• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు

  భార‌త‌దేశంలోని ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను మూడు ప్ర‌తిపాద‌న‌ల‌కు సంబంధించిన అంశంగా ప‌రిగ‌ణించాలి. అవి: ప‌్రయివేటీక‌ర‌ణ‌, స‌ర‌ళీకృత విధానాల అమ‌లు, ప్ర‌పంచీక‌ర‌ణ‌. ప్ర‌యివేటీక‌ర‌ణ - ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లు, విధుల‌ను ప్ర‌యివేటు రంగ‌ప‌రం చేయ‌డాన్ని తెలుపుతుంది. స‌ర‌ళీకృత విధానాలు - ప్ర‌భుత్వ ఆంక్ష‌లు, నియంత్ర‌ణ‌ల‌ను స‌డలించి పారిశ్రామిక, ద్ర‌వ్య, విత్త, విదేశీ విధానం, విదేశీ పెట్టుబ‌డుల్లో ఉదార వైఖ‌రిని పాటించ‌డాన్ని వివ‌రిస్తాయి. ప్ర‌పంచీక‌ర‌ణ - మూల‌ధ‌నం, సాంకేతిక విజ్ఞానం, వ‌స్తుసేవ‌లు, శ్రామిక గ‌మ‌న‌శీల‌త‌పై ఆంక్ష‌ల‌ను తొల‌గించి స్వేచ్ఛా విధానం ద్వారా 'విశ్వ‌గ్రామానికి' మార్గం సుగ‌మం చేయ‌డాన్ని సూచిస్తుంది.

  సంస్కరణలకు పూర్వం భారతదేశంలో వృద్ధిరేటు అల్పంగా, అసంతృప్తికరంగా ఉండేది. దీనికి కారణం ప్రభుత్వరంగ సంస్థల అసమర్థత, ప్రయివేటు రంగంపై నియంత్రణలు, విదేశీ మూలధనం, విదేశీ పెట్టుబడులపై ఉన్న ఆంక్షలు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 1991 ప్రారంభంలో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1980 దశకంలో భారత ప్రభుత్వం అమలు చేసిన సురక్షితంకాని స్థూల ఆర్థిక విధానాలే ఆర్థిక అసమతౌల్యానికి దారితీశాయి. 1980-81 లో స్థూల దేశీయోత్పత్తిలో 5.1 శాతంగా ఉన్న కోశలోటు 1990-91 నాటికి 7.8 శాతానికి చేరుకుంది. ఈ లోటు సర్దుబాటు కోసం ప్రభుత్వం దేశీయ రుణ సమీకరణ చేసింది. 1980-81 లో ఈ రుణం స్థూల దేశీయోత్పత్తిలో 30 శాతం కాగా, 1990-91 నాటికి 50 శాతానికి చేరింది. ఇంతేకాకుండా విదేశీ వ్యాపార చెల్లింపుల శేషపు కరెంట్ ఖాతా లోటు 1980-81 లో స్థూల దేశీయోత్పత్తిలో 1.39 శాతం లేదా 2 బిలియన్ డాలర్లు కాగా, 1990-91 నాటికి 3.9 శాతం లేదా 9.7 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఈ విపత్కర పరిణామాల కారణంగా భారత ప్రభుత్వ విదేశీ రుణం 1980-81 లో జీడీపీలో 12 శాతం ఉండగా, 1990-91 నాటికి 23 శాతానికి చేరింది. విదేశీ మారక నిధులు కేవలం ఒక వారానికి సరిపడే దిగుమతుల స్థాయికి పడిపోయాయి. ద్రవ్యోల్బణం 1980-81 లో 6.7 శాతం నమోదు కాగా 1990-91 నాటికి 10 శాతానికి చేరుకుంది. దీనికి తోడు 1990 ఆఖరి దశకంలో ఏర్పడిన గల్ఫ్ సంక్షోభం పెట్రోలు ధరల పెరుగుదలకు కారణమై ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్ర స్థాయికి చేర్చింది.

  ఆర్థిక సంక్షోభాన్ని నివారించి అంతర్గత, బహిర్గత నమ్మకపు స్థాయిని నిలబెట్టుకోవడానికి అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ చొరవతో 1991 లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. అందుకే వీటిని 'రావు-మన్మోహన్ నమూనా' అని కూడా పిలుస్తారు. ఈ సంస్కరణల ఫలితంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగ్గ స్థాయిలో విధానపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ప్రపంచస్థాయిలో దేశం శీఘ్రతర ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ (LPG) విధానాన్ని అమలు చేసింది.

 

ఆర్థిక సంస్కరణల లక్ష్యాలు

ఎ) కోశ లోటును, రెవెన్యూ లోటును తగ్గించడం.

బి) ప్రభుత్వరంగ పరిధిని తగ్గించి, ప్రయివేటు రంగానికి అప్పగించడం.

సి) పారిశ్రామిక లైసెన్సులు ఎత్తివేయడం.

డి) విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, విదేశీ వ్యాపారంలో సుంకాలు, కోటాలు ఎత్తివేయడం.

ఇ) ఆర్థిక వృద్ధిరేటును పెంచడం.

ఎఫ్) సంపూర్ణ ఉద్యోగితను సాధించడానికి ఉపాధిని విస్తరించడం.

జి) పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలు తగ్గించడం.

హెచ్) దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభాను తగ్గించడం.

ఐ) ప్రాంతీయ అసమానతలు తగ్గించడం.

 

సంస్కరణల్లోని ముఖ్యాంశాలు

     1980 వ దశకం మధ్యలో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం విదేశీ వర్తకం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, విదేశీ మూలధనంపై ఆంక్షలను సడలించడానికి ప్రయత్నించినప్పటికీ, పూర్తిస్థాయి సంస్కరణలు మాత్రం 1991 లోనే జరిగాయి. ఈ నూతన ఆర్థిక సంస్కరణలను రెండు విధాలుగా చెప్పవచ్చు. 

1) స్వల్పకాలానికి సంబంధించిన స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు.

2) దీర్ఘకాలానికి సంబంధించిన నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు.

 

స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు

    ఆర్థిక వ్యవస్థలో వెంటనే సర్దుబాటు చేసేందుకు ఉపయోగించిన ఈ చర్యలనే డిమాండ్ నిర్వహణ చర్యలు అంటారు. దీనిలో భాగంగా ద్రవ్య సప్లయ్‌ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, కోశ సర్దుబాటు చర్యల్లో భాగంగా రాబడిని పెంచి, వ్యయాలను తగ్గించడం, విదేశీ చెల్లింపుల్లో లోటును తగ్గించేందుకు మూల్యహీనీకరణ లాంటి చర్యలను సూచించారు.

వీటిలో ప్రధానంగా పన్ను రాబడిని పెంచేందుకు 1991, 1998 లలో రాజా చెల్లయ్య కమిటీని, ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించేందుకు 2000 లో గీతాకృష్ణన్ కమిషన్‌ను నియమించారు. ఇవేకాకుండా పన్నేతర రాబడిని పెంచేందుకు నీటిపారుదల, విద్యుత్, రోడ్లు మొదలైన వాటిపై యూజర్ ఛార్జీలు విధించారు. కోశలోటును తగ్గించేందుకు భారత ప్రభుత్వం 2003 లో 'కోశ సంస్కరణల బడ్జెటరీ నిర్వహణ చట్టాన్ని (FRBM)' ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా అన్ని రాష్ట్రాలు రెవెన్యూ లోటును 2008-09 నాటికి 0 శాతానికి, కోశలోటును 3 శాతానికి తగ్గించగలగాలి. ఈవిధంగా తగ్గించిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. విదేశీ వ్యాపార చెల్లింపుల్లో లోటును తగ్గించేందుకు 1991 జులై 1, 3 తేదీల్లో రెండుసార్లు మూల్యహీనీకరణ (18% నుంచి 19% మేరకు) చేశారు.

 

నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు

     ఇవి దీర్ఘ కాలానికి చెందినవి. సప్లయ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి. దీనిలో భాగంగానే భారత ప్రభుత్వం సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ అనే మూడు విధానాలను ప్రవేశ పెట్టడానికి కృషిచేసింది.

 

సరళీకరణ (Liberalisation)

      ప్రభుత్వం నియంత్రిత, కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛను కల్పించడాన్ని 'సరళీకరణ' అంటారు. అంటే ప్రభుత్వ జోక్యం తగ్గించి, మార్కెట్ శక్తులకు స్వేచ్ఛను కల్పించడం. లైసెన్సులు, పెట్టుబడి లాంటి విషయాల్లో సరళీకరణ వైపు మొగ్గుచూపారు. సంస్కరణలకు పూర్వం ఏ పరిశ్రమ స్థాపించాలన్నా ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొందాల్సి వచ్చేది. కానీ, 1991 ఆర్థిక సంస్కరణల్లో భాగంగా, సరళీకరణ విధానం ద్వారా 18 రకాల పరిశ్రమలు మినహా మిగతా వాటికి లైసెన్సులు ఎత్తివేశారు. ప్రస్తుతం వీటి సంఖ్యను ఆల్కహాలు, సిగరెట్లు, ప్రమాదకర రసాయనాలు, రక్షణ పరికరాలు, పారిశ్రామిక పేలుడు పదార్థాల్లాంటి 5 పరిశ్రమలకు పరిమితం చేశారు.

విదేశీ పెట్టుబడులపై పరిమితిని సవరించారు. 49 శాతం అనే పరిమితిని ఎత్తివేశారు. చాలా పరిశ్రమల్లో 74 శాతం వరకు, కొన్ని గుర్తించిన పరిశ్రమల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. గనులు, పోర్టులు, టూరిజం, తేయాకు, కాఫీ, రబ్బరు లాంటి తోట పంటలు, కొరియర్ సేవలు లాంటి వాటిలో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించారు.

      ఏకస్వామ్యాల నియంత్రణ చట్టం (MRTP) పరిశ్రమల స్థాపన, విస్తరణకు అవరోధంగా మారిందని గుర్తించి సరళీకరణలో భాగంగా దీన్ని సవరించారు. మౌలిక రంగాలను ప్రభుత్వ రంగానికి పరిమితం చేసి, ఇతర పరిశ్రమల్లో ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించారు. పారిశ్రామిక తీర్మానాల్లో పరిశ్రమలను అత్యంత ప్రభావితం చేసిన వాటిలో 1991, జులై 24 న ప్రవేశపెట్టిన తీర్మానం ప్రధానమైంది. ప్రపంచీకరణ భావాలు దీనిపై ప్రభావం చూపాయి. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి విధానాలను సరళతరం చేశారు. 1991 నుంచి విదేశీ మారక నియంత్రణ చట్టాన్ని (FERA) సడలిస్తూ, విదేశాల్లో భారతీయులు జరిపే లావాదేవీల విషయంలో స్వేచ్ఛను పెంచారు. చివరకు FERAను 1999 లో విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) గా మార్చారు. FEMAను 2000 జూన్ 1 నుంచి అమల్లోకి తెచ్చారు.

 

ప్రయివేటీకరణ (Privatisation)

       గత రెండున్నర దశాబ్దాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన పదం ప్రయివేటీకరణ. దీనికి అర్థం ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే కార్యకలాపాల నుంచి ప్రభుత్వం వైదొలగి, మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేయడం. పబ్లిక్ సంస్థల యాజమాన్యం, నిర్వహణ భారాన్ని ప్రయివేటుపరం చేసే ప్రయివేటీకరణ ప్రక్రియను 1969 లో ఆచార్య పీటర్ డ్రకర్ తన 'The Age of Discontinuity' లో ప్రస్తావించారు. 1980 లో మార్గరెట్ థాచర్ ఇంగ్లండ్‌లో పబ్లిక్ రంగ సంస్థలను ప్రయివేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ చేపట్టడంతో ఈ భావన ప్రాచుర్యంలోకి వచ్చింది.

  1980 లలో మన దేశంలో కొన్ని రంగాల్లో ప్రయివేటీకరణ ప్రవేశ పెట్టినప్పటికీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు, దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా 1991 లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానం ప్రయివేటీకరణ ప్రక్రియకు పెద్దపీట వేసింది. పబ్లిక్‌రంగ సంస్థల యాజమాన్యం, ఆస్తులు ప్రయివేటుపరం చేయడం వల్ల సంస్థ యాజమాన్య సామర్థ్యం మెరుగుపడి, ఆర్థిక సమర్థత పెరుగుతుందన్న వాదం బలపడింది.
      ప్రయివేటీకరణ ప్రక్రియను మన దేశంలో Disinvestment, ఇంగ్లండ్‌లో Denationalisation, ఆస్ట్రేలియాలో Prioritisations, బొలీవియాలో Industrial transition, బ్రెజిల్‌లో Destatisations, న్యూజిలాండ్‌లో Assets Sales Programme అనే భావనల ద్వారా అమలుచేస్తున్నారు.
     1991 లో ప్రయివేటీకరణలో భాగంగా ప్రభుత్వానికి కేటాయించిన పరిశ్రమలను ప్రయివేటు రంగానికి అప్పగించారు. తద్వారా ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమలను 8 కి తగ్గించారు. ప్రస్తుతం ఈ పరిశ్రమల సంఖ్యను 2 కి తగ్గించారు. అణుశక్తి, రైల్వే రవాణా మినహా మిగతా అన్ని పరిశ్రమలను ప్రయివేటు రంగంలో స్థాపించుకోవచ్చు.
     ప్రయివేటీకరణలో భాగంగానే ప్రభుత్వరంగ సంస్థల్లోని పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని రూపొందించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వానికి ఉన్న వాటాలను ప్రజలకు, సంస్థలకు, మ్యూచువల్ ఫండ్స్‌కు అమ్మివేయడాన్ని 'పెట్టుబడుల ఉపసంహరణ' (Disinvestment) అంటారు. వ్యూహాత్మకంకాని ప్రభుత్వరంగ సంస్థల్లో భారీగా పేరుకుపోయిన ప్రభుత్వ వనరులను సాంఘిక రంగం వైపు మళ్లించడం, మితిమీరుతున్న ప్రభుత్వ రుణ భారాన్ని తగ్గించే లక్ష్యంతో పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చిన నిధులను 75 శాతం సాంఘిక సేవలపై, మిగిలిన 25 శాతం లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రభుత్వం అనుసరించే సరైన పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాన్ని సూచించమని ప్రొఫెసర్ రంగరాజన్ అధ్యక్షతన 1992 లో కమిటీని నియమించారు. అదేవిధంగా దీర్ఘకాలంలో ఉత్తమమైన పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని సూచించేందుకు జి.వి.రామకృష్ణ అధ్యక్షతన 1996 లో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ను నియమించారు. తర్వాత దీన్ని పునర్ వ్యవస్థీకరించి ఆర్.హెచ్.పాటిల్ అధ్యక్షతన కమిషన్‌ను నియమించారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం 2000 లో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.

 

ప్రపంచీకరణ (Globalisation)

     వస్తుసేవలు, మూలధనం, సాంకేతిక విజ్ఞానం, శ్రామికుల ప్రవాహానికి ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అనుసంధానం చేసే ప్రక్రియను ప్రపంచీకరణగా వ్యవహరిస్తారు. ప్రపంచీకరణ నాలుగు అంశాల పరిధిలో జరుగుతుంది.

ఎ) వాణిజ్య అవరోధాలు తగ్గించి, వివిధ దేశాల మధ్య వస్తుసేవల ప్రవాహానికి ఉన్న ఇబ్బందులను తొలగించడం.

బి) సాంకేతిక విజ్ఞాన ప్రవాహానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం.

సి) మూలధన ప్రవాహానికి అనుకూల వాతావరణం కల్పించడం.

డి) శ్రామిక గమనశీలతను పెంచడానికి అనుకూలంగా ప్రోత్సహించడం.

ఆచార్య జగదీశ్ భగవతి 'దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసి వ్యాపారం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, స్వల్పకాల మూలధనం, మానవ వనరులు, సాంకేతిక విజ్ఞాన ప్రవాహాన్ని కొనసాగించడాన్ని స్వేచ్ఛా ఆర్థిక ప్రపంచీకరణ'గా నిర్వచించారు. 'దేశాల రాజకీయ సరిహద్దులను దాటి ఆర్థిక కార్యకలాపాలనువిస్తరించడమే ప్రపంచీకరణ' అని దీపక్‌నాయర్ నిర్వచించారు.

 

ప్రపంచీకరణ లక్షణాలు

    ఎ) అంతర్జాతీయ ద్రవ్య వ్యవహారాల్లో వేగవంతమైన వృద్ధి.

    బి) వ్యాపార రంగంలో వృద్ధి వేగం సాధించడం, ప్రత్యేకించి బహుళజాతి సంస్థల వ్యాపార వృద్ధి.

    సి) బహుళ జాతి సంస్థల ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో పెరుగుదల.

    డి) గ్లోబల్ మార్కెట్ల ఆవిర్భావం.

    ఇ) రవాణా, కమ్యూనికేషన్ రంగాల శీఘ్రతర వృద్ధి వల్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడం.

 

ప్రపంచీకరణ దిశగా చర్యలు

 భారతదేశం ప్రపంచీకరణ దిశగా మూడు ముఖ్యమైన చర్యలను చేపట్టింది.
    i) రూపాయి బహిర్గత విలువ సవరణ, రూపాయి పరివర్తనం.
    ii) దిగుమతుల సరళీకరణ.
    iii) వివిధ దేశీయ ఉత్పత్తి రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం.

విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో ప్రభుత్వ జోక్యం లేకుండా డిమాండ్, సప్లయ్ శక్తుల ద్వారా ద్రవ్యం విలువను నిర్ణయించడాన్ని ప్రపంచీకరణ ప్రక్రియలో అతి ముఖ్యమైన చర్యగా పరిగణిస్తున్నారు. 1991 లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత రూపాయిని పరివర్తనం చేసే ప్రయత్నం జరిగింది. ఈ దిశగా భారత ప్రభుత్వం

రెండు దశల్లో జులై 1, 3 తేదీల్లో రూపాయి విలువను 18-19 శాతం వరకు తగ్గించి, మూల్యహీనీకరణ చేసింది.

     ఆ తర్వాత సంపూర్ణ పరివర్తనం (Full Convertability) లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో పురోగమన చర్యలు చేపట్టింది. 1992-93 బడ్జెట్‌లో పాక్షిక పరివర్తనం ద్వారా ద్వంద్వ మారకరేటు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతిలో 40 శాతం విదేశీ మారక ద్రవ్య సంపాదనలను అధికార రేటు వద్ద, మిగిలిన 60 శాతం విదేశీ మారక ద్రవ్య సంపాదనలను మార్కెట్ నిర్ణయించిన రేటు వద్ద ఎగుమతిదారులు పరివర్తనం చేసుకున్నారు. 1993-94 బడ్జెట్‌లో వాణిజ్య ఖాతా లావాదేవీల ద్వారా పొందిన మారకపు ద్రవ్యాన్ని సంపూర్ణంగా (మార్కెట్ నిర్ణయించిన రేటు వద్ద) పరివర్తనం చేసుకునే అవకాశం కల్పించింది. 1994 ఆగస్టు 19 న వర్తమాన ఖాతా లావాదేవీలకు సంపూర్ణ పరివర్తనాన్ని ప్రవేశపెట్టింది.

Posted Date : 21-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌