• facebook
  • whatsapp
  • telegram

హైకోర్టు

* రాష్ట్రంలో అత్యున్నత న్యాయవ్యవస్థ
* దేశంలో 24 హైకోర్టులు
* రిట్ల అధికార పరిధి విస్తృతం
భారత రాజ్యాంగం ఏకీకృత స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ప్రకారం మనదేశంలో జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు.. రాష్ట్రస్థాయిలో హైకోర్టు అత్యున్నత న్యాయస్థానాలు. హైకోర్టు నిర్మాణం.. అధికారాలు-విధులు.. న్యాయమూర్తుల నియామకం.. తదితర అంశాలపై అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 214 నుంచి 231 వరకు ఉన్న ఆర్టికల్స్ హైకోర్టు నిర్మాణం, అధికారాలు, విధుల గురించి తెలియజేస్తాయి. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు; రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది.

 

నిర్మాణం

ఆర్టికల్ 216 ప్రకారం రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి నిర్ణయాన్ని బట్టి ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఎందుకంటే రాజ్యాంగం హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రపతి తన విచక్షణతో హైకోర్టు పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తారు.

 

నియామకం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు ఆ రాష్ట్ర గవర్నరుతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు. ఇతర న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్ర గవర్నరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు, ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతి సంప్రదిస్తారు.

 

అర్హతలు

హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవడానికి కింది అర్హతలు ఉండాలి.

1. భారతీయ పౌరుడై ఉండాలి.

2. భారతదేశంలో కేంద్ర లేదా రాష్ట్రస్థాయి న్యాయ సర్వీసుల్లో 10 సంవత్సరాలు న్యాయాధికారిగా పనిచేసి ఉండాలి.

3. రెండు లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టుల్లో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.

 

పదవీకాలం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు 62 ఏళ్లు నిండే వరకూ ఆ పదవిలో కొనసాగుతారు.

 

ప్రమాణ స్వీకారం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో రాష్ట్ర గవర్నరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

 

జీతభత్యాలు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.90,000, ఇతర న్యాయమూర్తులకు నెలకు రూ.80,000 జీతం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. వీరి జీతభత్యాలను రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

 

హైకోర్టు అధికారాలు, విధులు

హైకోర్టు అధికారాలు, విధులను కింది విధంగా వివరించవచ్చు. అవి..

 

1. ప్రారంభ అధికార పరిధి

ఆర్టికల్ 225 ప్రకారం హైకోర్టుకు కింది వివాదాలను నేరుగా విచారించి, తీర్పులు ఇచ్చే అధికారం ఉంది. అవి..
* వివాహం, విడాకులు, వీలునామా, కంపెనీ చట్టాలు, కోర్టు ధిక్కారం.
* ప్రాథమిక హక్కులకు సంబంధించిన వివాదాలు.
* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ్యుల ఎన్నికల వివాదాలు.
* రెవెన్యూ వివాదాలు.
పైవన్నీ ప్రారంభ అధికార పరిధిలోకి వస్తాయి.

 

2. రిట్లు జారీచేసే అధికారం

హైకోర్టులు ఆర్టికల్ 226 ప్రకారం రిట్లు జారీచేస్తాయి. అవి..

1. హెబియస్ కార్పస్
2. మాండమస్
3. సెర్షియోరారి
4. కో వారెంటో
5. ప్రొహిబిషన్

హైకోర్టుల రిట్లు జారీచేసే అధికార పరిధి, సుప్రీంకోర్టు రిట్ల అధికార పరిధి కంటే విస్తృతమైంది. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం రిట్లను కేవలం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం మాత్రమే జారీ చేస్తుంది. అయితే హైకోర్టులు ప్రాథమిక హక్కుల పరిరక్షణతోపాటు, ఇతర ప్రయోజనాల కోసం కూడా రిట్లను జారీ చేస్తాయి.

 

రిట్లు-వివరణ

హెబియస్ కార్పస్ (వ్యక్తి శరీరాన్ని ప్రవేశపెట్టడం): నిర్బంధించిన వ్యక్తిని న్యాయస్థానంలో హాజరుపరచమని ఇచ్చే ఆదేశమే హెబియస్ కార్పస్. చట్ట వ్యతిరేకంగా నిర్బంధించిన వ్యక్తిని కోర్టులో హాజరుపరచమని ఈ రిట్‌ను జారీ చేస్తారు.
మాండమస్ (మేము ఆజ్ఞాపిస్తున్నాం): ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తన చట్టబద్ధ విధులను నిర్వర్తించనప్పుడు, నిర్వర్తించాల్సిందిగా ఇచ్చే ఆదేశమే మాండమస్.
సెర్షియోరారి (ధ్రువీకరణ అవడం): దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు, దాన్ని రద్దుచేసి, కేసును పైస్థాయి కోర్టుకు బదిలీ చేయమని ఇచ్చే ఆదేశమే సెర్షియోరారి.
కో వారెంటో (ఏ అధికారంతో): ఏ అధికారి అయినా తనకు లేని అధికారాన్ని చెలాయించినప్పుడు లేదా అనధికారికంగా పదవిలో కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ జారీచేసే ఆదేశమే కో వారెంటో.
ప్రొహిబిషన్ (నిషేధించడం): దిగువ న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించి కేసులు విచారిస్తున్నపుడు విచారణను తదుపరి ఆదేశాల వరకూ నిలిపివేయాల్సిందిగా హైకోర్టు జారీచేసే ఆదేశమే ప్రొహిబిషన్.
గమనిక: ప్రొహిబిషన్, సెర్షియోరారి రిట్ల ముఖ్య ఉద్దేశం - దిగువ కోర్టులు తమ పరిధిని అతిక్రమించకుండా నియంత్రించడం. అయితే ప్రొహిబిషన్ కేసు విచారణ దశలో ఉన్నపుడు ఇచ్చే ఆదేశం కాగా, సెర్షియోరారి తీర్పు వెలువడిన తర్వాత ఇచ్చే ఆదేశం.

 

అప్పీళ్ల విచారణ పరిధి

దిగువ న్యాయస్థానాల తీర్పులపై వచ్చే సివిల్, క్రిమినల్ అప్పీళ్లను హైకోర్టు విచారించి తీర్పులు ఇస్తుంది. దిగువ కోర్టులు విధించిన మరణశిక్షను హైకోర్టు ధ్రువీకరించాలి.

 

కోర్ట్ ఆఫ్ రికార్డ్

ఆర్టికల్ 215 ప్రకారం హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్‌గా పనిచేస్తుంది. దీని ప్రకారం హైకోర్టుకు రెండు అధికారాలు ఉన్నాయి. అవి..

1. హైకోర్టు తన తీర్పులు, నిర్ణయాలను రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఇవి దిగువ న్యాయస్థానాలకు మార్గదర్శకంగా ఉంటాయి.

2. కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారిని శిక్షించే అధికారం.

 

న్యాయ సమీక్ష

సుప్రీంకోర్టుకు ఉన్నట్లు హైకోర్టులకు కూడా న్యాయసమీక్ష అధికారం ఉంది. కేంద్ర, రాష్ట్ర శాసన శాఖలు చేసే చట్టాలు; కేంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలు అమలు చేసే ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అవి చెల్లవని ప్రకటించే అధికారం హైకోర్టులకు ఉంది. దీన్నే న్యాయసమీక్ష అధికారం అంటారు.

 

సలహాపూర్వక విధులు

గవర్నరు కోరినప్పుడు న్యాయసంబంధ విషయాల్లో సలహాలు ఇస్తుంది. జిల్లా న్యాయమూర్తుల నియామకం, పదోన్నతి, బదిలీలు తదితర అంశాలపై గవర్నరుకు సలహాలు ఇస్తుంది.

 

ఇతర విధులు

హైకోర్టు ఏ జిల్లాలో ఉంటుందో ఆ జిల్లా కోర్టుగా వ్యవహరిస్తుంది. గరవ్నరు పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక గవర్నరుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాలు, ట్రైౖబ్యునళ్లను హైకోర్టు పర్యవేక్షిస్తుంది.

 

తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి హైకోర్టు

ఆంధప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడం వల్ల 2014, జూన్ 2 నుంచి ఆంధప్రదేశ్ హైకోర్టును హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా పేరు మార్చారు. ఇది రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కి కొత్త హైకోర్టు ఏర్పాటు చేసిన తర్వాత.. హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ హైకోర్టుగా పనిచేస్తుంది. హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో న్యాయమూర్తుల సంఖ్య 49. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోస్లే.

భారతదేశంలో 1862లో మొదటిసారిగా కోల్‌కతా, చెన్నై, ముంబయిల్లో హైకోర్టులను ఏర్పాటు చేశారు. 1866లో అలహాబాద్‌లో 4వ హైకోర్టు ఏర్పాటైంది. ప్రస్తుతం భారతదేశంలో 24 హైకోర్టులున్నాయి.

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌