• facebook
  • whatsapp
  • telegram

వరదలు

నదీప్రవాహ మార్గాల హద్దులు (గట్లు)జల ప్రవాహాన్ని నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితిని 'వరద' అంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితులు, వర్షపాతం ఉండటంవల్ల ఏటా ఏదో ఒక ప్రాంతంలో వరదలు సంభవిస్తూ ఉంటాయి. అధిక వర్షపాతం ఉండే జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తుపాను, వాయుగుండాలు వచ్చినప్పుడు కూడా వరదలు వస్తాయి. అధిక వర్షపాతం, కూడా వరదలు రావడానికి కారణమవుతుంది. భారతదేశంలోని సుమారు 3290 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని భూమి వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.

ఏటా సరాసరి 75 లక్షల హెక్టార్ల భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. సుమారు 1600 మంది వరదల వల్ల మరణిస్తున్నారు. సాలీనా రూ.1805 కోట్ల రూపాయల ఆస్తి, పంటనష్టం జరుగుతోంది. ఇళ్లు, రోడ్లు దెబ్బతింటున్నాయి. 1977లో అత్యధికంగా 11,316 మంది మృత్యువాత పడ్డారు. భారతదేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వివిధ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. దేశ విస్తీర్ణంలో 8 శాతం వరకూ భూభాగం వరదలకు గురయ్యే అవకాశముంది. గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వస్తుంటాయి.

 

వరదలు రావడానికి కారణాలు
* నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం, నది ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.
* అధిక వర్షపాతం, వాయుగుండాలు, తుపాన్లు వరదలకు కారణమవుతాయి.
* నదులు, చెరువులు, కాల్వలకు గండ్లు పడటం; నదీ ప్రవాహ మార్గాలు పూడికతో నిండిపోవడం వల్ల వరదలు సంభవిస్తున్నాయి.

* అతిగా అడవులను నరికివేయడం, పర్వత ప్రాంతాల్లో నేల క్రమక్షయానికి గురవడం వల్ల వరదల ఉద్ధృతి పెరుగుతోంది.
* కొండ చరియలు విరిగిపడటంతో నదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.
* చెరువులు, ఆనకట్టలు, గట్ల నిర్మాణంలో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించకపోవడం వల్ల కూడా వరదలు రావొచ్చు.
* మహానగరాల్లోని నాలాలు ప్లాస్టిక్ కవర్లు, చెత్త, ఇతర ఘన పదార్థాలతో నిండిపోవడం వల్ల అవి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో ఈకారణంగానే వరదలు సంభవించాయి.

* వర్షం పడినప్పుడు నీరు నేలలోకి సరైనవిధంగా ఇంకకపోవడం వల్ల వరదలు ఎక్కువవుతాయి. నగరాల్లో నీరు ఇంకే మార్గాలకు పూర్తిగా అడ్డుపడటం వల్ల తరచుగా వర్షాకాలంలో వరదల తాకిడిని, వేసవిలో నీటి కొరతను ఎదుర్కొంటున్నాం.


వరద విపత్తు ఆధారంగా భారతదేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించవచ్చు.


బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం
   బ్రహ్మపుత్ర, బారక్ నదులు, వీటి ఉపనదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు అధిక వర్షపాతం (1100 మి.మీ. నుంచి 6350 మి.మీ.) నమోదవుతోంది. అందువల్ల సర్వసాధారణంగా ఈ ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఇక్కడి నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి, దిగువకు రావడం వల్ల నేల క్రమక్షయానికి గురవడం, కొండచరిచయలు విరిగి పడటం కూడా ఎక్కువగా ఉంటోంది.


గంగానదీ పరీవాహక ప్రాంతం 
             గంగా దాని ఉపనదులైన యమున, సోన్, గండక్, కోసి, మహానంద, రాఫ్తి లాంటి నదీ పరీవాహక ప్రాంతాలు దీని కిందికి వస్తాయి. వీటి వల్ల ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌ని కొన్ని ప్రాంతాలు, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో వరద ముప్పు ఉంది. ఇక్కడ సంవత్సరానికి 600 మి.మీ. నుంచి 1900 మి.మీ. వరకూ వర్షం కురుస్తుంది. ఈ రాష్ట్రాల్లో గంగానది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి.

ఉత్తర-పశ్చిమ నదీ పరీవాహక ప్రాంతం 
             బియాస్, రావి, చీనాబ్, జీలమ్ లాంటి నదుల ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాల్లో ఈ నదుల వల్ల వరదలు సంభవిస్తాయి. గంగా పరీవాహక ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వరద ముప్పు తక్కువే అయినప్పటికీ పూడిక సమస్య ఎక్కువ.


మధ్య భారతదేశం - దక్కన్ ప్రాంతాలు
నర్మదా, తిరుపతి, మహానంది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒడిషా రాష్ట్రాలు ఈ నదుల వల్ల వరదల బారిన పడతాయి. ఒడిషాలోని కొన్ని జిల్లాల్లో వరదలు తరచుగా వస్తుంటాయి. ఈ రాష్ట్రాల్లో రుతుపవనాల సమయంలో, తుపాన్లు సంభవించినప్పుడు వరదలు వచ్చే అవకాశం ఎక్కువ.


వరదలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నదీతీర ప్రాంతాల్లో, తరచుగా వరదలకు గురవడానికి అవకాశమున్న ప్రజలు వరదలు రావడానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల వరదల సమయంలో తక్కువ నష్టం జరుగుతుంది.
* దగ్గరలోని పునరావాస కేంద్రాన్ని గుర్తించి అక్కడికి తొందరగా చేరే మార్గాన్ని తెలుసుకోవాలి.
* ప్రథమ చికిత్స పెట్టెలో మందులు, ఇతర సామాగ్రి ఉన్నాయా లేవో చూసుకోవాలి. ప్రత్యేకంగా డయేరియా, పాముకాటుకు సరైన ఔషధాలను సిద్ధం చేసుకోవాలి.

* రేడియో, టార్చిలైటు, బ్యాటరీలు, తాళ్లు, గొడుగు లాంటివి సమకూర్చుకోవాలి.

* మంచినీరు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, ఇంధనం లాంటివి ముందుగానే సమకూర్చుకుని నిల్వ చేసుకోవాలి.
* నీరు తాకినా తడవని సంచుల్లో (water proof bags) దుస్తులు, ఇతర విలువైన వస్తువులను భద్రపరచుకోవాలి.
* గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తయిన ప్రదేశాలను గుర్తించి, పశువులను అక్కడికి తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి.

 
వరద వచ్చిన ప్రాంతంలో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* సురక్షిత (కాచి వడపోసిన) నీటినే తాగాలి. లేకపోతే కలరా, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
* ఆహార పదార్థాలను వరదనీటిలో తడవకుండా చూడాలి. వరద నీటిలో తడిసిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు.
* నీటిని శుభ్రపరచడానికి బ్లీచింగ్ పౌడరు కలపాలి. పరిసరాల్లో సున్నాన్ని చల్లాలి.
* వరదనీటిలోకి వెళ్లకూడదు. వరదల సమయంలో పాముకాటు ప్రమాదాలు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు.

 ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా కొన్నిసార్లు అనూహ్యంగా వరదల ముంపునకు గురై తీవ్ర ఇబ్బందుల పాలవుతాం. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను చూద్దాం...
* వరదలు సంభవించే కాలంలో తరచుగా రేడియో, టీవీ హెచ్చరికలను వింటూ ఉండాలి. ప్రభుత్వం లేదా వాతావరణ శాఖ చేసే హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి.
* ప్రాంతీయ అధికారులు చేసే హెచ్చరికలను గమనిస్తూ, వాటికి అనుగుణంగా స్పందించాలి.
* ఆహార పదార్థాలు, నీరు, దుస్తుల లాంటివి దగ్గరగా ఉంచుకోవాలి.
* గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సామగ్రి, పశువులు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
* మన నివాస ప్రాంతాల్లో కొద్ది గంటల్లో వరద ముంపు ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి.
* సురక్షిత, పునరావాస కేంద్రాలకు వెళ్లేటప్పుడు తమ వెంట విలువైన వస్తువులు, పత్రాలు, అత్యవసర మందులు, దుస్తుల లాంటివి తీసుకు వెళ్లాలి.
* వస్తువులను నేలపై కాకుండా ఎత్తయిన ప్రదేశంలో ఉంచాలి. ఇంటికి వచ్చే విద్యుత్ కనెక్షన్లను తీసేయాలి.
* తెలియని ప్రదేశంలో నిల్వ ఉండే నీటిలోకి వెళ్లకూడదు.

 

వరదల వల్ల నష్టాలు
*వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతుంది. ఇళ్లు, పంటపొలాలు దెబ్బతింటాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడం వల్ల అది వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది. పంటపొలాలు మునిగిపోయి అధిక నష్టం కలుగుతుంది.
* వరదల వల్ల అనేకమంది నిరాశ్రయులవుతారు. పశువులు మృత్యువాత పడతాయి. తాగునీరు కలుషితమవుతుంది. తాగడానికి మంచినీరు దొరకదు.

* కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, కలరా లాంటి అంటువ్యాధులు ప్రబలుతాయి.
* నేల క్రమక్షయానికి గురై సారవంతం తగ్గుతుంది. జలాశయాల్లో పూడిక పెరుగుతుంది. అధిక వరదల వల్ల రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతింటాయి. దీని వల్ల రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలు నాశనమవుతాయి. భవనాలు దెబ్బతినడం వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది. ఆహారం, పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది.
* అటవీ ప్రాంతాల్లో వరదల వల్ల అక్కడి జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
* వరదల వల్ల మహానగరాల్లో పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. కొండచరియలు విరిగిపడతాయి.
¤* ఆకస్మికంగా సంభవించే వరదల్లో కొందరు కొట్టుకుపోయి, మరణాలు సంభవిస్తాయి. పాత భవనాలు కూలిపోవడం లాంటి వాటి వల్ల కూడా ప్రాణనష్టం జరుగుతుంది. సముద్రతీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి వలలు, పడవలకు నష్టం ఉంటుంది.

 

 నివారణ చర్యలు
* నదుల ఎగువ ప్రాంతాల్లో అడవులను పెంచాలి. దీనివల్ల వర్షపు నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోయి వరదలు రాకుండా ఉంటాయి.
* పోడు వ్యవసాయాన్ని తగ్గించాలి, నీటి ప్రవాహానికి అడ్డంకులు కల్పించకూడదు.
* వరదనీటిని వరద కాల్వల ద్వారా ఇతర ప్రాంతాలకు మళ్లించాలి.
*వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నదులపై ప్రాజెక్టులను, రిజర్వాయర్లను నిర్మించాలి.
* ముందస్తు హెచ్చరిక కేంద్రాల ద్వారా ప్రజలకు వరద ముప్పు గురించి ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం వరదల సమయంలో తక్షణం స్పందించి సహాయ చర్యలు చేపట్టాలి.
* లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలి. అక్కడ వారికి ఆవాసాలు ఏర్పరచాలి.
* ఏటా తరచుగా వరదలు వచ్చే ప్రాంతాలను గుర్తించి శాశ్వత నివారణ కార్యక్రమాలను చేపట్టాలి. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలతో మ్యాప్‌లను గీయాలి.
* పట్టణాల్లో డ్రైనేజి వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలి. అవసరమైతే మెరుగుపరచాలి.
* పెద్ద ఆనకట్టలతోపాటు చిన్న, చిన్న చెక్‌డ్యామ్‌లు, కాంటూర్ కందకాల లాంటివాటిని ఏర్పరచి నీటిని నియంత్రించవచ్చు.


 భారతదేశంలో వరద నియంత్రణా చర్యలు
  ప్రపంచంలో అధికంగా వరదలు సంభవించే ప్రాంతాల్లో భారత్ ఒకటి. రుతుపవన వర్షపాతం, నదులు తీసుకువచ్చే మట్టి, పర్వత ప్రాంతాల్లో కోతకు గురికావడం లాంటి కారణాల వల్ల భారతదేశంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంది. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వం వరద నివారణా చర్యలను చేపడుతోంది. పదో పంచవర్ష ప్రణాళికా కాలం వరకు వరదలు సంభవించే అవకాశమున్న 45.6 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో రక్షణ చర్యలు చేపట్టారు. 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో 2.18 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అదనంగా రక్షణ చర్యలు చేపట్టారు.
1954లో 'నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌'ను ప్రారంభించిన తర్వాత వరద నియంత్రణా చర్యలను వేగవంతం చేశారు. 'సెంట్రల్ వాటర్ కమిషన్' (CWC) అనే సంస్థ భారతదేశంలో వరదల గురించి ముందస్తు సమాచారాన్ని అందిస్తుంది.     
దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇది రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద సమాచారాన్ని సేకరించి, ఆయా ప్రదేశాల్లోని హెచ్చరికల కేంద్రాలకు పంపిస్తుంది. ఈ కేంద్రాలు సమాచారాన్ని స్థానిక ప్రజలకు తెలియజేస్తాయి.

 

వరద నష్టం తగ్గించడానికి చేపడుతోన్న చర్యలు
* వరదల సమయంలో తగిన చర్యలు చేపట్టడానికి 'నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్' (NDRF)కు చెందిన బెటాలియన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వీరికి తగిన శిక్షణనివ్వడంతోపాటు అధునాతన పరికరాలను సమకూర్చారు.

* వరదలు సంభవించిన ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రజలకు అత్యవసర వైద్య సహాయాన్ని, ఔషధాలను అందిస్తారు.
* నీటిని నిల్వ చేయడానికి ఆనకట్టలు, రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. దీనివల్ల నదుల్లో నీటిమట్టాన్ని నియంత్రించగలుగుతున్నాం. ఫలితంగా వరద ముప్పు తగ్గుతోంది. వీటిలో నిల్వ ఉన్న నీటిని తిరిగి వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, తాగునీరు, పరిశ్రమలకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం ఆనకట్టల భద్రతను కూడా పర్యవేక్షిస్తోంది.
* వరదల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి, వరదల నివారణకు ఆనకట్టల్లో పూడిక ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాల్వల్లో నీరు సాఫీగా ప్రవహించేవిధంగా చూస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో నేలక్రమక్షయం జరగకుండా అడవులను పెంచుతున్నారు.
* జాతీయ రహదార్లు, వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతినకుండా వాటిని ప్రత్యేక పద్ధతిలో నిర్మించడం, వాటి రక్షణ చర్యలు చేపట్టడం, వరదలకు ముందు, తర్వాత వాటిని పరిశీలించడం లాంటి చర్యలు చేపడుతున్నారు.

* వరదలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడానికి, వాటిని నివారించడానికి భారత ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక సంస్థలను ఏర్పాటు చేసింది.
* వరదలు సంభవించినప్పుడు ఆ నీటిని మళ్లించడానికి ప్రత్యేక కాల్వలను నిర్మిస్తున్నారు. తరచుగా వరదలు సంభవించే ప్రాంతాలను గుర్తించి వాటి మ్యాపులను గీస్తున్నారు. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో శాశ్వత వరద నివారణా చర్యలు చేపట్టడమే కాకుండా ముందస్తు హెచ్చరికలను కూడా జారీచేయవచ్చు.
* సెంట్రల్ వాటర్ కమిషన్ (CWE), ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) వారు భారతదేశంలోని 62 నదీ పరీవాహక ప్రాంతాల్లోని 945 ప్రదేశాల నుంచి నీరు, వాతావరణ సంబంధ సమాచారాన్ని గ్రహిస్తున్నారు.
దీన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లోని ముందస్తు హెచ్చరికల కేంద్రాలకు పంపిస్తున్నారు. ఇలాంటి వరద హెచ్చరికల కేంద్రాలు భారతదేశంలో 175 ఉన్నాయి. వీటిలో మన రాష్ట్రంలో గోదావరీ పరీవాహక ప్రాంతంలో 18, కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో 9 ఉన్నాయి.

*భారతదేశంలో ఇలాంటి హెచ్చరికల కేంద్రాలు అత్యధికంగా గంగా, దాని ఉపనదుల ప్రాంతాల్లో 87 ఉన్నాయి.

* భారతదేశంలోని కొన్ని నదులు ఇతర దేశాల్లో కూడా ప్రవహిస్తున్నాయి. ఇతర దేశాల సరిహద్దు ప్రాంతాల్లో పుట్టి, మనదేశం ద్వారా ప్రవహించే నదులున్నాయి. భారత్ ఇలాంటి నదుల వల్ల కలిగే వరద నష్టాన్ని నివారించడం కోసం నేపాల్, చైనా, భూటాన్ లాంటి దేశాలతో కలిసి పని చేస్తోంది. వరదల నియంత్రణకు సంబంధించి వివిధ ఒప్పందాలను కుదుర్చుకుంది.
* సామాన్య ప్రజలకు వరదలకు సంబంధించిన అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతం చేసే వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ అంశాన్ని పాఠ్యాభాగాల్లోనూ చేరుస్తున్నారు. గ్రామస్థాయి నుంచి అన్ని వర్గాల వారికి శిక్షణ ఇస్తున్నారు. వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాలు వరదల గురించి పరిశోధనలు చేస్తున్నాయి.

Posted Date : 24-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌