• facebook
  • whatsapp
  • telegram

పార్లమెంటు

  జనరల్ స్టడీస్ సిలబస్‌లో 'భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ' అంశాలను పొందుపరిచారు. దీని అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు మన దేశ అత్యున్నత అధికార వ్యవస్థ అయిన పార్లమెంటు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
భారతదేశంలో అత్యున్నత శాసన నిర్మాణ సంస్థ - పార్లమెంటు. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ అనే రెండూ సభలతోపాటు రాష్ట్రపతి కూడా అంతర్భాగమే. అయితే రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుడు కాదు. పార్లమెంటులో ప్రతి శాసన నిర్మాణ ప్రక్రియ రాష్ట్రపతితో ముడిపడి ఉండటం వల్ల రాష్ట్రపతిని పార్లమెంటులో అంతర్భాగంగా పరిగణిస్తారు.

 

పార్లమెంటు నిర్మాణం

దీనిలో రెండు సభలు ఉంటాయి. అవి

1) లోక్‌సభ

2) రాజ్యసభ

 

లోక్‌సభ

లోక్‌సభను ప్రజాప్రతినిధుల సభ లేదా దిగువ సభ అంటారు. లోక్‌సభకు ఎన్నికవడానికి భారతీయ పౌరుడై ఉండాలి. 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. లోక్‌సభ సభ్యులను లోక్‌సభ నియోజక వర్గాల ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.

లోక్‌సభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 552. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల సంఖ్య 545. వీరిలో రాష్ట్రాల నుంచి 530, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ఉంటారు. ఇద్దరు ఆంగ్లో ఇండియన్‌లను రాష్ట్రపతి సిఫార్సు చేస్తారు. లోక్‌సభ సభ్యులు 5 ఏళ్ల కాలానికి ఎంపిక అవుతారు. అయితే మధ్యలోనే లోక్‌సభ రద్దుకావచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో లోక్‌సభను ఒక సంవత్సరం పొడిగించవచ్చు. లోక్‌సభ సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. లోక్‌సభ సమావేశాలు నిర్వహించడానికి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యనే కోరం అంటారు. ఇది సభ్యుల సంఖ్యలో 1/10వ వంతు.

 

లోక్‌సభ స్పీకర్ లోక్‌సభ సమావేశాలకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్ లోక్‌సభ సమావేశాలు సక్రమంగా, హుందాగా జరిగేలా చూస్తారు. లోక్‌సభలో బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుమతి ఇస్తారు. ఒక బిల్లు ఆర్థిక బిల్లా, సాధారణ బిల్లా అని నిర్ణయించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. బిల్లులపై చర్చించడానికి, ఆ తర్వాత ఓటింగ్‌కి అనుమతి ఇస్తారు. బలాబలాలు (సమాన ఓట్లు వచ్చినప్పుడు) సమానమైనప్పుడు తన నిర్ణాయక ఓటు వేస్తారు. పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. లోక్‌సభ సభ్యుల హక్కులను పరిరక్షిస్తారు.

 

రాజ్యసభ

రాజ్యసభను రాష్ట్రాల మండలి లేదా ఎగువ సభ అంటారు. రాజ్యసభకు ఎన్నికవడానికి భారతీయ పౌరుడై ఉండాలి. 30 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. రాజ్యసభ సభ్యులను పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రాష్ట్రాల విధాన సభ సభ్యులు (ఎమ్ఎల్ఏ) ఎన్నుకుంటారు.

రాజ్యసభలో గరిష్ఠంగా 250 మంది సభ్యులు ఉండొచ్చు. ప్రస్తుత రాజ్యసభ సభ్యుల సంఖ్య 245. ఇందులో రాష్ట్రాల నుంచి 229 మంది, కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ నుంచి 3, పాండిచ్చేరి నుంచి ఒకరు ఉండగా వివిధ రంగాల్లోని 12 మంది నిపుణులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ఇది శాశ్వత సభ. ప్రతి రెండేళ్లకు 1/3 వంతు సభ్యులు పదవి విరమణ చేయగా, 1/3 వంతు మంది ఎన్నిక అవుతారు. అందుకే దీన్ని శాశ్వత సభ లేదా నిరంతర సభ అంటారు. రాజ్యసభ సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్ (ఉపరాష్ట్రపతి) ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యనే కోరం అంటారు. ఇది సభ్యుల సంఖ్యలో 1/10వ వంతు.

 

రాజ్యసభ ఛైర్మన్ 

పదవిరీత్యా ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభ ఛైర్మన్ రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశాలు సక్రమంగా, హుందాగా జరిగేలా చూస్తారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టడానికి, వాటిపై చర్చించడానికి అనుమతి ఇస్తారు. చర్చ తర్వాత ఓటింగ్‌కి కూడా అనుమతి ఇస్తారు. సమాన ఓట్లు వచ్చినప్పుడు తన నిర్ణాయక ఓటు వేస్తారు. రాజ్యసభ సభ్యుల హక్కులను పరిరక్షిస్తారు.

 

పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు సంవత్సరానికి కనీసం రెండుసార్లు సమావేశం కావాలి. ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్యకాలం 6 నెలలకు మించకూడదు. అవసరం అయితే ఎన్నిసార్లయినా ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించవచ్చు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అనే మూడు సమావేశాలు సంవత్సరంలో జరుగుతుంటాయి.

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌