• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్య విధానం, బ్యాంకింగ్

  ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య, బ్యాంకింగ్ అంశాలు అత్యంత కీలకమైనవి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహం ప్రాధాన్యాన్ని మానవ శరీరంలో రక్త ప్రవాహంతో పోల్చవచ్చు. దేశ ఆర్థిక విధానాలను లోతుగా అర్థం చేసుకోవడంలో ద్రవ్య విధానం, బ్యాంకింగ్ వ్యవస్థ ప్రధానపాత్ర పోషిస్తాయి. అన్ని రకాల పోటీపరీక్షల్లోనూ 'ఇండియన్ ఎకానమీ' సబ్జెక్టు చాలా కీలకమైంది. పై అంశాలపై ఒక నిర్దిష్ట అవగాహనను ఏర్పరచుకోగలిగితే మంచి మార్కులు సాధించే వీలుంటుంది. ప్రధానంగా గణాంకాల సరళిని అర్థం చేసుకుంటే సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు.
భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ సరళీకరణ, ప్రపంచీకరణల ద్వారా గత రెండు దశాబ్దాల్లో ఎంతో పరివర్తన చెందింది. భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల సమ్మిళితం. ద్రవ్య, బ్యాంకింగ్ వ్యవస్థల గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

 

ద్రవ్యం - నిర్వచనం

ద్రవ్యాన్ని నిపుణులు ప్రజల భావాలకు అనుగుణంగా వివిధ కోణాల్లో నిర్వచించారు. అవేమిటో చూద్దాం..

* ప్రజలంతా దేన్ని 'ద్రవ్యం' అని సార్వత్రికంగా అంగీకరిస్తే అదే ద్రవ్యం - సెలిగ్‌మన్

* వినిమయ సాధనంగా ప్రజలంతా భావించేదే ద్రవ్యం - క్రౌధర్

* ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో లభ్యమయ్యే మొత్తమే ద్రవ్యం - రాడ్‌క్లిఫ్ కమిటీ

 

'ద్రవ్య' వర్గీకరణ

* ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువుని బట్టి రెండు రకాలు. అవి

    1. లోహపు ద్రవ్యం
    2. కాగితపు ద్రవ్యం

* చట్టబద్ధమైన ఆమోదం కోణంలో రెండు రకాలు.
    1. అపరిమిత చట్టబద్ధమైన ద్రవ్యం
    2. పరిమిత చట్టబద్ధమైన ద్రవ్యం

* ప్రజల ద్రవ్యత్వాభిరుచి(లిక్విడిటీ ప్రిఫరెన్స్)కి అనుగుణంగా చూస్తే.. 1. సామాన్య ద్రవ్యం, 2. సమీప ద్రవ్యం - అని రెండు రకాలు.

 

విశదీకరణ

లోహపు ద్రవ్యం: ద్రవ్యం తయారీలో లోహాలు (బంగారం, వెండి, నికెల్) ఉపయోగిస్తే దాన్ని లోహపు ద్రవ్యం అంటారు. ఇందులో 3 అంశాలుంటాయి.

i) ప్రమాణ ద్రవ్యం: ఒక నాణెం తయారీకి ఉపయోగించే లోహం విలువ దాని ముఖవిలువకు సమానంగా ఉంటే దాన్ని ప్రమాణ ద్రవ్యం అంటారు.
ఉదా: 5 రూపాయల నాణెం తయారీకి 5 రూపాయల విలువ ఉన్న వెండి వాడటం.

ii) చిహ్న ద్రవ్యం: నాణెం తయారీకి ఉపయోగించే లోహం విలువ కంటే దాని చెలామణి విలువ ఎక్కువ ఉండటం.

iii) ప్రతినిధి ద్రవ్యం: తక్కువ విలువ ఉన్న లోహాన్ని లేదా కాగితాన్ని ద్రవ్యంగా ముద్రించి వాడటం. ఈ విధానంలో ద్రవ్యం జారీ చేసే అధికారుల దగ్గర ద్రవ్యానికి సమానమైన బంగారం, వెండి నిల్వలుంటాయి.

 

కాగితపు ద్రవ్యం (కరెన్సీ)

కాగితంపై ముద్రించే ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యం లేదా కరెన్సీ అంటారు. భారతదేశంలో ఈ పద్ధతి 19వ శతాబ్దంలో మొదలైంది. మొదట దీన్ని చైనాలో ప్రారంభించారు. ఇందులో 3 రకాలుంటాయి.

i) పరివర్తనీయ కాగితపు ద్రవ్యం: ఈ ద్రవ్యం బంగారం లేదా వెండి లోహాల్లోకి మార్చుకోవడానికి వీలు కలిగిస్తుంది. 19వ శతాబ్దంలోని స్వర్ణ ప్రమాణంలో ఈ సౌలభ్యం ఉండేది. అంతర్జాతీయ మార్కెట్‌లో 1944-1971 మధ్య ఉన్న బ్రిటన్‌వుడ్స్ పద్ధతిలో అమెరికన్ డాలర్లను బంగారంగా మార్చుకునే సౌకర్యం ఉండేది.

ii) అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం: జారీ చేసిన కాగితపు నోట్లను బంగారం లేదా వెండి లోహాల్లోకి మార్చుకునే వీలుండదు.

iii) శాసనపు ద్రవ్యం: అత్యవసర పరిస్థితుల్లో జారీచేసే కరెన్సీని శాసనపు ద్రవ్యం అంటారు. దీన్ని పరిమిత పరిమాణంలోనే జారీ చేస్తారు.

 

చట్టబద్ధమైన ద్రవ్యం

కేంద్ర బ్యాంకు జారీచేసే ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకులు జారీచేసే చెక్కులు, ప్రామిసరీ నోట్లు చట్టబద్ధమైన ద్రవ్యం కాదు. వీటిలో 2 అంశాలు..

i) అపరిమిత చట్టబద్ధమైన ద్రవ్యం: రిజర్వు బ్యాంకు జారీ చేసే కరెన్సీ నోట్లు ఎంత పరిమాణంలో ఉన్నా భారత ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలి.

ఉదా: మనదేశంలో 50 పైసలకు మించి ఉన్న నాణేలు, రూపాయి నుంచి 1000 వరకు ఉన్న నోట్లు.

ii) పరిమిత చట్టబద్ధమైన ద్రవ్యం: కొంత పరిమితికి లోబడి మాత్రమే ఆమోదించే ద్రవ్యం.
ఉదా: 5, 10, 20, 25 పైసల నాణేలు. వీటిని 25 రూపాయల వరకు మాత్రమే ఆమోదిస్తారు.

 

ద్రవ్యత్వ అభిరుచి

i) సామాన్య ద్రవ్యం: ప్రజల దగ్గర ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు, బ్యాంకుల వద్ద ఉండే డిమాండ్ డిపాజిట్లును సామాన్య ద్రవ్యం లేదా సంకుచిత ద్రవ్యం (న్యారో మనీ) అంటారు. దీనికి ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది.

ii) సమీప ద్రవ్యం: సామాన్య ద్రవ్యంతో పోల్చినప్పుడు తక్కువ ద్రవ్యత్వం కలిగి ఉంటుంది. అవసరమైనప్పుడు దీన్ని ద్రవ్యంగా తక్కువ కాలవ్యవధిలో, తక్కువ ఖర్చుతో మార్చుకోగలం.
ఉదా: ట్రెజరీ బిల్లులు, బాండ్లు, డిబెంచర్లు

 

ద్రవ్య భావనలు

* M1, M2, M3, M4 అనే నాలుగు రకాల ద్రవ్య భావనలను భారత రిజర్వు బ్యాంకు ఏప్రిల్ 1977 నుంచి ప్రవేశ పెట్టింది.

* M1ని సంకుచిత ద్రవ్యం, M3ని విశాల ద్రవ్యం అంటారు.

M1, M3 ద్రవ్య పరిమాణాలను రిజర్వు ద్రవ్యం లేదా హైపర్ ద్రవ్యం నిర్ణయిస్తుంది.

* M1 నుంచి M4 కు ద్రవ్యత్వం తగ్గుతూ వస్తుంది.

* M1 కు అత్యధిక ద్రవ్యత్వం ఉండటం వల్ల బ్యాంకులు వాటి రుణాలను దీనిమీద ఆధారపడి జారీ చేయలేవు.

* M3 కు తక్కువ ద్రవ్యత్వం ఉంటుంది. దాంతో ఇవి బ్యాంకుల వద్ద నిర్ణీతకాలం ఉంటాయి. కాబట్టి బ్యాంకులు రుణాలను దీనిమీద ఆధారపడి జారీ చేస్తాయి.

 

భారతదేశ ద్రవ్య వ్యవస్థ

మన దేశంలో ద్రవ్య వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల విశేషాలివి..

* భారతీయ రిజర్వు బ్యాంకు, దేశ ద్రవ్య వ్యవస్థను నియంత్రిస్తుంది.

* ప్రస్తుత ద్రవ్య వ్యవస్థను పరివర్తనలేని కాగితపు ప్రమాణంగా వర్ణించవచ్చు.

* భారత ద్రవ్య వ్యవస్థ మూలాధార యూనిట్ రూపాయి. రూపాయితోపాటు రూ. 2, 5, 10, 20, 50, 100, 500, 1000 విలువ ఉన్న కాగితపు ద్రవ్య యూనిట్లు ఉంటాయి.

* ఈ ద్రవ్య వ్యవస్థ 1957 జనవరి నుంచి వాడుకలో ఉంది.

* భారతదేశ కాయినేజ్(సవరణ) చట్టం - 1955 ద్వారా నూతన దశాంశ(డెసిమల్) వ్యవస్థను ప్రవేశపెట్టారు.

 

నాణేలు, ఆర్‌బీఐ నోట్లు

* భారతదేశ కేంద్ర ప్రభుత్వ విత్త మంత్రిత్వ శాఖ ఒక రూపాయి నోట్లను; ఒక రూపాయి, 50 పైసల నాణేలతో సహా అన్ని నాణేలను ముద్రిస్తుంది.

* 2011 జూన్ నుంచి 25 పైసలు అంతకంటే తక్కువ విలువ ఉన్న నాణేలను తొలగించారు.

* భారతదేశంలో కరెన్సీను ముద్రించే గుత్తాధిపత్య హక్కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కు ఉంది.

 

భారత్‌లో ద్రవ్య సరఫరా

ఒక దేశంలో ప్రజల వద్ద, వ్యాపార సంస్థల వద్ద ఉండే ద్రవ్యాన్ని ద్రవ్య సరఫరా అంటారు. ప్రజలు, వ్యాపార సంస్థలు తమ లావాదేవీలు జరపడానికి, రుణాలను చెల్లించడానికి వినియోగించే మొత్తం మాత్రమే 'ద్రవ్య సరఫరా' పరిధిలోకి వస్తుంది.

ద్రవ్య సమష్టిలు (మానిటరీ అగ్రిగేట్స్) / ద్రవ్య కొలమానాలు

i) మొదటి రకం ద్రవ్యం లేదా సంకుచితమైన ద్రవ్యం (M1)

* ప్రజల దగ్గర ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు (C).

* బ్యాంకుల డిమాండ్ డిపాజిట్లు (DD)

* కేంద్ర బ్యాంకు ఇతర డిపాజిట్లు (OD)

M1 = C + DD + OD

ii) రెండోరకం ద్రవ్యం (M2)

* M1 సహా తపాలా కార్యాలయాల వద్ద ఉండే పొదుపు డిపాజిట్లు.

iii) మూడోరకం ద్రవ్యం (M3) లేదా విశాల ద్రవ్యం

* M1 సహా బ్యాంకుల వద్ద ఉన్న కాలపరిమితి డిపాజిట్లు (TD)

M3 = M1 + TD

iv) నాలుగోరకం ద్రవ్యం (M4)

M3 సహా అన్ని రకాల తపాలా కార్యాలయాల డిపాజిట్లు

* తపాలా కార్యాలయాలకు చెందిన గణాంకాలను రిజర్వు బ్యాంకు తాజాగా సంకలనం చేయడం లేదు కాబట్టి M2, M4 భావనలు అర్థరహితంగా మారాయి. (పట్టికలు-1, 2 చూడండి)

వై.వి.రెడ్డి (1998) మూడో వర్కింగ్ గ్రూపు - నూతన ద్రవ్య, ద్రవ్యత్వ కొలమానాలు

ఈ వర్కింగ్ గ్రూపు నాలుగు ద్రవ్య సమష్టిలను పునర్‌నిర్వచించింది.

* సవరించిన ద్రవ్య సప్లయి నిర్వచనం ప్రకారం M0 (రిజర్వ్ ద్రవ్యం), M1 (సంకుచిత ద్రవ్యం), M2, M3 (విశాల ద్రవ్యం)లను మాత్రమే లెక్కిస్తారు.

* రిజర్వు లేదా హైపవర్ ద్రవ్యం (M0): ద్రవ్య సప్లయిని నిర్ణయించే అంశాల్లో ప్రధానమైంది. దీన్ని ప్రభుత్వ ద్రవ్యంగా భావించవచ్చు. దీన్ని మూలాధార ద్రవ్యం లేదా హైపవర్ ద్రవ్యం అంటారు.

M0 = C + OD + CR

C = ప్రజల దగ్గర చెలామణిలో ఉన్న నాణేలు, కరెన్సీ

OD = ప్రజలు రిజర్వు బ్యాంకులో పెట్టుకున్న ఇతర డిపాజిట్లు

CR = వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు

M0కు M1 మధ్య అవినాభావ సంబంధం ఉంది.

M1 = C + OD + DD

బ్యాంకింగ్ వ్యవస్థ సృష్టించే మొత్తం డిపాజిట్ నిర్మాణానికి నగదు నిల్వలు (CR) మూలాధారంగా ఉంటాయి. (పట్టిక-3 చూడండి)

 

ద్రవ్య గుణకం

* ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయిని నిర్ణయించే అంశాల్లో ముఖ్యమైంది రిజర్వు ద్రవ్యం.

* ద్రవ్య సప్లయి, రిజర్వు ద్రవ్యానికి మధ్య ఉండే నిష్పత్తిని ద్రవ్య గుణకం తెలియజేస్తుంది.

* సంకుచిత ద్రవ్య గుణకం m1 = M1/M0

* విశాల ద్రవ్య గుణకం m3 = M3/M0

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌