీ నేతృత్వంలో రెండో పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో సభ్యులు వి.రామచంద్రన్, ఎ.పి.ముఖర్జీ, ఎ.హెచ్‌.కరో, జయప్రకాష్‌ నారాయణ, వినీతా రాయ్‌.

 * వీరప్ప మొయిలీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో వి.రామచంద్రన్‌ నేతృత్వం వహించారు.

 * రెండో పరిపాలనా సంస్కరణల సంఘం ప్రభుత్వ పాలనా వ్యవస్థను సమగ్రంగా పునర్‌ వ్యవస్థీకరించడానికి, బాధ్యతాయుత పరిపాలన, జవాబుదారీతనం, సమర్థ పరిపాలనకు సంబంధించిన 15 నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అవి:

1. సమాచారహక్కు, మంచి పాలనకు మూలం

2. సంక్షోభ నిర్వహణ, నియంత్రణ 

3. మానవ మూలధనం అన్‌లాకింగ్‌ చేయడం 

4. సంఘర్షణల పరిష్కారం కోసం సామర్థ్యం పెంపు

5. స్థానిక పాలన 

6. పబ్లిక్‌ ఆర్డర్‌ 

7. పాలనలో నీతి 

8. లోకల్‌ గవర్నెన్స్‌ 

9. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం 

10. ఆర్థిక పరిపాలన 

11. పౌరుల చుట్టూ పరిపాలన

12. భారత ప్రభుత్వం సంస్థాగత నిర్మాణం 

13. సోషల్‌ క్యాపిటల్‌ 

14. సిబ్బంది పరిపాలన పునరుద్ధరణ

15. ఇ-పరిపాలనకు ప్రోత్సాహం 


ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ తీర్మానం:  పంజాబ్‌లోని అకాలీదళ్‌ పార్టీ 1973లో ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ అనే ప్రాంతంలో సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలో నిజమైన సమాఖ్య స్ఫూర్తిని తీసుకురావాలని, కేంద్ర ప్రభుత్వం కేవలం రక్షణ, అంతర్జాతీయ సంబంధాలు, కమ్యూనికేషన్‌లు, కరెన్సీ లాంటి అంశాలకే పరిమితం కావాలని అందులో పేర్కొంది.


పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మెమొరాండం:  కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మెరుగుపడాలంటే అనుసరించాల్సిన నియమ నిబంధనలను పేర్కొంటూ 1977లో పశ్చిమ బెంగాల్‌లోని వామపక్ష ప్రభుత్వం ఒక మెమొరాండాన్ని ఆమోదించింది.


ముఖ్యాంశాలు: * అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలి.* రాజ్యాంగంలోని యూనియన్‌ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో సమాఖ్య అనే పదాన్ని చేర్చాలి.* రాజ్యసభకు లోక్‌సభతో సమానంగా అధికారాలు కల్పించాలి. * జోనల్‌ కౌన్సిల్‌ వ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించాలి. * నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.* రాజ్యాంగం నుంచి ఆర్టికల్‌ 356, 360లను తొలగించాలి.

 రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 14-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌