• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - పరిశ్రమలు

   దేశంలోని పరిశ్రమలను అవి వినియోగించుకునే ముడిసరుకులు, ఉత్పత్తి చేస్తున్న వస్తువులను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) వ్యవసాయాధార పరిశ్రమలు 2) ఖనిజాధార పరిశ్రమలు 3) యంత్ర పరికరాల పరిశ్రమలు.

వ్యవసాయాధార పరిశ్రమలు: ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులను ముడిసరుకులుగా వినియోగించుకుని వస్తువులను ఉత్పత్తి చేస్తుంటాయి. నూలు వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ, ఉన్ని వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ, పేపరు పరిశ్రమ మొదలైనవి వీటికి ఉదాహరణ. ఇవి దేశంలో అత్యంత ప్రధానమైన, పురాతన పరిశ్రమలు. ఎక్కువమంది శ్రామికులు వీటిపైనే ఆధారపడి ఉన్నారు.

ఖనిజాధార పరిశ్రమలు: ఇవి ప్రధానంగా ఖనిజ ఉత్పత్తులను ముడిసరుకులుగా వినియోగించుకుని వస్తూత్పత్తి జరుపుతాయి. ఇనుము - ఉక్కు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ, అల్యూమినియం పరిశ్రమ మొదలైనవి వీటికి ఉదాహరణ. దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రధానమైన మౌలిక పరిశ్రమలుగా వీటిని పేర్కొంటారు.

యంత్ర పరికరాల పరిశ్రమలు: ఇవి ప్రధానంగా వివిధ రకాల యంత్రాలను తయారు చేసే పరిశ్రమలు. ఉదాహరణకి నౌకా నిర్మాణ కేంద్రాలు, లోకోమోటివ్స్, బీహెచ్ఈఎల్ కర్మాగారాలు, హెచ్ఏఎల్ కర్మాగారాలు, హెచ్ఎంటీ కర్మాగారాలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కర్మాగారాలు మొదలైనవి.

* వీటితోపాటు రసాయన కర్మాగారాలు, ఎరువుల కర్మాగారాలు, అణు ఉత్పత్తి కేంద్రాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఔషధ కర్మాగారాలు కూడా దేశంలో అధిక మొత్తంలో ఉన్నాయి.

* 2015 - 16 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగ వాటా సుమారు 22 శాతం.

 

పరిశ్రమల విస్తరణ 

జౌళి పరిశ్రమ: జౌళి అనేది స్థూలమైన పదం. నూలు వస్త్ర పరిశ్రమ, ఉన్ని పరిశ్రమ, జనపనార పరిశ్రమ, పట్టు పరిశ్రమలను జౌళి పరిశ్రమగా పరిగణిస్తారు. దేశంలో అతి పురాతనమైన, అతిపెద్ద పరిశ్రమ ఇది.

నూలు వస్త్ర పరిశ్రమ: దేశంలో నూలు వస్త్ర పరిశ్రమ చాలా పురాతనమైంది. ఇది ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ. ప్రపంచంలో నూలు వస్త్రాల ఉత్పత్తిలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉండగా, భారతదేశం మూడో స్థానంలో ఉంది.

* దేశంలో మొదటి నూలు వస్త్ర పరిశ్రమను 1818లో కోల్‌కతా సమీపంలోని పోర్ట్ గ్లాస్టర్ వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఇది కొద్దికాలంలోనే మూతపడింది.

* దేశంలో మొదటి అధునాతన నూలు వస్త్ర పరిశ్రమను 1854లో పార్శీ పెట్టుబడిదారులు ముంబయిలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దేశంలో నూలు వస్త్ర పరిశ్రమ అభివృద్ధి ప్రారంభమైంది.

* ప్రస్తుతం దేశంలో నూలు వస్త్ర పరిశ్రమలో ప్రధాన ఉత్పత్తిదారులు: మహారాష్ట్ర, గుజరాత్.

* దేశంలోని ప్రధాన నూలు వస్త్ర ఉత్పత్తి కేంద్రాలు: ముంబయి, అహ్మదాబాద్, కోయంబత్తూరు.

* దేశంలో నూలు వస్త్ర పరిశ్రమలను మొదట ముంబయి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా స్థాపించారు. దీంతో అనతికాలంలోనే ముంబయి నూలు వస్త్ర పరిశ్రమకి ప్రధాన కేంద్రంగా మారింది. అందుకే ముంబయిని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, కాటన్ పోలిస్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు. (అయితే ప్రస్తుతం అహ్మదాబాద్ నగరాన్ని కూడా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటున్నారు.)

* నూలు వస్త్రాల ఉత్పత్తిలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా తమిళనాడు ప్రథమ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో పెద్దసంఖ్యలో నూలు వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరును దక్షిణ భారత మాంచెస్టర్‌గా పేర్కొంటారు.

 

జనపనార పరిశ్రమ 

         జౌళి పరిశ్రమల్లో రెండో స్థానం జనపనార పరిశ్రమది. 1855లో కలకత్తా సమీపంలోని రిష్రా ప్రాంతం వద్ద దేశంలోనే తొలి జనపనార పరిశ్రమను ఏర్పాటు చేశారు. దేశంలో జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం - పశ్చిమ్ బంగ. దీంతోపాటు బిహార్, అసోం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జనపనార పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. కలకత్తా నగరాన్ని జ్యూట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా పేర్కొంటారు. జనపనారని బంగారు పీచు అని కూడా అంటారు. ప్రపంచంలో జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారత్. అయితే ఎగుమతుల్లో మాత్రం బంగ్లాదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. జనపనార నుంచి తయారుచేసే వస్తువుల్లో గోనె సంచులు, తాళ్లు, తివాచీలు, కాన్వాస్, ప్యాక్ షీట్లు, టార్పాలిన్ ప్రధానమైనవి.

ఉన్ని వస్త్ర పరిశ్రమ: గొర్రెల నుంచి సేకరించిన ఉన్నిని ముడిసరుకుగా ఉపయోగించి ఉన్ని వస్త్రాలను తయారుచేస్తారు. దేశంలోని మొదటి ఉన్ని వస్త్ర పరిశ్రమను 1876లో కాన్పూర్‌లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఈ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.

* పంజాబ్‌లోని లుథియానా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్; ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్, ఆగ్రా; రాజస్థాన్‌లోని జయపుర (జైపూర్); మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్; గుజరాత్‌లోని జామ్‌నగర్‌లలోని ఉన్ని ఉత్పత్తి కేంద్రాలు ప్రధానమైనవి.

పట్టు వస్త్ర పరిశ్రమ: దేశంలో మొదటి పట్టు వస్త్ర పరిశ్రమను 1932లో పశ్చిమ్ బంగలోని హౌరా వద్ద ఏర్పాటు చేశారు. దేశంలో ప్రధానంగా మల్బరీ, టస్సర్, ముగ, ఎరి అనే నాలుగు రకాల పట్టు ఉత్పత్తి అవుతోంది. వీటిలో మల్బరీ పట్టు చాలా ప్రధానమైంది. దేశంలో పట్టువస్త్రాల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం - కర్ణాటక.

* అసోం, పశ్చిమ్ బంగ, బిహార్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో కూడా పట్టు వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది. ప్రపంచంలో పట్టు వస్త్రాల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో, భారతదేశం రెండో స్థానంలో ఉన్నాయి.

పంచదార పరిశ్రమ: దేశంలో రెండో అతిపెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా పంచదార పరిశ్రమను పేర్కొంటారు. దేశంలో మొదటి పంచదార పరిశ్రమను బిహార్‌లో స్థాపించారు. ప్రస్తుతం దేశంలో అత్యధిక పంచదార మిల్లులు ఉన్న రాష్ట్రం - ఉత్తర్ ప్రదేశ్. అయితే పంచదార ఉత్పత్తిలో మాత్రం మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది.

* 1932లో దేశంలోని పంచదార పరిశ్రమలకు రక్షణ కల్పించడంతో 1939 నాటికి దేశం పంచదార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. సహకార రంగంలో అత్యధిక పంచదార పరిశ్రమలున్న రాష్ట్రం మహారాష్ట్ర.

తోళ్ల పరిశ్రమ: దేశంలో మొదటి అధునాతన తోళ్ల పరిశ్రమను కాన్పూర్‌లో ఏర్పాటు చేశారు. భారతదేశం నుంచి రష్యా, బ్రిటన్, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా మొదలైన దేశాలకు తోలు ఉత్పత్తులను అధిక మొత్తంలో ఎగుమతి చేస్తున్నారు.

దేశంలో ప్రసిద్ధి చెందిన తోలు ఉత్పత్తి కేంద్రాలు: కాన్పూర్, ఆగ్రా, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్.

 

కాగితపు పరిశ్రమ 

కాగితం తయారీలో ఉపయోగించే ప్రధాన ముడి సరుకులు: కలప గుజ్జు, చెరకు పిప్పి, సబాయ్, సలామ్ లాంటి గడ్డి, రాగులు మొదలైనవి. దేశంలో మొదటి కాగితపు పరిశ్రమను 1832లో కోల్‌కతా సమీపంలోని షేరంపూర్‌లో ఏర్పాటు చేశారు. అయితే 1870లో బాలిగంజ్ వద్ద ఏర్పాటైన రాయల్ బెంగాల్ పేపర్ మిల్‌ను అధునాతన పేపర్ కర్మాగారంగా పేర్కొంటారు. 1981లో మధ్యప్రదేశ్‌లోని నేపానగర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్ మిల్స్ అనే పేరుతో కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు.

* దేశంలో ప్రధానంగా మధ్యప్రదేశ్, పశ్చిమ్ బంగ, మహారాష్ట్ర, ఒడిశా, అసోం, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఈ కర్మాగారాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని దేవాస్, హోషంగాబాద్‌లలో కాగితపు కరెన్సీని తయారు చేయడానికి కావలసిన పేపర్ ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి, కొవ్వూరు, కర్నూలు ప్రాంతాల్లో; తెలంగాణాలో భద్రాచలం, ఆదిలాబాద్‌లోని సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతాల్లో పేపర్ మిల్లులు ఉన్నాయి.

రబ్బరు పరిశ్రమ: రబ్బరు చెట్టుకు గాటుపెట్టి వచ్చే స్రావాన్ని సేకరించి, దాన్ని వివిధ రసాయనాలతో కలిపి ఘనీభవించేలా చేసి సహజ రబ్బరును తయారుచేస్తారు. దేశంలో సహజ రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ. దీంతోపాటు పశ్చిమ్ బంగలోని హుగ్లీ నది పరీవాహక ప్రాంతం, ముంబయి పరిసర ప్రాంతాల్లో కూడా రబ్బరును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బరౌలి ప్రాంతంలో పెద్దమొత్తంలో కృత్రిమ రబ్బరును ఉత్పత్తి చేస్తున్నారు.

 

ఇనుము - ఉక్కు పరిశ్రమ 

         ఒక దేశ పారిశ్రామిక సామర్థ్యాన్ని ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే ఇనుము - ఉక్కు ఆధారంగా అంచనా వేస్తారు. భారతదేశంలోని మొదటి ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని 1870లో పశ్చిమ్ బంగలోని కుల్టీ ప్రాంతం వద్ద బెంగాల్ ఐరన్ వర్క్స్ పేరుతో ఏర్పాటు చేశారు. అయితే ఇది పూర్తిస్థాయి కర్మాగారంగా అభివృద్ధి చెందలేదు.

* 1907లో ఝార్ఖండ్‌లోని సక్చీ ప్రాంతంలో టాటా ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ఇది అధునాతన, పూర్తిస్థాయి ఇనుము - ఉక్కు కర్మాగారం. తర్వాతి కాలంలో ఈ ప్రాంతం జంషెడ్‌పూర్‌గా మారింది. దేశంలో ఇదే అతి పెద్ద సమీకృత ఇనుము - ఉక్కు కర్మాగారం.

 

టాటా ఇనుము - ఉక్కు కర్మాగారం

ముఖ్యాంశాలు:

నెలకొని ఉన్న ప్రాంతం: ఝార్ఖండ్‌లోని సింగ్భమ్ జిల్లాలో ఉన్న జంషెడ్‌పూర్.

ఇనుప ధాతువు: గురుమహిషినీ (ఒడిశా), నేమండీ (ఝార్ఖండ్) గనుల నుంచి సరఫరా అవుతోంది.

మాంగనీస్: ఒడిశాలోని జోడా గనుల నుంచి వస్తోంది.

బొగ్గు: ఝరియా (ఝార్ఖండ్) నుంచి సరఫరా చేస్తున్నారు.

నీరు: సువర్ణరేఖ, కోర్కామ్ నదుల నుంచి.

డోలమైట్, సున్నపురాయి: ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లా నుంచి

ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ:

* 1919లో పశ్చిమ్ బంగలోని బర్నపూర్ వద్ద ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఏర్పాటు చేశారు. అప్పటికే నిర్మించిన కుల్టీ, హీరాపూర్ ప్రాంతాల్లోని కర్మాగారాలను ఈ కంపెనీలో విలీనం చేశారు. దీన్ని 1972లో ప్రభుత్వ యాజమాన్యం కిందికి తెచ్చారు.

ప్రాంతం: పశ్చిమ్ బంగలోని బర్నపూర్. కోల్‌కతా - అసన్‌సోల్ రైలు మార్గం ద్వారా మూడు కర్మాగారాలను అనుసంధానం చేశారు.

ఈ కర్మాగారానికి - ఇనుప ధాతువు: గువా గనుల నుంచి సరఫరా అవుతోంది.

విద్యుచ్ఛక్తి: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి లభిస్తోంది.

నీరు: బార్‌కార్ నది నుంచి సరఫరా చేస్తున్నారు.

బొగ్గు: ఝరియా, రాణిగంజ్ గనుల నుంచి లభ్యం.

డోలమైట్: సుందర్‌ఘర్ ప్రాంతం నుంచి వస్తోంది.విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్:

* 1923లో కర్ణాటకలోని భద్రావతి వద్ద మైసూర్ స్టీల్ వర్క్స్ కర్మాగారాన్ని స్థాపించారు. ప్రస్తుతం దీన్ని విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ అని పిలుస్తున్నారు. దీన్ని 1962లో ప్రభుత్వ యాజమాన్యం కిందకు తీసుకువచ్చారు.

      విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్‌కు అవసరమైన ముడిసరుకులు, లభించే ప్రదేశాలు: చిక్కమగళూర్ జిల్లాలోని కెమ్మనగండి గనుల నుంచి ఇనుప ధాతువు సరఫరా అవుతోంది. మాంగనీస్ - షిమోగా, చిత్రదుర్గ ప్రాంతాల నుంచి, నీరు - భద్రావతి నది నుంచి, సున్నపురాయి - బుండిగూడ, విద్యుత్ - శరావతి, శివసముద్రం విద్యుత్ కేంద్రాల నుంచి అందిస్తున్నారు.

Posted Date : 17-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌