• facebook
  • whatsapp
  • telegram

గవర్నర్

* గవర్నర్ అధీనంలో రాష్ట్ర ఆగంతుక నిధి

* అధికార నివాసం రాజ్‌భవన్

  భారతదేశ పార్లమెంటరీ విధానం ప్రకారం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ రెండు రకాల కార్యనిర్వాహక వర్గాలు ఉన్నాయి. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్‌లు నామమాత్ర కార్యనిర్వాహక అధిపతులుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండళ్లు వాస్తవ కార్యనిర్వాహక వర్గంగా అధికారాన్ని చెలాయిస్తున్నాయి.

 

గవర్నర్ నియామకం

ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తారు. ఒక వ్యక్తిని గవర్నర్‌గా నియమించాలంటే ఆర్టికల్ 157 ప్రకారం ఆయన భారతీయ పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. లాభదాయక పదవిలో ఉండకూడదు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ కొనసాగుతున్నారు.

 

పదవీ కాలం

గవర్నర్ సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు. అయితే ఆర్టికల్ 156 (1) ప్రకారం రాష్ట్రపతి సంతృప్తి చెందినంత కాలం పదవిలో కొనసాగుతారు. అంటే రాష్ట్రపతి ఎప్పుడైనా గవర్నర్‌ను పదవి నుంచి తొలగించవచ్చు. లేదా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయవచ్చు.

 

ప్రమాణ స్వీకారం

ఆర్టికల్ 159 ప్రకారం గవర్నర్‌తో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి లేని పక్షంలో హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

 

జీతభత్యాలు

గవర్నర్ జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం గవర్నర్ నెల జీతం రూ. 1,10,000. 'రాజ్‌భవన్' అని పిలిచే అధికార నివాసంతోపాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.

 

అధికారాలు - విధులు

రాష్ట్రపతికి ఉండే దౌత్య, సైనిక, అత్యవసర అధికారాలు రాష్ట్ర గవర్నరుకు లేవు. గవర్నర్ అధికారాలను కార్యనిర్వాహక, శాసన, ఆర్థిక, న్యాయ, విచక్షణ అనే రకాలుగా వర్గీకరించవచ్చు.

 

కార్యనిర్వాహక అధికారాలు

ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్రంలో కార్యనిర్వాహక పనులన్నీ గవర్నర్ పేరు మీద జరుగుతాయి. గవర్నర్ స్వయంగా లేదా తన అధీన అధికారుల ద్వారా వీటిని చెలాయిస్తారు. ఈ కార్యనిర్వాహక అధికారాల నిర్వహణ కోసం రాష్ట్రస్థాయిలో గవర్నర్ వివిధ ఉన్నత పదవుల నియామకాలు చేస్తారు. అందులో ముఖ్యమైనవి..

* ఆర్టికల్ 164(1) ప్రకారం సాధారణ ఎన్నికల తర్వాత మెజార్టీ ఓట్లు సాధించిన పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు. ఏ పార్టీకీ మెజార్టీ రాకపోతే పార్టీల కూటమి నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తారు. ఈ రెండూ సాధ్యం కాకపోతే తన విచక్షణ అధికారాలతో ముఖ్యమంత్రిని నియమిస్తారు. అయితే సీఎం అభ్యర్థి విధానసభలో మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిని నియమించిన తర్వాత ఆయన సలహాలపై మంత్రులను నియమిస్తారు.

* ఆర్టికల్ 165(1) ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను నియమిస్తారు.

* ఆర్టికల్ 316(1) ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమిస్తారు.

* రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సెలర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర వర్సిటీలకు వైస్ ఛాన్సెలర్లను నియమిస్తారు.

* రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను నియమిస్తారు.

* ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు.

* రాష్ట్రంలో మహిళా కమిషన్; మైనార్టీ కమిషన్; వెనకబడిన వర్గాల కమిషన్; ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఛైర్మన్లను, సభ్యులను నియమిస్తారు.

 

శాసన అధికారాలు

రాష్ట్ర శాసనశాఖలో గవర్నర్ అంతర్భాగం. కానీ శాసనసభలో సభ్యుడు కాదు. శాసన నిర్మాణ ప్రక్రియ మొత్తం ఆయనతోనే ముడిపడి ఉంటుంది. గవర్నర్ శాసన అధికారాలివి..

* ఆర్టికల్ 174 ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభను సమావేశపరుస్తారు. వాయిదా వేస్తారు. రద్దు చేస్తారు.

* ఆర్టికల్ 175 ప్రకారం రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ప్రసంగించవచ్చు. సందేశం పంపవచ్చు.

* రాష్ట్ర శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను, విధాన పరిషత్తుకు 1/6 వంతు సభ్యులను నామినేట్ చేస్తారు.

* ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్సులు జారీ చేస్తారు.

* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ సంతకం చేసి ఆమోదిస్తే అవి చట్టాలుగా చెలామణి అవుతాయి. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించవచ్చు. లేదా మళ్లీ పరిశీలన చేయమని శాసనసభకు పంపవచ్చు. లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపవచ్చు.

 

ఆర్థిక అధికారాలు

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను విధానసభలో ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటారు. ద్రవ్య బిల్లులను గవర్నర్ అనుమతితోనే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. రాష్ట్ర ఆగంతుక నిధి (కంటింజెన్సీ ఫండ్) గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. అనుకోని వ్యయాన్ని భరించడానికి ఈ నిధి నుంచి నిధులు విడుదల చేస్తారు.

 

న్యాయ అధికారాలు

ఆర్టికల్ 161 ప్రకారం రాష్ట్రస్థాయిలో న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించేందుకు, క్షమాభిక్ష ప్రసాదించేందుకు, శిక్షను రద్దు చేసేందుకు గవర్నర్‌కి అధికారం ఉంది. అయితే ఉరిశిక్షను రద్దుచేసే అధికారం లేదు. సైనిక కోర్టుల తీర్పులు, అవి విధించిన శిక్షల్లో గవర్నర్ జోక్యానికి స్థానం లేదు. రాష్ట్ర హైకోర్టును సంప్రదించి జిల్లా న్యాయమూర్తుల నియామకం, పదోన్నతులు చేస్తారు.

 

విచక్షణాధికారాలు

రాష్ట్ర మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా గవర్నర్ కొన్ని అధికారాలు చెలాయిస్తారు. అవి..

* ఏ పార్టీకీ మెజార్టీ లేనప్పుడు, పార్టీల కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రాని పక్షంలో గవర్నర్ తన విచక్షణ అధికారంతో ముఖ్యమంత్రిని నియమించవచ్చు. అయితే ఆ సీఎమ్ శాసనసభలో మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

* శాసనసభలో మెజార్టీ కోల్పోయినప్పుడు.. గవర్నర్ తన విచక్షణాధికారంతో మంత్రిమండలిని రద్దు చేయవచ్చు.

* రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు.

* ఆర్టికల్ 356 (1) ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగే పరిస్థితి లేనప్పుడు రాష్ట్రపతికి నివేదిక పంపే అధికారం ఉంది.

భారత రాజ్యాంగంలోని 153 నుంచి 167 ప్రకరణలు (ఆర్టికల్స్) రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి వివరిస్తున్నాయి. రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలితో కూడి ఉంటుంది. రాష్ట్రంలో ప్రధాన కార్యనిర్వాహక అధిపతి గవర్నర్. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. 7వ రాజ్యాంగ సవరణ చట్టం-1956 ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్‌గా నియమించవచ్చు.

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌