• facebook
  • whatsapp
  • telegram

భార‌త‌దేశ ఆర్థిక వ్యవ‌స్థ

  జనరల్ స్టడీస్ సిలబస్‌లో 'భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధి' అని పేర్కొన్నారు. ఇందుకోసం అభ్యర్థులు భారతదేశ సామాజిక, ఆర్థిక స్థితిగతులు, అభివృద్ధి తీరుతెన్నులు తెలుసుకోవాలి. ఆ అంశాలన్నింటినీ తెలంగాణ రాష్ట్రం కోణంలో కూడా అవగాహన చేసుకోవాలి. దేశం, రాష్ట్రం ప్రస్తుత స్థితిగతులు, దాని కారణాలు అభివృద్ధి దిశగా జరుగుతున్న ప్రయత్నాలపై అధ్యయనం సాగించాలి.
'తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్' ప్రకటించిన పలు ఉద్యోగ పరీక్షలకు భారతదేశం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక అంశం ముఖ్యమైన విభాగంగా ఉంది. దీనిలో నుంచి సుమారు 10 నుంచి 15 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
భారతదేశం - ఆర్థికరంగ అంశాలు

* భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తాయి. పారిశ్రామికంగా తక్కువ అభివృద్ధి చెందడం, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల స్థాయి తక్కువగా ఉండటం, జనాభా వృద్ధి రేటు, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండటం ఈ దేశాల ప్రధాన లక్షణాలు. అలాగే ఈ దేశాల్లో సాంఘిక వ్యవస్థ వెనుకబడి ఉంటుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, సంప్రదాయ అంశాలు, కులం, మతం, సాంఘిక ఆచార వ్యవహారాలు, మూఢ నమ్మకాలు, గ్రామీణ సమాజం లాంటి అంశాలు ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం

* భారతదేశం ప్రణాళికా అభివృద్ధిపై ఆధారపడటం వల్ల ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పవచ్చు. భారత్‌లో ప్రణాళికా సంఘాన్ని 1950 లో ప్రారంభించారు. 1951లో రష్యా దేశ ప్రణాళికా అభివృద్ధి భారతదేశాన్ని ప్రభావితం చేసింది. అప్పటి నుంచి ఆ దేశ ప్రణాళికలను అనుసరించి మన దేశ ప్రణాళికలను రూపొందించారు. నేటి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు ఆ విధానాన్నే అనుసరిస్తూ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారు. ప్రణాళికల మూలంగా దేశంలో విస్తృతమైన అభివృద్ధి జరిగింది. కానీ, అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్ లాంటి దేశాలతో పోలిస్తే పారిశ్రామిక, ఆదాయ, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, మూలధన కల్పన లాంటి రంగాల్లో భారత్ చాలా వెనుకబడి ఉంది.

 

అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు

1. తక్కువ ఆదాయ స్థాయి: భారతదేశ తలసరి ఆదాయం 1995-96లో రూ.9300, 2011-12 స్థిర ధరల ఆధారంగా 2012-13లో రూ.64,316గా, 2014లో రూ.74,193గా ఉంది.

 

తలసరి ఆదాయాలు - వృద్ధిరేట్లు

* ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం వృద్ధిరేట్లు 2012-13లో 11.3%గా, 2013-14లో 12.3%, 2014-15లో 10.1%గా ఉన్నాయి.

* స్థిర ధరల్లో తలసరి ఆదాయం వృద్ధిరేట్లు కింది విధంగా ఉన్నాయి.

2012-13 - 3.2% 2013-14 - 5.4% 2014-15 - 6.1%

 

2. వ్యవసాయరంగ ప్రాధాన్యం

* భారతదేశంలో 2/3 వంతు ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నారు.

* అభివృద్ధి చెందిన దేశాల్లో వారి స్థూల జాతీయ ఆదాయంలో వ్యవసాయరంగ వాటా 5% లోపు మాత్రమే ఉంటుంది.

* భారతదేశ స్థూల జాతీయ ఆదాయంలో వ్యవసాయరంగ వాటా సుమారు 14% గా ఉంది. అంటే జీడీపీలో వ్యవసాయ రంగం వాటా అత్యధికం ఉండటాన్ని వెనుకుబాటుతనానికి సూచికగా చెప్పవచ్చు.

* 1950-51 జీడీపీలో వ్యవసాయరంగం, అనుబంధ రంగాల వాటా 56.5%.

* 2014-15 జీడీపీలో వ్యవసాయరంగం, అనుబంధ రంగాల వాటా 13.9%.

 

3. వ్యవసాయ ఉపాధి ఎక్కువ

*1951లో వ్యవసాయ రంగంలో శ్రామికులు 98 మిలియన్లు ఉండగా, 2001కి 235 మిలియన్లకు పెరిగారు.

* 2008-11 మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో 46% పురుష శ్రామికులకు, 65% స్త్రీ శ్రామికులకు ఉపాధి అందింది.

* పెరిగే శ్రామికులకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో ఉపాధి వృద్ధి లేనందున వ్యవసాయంపై ఆధారపడే జనాభా ఎక్కువగా ఉంది. ఇది అల్ప ఉద్యోగిత, రుతు సంబంధ, ప్రచ్ఛన్న నిరుద్యోగితలకు దారి తీస్తుంది.

* అభివృద్ధి చెందిన దేశాల్లో బ్రిటన్, అమెరికాలో 2% నుంచి 3% వరకు శ్రామికులు వ్యవసాయరంగంపై ఆధారపడి పని చేస్తున్నారు.

 

4. మూలధన కల్పన తక్కువగా ఉండటం

* భారత్‌లో ఆదాయాల స్థాయి తక్కువగా ఉన్నందున పొదుపు తక్కువగా ఉంటుంది.

* అభివృద్ధి చెందిన దేశాల్లో మూలధన కల్పన/ పెట్టుబడుల వాటా జీడీపీలో సుమారు 40% ఉంటుంది.

* దేశంలో కింది విధంగా స్థూల పెట్టుబడి రేట్లు ఉన్నాయి.

2011-12 - 38.2% 2012-13 - 36.6%

2013-14 - 32.3%

* దేశంలో మూలధన కల్పన రేటు క్రమంగా తగ్గుతుందని చెప్పవచ్చు.

 

5. తక్కువ సాంకేతిక అభివృద్ధి

* సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో భారతదేశంలోని అన్ని రంగాలు వెనుకబడి ఉన్నాయి.

* సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అనేది దేశ ఆదాయంలో ఎంత శాతం పరిశోధన, అభివృద్ధిపై వ్యయం చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది.

* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతిక రంగంపై చేసే వ్యయం ఎక్కువ కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ఎక్కువ. ఈ రంగంపై జీడీపీలో జపాన్ 3.5%, జర్మనీ 2.9% వ్యయం చేస్తున్నాయి.

* 2005-12 మధ్య కాలంలో భారతదేశ జీడీపీలో సాంకేతిక రంగం వాటా 0.8% (1% కంటే తక్కువ)గా ఉంది. ఇంత తక్కువ వాటా కారణంగా సాంకేతిక రంగంలో మన దేశం వెనుకబడి ఉందని చెప్పవచ్చు.

 

6. జనాభా పెరుగుదల రేటు ఎక్కువ

* దేశంలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. 2011లో జనాభా పెరుగుదల రేటు 1.8%గా నమోదయ్యింది.

* 1971 నుంచి జనాభాను నియంత్రించే కార్యక్రమాలు అమల్లో ఉన్నప్పటికీ జననాల రేటు ఆశించిన స్థాయిలో తగ్గలేదు. అంతేకాకుండా, మరణాల రేటు తగ్గడంతో జనాభాలో పెరుగుదల ఎక్కువగా ఉంది.

 

7. తక్కువ అక్షరాస్యత

* భారతదేశంలో అక్షరాస్యత స్థాయి తక్కువగా ఉంది. 1951లో 18.3%గా ఉన్న అక్షరాస్యత 2011 నాటికి 74% కి పెరిగింది. కానీ, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంది.

* 2011 ప్రకారం పురుషుల అక్షరాస్యత - 82.1%

* 2011 ప్రకారం స్త్రీల అక్షరాస్యత - 65.5%

 

8. పేదరికం ఎక్కువగా ఉండటం

* అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉంది.

* దేశంలో ఎన్ఎస్ఎస్‌వో 68వ రౌండ్ ప్రకారం 2011-12లో 21.9% జనాభా పేదరికంలో ఉంది.

 

9. శిశు మరణాలు ఎక్కువగా ఉండటం

* భారత్‌లో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఇది 2012లో 1000 మంది శిశు జననాలకు 42 మంది మరణించారు.

* శిశు మరణాలు రేటు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, పోషకాహారం మొదలైన వాటి లభ్యతలో తేడాలు/ కొరత ఎక్కువగా ఉండటం.

 

10. సంప్రదాయ దృక్పథాలు
* భారత సమాజం అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. సమాజాన్ని కులాలు, ఉపకులాలుగా విభజించడం వల్ల దేశంలో సమ్మిళిత అభివృద్ధి జరగడం లేదు.
* గ్రామీణ సమాజంలో మతం, ఆచార వ్యవహారాలు, మూఢనమ్మకాలు మొదలైన అంశాలు ఉన్నందున దేశం వెనుకబడి ఉంది.

 

11. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ

* ఉమ్మడి కుటుంబాల వ్యవస్థలో నివసించే గ్రామీణ సమాజం, కార్మికుల వలస గమనశీలతకు ప్రధాన ఆటంకంగా చెప్పవచ్చు. కార్మికుల గమనశీలత లేకపోతే దేశం అభివృద్ధి విషయంలో వెనుకంజ వేస్తుంది.

 

ఏం చదవాలి?

ఆర్థిక విభాగం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలైన వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు, జాతీయ ఆదాయంలో వాటి వాటా ఎంత ఉంది అనే అంశాలు అధ్యయనం చేయాలి. వీటితో పాటు దేశ ప్రధాన ఆర్థిక సమస్యలు పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలకు సంబంధించిన అంశాలు, వాటి ప్రస్తుత స్థితులు, దేశ ఆర్థిక ప్రగతికి ప్రధాన కారణాలైన ప్రణాళికలు - లక్ష్యాలు, వాటి ప్రాధాన్యాలతో పాటు 12వ ప్రణాళిక లక్ష్యాలు, దాని వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగ వృద్ధిరేటు లక్ష్యాలు తప్పనిసరిగా చదవాలి. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి భావనలు గురించి తెలుసుకోవాలి. అంతే కాకుండా ఈ అంశాలను ప్రధానంగా తెలంగాణ కోణంలో చదవాలి. ముఖ్యమైన అంశాలన్నింటినీ భారత్, తెలంగాణ నేపథ్యంలో పట్టిక రూపంలో రాసుకుని చదవాలి. దీని వల్ల పునశ్చరణ చేయడం తేలిక అవుతుంది.
సామాజిక రంగం లో విద్య, వైద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగం, పథకాలు అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశాలు. అక్షరాస్యత స్థితులు, వైద్య ఆరోగ్య పథకాలు, బీమా పథకాలు ఇటీవల ప్రకటించినవి తప్పనిసరిగా చదవాలి.

Posted Date : 24-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌