• facebook
  • whatsapp
  • telegram

భారత రిజర్వ్ బ్యాంక్, ద్రవ్య విధానం

  ఆధునిక కాలంలో సార్వభౌమ దేశాలన్నింటిలోనూ కేంద్ర బ్యాంక్‌ను ఒక ముఖ్య ద్రవ్య సంస్థగా భావిస్తున్నారు. ఆ దేశాల్లో జరిగే అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలను అది నియంత్రిస్తుంది. దేశ ఆర్థిక విధానాలను అమలు పరచడంలో కేంద్ర బ్యాంకు ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన దేశంలో స్వాతంత్య్రానంతరం ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధిని త్వరితగతిన సాధించడానికి ప్రభుత్వ స్వాధీనంలో ఉండే కేంద్ర బ్యాంక్ అవసరమని భావించి, ఆర్‌బీఐని ఏర్పాటు చేశారు.

  ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక రంగంలో అవసరమైన పెట్టుబడులను పొదుపు ద్వారా సమీకరించడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు అవసరమైన పెట్టుబడులను అందించడానికి వాణిజ్య బ్యాంకులు పరపతిని సృష్టిస్తున్నాయి. ఈ ప్రక్రియలో అప్పుడప్పుడు వ్యాపార కార్యకలాపాల్లో వచ్చే ఒడుదొడుకుల ఫలితంగా వ్యాపార చక్రాలు ఏర్పడతాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు కూడా తలెత్తుతాయి. ధరల స్థాయుల్లోని ఒడుదొడుకులను అదుపులో పెట్టడానికి పరపతి, ద్రవ్య పరిమాణాలను నియంత్రించడం అవసరం. కాగితపు ద్రవ్యం, దాని మార్పిడి రేటును స్థిరీకరించడం కూడా అవసరం. తద్వారా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్య వ్యవస్థ చివరికి ఆర్థికాభివృద్ధికి దారితీయాలి. దీన్ని సాధించడానికి, బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించడానికి అధికారం కలిగి ఉన్న అత్యున్నత సంస్థ అవసరం. భారతదేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ అనే కేంద్ర బ్యాంకు ఈ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

 

పుట్టు పూర్వోత్తరాలు

  మొదటి కేంద్ర బ్యాంక్ 1656లో స్వీడన్ రిక్స్ బ్యాంకు స్థాపనతో మొదలైనా, కేంద్ర బ్యాంక్ అనే భావన ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందింది. 1694లో స్థాపించిన 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్' ఒక కేంద్ర బ్యాంక్ నిర్వహించాల్సిన అన్ని విధులను నిర్వహించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను అనుసరించి 19వ శతాబ్దంలో యూరప్‌లో మరెన్నో కేంద్ర బ్యాంకులు పుట్టుకొచ్చాయి.

  1800లో స్థాపించిన 'బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్' దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిర్వహించింది. బ్యాంక్ ఆఫ్ నెదర్లాండ్స్‌ను 1814లో, 'బ్యాంక్ ఆఫ్ రష్యా'ను 1860లో ఏర్పాటు చేశారు. దేశీయ ద్రవ్య పద్ధతిని క్రమపరచడానికి 1882లో 'బ్యాంక్ ఆఫ్ జపాన్‌'ను స్థాపించారు. 'ఇటలీ సెంట్రల్ బ్యాంకు' 1893లో ఏర్పడగా, స్విస్ జాతీయ బ్యాంకు 1907లో స్థాపితమైంది. ప్రపంచంలో అతి పెద్ద పెట్టుబడిదారీ దేశమైన అమెరికాలో 'ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌'ను 1913లో, కెనడాలో 1934లో స్థాపించారు.

  1920లో బ్రెస్సల్స్‌లో జరిగిన అంతర్జాతీయ విత్త సమావేశంలో కేంద్ర బ్యాంకు లేని దేశాల్లో వీలైనంత తొందర్లో కేంద్ర బ్యాంకులను స్థాపించాలని తీర్మానించారు. దీనికి అనుగుణంగా చాలా దేశాల్లో కేంద్ర బ్యాంకులను స్థాపించారు.

 

కేంద్ర బ్యాంకు నిర్వచనం

కేంద్ర బ్యాంకు నిర్వచనం అది నిర్వహించే విధులను అనుసరించి ఉంటుంది. కేంద్ర బ్యాంకు విధులు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. ఒకే దేశంలో వివిధ కాలాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. అందువల్ల కేంద్ర బ్యాంకుకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని ఇవ్వడం కష్టం.

* కేంద్ర బ్యాంకు ప్రధానమైన విధి స్థిరత్వాన్ని కాపాడటం. అంటే ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రించడం.- కిచ్, ఎల్‌కిన్
* ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్య పరిమాణాల పెరుగుదల, తరుగుదలను అజమాయిషీ చేయడం కేంద్ర బ్యాంకు ముఖ్య విధి- కెంట్
* కేంద్ర బ్యాంకు అనేది వాణిజ్య బ్యాంకులకు అంతిమంగా రుణాలిచ్చి ఆదుకునే వ్యవస్థ- హాత్రే
* ద్రవ్య విధానాన్ని అమలు పరచడం కేంద్ర బ్యాంకు ముఖ్యవిధి- సేయర్స్
* కేంద్ర బ్యాంకు ద్రవ్య, బ్యాంకింగ్ నిర్మాణంలో శిఖరం ఆక్రమిస్తున్న బ్యాంకు. ఇది కరెన్సీ నోట్లను జారీ చేయడంలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండటంతోపాటు అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది- డికాక్

 

భారత రిజర్వ్ బ్యాంక్

* భారతదేశ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్. దీన్ని RBI చట్టం 1934 కు అనుగుణంగా 1935, ఏప్రిల్ 1న రూ.5 కోట్ల మూలధనంతో వాటాదార్ల బ్యాంకుగా (Share holders bank) స్థాపించారు.

* 1949, జనవరి 1న రిజర్వ్ బ్యాంక్‌ను జాతీయం చేశారు. ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం కోల్‌కతాలో ఉండేది. 1937లో దీన్ని శాశ్వతంగా ముంబయికి మార్చారు. సమర్థంగా విధులను నిర్వహించడానికి వీలుగా కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, నాగ్‌పుర్, చెన్నై, హైదరాబాద్, పట్నా నగరాల్లో శాఖలను ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. నలుగురికి మించకుండా ఉపగవర్నర్లు ఉంటారు. ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్.

 

ఆర్‌బీఐ లక్ష్యాలు

ఎ) కరెన్సీని క్రమబద్ధం చేయడం

బి) ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య స్థిరత్వాన్ని, సుస్థిరతను సాధించడం

సి) పటిష్ఠమైన ద్రవ్య విధానాన్ని అమలుపరుస్తూ, పరపతిని నియంత్రించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం.

డి) దేశంలో వాణిజ్య బ్యాంకులకు స్నేహితుడిగా, తత్వవేత్తగా, మార్గదర్శకుడిగా వ్యవహరించడం.

ఇ) దేశవ్యాప్తంగా ఒకే రీతిలో పరపతి విధానాన్ని అమలు చేయడం.

ఎఫ్) దేశ ఆర్థిక, కోశ విధానాల్లో ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించడం.

 

ఆర్‌బీఐ విధులు

     ఆదర్శమైన ఒక కేంద్ర బ్యాంక్ నిర్వహించే అన్ని ప్రాచీన, ఆధునిక విధులను భారత రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుంది. భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ప్రకారం ఆర్‌బీఐ ఈ కింది విధులను నిర్వహిస్తుంది.

 

1. ద్రవ్యాన్ని ముద్రించి, చలామణి చేసే గుత్తాధిపత్యం:
     భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 సెక్షన్ 22 ప్రకారం కరెన్సీ నోట్లను ముద్రించే గుత్తాధిపత్య అధికారం భారత రిజర్వ్ బ్యాంకుకు ఉంటుంది. రెండు రూపాయల కరెన్సీ నుంచి రూ.2 వేల నోట్ల వరకు ఆర్‌బీఐ ముద్రించి, పంపిణీ చేస్తుంది. 
* ఒక రూపాయి నోటు, ఒక రూపాయి నాణేలను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసినా, వాటి పంపిణీ బాధ్యత మాత్రం ఆర్‌బీఐదే.
* 1956 కు ముందు ఆర్‌బీఐ కరెన్సీ నోట్ల జారీకి అనుపాత నిల్వల పద్ధతిని పాటించింది. 1956లో అనుపాత నిల్వల పద్ధతిని రద్దు చేసి, 'కనిష్ఠ నిల్వల పద్ధతి' (Minimum Reserve System) ప్రవేశపెట్టింది.
* కరెన్సీ జారీకి రూ.400 కోట్లు కనీస నిల్వలుగా నిర్ణయించారు. ఇందులో రూ.200 కోట్ల మేర బంగారం, రూ.200 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఉండాలి. 1957లో కరెన్సీ నిల్వల పరిమాణాన్ని రూ.400 కోట్ల నుంచి రూ.200 కోట్లకు తగ్గించారు. ఇందులో రూ.115 కోట్ల మేరకు బంగారం నిల్వలు, రూ.85 కోట్ల మేరకు విదేశీ మారక ద్రవ్యం ఉండాలి.

 

2. ప్రభుత్వ బ్యాంకు:
    ఆర్‌బీఐ నిర్వహించే రెండో ముఖ్య విధి- ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరించడం. కేంద్ర ప్రభుత్వానికి, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ బ్యాంకుగా, ప్రభుత్వ ఏజెంటుగా ఇది వ్యవహరిస్తుంది. ఆర్థిక, ద్రవ్య విధానాల విషయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారుగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున రుణాలను స్వీకరిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 90 రోజుల కాలపరిమితితో స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తుంది. వీటిని 'వేస్ అండ్ మీన్స్' అడ్వాన్స్ అంటారు. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.

 

3. బ్యాంకులకు బ్యాంకు:
     వాణిజ్య బ్యాంకులకు నాయకత్వం వహించి, వాటి కార్యకలాపాలను నియంత్రిస్తుంది. వాణిజ్య బ్యాంకులు తమ లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆర్‌బీఐకి పంపాల్సి ఉంటుంది. ఒక కొత్త బ్యాంకు ఆవిర్భవించాలన్నా, ఒక కొత్త శాఖను ఏర్పాటు చేయాలన్నా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి లైసెన్సు పొందాల్సి ఉంటుంది.

 

4. అంతిమ రుణదాత:
    అర్హత కలిగిన బిల్లులను రీ-డిస్కౌంట్ చేయటం ద్వారా గానీ, అర్హమైన సెక్యూరిటీల మీద రుణాలు, అడ్వాన్సుల రూపంలో వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభం ఏర్పడే పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులను ఆదుకోవటానికి ఆర్‌బీఐ అందుబాటులో ఉంటుంది. అందుకే ఆర్‌బీఐని అంతిమ రుణదాత అంటారు.

 

5. పరపతి నియంత్రణ ద్వారా ఆర్థిక స్థిరత్వం:
     వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి పరిమాణం ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ, ప్రతిద్రవ్యోల్బణానికి దారితీసి ఒడుదొడుకులు ఏర్పడవచ్చు. పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలను ఉపయోగించడం ద్వారా ఆర్‌బీఐ పరపతి నియంత్రణ చేస్తుంది.

 

6. అంతర్జాతీయ ద్రవ్యనిధుల పరిరక్షణ:
    విదేశీ ద్రవ్య వ్యవహారాలన్నీ ఆర్‌బీఐ ద్వారానే నడుస్తాయి. అంతర్జాతీయ చెల్లింపుల శేషంలో ఏర్పడే లోటును పూరించడానికి విదేశీ మారకంగా ఉపయోగించే బంగారు నిల్వలను, విదేశీమారక ద్రవ్య నిల్వలను పరిరక్షించడం ఆర్‌బీఐ విధుల్లో ఒకటి.

 

7. క్లియరింగ్ హౌస్‌ల నిర్వహణ:
    బ్యాంకుల నిత్యావసరాల్లో పనులను సులభతరం చేసే నిమిత్తం కొన్ని ముఖ్య కేంద్రాల్లో ఆర్‌బీఐ క్లియరింగ్ హౌస్‌లను నిర్వహిస్తోంది. క్లియరింగ్ హౌస్‌ల ద్వారా జరిగిన వ్యవహారాల వల్ల ఏయే వాణిజ్య బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇస్తున్నాయో ఆర్‌బీఐకి తెలుస్తుంది.

 

8. పర్యవేక్షక విధులు:
     భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలో రిజర్వ్ బ్యాంకు శిఖరాగ్ర సంస్థ. బ్యాంకింగ్ సంస్థలపై నియంత్రణ, పర్యవేక్షణ ద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడుతుంది. ఆర్థిక వ్యవస్థలో మోసపూరిత కార్యకలాపాల నియంత్రణకు అవసరమైన విధివిధానాలను అమలుపరచడం ద్వారా బ్యాంకు నిధులు సమర్థంగా ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడేలా చూస్తుంది.

 

9. అభివృద్ధిపరమైన విధులు:
    భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేక అభివృద్ధిపరమైన, ప్రగతి పూర్వకమైన విధులను నిర్వహిస్తుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి, అవస్థాపన సౌకర్యాల కల్పనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అవసరమైన చర్యలను ఆర్‌బీఐ చేపడుతుంది.
* వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కోసం 1963లో వ్యవసాయ పునఃవిత్త కార్పొరేషన్‌ను, 1982లో నాబార్డ్‌ను స్థాపించారు.
* పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి 1948లో భారత పారిశ్రామిక విత్త కార్పొరేషన్‌ను, 1953లో రాష్ట్ర విత్త కార్పొరేషన్‌లు, 1964లో భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (ఐడీబీఐ), భారతదేశ యూనిట్ ట్రస్ట్ (యూటీఐ)ను ఆర్‌బీఐ స్థాపించింది.

 

ఆర్‌బీఐ ద్రవ్యవిధానం

  ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య పరిమాణం ముఖ్యంగా పరపతి రూపంలో బ్యాంకులు సృష్టించే ద్రవ్యం ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. కానీ, అదే సమయంలో ద్రవ్యోల్బణం, స్పెక్యులేటివ్ కార్యకలాపాలకు, ఆదాయ అసమానతలు పెరగడానికి, వ్యాపార చక్రాలు ఏర్పడటానికి ద్రవ్య పరిమాణం కారణం అవుతుంది. కాబట్టి ఈ సమస్యలను అధిగమించి, నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానాన్ని అమలు చేస్తుంది.

ద్రవ్య విధానం ముఖ్య లక్ష్యాలు:
     ఎ) ధరల స్థాయి నియంత్రణ, వ్యాపార చక్రాల నియంత్రణ
     బి) సంపూర్ణ ఉద్యోగిత సాధించడం
     సి) త్వరిత ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం
     డి) ఆదాయ అసమానతలు తగ్గించడం
     ఇ) విదేశీ మారకపు రేట్ల స్థిరత్వానికి కృషి చేయడం
     ఎఫ్) చెల్లింపుల శేషంలో సమతౌల్యం సాధించడం
     జి) ప్రాంతీయ సమానాభివృద్ధికి కృషి చేయడం

 

ద్రవ్య విధాన/ పరపతి నియంత్రణ సాధనాలు

   రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరిమాణం, ఉపయోగాలను నియంత్రించడానికి చేపట్టే విధానాన్నే 'ద్రవ్యవిధానం' అంటారు. ద్రవ్య విధాన సాధనాలు లేదా పరపతి నియంత్రణ సాధనాలు రెండు రకాలు: అవి.

     1. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు

     2. గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు

* పరిమాణాత్మక పరపతి నియంత్రణలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ దేశంలో పరపతి పరిమాణాన్ని, ద్రవ్య సరఫరాను నియంత్రిస్తుంది.

* గుణాత్మక పరపతి విధానం అంటే పరపతి, ద్రవ్య సరఫరా ఉపయోగాన్ని నియంత్రించడం. దీనికోసం మార్జిన్లను మార్చడం, విచక్షణాత్మక వడ్డీరేటు, వినియోగదారుల పరపతి నియంత్రణ, పరపతి రేషనింగ్, నైతికోద్బోధ, ప్రత్యక్ష చర్యలు లాంటి విధానాలను ఆర్‌బీఐ పాటిస్తుంది.

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌