• facebook
  • whatsapp
  • telegram

రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా

* విశేష అధికారాల కేంద్ర బ్యాంకు
* దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం
  దేశాల ఆర్థిక విధానాలను ప్రభావితం చేయడంలో కేంద్ర బ్యాంకులు ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా.. ద్రవ్య ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం, ఆర్థిక వృద్ధికి దోహదపడటం అనేవి కేంద్ర బ్యాంకుల లక్ష్యాలు. అయితే వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకుల ముఖ్య ఉద్దేశాలు భిన్నంగా ఉండవచ్చు లేదా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను బట్టి మారవచ్చు. భారతదేశంలో కేంద్ర బ్యాంకు - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ). దేశంలోని బ్యాంకింగ్ కార్యకలాపాలన్నింటినీ రిజర్వ్ బ్యాంకు నియంత్రిస్తూ, ద్రవ్య, కోశ విధానాల రూపకల్పనకు మూలాధారంగా ఉంటుంది. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆర్‌బీఐ గురించి మంచి అవగాహన సాధించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆవిర్భావంతో పాటు.. విధులు, విధానాలు, ఆధునిక పోకడలు.. వీటి ప్రభావం తదితర అంశాలను అధ్యయనం చేయాలి. అనువర్తన (అప్లికేషన్) ప్రశ్నలకు ప్రాధాన్యమిస్తూ పూర్తి సమాచారాన్ని క్రోడీకరించాలి.
కేంద్ర బ్యాంకు అనే భావన 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రబలంగా వ్యాప్తి చెందింది. 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌'ను కేంద్ర బ్యాంకులకు ఒక నమూనాగా, ఆదర్శంగా చెప్పవచ్చు. అనేక పాశ్చాత్య దేశాల్లో 19వ శతాబ్దంలో కేంద్ర బ్యాంకులను స్థాపించారు. కేంద్ర బ్యాంకు ఒక ఆర్థిక వ్యవస్థలో అత్యున్నత విత్తసంస్థ. భారత దేశంలో రిజర్వు బ్యాంకును 1935లో స్థాపించి.. 1949లో జాతీయం చేశారు. (పట్టిక-1 చూడండి)

 

ఆర్‌బీఐ ఏం చేస్తుంది?

భారత రిజర్వు బ్యాంకు చట్టం (1934) ప్రకారం ఆర్‌బీఐ కింది విధులను నిర్వహిస్తుంది.

* ద్రవ్యాన్ని ముద్రించి చెలామణీ చేసే గుత్తాధిపత్యం: ఆర్‌బీఐకి '1934 ఆర్‌బీఐ చట్టం, సెక్షన్ 22' ప్రకారం కరెన్సీ నోట్లను ముద్రించే గుత్తాధిపత్య అధికారం ఉంటుంది.
* 2 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు నోట్లను ముద్రించి పంపిణీ చేస్తుంది.
* భారతదేశ విత్త మంత్రిత్వ శాఖ ముద్రించే ఒక రూపాయి నోట్లను, అన్ని నాణేలను.. భారతదేశ ప్రభుత్వ ఏజెంటుగా పంపిణీ చేస్తుంది.
* 1957 నుంచి ఆర్‌బీఐ కనిష్ఠ నిల్వల పద్ధతిని అనుసరించి కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది.
* కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ నగదు నిల్వలను వడ్డీ రహితంగా డిపాజిట్ రూపంలో ఆర్‌బీఐ తన వద్ద ఉంచుతుంది. అలాగే ప్రభుత్వం తరపున చెల్లింపులు చేయడం, రాబడులను వసూలు చేయడం, విదేశీమారక ద్రవ్య పత్రాలను నిల్వ చేయడం, ప్రభుత్వ బ్యాంకుగా, ఏజెంటుగా వ్యవహరించడం చేస్తుంది.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకింగ్, ఆర్థిక, ద్రవ్య విధానాల విషయాల్లో సలహాదారుగా ఉంటుంది.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున రుణాలను స్వీకరించి వాటిని ఏ సమయంలో, ఎంత మొత్తంలో స్వీకరించాలో తెలిపే సలహాదారుగా కూడా వ్యవహరిస్తుంది.
* ట్రెజరీ బిల్లులను వారపు వేలం పాటల్లో అమ్ముతుంది.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 90 రోజుల కాలపరిమితితో స్వల్పకాలిక రుణాలు 'వేస్ అండ్ మీన్స్' అడ్వాన్సులను మంజూరు చేస్తుంది.
* కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'ఓవర్ డ్రాఫ్ట్' సౌకర్యాన్ని కూడా ఆర్‌బీఐ ద్వారా వినియోగించుకుంటాయి.
* 'రిజర్వ్ బ్యాంకు చట్టం-1934, బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం- 1949' ప్రకారం దేశంలో అన్ని బ్యాంకులను నియంత్రించే అధికారం ఆర్‌బీఐకి ఉంటుంది.
* రిజర్వ్ బ్యాంకు రెండో షెడ్యూల్‌లో ఉన్న అన్ని బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులుగా పరిగణిస్తారు.
* బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం (1949) ప్రకారం ప్రతి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు తన డిమాండు డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లలో కొంత శాతాన్ని నగదు నిల్వల రూపంలో ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాలి.
* బ్యాంకుల లైసెన్సింగ్ అధికారం ఆర్‌బీఐకి ఉంటుంది.
* ప్రతి బ్యాంకు ప్రతి శుక్రవారం వారాంతపు లావాదేవీలను ఆర్‌బీఐకి సమర్పించాలి.
* అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులను ఆర్‌బీఐ ఆదుకుంటుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంకును అంతిమ రుణదాత అంటారు. దీన్ని ఆర్‌బీఐ విధుల్లో ముఖ్యమైందిగా పరిగణిస్తారు. వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి పరిమాణం వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడవచ్చు.
* బ్యాంకు రేటు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, నగదు నిల్వల నిష్పత్తిలో మార్పుల ద్వారా రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల పరపతిపై నియంత్రణ చేస్తుంది.
* భారతదేశ రూపాయి బహిర్గత విలువను నిలకడగా ఉంచే బాధ్యత ఆర్‌బీఐపై ఉంటుంది. రూపాయి మారకపు రేటును స్థిరంగా నిర్వహించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు అంతర్జాతీయ కరెన్సీని నిల్వ ఉంచుతుంది.
* బ్యాంకుల స్థాపన, లైసెన్సింగ్ విధానం, శాఖల విస్తరణ, యాజమాన్య పద్ధతులు, పునర్ వ్యవస్థీకరణ లాంటి విస్తారమైన అధికారాలు ఆర్‌బీఐకి ఉంటాయి.
* రిజర్వ్ బ్యాంక్ 1935లో ప్రత్యేక వ్యవసాయ పరపతి విభాగాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకును 1980వ దశకంలో స్థాపించింది. అలాగే భారతదేశ పారిశ్రామిక విత్త కార్పొరేషన్‌ను, రాష్ట్ర విత్త కార్పొరేషన్లను వివిధ రాష్ట్రాల్లో స్థాపించింది.

 

రిజర్వు బ్యాంకు ద్రవ్య విధానం

ద్రవ్యం ద్వారా కొన్ని ఆదర్శ లక్ష్యాలను సాధించడానికి రిజర్వ్ బ్యాంకు చేపట్టే విధానాన్ని ద్రవ్య విధానం అంటారు.

ముఖ్య లక్షణాలు: 1) ధరల స్థాయి నియంత్రణ, 2) వ్యాపారచక్రాల నియంత్రణ, 3) సంపూర్ణ ఉద్యోగిత సాధించడం, 4) విదేశీ మారక ద్రవ్య రేట్లలో స్థిరత్వం. 5) ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం

 

ద్రవ్య విధాన పరికరాలు / పరపతి నియంత్రణ పరికరాలు

భారత రిజర్వ్ బ్యాంకు చరిత్రాత్మకంగా ప్రత్యక్ష పరికరాలైన నగదు నిల్వల నిష్పత్తి, శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి (ఎస్ఎల్ఆర్), నియంత్రించే వడ్డీరేట్లు, బ్యాంకుల పరపతిని నిర్దేశించడం లాంటి వాటిని ఉపయోగించేది. కానీ 1990 దశకంలో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయ అనుభవాల దృష్ట్యా భారతదేశ ద్రవ్య విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. దీని మూలంగా ఆర్‌బీఐ ప్రత్యక్ష పరికరాల నుంచి పరోక్ష ద్రవ్యవిధాన పరికరాలైన బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్), మార్కెట్ స్థిరత్వ పథకం (ఎంఎస్ఎస్), బహిరంగ మార్కెట్ వ్యవహారాలు (వోఎంవో), రెపో- రివర్స్‌రెపో రేట్లకు ప్రాధాన్యం ఇస్తోంది.

 

నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)

ఒక బ్యాంకు తన మొత్తం డిమాండ్, కాలపరిమితి డిపాజిట్లలో రిజర్వ్ బ్యాంకు వద్ద నగదు నిల్వలుగా పెట్టాల్సిన నిష్పత్తే నగదు నిల్వల నిష్పత్తి. 'రిజర్వ్ బ్యాంకు సవరణ చట్టం-1962' ప్రకారం మొత్తం డిపాజిట్లపై 3 శాతం నుంచి 15 శాతం వరకు నగదు నిల్వల రేటును పెంచే అధికారం రిజర్వ్ బ్యాంకుకు ఉంది. 'రిజర్వ్ బ్యాంకు సవరణ చట్టం-2006' రిజర్వ్ బ్యాంకుకు ఎలాంటి పరిమితి లేకుండా నగదు నిల్వల నిష్పత్తిని నిర్ణయించే వెసులుబాటు కల్పించింది. 1992లో 15% గరిష్ఠ స్థాయిలో ఉన్న సీఆర్ఆర్‌ను ప్రస్తుతం 4% వరకు ఆర్‌బీఐ తగ్గించింది.

 

శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి (ఎస్ఎల్ఆర్)

ఎస్ఎల్ఆర్‌ను 1949లో మొదట బ్యాంకుల మీద 20%గా విధించారు. ఈ నిష్పత్తిలో ఎస్ఎల్ఆర్ 15 సంవత్సరాల పాటు (సెప్టెంబరు 1964 వరకు) ఉంది. తర్వాత దీన్ని 25%కు పెంచారు. అనంతరం ఎస్ఎల్ఆర్‌లో (1970 ఫిబ్రవరిలో) మార్పు చేశారు. అప్పటి నుంచి దీన్ని వివిధ దశల్లో పెంచారు. గరిష్ఠంగా 1990 సెప్టెంబరులో 38.5% వరకు పెంచారు. తరువాత రిజర్వ్ బ్యాంకు విధాన నిర్ణయం ప్రకారం ఎస్ఎల్ఆర్‌ను 1993 మొదటి భాగంలో 38.25% నుంచి 1997లో 25% వరకు తగ్గించారు. ప్రస్తుతం ఇది 21.5%గా ఉంది.



బ్యాంకు రేటు

బ్యాంకు రేటును 1935లో 3.5%గా నిర్ణయించి కొద్ది మార్పులతో 1991లో 12%కు పెంచారు. 1997 ఏప్రిల్‌లో 11% ఉన్న బ్యాంకు రేటు 2003 ఏప్రిల్‌కి 6% కు మార్పు చేశారు. లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (ఎల్ఏఎఫ్)లో భాగంగా ఆర్‌బీఐ రెపో, రివర్స్‌రెపో రేట్ల వినియోగం ద్వారా ద్రవ్య విధానాన్ని నియంత్రణ చేయడం వల్ల బ్యాంకు రేటు ప్రాధాన్యం తగ్గింది. ప్రస్తుతం (సెప్టెంబరు 29, 2015 - ఆర్‌బీఐ నివేదిక) బ్యాంకు రేటు 7.75%గా ఉంది.(పట్టిక-2)

 

బహిరంగ మార్కెట్ వ్యవహారాలు

ప్రభుత్వ సెక్యూరిటీల మీద ఆర్‌బీఐ నిర్వహించే వడ్డీరేట్ల నుంచి మార్కెట్‌లో స్వతంత్రంగా నిర్ణయించే వడ్డీరేట్ల వ్యవస్థకు మార్పుచెందే క్రమంలో బహిరంగ మార్కెట్ వ్యవహారాలు ఒక ముఖ్యమైన ద్రవ్యత్వ సాధనంగా రూపొందాయి. 1995-96 నుంచి వోఎంవోపై ఎక్కువ దృష్టి కేంద్రీకృతమైంది. 1998-99లో వివిధ మెచ్యూరిటీలున్న ట్రెజరీ బిల్లులను బహిరంగ మార్కెట్ వ్యవహారాల్లో చేర్చారు. ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్ బాగా అభివృద్ధి చెంది, అర్హత ఉన్న సెక్యూరిటీల పరిమాణం ఎక్కువగా ఉంటే వోఎంవోల వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి.

 

రెపో-రివర్స్‌రెపో రేటు

దేశంలోని వాణిజ్య బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంకు ఏ వడ్డీరేటు వద్ద రుణాలను పొందుతుందో ఆ రేటును రెపోరేటు అంటారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వం పెరిగి ద్రవ్యోల్బణ వాతావరణం ఏర్పడే పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంకు రెపో ద్వారా ద్రవ్యత పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది ఒక స్వల్పకాలిక రేటు.

వాణిజ్య బ్యాంకులు, ఏ వడ్డీ రేటు వద్ద తమకు అవసరమైన రుణాలను పొందగలుగుతాయో, ఆ రేటును రివర్స్ రెపో రేటు అంటారు. (పట్టిక-3)

 

ఆర్థిక స్థిరత్వం - ద్రవ్య విధానం పాత్ర

రిజర్వ్ బ్యాంకు అనేక ఉద్దేశాల్లో.. ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం సాధించడం కీలకమైనవి. ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పరచడానికి 2000 మొదటి దశకంలో రెపో, రివర్స్‌రెపో రేట్లపై ఎక్కువగా ఆధారపడింది. ఈ దశకంలో రెపో రేటును 4.25% నుంచి 9.0% మధ్య పరిస్థితులకు అనుగుణంగా 25 సార్లు, రివర్స్‌రెపో రేటును 3.25% నుంచి 6.75% మధ్య 19 సార్లు సవరించారు. బ్యాంకులు తమ డిపాజిట్లు, రుణ రేట్లను నిర్ణయించుకోవడానికి భారతదేశ విత్త వ్యవస్థలో స్వేచ్ఛ కలిగి ఉన్నాయి. ఇలాంటి సరళీకృత విత్తవ్యవస్థలో రిజర్వ్ బ్యాంకు విధాన సూచికల ద్వారా ఆశించిన ఫలితాలు సాధించడం కేంద్ర బ్యాంకుకు సవాల్‌గా చెప్పవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక పరిమితులు, డిపాజిట్ల మీద చెల్లించాల్సిన వడ్డీ, ప్రభుత్వ రుణ పరిమాణం, తిరిగిరాని రుణాలు (ఎన్‌పీఏ) ద్రవ్యోల్బణం తదితర అంశాలు ద్రవ్య విధానం అమలుకు ప్రధాన అడ్డంకులు.

 

నిపుణుల మాట

* కేంద్ర బ్యాంకు ప్రధానమైన విధి స్థిరత్వాన్ని కాపాడటం.. అంటే ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రించడం. - కిచ్ఎల్‌కిన్

* కేంద్ర బ్యాంకు దేశంలోని అన్ని బ్యాంకులకు బ్యాంకు. ఇది కరెన్సీ నోట్లను జారీ చేయడం.. ద్రవ్య పరిమాణాన్ని నియంత్రించడం.. ప్రభుత్వాలకు ప్రతినిధిగా వ్యవహరించడం.. వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలను కాపాడటం.. విదేశీ మారక ద్రవ్యాన్ని నియంత్రించడం.. అంతర బ్యాంకు లావాదేవీలను పరిష్కరించడం.. పరపతిని నియంత్రించడం చేస్తుంది. - ఎమ్.హెచ్.డి.కోక్

* ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్య పరిమాణాల పెరుగుదల, తరుగుదలను అదుపు చేయడం కేంద్ర బ్యాంకు ముఖ్య విధి. - కెంట్

* ద్రవ్య విధానాన్ని అమలు పరచడం కేంద్ర బ్యాంకు ముఖ్యమైన విధి. - ఆర్.ఎన్.సేయర్స్

* కేంద్ర బ్యాంకు అనేది వాణిజ్య బ్యాంకులకు అంతిమంగా రుణాలిచ్చి ఆదుకునే వ్యవస్థ. - హాత్రీ

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌