• facebook
  • whatsapp
  • telegram

ఆర్థికాభివృద్ధి

* ప్రభావితం చేసే అంశాలెన్నో

* ఆర్థికేతరాలూ కీలకమే
  'ఆర్థికాభివృద్ధి' మనమంతా తరచూ వినే మాట ఇది.. దీన్ని అర్ధం చేసుకోవాలంటే అనేక అంశాలు తెలిసి ఉండాలి. అంతా తెలిసినట్లే అనిపించినా లోతైన అధ్యయనం ద్వారా మాత్రమే మంచి అవగాహన ఏర్పడుతుంది. విశేషమేమంటే ఆర్థిక అంశాలే కాకుండా.. ఆర్థికేతర విషయాలు కూడా అవగతమైతేనే ఆర్థికాభివృద్ధి అనేది బోధపడుతుంది. ఇంతటి సంక్లిష్టమైన ఆర్థికాభివృద్ధి ప్రక్రియపై - పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం అధ్యయన సమాచారం..

  ఆర్థికాభివృద్ధి అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియ. సహజ వనరులు, ఆర్థిక-ఆర్థికేతర అంశాల వల్ల ఇది ప్రభావితమవుతుంది. సహజ వనరులను ఆర్థికాభివృద్ధిని నిర్ణయించేవిగా చెప్పొచ్చు. ఆర్థిక కారకాల్లో.. ముఖ్యంగా మూలధన సదుపాయం, దాని రేటు, ఉపాంత ఉత్పత్తి, నిష్పత్తి తదితర అంశాలు ఏ దేశాభివృద్ధినైనా నిర్ణయిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల మిగులు, అంతర్జాతీయ వ్యాపారంలో మిగులు కూడా అత్యంత ప్రభావితం చేసే అంశాలు. ఆర్థికేతర అంశాల్లో ముఖ్యంగా మానవ వనరుల నాణ్యత, రాజకీయ స్వేచ్ఛ, సాంఘిక వ్యవస్థ, సాంకేతిక నిర్మాణం, సార్వత్రిక విద్య, ఉన్నత విద్య, పరిశోధన అభివృద్ధిపై ప్రభుత్వ వ్యయాలు, అవినీతి రహిత పాలన లాంటివి దేశ

  ఆర్థికాభివృద్ధి దిశ-దశను నిర్ణయిస్తాయి. మొత్తంగా ఇవన్నీ మానవాభివృద్ధిని నిర్ణయిస్తాయి.

 

ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక అంశాలు

ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక అంశాల పాత్ర అత్యంత కీలకం. ఒక దేశ ఆర్థికాభివృద్ధి నిర్దిష్ట సమయంలో జరుగుతుందా లేదా అనేది మూలధన సంచయనం రేటు, మూలధన నిల్వలపై ఆధారపడి ఉంటుంది.

 

ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు

1. మూలధన సంచయనం

ఒక దేశ ప్రగతిశీల నిర్మాణంలో మూలధనం క్రియాశీల పాత్ర పోషిస్తుంది. ఆర్థికాభివృధ్ధి సాధనలో వృద్ధిరేటు పెరుగుదలకు పెట్టుబడి ప్రధానమైంది. ఇది అభివృద్ధి దిశను నిర్ణయిస్తుంది. ఆదాయాన్ని ఎక్కువస్థాయిలో పొదుపు చేస్తే పెట్టుబడులు పెరిగి అభివృద్ధి జరుగుతుంది.

 

2. వ్యవసాయోత్పత్తుల మిగులు

దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదల ఉండటమే కాకుండా, ఉత్పాదకతలో పెరుగుదల ఉండటం అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రజల అవసరాలు తీరాక మిగులు ఎంత ఉందో తెలిపేదే 'విక్రయం కాగల మిగులు'. ఇది ఎక్కువగా ఉంటే ఆదాయాలు పెరిగి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.

 

3. విదేశీ వ్యాపారస్థితి

ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాల్లో ఒక దేశం ఏ విధమైన ఉత్పత్తులు చేస్తుందనేది కీలకం. ఇది అంతర్జాతీయ వ్యాపారంలో మిగులును నిర్ణయిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రాథమిక రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఎగుమతి చేసి పారిశ్రామిక, యంత్ర వస్తువులను దిగుమతి చేసుకుంటాయి. ఈ దేశాల్లో అధిక విలువున్న వస్తువుల దిగుమతుల వల్ల విదేశీ నిల్వలు తగ్గుతున్నాయి.

 

4. ఆర్థిక వ్యవస్థ తీరు

అభివృద్ధి చెందుతున్న దేశం తన అభివృద్ధికి ఏ రకమైన నమూనాను అనుసరిస్తుందో దాన్నిబట్టి ఆర్థికాభివృద్ధిలో మార్పులుంటాయి. ముఖ్యంగా దేశం పెట్టుబడిదారులకు ప్రాధాన్యం ఇస్తుందా, ప్రభుత్వ రంగం ద్వారా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందా అనేది కీలకమైన అంశం. ఇటీవల అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ తమ దేశాభివృద్ధికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తున్నాయి. ఈ వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల కలయిక ద్వారా అభివృద్ధి జరుగుతుంది.

 

ఆర్థికాభివృద్ధిలో ఆర్థికేతర అంశాల పాత్ర

చరిత్రలో ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక అంశాలకున్న ప్రాధాన్యమే ఆర్థికేతర అంశాలకూ ఉంది. వీటిలో ముఖ్యమైనవి.

1. మానవ వనరులు

ఆర్థికాభివృద్ధిలో మానవ వనరులు అతి ముఖ్యమైనవి. దేశంలో అక్షరాస్యత కలిగిన, ఆరోగ్యవంతమైన, నైపుణ్యమున్న జనాభాను మానవ వనరులుగా భావిస్తారు. ఉత్పత్తి పెరుగుదలకు వీరు అధిక స్థాయిలో దోహదం చేస్తారు. తద్వారా ఆర్థికాభివృధ్ధి, ఉత్పాదక స్థితి పెరుగుతుంది.

 

2. సాంకేతిక విజ్ఞాన స్థితి

ఒక దేశం ఉత్పత్తి పెరుగుదల, నాణ్యత, పరిమాణం లాంటి అంశాలు సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం తక్కువ సమయంలో ఎక్కువ నాణ్యమైన వస్తువులను అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుంది. కాబట్టి ఆర్థికాభివృద్ధి నిర్ణయంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రముఖపాత్రను పోషిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వాలు చేస్తున్న పరిశోధన అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాలపై వ్యయం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

 

3. రాజకీయ స్వేచ్ఛ

ఒక దేశ ఆర్థిక స్థితి, వ్యవసాయ-పారిశ్రామిక రంగాల అభివృద్ధి గతంలో ఆ దేశం వలస పాలనలో ఉందా? లేదా అనే అంశాల ఆధారంగా నిర్ణయించవచ్చు. పాలన స్వేచ్ఛ లేకపోతే అర్థికాభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఉదా: అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కెన్యా, మలేసియా మొదలైనవి. ఈ దేశాలన్నీ గతంలో బ్రిటిష్ పాలనలో ఉండటంతో దోపిడీకి గురై అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. స్వయం పాలన స్వేచ్ఛ, వనరుల సద్వినియోగం, ఉత్పత్తుల అభిలషణీయ వినియోగం ద్వారా స్వయం సమృద్ధి సాధించవచ్చు.

 

4. సాంఘిక వ్యవస్థ నిర్మాణం

దేశంలో ఉన్న సాంఘిక వ్యవస్థలో ప్రధాన అంశాలైన కులం, మతం, ప్రాంతం, మూఢ నమ్మకాలు, గ్రామీణ-పట్టణ సమాజం, స్త్రీ సాధికారకత, అక్షరాస్యత, మహిళల అక్షరాస్యత లాంటి అంశాల ఆధారంగా ఆర్థికాభివృద్ది జరుగుతుంది.
ఒక దేశ సామాజిక నిర్మాణంలో.. ఈ అన్ని అంశాల్లో అనుకూలత, ప్రజా భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం, అభివృద్ధి చెందాలనే భావన దేశంలో ఆర్థికాభివృద్ధిని నిర్ణయిస్తాయి. ఇవన్నీ ఆ దేశ ఆర్థికవ్యవస్థ పునాదులను పటిష్ఠం చేస్తాయి.

 

5. అభివృద్ధి చెందాలనే కోరిక (డిజైర్ టు డెవలప్)

ఆర్థికాభివృద్ధి అనేది ఒక యాంత్రిక పరమైన ప్రక్రియ కాదు. ఇది ప్రజల ఆలోచన, మానసిక అనుకూల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రజలకు అభివృద్ధి చెందాలనే భావన, కోరిక ఎక్కువగా ఉంటే ఆ దేశ అభివృద్ధి త్వరగా జరుగుతుంది.

 

6. అవినీతి

అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృధ్దిని నిరోధించే ప్రధాన అంశం అవినీతి. ప్రభుత్వంలోని అంగాల్లో ముఖ్యంగా ఉద్యోగస్వామ్యంలోని అవినీతి స్థాయికి ఆర్థికాభివృద్ధికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, వ్యాపార వాణిజ్య సమూహాల్లో, అధికార గణంలో నీతీనిజాయతీ ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి పెరిగి దేశాభివృద్ధి జరుగుతుంది. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి (క్రోనీ క్యాపిటలిజం) లాంటి అంశాలు.. పాలనలో అవినీతి ప్రభుత్వ విధానాలు కొన్ని వర్గాలకు అనుకూల నిర్ణయాలు తీసుకునేలా ఉండి ఆర్థిక శక్తి కేంద్రీకరణకు, ఆదాయ అసమానతల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

 

7. పరిశోధన, అభివృద్ధిపై వ్యయం

దేశ ఆర్థికాభివృద్ధికి, ఉత్పత్తి పెరుగుదలకు ప్రభుత్వం మొత్తం వ్యయంలో పరిశోధన రంగంపై ఎంత కేటాయిస్తుందనే అంశంపై ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వీటిపై ఎక్కువ వ్యయం చేస్తే సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెంది ఉత్పత్తిలో భారీ పెరుగుదల నమోదవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సుమారు జీడీపీలో 5 శాతం ఈ రంగంపై వ్యయం చేస్తుండగా, వెనుకబడిన దేశాలు 1 శాతం లోపే వ్యయం చేస్తున్నాయి.

 

ఆర్థికాభివృద్ధి-ప్రజాసంక్షేమం

ఆర్థికాభివృద్ధి ప్రధానంగా దేశంలో ఆర్థికవృద్ధి (ఉత్పత్తి పెరుగుదల)తో పాటు దేశంలో వచ్చిన వ్యవస్థాపూర్వక, సాంఘిక, ప్రగతిశీల, సాంకేతిక మార్పుల గురించి తెలుపుతుంది. అంటే దేశంలో సమూల మార్పులను ఇది వివరిస్తుంది. తద్వారా ప్రజాసంక్షేమం సాధ్యపడుతుంది.

కొన్ని అంశాల్లో పెరుగుదల దేశ సంక్షేమాన్ని పెంచడానికి బదులు తగ్గిస్తుంది. దేశంలో ఉత్పత్తులు ఏ రంగానికి చెందినవి? ప్రణాళికల అమలు ఎలా జరుగుతుంది? అనే అంశాలపై కూడా ప్రజాసంక్షేమం ఆధారపడి ఉంటుంది.
 

Posted Date : 24-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌