• facebook
  • whatsapp
  • telegram

సుప్రీంకోర్టు

* భార‌త‌దేశంలో సుప్రీంకోర్టు

* విస్రృత అధికారాలు

రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన మూడు అత్యున్నత వ్యవస్థల్లో శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలున్నాయి. వీటిలో న్యాయశాఖను రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్రంగా, సర్వోన్నతంగా తీర్చిదిద్దారు. సమాఖ్య దేశాల్లో ఉన్నట్లు ద్వంద్వ న్యాయ వ్యవస్థను కాకుండా ఏకీకృత, బలమైన న్యాయవ్యవస్థను మన దేశంలో ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యానికి రక్షణ కల్పించారు. రాజ్యాంగ అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దేశంలోని అన్ని న్యాయస్థానాలను పర్యవేక్షించే సుప్రీంకోర్టు గురించి తెలుసుకోవాలి.
భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. భారత ప్రభుత్వ చట్టం-1935 ద్వారా మనదేశంలో ఫెడరల్ కోర్టును స్థాపించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక 1950, జనవరి 28 నుంచి ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
భారత రాజ్యాంగంలోని Vవ భాగం, 4వ అధ్యాయంలోని 124 నుంచి 147 వరకు ఉన్న ప్రకరణలు (ఆర్టికల్స్) సుప్రీంకోర్టు నిర్మాణం, స్వతంత్ర ప్రతిపత్తి, అధికారాలు తదితర అంశాల గురించి తెలియజేస్తాయి.

 

సుప్రీంకోర్టు నిర్మాణం

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మంది ఇతర న్యాయమూర్తులు ఉన్నారు.

 

న్యాయమూర్తుల నియాకం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు.
అర్హతలు: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యే వారికి కింది అర్హతలు ఉండాలి.

* భారతీయ పౌరుడై ఉండాలి.

* భారతదేశంలో ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. లేదా ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. లేదా రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయకోవిదుడై (న్యాయ నిపుణుడు) ఉండాలి.

 

పదవీ కాలం

సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా ఒకసారి నియమితులయ్యాక 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారు పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యేవారికి కనిష్ఠ వయసును నిర్ధారించలేదు.

 

పదవీ ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి ద్వారా నియమితులైన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

 

తొలగింపు

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంటు తీర్మానం ద్వారా.. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించవచ్చు.

 

జీత, భత్యాలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల జీత భత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం నెలకు రూ. లక్ష, ఇతర న్యాయమూర్తుల జీతం నెలకు రూ. 90 వేలు. ఆర్థిక అత్యవసర పరిస్థితిల్లో మినహా సాధారణ పరిస్థితుల్లో వీరి జీత భత్యాలను తగ్గించడానికి వీల్లేదు.

 

'సుప్రీం' అధికారాలు - విధులు

భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలను కల్పించింది. అందుకే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ 'ప్రపంచంలోని అన్ని ఉన్నత న్యాయస్థానాల కంటే భారతదేశ సుప్రీంకోర్టుకు అధికారాలు ఎక్కువ' అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అధికార పరిధిని కింది విధంగా విభజించవచ్చు.

* స్వతస్సిద్ధమైన అధికారాలు

* రిట్లను జారీచేసే అధికారం

* అప్పీళ్ల విచారణాధికారం

* సలహాపూర్వక అధికారం

* కోర్ట్ ఆఫ్ రికార్డ్

* న్యాయ సమీక్షాధికారం

* ఇతర అధికారాలు

 

స్వతస్సిద్ధమైన అధికారాలు

కింది అంశాలు సుప్రీంకోర్టు స్వతస్సిద్ధ అధికారాల్లోకి వస్తాయి.

* కేంద్రానికీ, ఒకటీ లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలపై తీర్పు ఇస్తుంది.

* కేంద్రానికీ, ఒకటీ లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఒక వైపు, ఒక రాష్ట్రం లేదా ఎక్కువ రాష్ట్రాలు ఇంకో వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తలెత్తే వివాదాలపై తీర్పు ఇస్తుంది.

* రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను విచారించి తీర్పు ఇస్తుంది.

 

రిట్లను జారీచేసే అధికారం

సుప్రీంకోర్టు 32వ ప్రకరణ ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం రిట్లను జారీ చేస్తుంది. ఇది కూడా స్వతస్సిద్ధ అధికార పరిధిలోకి వస్తుంది.

 

అప్పీళ్ల విచారణాధికారం

సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నతమైన అప్పీళ్ల న్యాయస్థానంగా పని చేస్తుంది. హైకోర్టుల తీర్పులకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీళ్లను పరిశీలించి, విచారించి, తీర్పులు ఇచ్చే అధికారాన్ని అప్పీళ్ల విచారణాధికారం అంటారు. ఈ అధికారాన్ని 4 రకాలుగా విభజించవచ్చు.

1. రాజ్యాంగ సంబంధ వివాదాల అప్పీళ్లు

2. సివిల్ వివాదాల అప్పీళ్లు

3. క్రిమినల్ వివాదాల అప్పీళ్లు

4. సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతి పొందిన అప్పీళ్లు

 

సలహా పూర్వక విధులు

భారత రాష్ట్రపతి.. 143వ ప్రకరణ ప్రకారం ఏదైనా చట్టం లేదా ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశం లేదా రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, సంధులకు సంబంధించిన విషయంపై సుప్రీంకోర్టును సలహా కోరువచ్చు. సుప్రీంకోర్టు ఆ అంశంపై తన సలహా, సూచనలను రాష్ట్రపతికి ఇస్తుంది. అయితే రాష్ట్రపతి వాటిని పాటించవచ్చు, పాటించక పోవచ్చు.

 

కోర్ట్ ఆఫ్ రికార్డ్సు

ప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, ఇతర న్యాయ సంబంధ సమాచారాన్ని కోర్టు ఆఫ్ రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. ఇది కింది న్యాయస్థానాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది.

 

న్యాయ సమీక్షాధికారం

శాసన శాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్వాహక వర్గం చర్యలు రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయా లేదా అని సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. అలాగే అవి రాజ్యాంగ బద్ధంగా లేకపోతే చెల్లవని కొట్టివేసే అధికారం కూడా ఉంది. రాజ్యాంగ ఔన్నత్యాన్ని నిలబెట్టడం న్యాయసమీక్ష ముఖ్య ఉద్దేశం.

 

ఇతర అధికారాలు

పైన వివరించిన అధికారాలతోపాటు, మరికొన్ని ఇతర అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయి. అవి..

* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను విచారించి తీర్పులు ఇవ్వడం.

* రాష్ట్రపతి ఆదేశంపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల ప్రవర్తనపై విచారణ చేయవచ్చు.

* భారత రాజ్యాంగ అంశాలపై అంతిమ వ్యాఖ్యాతగా పని చేస్తుంది.

* సుప్రీంకోర్టు తాను గతంలో ఇచ్చిన తీర్పులను పునఃపరిశీలన చేయవచ్చు.

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌