• facebook
  • whatsapp
  • telegram

నాడీవ్యవస్థ

  బహుకణ జీవుల్లో నియంత్రణ సమన్వయానికి, శరీరం వెలుపల జరిగే మార్పులకు అనుక్రియ (Response)ను చూపేందుకు నాడీవ్యవస్థ అభివృద్ధి చెంది ఉంటుంది. నాడీవ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక ముఖ్యకణాలు నాడీకణాలు (న్యూరాన్లు). ఈ కణాలకు తోడుగా గ్లియల్ కణాలుంటాయి. ఇవి నాడీకణాల పోషణ, రక్షణకు ఉపయోగపడతాయి. నాడీకణంలో కణదేహం, డెండ్రైట్లు, ఎక్సాన్ అనే భాగాలుంటాయి. నాడీ కణదేహంలో కేంద్రకం, నిస్సల్ కణికలు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. కణదేహం నుంచి ఏర్పడే పోగుల్లాంటి నిర్మాణాలు డైండ్రైట్లు. ఇవి శాఖోపశాఖలుగా ఉండి సమాచారాన్ని సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. ఎక్సాన్(Axon) నాడీకణ దేహం నుంచి ఏర్పడే పొడవైన నిర్మాణం. ఎక్సాన్ చివర అనేక శాఖలుగా చీలుతుంది. వీటిని నాడీ అంత్యాలు అంటారు. ఇవి మరొక నాడీకణం డెండ్రైట్, ఎక్సాన్ లేదా కండర కణజాలంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. రెండు న్యూరాన్లు లేదా న్యూరాన్, కండర తంతువు మధ్యప్రదేశాన్ని సైనాప్స్ (Snapse) అంటారు. ఎక్సాన్‌కు ఉండే తొడుగును మైలిన్ తొడుగు (Myelin sheath) అంటారు. ఇది ఎక్సాన్ ద్వారా ప్రయాణించే విద్యుత్ ప్రచోదనాలను బయటకు వెళ్లకుండా కాపాడుతుంది. మైలిన్ తొడుగు లేని ప్రదేశాలను రణ్‌వీర్ కణుపులు అంటారు. నాడీకణాలకు విభజన చెందే శక్తిలేదు.

 

నాడీవ్యవస్థ ఉపయోగాలు

       ఇది మన శరీరం లోపల, వెలుపల జరిగే మార్పులకు ప్రతిస్పందిస్తుంది. శరీరంలో ఉండే గ్రాహకాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ప్రచోదనాలను మెదడుకు చేరవేస్తుంది. మెదడు ఇచ్చిన ఆజ్ఞలను అవయవాలకు పంపిస్తుంది. మనం గ్రహించిన సమాచారాన్ని గ్రహిస్తుంది, నిల్వ చేసుకుంటుంది, విశ్లేషిస్తుంది. అవసరమైన సమాచారాన్ని కావాల్సిన సమయంలో జ్ఞప్తికి తెస్తుంది.

 

నాడులు

      నాడీకణాలు కలసి నాడులను ఏర్పరుస్తాయి. ఇవి వివిధ అవయవాల నుంచి సమాచారాన్ని తీసుకువస్తాయి, తీసుకువెళతాయి. శరీరంలోని వివిధ భాగాల్లో ఉన్న గ్రాహకాల నుంచి కేంద్రనాడీవ్యవస్థకు సమాచారాన్ని తీసుకు వెళ్లేవాటిని జ్ఞాన లేదా అభివాహినాడులు (sensory or afferent nerves) అంటారు. కేంద్రనాడీ వ్యవస్థ నుంచి వివిధ అంగాలకు సమాచారాన్ని తీసుకు వచ్చే నాడులను చాలక లేదా అపవాహి నాడులు (motor or efferent nerves) అంటారు. మిశ్రమ నాడుల్లో పై రెండు రకాల పనులు జరుగుతాయి.

 

నాడీవ్యవస్థలోని భాగాలు

మానవ నాడీవ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి

1) కేంద్రనాడీ వ్యవస్థ (Central Nerves System),

2) పరిధీయ నాడీవ్యవస్థ (Perpheral Nerves System),

3) స్వయంచోదిత నాడీవ్యవస్థ (Autonomic Nerves System).

కేంద్రనాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము ఉంటాయి. మెదడు కపాలంలో భద్రంగా ఉంటుంది. మెదడులో బిలియన్ల కొద్ది నాడీకణాలుంటాయి.మనం తీసుకున్న ఆక్సిజన్‌లో సుమారు 20శాతం మెదడు వినియోగించుకుంటుంది. ఇది శక్తికోసం పూర్తిగా గ్లూకోజ్‌పై ఆధారపడుతుంది. జంతువులన్నింటిలోకెల్లా మానవ మెదడు ఎక్కువగా అభివృద్ధి చెందింది. మెదడును కప్పి మూడు పొరలుంటాయి. అవి

1) వరాశిక (Duramater) ఇది బయటపొర.

2) లౌతికళ (Archnoid memberane) ఇది మధ్య పొర.

3) మృద్వి (Pia) ఇది లోపల పొర.

ఈ పొరలనే మెనింజెస్ అని పిలుస్తారు.

 

మెదడు భాగాలు

మెదడును మూడు భాగాలుగా విభజింపవచ్చు. అవి:

1) ముందు మెదడు (Fore Brain)

2) మధ్య మెదడు (Mid Brain)

3) వెనుక మెదడు (Hind Brain)

       మెదడులో అతిపెద్ద భాగం ముందు మెదడు. దీనిలో ముఖ్య భాగాన్ని మస్తిష్కం (Cerebrum) అంటారు. ఇది లోతైన గాడితో రెండుభాగాలుగా విభజన చెంది ఉంటుంది.ఈ ప్రతి అర్ధభాగాన్ని మస్తిష్కార్ధగోళం అంటారు. దీనిలో కుడిమస్తిష్క అర్ధగోళం శరీరం ఎడమ భాగం చర్యలను నియంత్రిస్తుంది.ఎడమ మస్తిష్క అర్ధగోళం శరీరం కుడిభాగం చర్యలను నియంత్రిస్తుంది. ఈ అర్ధగోళాల బయట భాగం బూడిదరంగులో, లోపలి భాగం తెలుపురంగులో ఉంటుంది. బయట ఉండే బూడిద రంగు భాగాన్ని మస్తిష్క వల్కలం (Cerebral cortex) అంటారు. ఇది మడతలతో ఉంటుంది. దీనిలో ఉండే గట్ల లాంటి ప్రదేశాలను గైరి, వంపు ప్రదేశాలను సల్సి అని అంటారు. మస్తిష్క వల్కలంపై ఉన్న నిర్దిష్ట ప్రాంతాలు చూడటం, వినడం, మాట్లాడటం, రుచి, వాసనలను నియంత్రిస్తాయి. మస్తిష్క వల్కలం కిందిభాగంలో హైపోథాలమస్ అనే భాగం ఉంటుంది. దీనికి పిట్యుటరీ గ్రంథి అతికి ఉంటుంది. హైపోథాలమస్ స్రవించే హార్మోన్లు పిట్యుటరీ గ్రంథిని నియంత్రిస్తాయి. ఈ భాగం ఆకలి, దాహం, చెమట, ఉష్ణం, నిద్ర, కోపం, భయం లాంటి వాటిని నియంత్రిస్తుంది.
      మధ్య మెదడు ముందు మెదడు కిందుగా ఉండి వెనక, ముందు ఉండే మెదడ్లకు అనుసంధానకర్తగా పనిచేస్తుంది. అంతేకాకుండా చూడటానికి, వినడానికి ఉపయోగపడే చర్యలకు రిలే స్టేషన్‌లా పనిచేస్తుంది. వెనక మెదడులో అనుమస్తిష్కం (Cerebellum), మజ్జాముఖం (Medulla oblongata), పాన్స్ వెరోలి (Pons varolli) అనే భాగాలుంటాయి. అనుమస్తిష్కం నియంత్రిత చలనాల (Voluntary movements)ను, శరీర సమతాస్థితి (Equilibrium)ని, శరీర భాగాల స్థితి (Posture)ని నియంత్రిస్తుంది. మజ్జాముఖం అనియంత్రిత చలనాలైన గుండెకొట్టుకోవడం, శ్వాసక్రియ, హృదయస్పందన, రక్తపీడనం, లాలాజల ఉత్పత్తి లాంటి వాటిని నియంత్రిస్తుంది. ఈ మెదడు చివరి భాగం వెన్నుపాముగా కొనసాగుతుంది. పాన్స్ వెరోలి అనేది మజ్జాముఖం పై ఉంటుంది. ఇది మధ్యమెదడును, మజ్జాముఖాన్ని కలుపుతుంది.

 

వెన్నుపాము

        ఇది పొడవుగా ఉండి వెన్నెముక (Vertebral column) ద్వారా ప్రయాణిస్తుంది. వెన్నెముక వెన్నుపాముకు రక్షణ కల్పిస్తుంది. శరీర భాగాల నుంచి వార్తలు వెన్నుపాము ద్వారా మెదడుకు చేరతాయి. వెన్నుపాము బయట భాగం తెలుపు రంగులో, లోపల భాగం బూడిద రంగులో ఉంటుంది. దీని అడ్డుకోతలో బూడిద రంగు పదార్థం ఆంగ్ల అక్షరం-బీ ఆకారంలో కనిపిస్తుంది.వెన్నుపాము నుంచి వెన్నునాడులు ఉద్భవిస్తాయి.వెన్నుపాము ప్రతీకార చర్యలను నియంత్రిస్తుంది.

         ప్రతీకార చర్యలు (Reflex action) మెదడు ప్రమేయం లేకుండా, వేగంగా, వెంటనే, అప్రయత్నంగా జరిగే చర్యలు. వేడి పదార్థాన్ని ముట్టుకున్నప్పుడు చేతిని వెనుకకు తీసుకోవడం, తీక్షణమైన కాంతి కంటిమీద పడ్డప్పుడు కళ్లు మూసుకోవడం,ముళ్లు గుచ్చినప్పుడు వేగంగా ప్రతిస్పందించడం లాంటివి అసంకల్పిత చర్యలకు ఉదాహరణలు.శరీరంపై వివిధ రకాల ప్రేరణ లేదా క్షోభ్యత (stimulus)లు పనిచేస్తాయి.వీటికి శరీరం ప్రతిస్పందిస్తుంది. ప్రతీకార చర్య జరిగే మార్గాన్ని ప్రతీకార చర్యాచాపం (Reflex arch) అంటారు. దీనిలో భాగాలు 1) శరీరంలోని గ్రాహకం (Receptor), 2) జ్ఞాననాడి (Sensory nerve), 3) మధ్యస్థ నాడీకణం (Inter neuron), 4) చాలకనాడి (Motor nerve), 5) నిర్వాహక అంగం (Effector orgon). క్షోభ్యత పనిచేసినప్పుడు గ్రాహకం దానికి ప్రతిస్పందించి విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తుంది.ఈ ప్రచోదనాలు జ్ఞాననాడి ద్వారా ప్రయాణించి వెన్నుపామును చేరతాయి. ఇక్కడ ఉన్న మధ్యస్థ నాడీకణం సహాయంతో సమాచారం విశ్లేషించబడి ప్రతిక్రియ జరిగి సమాచారం తిరిగి ప్రచోదనాల రూపంలో చాలకనాడి ద్వారా నిర్వాహక అంగాన్ని చేరుతుంది. నిర్వాహక అంగం చివరకు నిర్దిష్ట పనిని నియంత్రిస్తుంది.
ప్రతీకార చర్యలు రెండు రకాలు. అవి:

            1) నిబంధన రహిత చర్యలు (Unconditional reflexes), 2) నిబంధన సహిత చర్యలు (Conditional reflexes). నిబంధన రహిత చర్యలు పుట్టుకతోపాటే ఉంటాయి. వీటిని మనం మధ్యలో అలవాటు చేసుకోలేం. ఇవి అందరిలో ఒకేరకంగా ఉంటాయి.నిబంధన సహిత చర్యలు నిత్యజీవితంలో ఒక పనిని అనేకసార్లు చేయడంవల్ల ఏర్పడతాయి. వీటిపై మొదట పరిశోధన చేసిన శాస్త్రవేత్త పావ్‌లోవ్ (Pavlov). ఇతడు కుక్కపై పరిశోధన చేసి గంట కొట్టగానే ఆహారం ఇవ్వకపోయినా అది లాలాజలం స్రవిస్తుందని తెలిపాడు.

 

పరిధీయనాడీవ్యవస్థ

           మెదడు, వెన్నుపాము నుంచి వెలువడే నాడులను కలిపి పరిధీయనాడీవ్యవస్థగా పిలుస్తారు. వీటి సంఖ్య 43 జతలు. ఈ నాడుల్లో 12 జతలు నాడులు మెదడు నుంచి ఉద్భవిస్తాయి. వీటిని కపాలనాడులు (Cranial Nerves)అంటారు.వీటిలో 10వ నాడి తప్ప మిగతా నాడులు మెడ,ముఖ భాగాల్లో వ్యాపించి ఉండి సమాచారాన్ని తీసుకురావడానికి లేదా తీసుకువెళ్లడానికి సహాయపడతాయి. పదోనాడి (వేగస్ నాడి) మాత్రం మెడ కింద ఉండే శరీర భాగాల్లోకి ప్రయాణిస్తుంది. ఇది స్వరపేటిక, వాయునాళం, ఊపిరితిత్తులు, గుండె, ఆహారనాళం,క్లోమగ్రంథి,జీర్ణాశయం లాంటి భాగాల వరకు వ్యాపించి ఉండి సమాచార ప్రసరణకు ఉపయోగపడుతుంది. వెన్నుపాము నుంచి వెలువడే 31 జతల నాడులను వెన్నుపాము నాడులు అంటారు. వీటిలో జ్ఞాన,చాలక నాడులు కలిసి ఉంటాయి. ఇవి వార్తలను అవయవాల నుంచి వెన్నుపాముకు; వెన్నుపాము నుంచి అవయవాలకు చేరవేస్తాయి.

 

స్వయంచోదిత నాడీవ్యవస్థ                                                                                       

దీనిలో నాడులుంటాయి. ఈ నాడీవ్యవస్థను తిరిగి రెండు భాగాలుగా విభజింపవచ్చు. అవి

1) సహానుభూతనాడీ వ్యవస్థ

(Sympathetic Nervous System),                                                                                                        

2) సహానుభూత పరనాడీ వ్యవస్థ
(Para Sympathetic Nervous System).

ఇవి రెండు శరీరంలో జరిగే పనుల వేగాన్ని పెంచుతాయి, తగ్గిస్తాయి.

Posted Date : 25-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌