• facebook
  • whatsapp
  • telegram

అడవులు వన్యప్రాణి సంరక్షణ

  పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. కానీ, భారతదేశంలో జనాభా విస్ఫోటం వల్ల వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు - రైలు మార్గాల అభివృద్ధి మొదలైన కార్యకలాపాలవల్ల అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీంతో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతోంది. అడవులు తరగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతోంది. అందుకే sustainable development ను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 1980లో సమగ్ర అడవుల పరిరక్షణ చట్టాన్ని (Forest Conservation1980) రూపొందించింది. పదో పంచవర్ష ప్రణాళికా కాలంలో సమగ్ర అడవుల పరిరక్షణ పథకాన్ని (Integrated Forest Protection Scheme) అమల్లోకి తెచ్చింది. 1988లో అటవీ విధానాన్ని (Forest Policy), 2006లో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చింది. వాతావరణ మార్పు (Climate Change), గ్లోబల్ వార్మింగ్‌ను నివారించడానికి అడవుల పరిరక్షణ ఎంతో అవసరం. అడవుల పరిరక్షణ, నిర్వహణ అనే అంశం భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉండటంతో అడవులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యతగా నిర్వహిస్తున్నాయి.

  భారత బొటానికల్ సర్వే (బి.ఎస్.ఐ.) ప్రకారం దేశంలో మొత్తం 46వేలకు పైగా వృక్షజాతులు ఉన్నాయి. కానీ, ఇటీవల అడవుల విధ్వంసం వల్ల అందులో అనేక వృక్షజాతులు అంతరించే ప్రమాదం ఉంది. భారత జూలాజికల్ సర్వే (జడ్.ఎస్.ఐ.) ప్రకారం దేశంలో మొత్తం 89వేలకు పైగా జంతు జాతులు (species) ఉన్నాయి. వీటిలో కూడా అనేకం అంతరించిపోయే ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి, ప్రకృతిసిద్ధమైన వృక్ష, జంతుజాతుల జీవ వైవిధ్యాన్ని (Bio - diversity) కాపాడేందుకు భారత ప్రభుత్వం అడవుల్లోని వృక్షాలను, జంతువులను వాటి సహజ పర్యావరణంలో అభివృద్ధి చేసేందుకు జీవావరణ కేంద్రాలను (Biosphere Reserves) నెలకొల్పింది. ఈ విధంగా దేశంలో మొదటగా ఏర్పాటుచేసింది నీలగిరి జీవావరణ కేంద్రం. దీన్ని 1986లో స్థాపించారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 15 జీవావరణ కేంద్రాలున్నాయి. 2008లో స్థాపించిన గుజరాత్‌లోని కచ్ కేంద్రం 15వ జీవావరణ కేంద్రం. ఈ 15 జీవావరణ కేంద్రాల్లో భౌగోళికంగా అతి పెద్దది మన్నార్ కేంద్రం. వీటిలో యునెస్కో గుర్తించి, ప్రపంచ జీవావరణ కేంద్రాల నెట్‌వర్క్‌లో చేర్చినవి నాలుగు. అవి: 1) సుందర్‌బన్స్, 2) మన్నార్, 3) నీలగిరి, 4) నందాదేవి. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకోసం దేశవ్యాప్తంగా 99 జాతీయ పార్కులు, 513 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అయిదు జాతీయ పార్కులు ఏర్పాటయ్యాయి. ఇక పెద్దపులుల సంరక్షణ, అభివృద్ధికి కేంద్రప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 17 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ ప్రాజెక్టుకు రాజీవ్‌గాంధీ టైగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.

జీవావరణ కేంద్రం  స్థాపించిన సంవత్సరం రాష్ట్రం/రాష్ట్రాలు
 1. నీలగిరి 1986 తమిళనాడు, కేరళ, కర్ణాటక
2. నందాదేవి 1988 ఉత్తరాఖండ్
 3. నోక్రెక్ 1988 మేఘాలయ
4. మానస్ 1989 అసోం
5. సుందర్ బన్స్ 1989 పశ్చిమబెంగాల్
6. మన్నార్ 1989 తమిళనాడు
7. గ్రేట్ నికోబార్ 1989 అండమాన్ - నికోబార్ దీవులు
8. సిమ్లీపాల్ 1994 ఒరిస్సా
9. దిబ్రూ -సైకోవా 1997 అసోం
10. దెహాంగ్ - దెబాంగ్ 1998 అరుణాచల్ ప్రదేశ్
11. పచ్ మరి 1999 మధ్యప్రదేశ్
12. కాంచన్ గంగ(జంగ) 2000 సిక్కిం
13. అగస్త్యమలై  2001 కేరళ
14. అచనామర్ - అమర్ కంఠక్ 2005 మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్
15. కచ్ 2008 గుజరాత్

భారత అటవీ పరిశోధన, విద్యా మండలి ఆధ్వర్యంలో అడవుల అభివృద్ధికోసం కృషిచేస్తున్న సంస్థలు
1. ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ - డెహ్రాడూన్
2. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎరిడ్ జోన్ ఫారెస్ట్రీ రిసెర్చ్ - జోధ్ పూర్
3. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమి - డెహ్రాడూన్
4. సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్ మెంట్ - అలహాబాద్
5. టెంపరేట్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ - సిమ్లా
6. ట్రాపికల్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ - జబల్ పూర్
7. రెయిన్ అండ్ మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (Rain & Moist Deciduous Forest Research Institute)- జోర్హాట్ (అసోం)
8. ఫారెస్ట్ ట్రెయినింగ్ ఇన్ స్టిట్యూట్ - డెహ్రాడూన్
9. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ - భోపాల్
10. ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఇన్ స్టిట్యూట్ - బెంగళూరు మొదలైనవి.

  ఏనుగుల సంరక్షణ, అభివృద్ధికి 1992లో ప్రాజెక్టు ఎలిఫెంట్‌ను స్థాపించారు. దీన్ని దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో అమలుచేస్తున్నారు. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణకు కేంద్రప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని రూపొందించింది.  కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ప్రత్యేకించి కొన్ని జంతువులకు ప్రసిద్ధి. దేశంలో అడవుల పరిరక్షణ, అభివృద్ధి, విద్య, పరిశోధనకోసం డెహ్రాడూన్‌లో 1987లో భారత అటవీ పరిశోధన, విద్యా మండలి (Indian Council of Forest Research and Education) స్థాపించారు.

Posted Date : 19-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌