• facebook
  • whatsapp
  • telegram

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా

  మన దేశంలో ఈస్టిండియా కంపెనీ పాలనాకాలంలో 1773లో రూపొందించిన రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా సుప్రీంకోర్టు ఏర్పడింది. ఇది 1774 మేలో కలకత్తా కేంద్రంగా 'ప్రీవీ కౌన్సిల్' పేరుతో పని ప్రారంభించింది. ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులతో ప్రీవీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.

* 1935 చట్టంలో ఫెడరల్ కోర్ట్ సమాఖ్య న్యాయవ్యవస్థగా మారి దిల్లీ కేంద్రంగా 1937, అక్టోబరు 1 నుంచి పనిచేస్తోంది.

* ఫెడరల్ కోర్ట్ ఆరంభంలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు.

* ఫెడరల్ కోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి మ్యారిస్ గేయర్.

* 1951లో 'సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా' దిల్లీ కేంద్రంగా ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులతో ఏర్పాటైంది.

* ఫెడరల్ కోర్టు ఆఖరి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ జె. కానియా.

* ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా. ఈయన సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తి.

* సుప్రీంకోర్టు నినాదం 'ధర్మమే జయిస్తుంది'.

* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం, లిఖిత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ మొదలైన బాధ్యతల వల్ల మన దేశంలో సుప్రీంకోర్టుకు ప్రాధాన్యం ఉంది.

* రాజ్యాంగం 5వ భాగం, 124వ నిబంధన నుంచి 147వ నిబంధన వరకు సుప్రీంకోర్టు నిర్మాణం, అధికారాలు మొదలైనవాటిని వివరించారు.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల పరిశీలనకు విడివిడిగా కోర్టులు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను ఒకే న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుంది. కాబట్టి మన దేశంలో న్యాయ వ్యవస్థను ఏకీకృత న్యాయ వ్యవస్థగా చెప్పవచ్చు.

* సుప్రీంకోర్టు మన దేశంలో అత్యున్నత న్యాయస్థానమే కాకుండా, హైకోర్టులపై పాలనా పర్యవేక్షణాధికారం ఉన్న న్యాయస్థానం.

* భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు తన మంత్రి మండలిని, ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు. ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు కూడా అవసరమైన మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సలహా తీసుకుంటారు.

* సుప్రీంకోర్టు నిర్మాణం, పరిధి, న్యాయమూర్తుల సంఖ్య మొదలైనవి నిర్ణయించే అధికారం 124వ నిబంధన ప్రకారం భారత పార్లమెంట్‌కు ఉంది.

* సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 30కి మించకుండా ఇతర న్యాయమూర్తులు ఉంటారు.

* వీళ్లే కాకుండా 127, 128 నిబంధనల ప్రకారం, రాష్ట్రపతి పూర్వానుమతితో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక న్యాయమూర్తులను నియమించవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో రిటైర్డ్ న్యాయమూర్తులే తాత్కాలిక న్యాయమూర్తులుగా అర్హులు. వీరికి కచ్చితమైన పదవీకాలం ఉండదు. కానీ సుప్రీంకోర్టు జడ్జీలకున్న అన్ని అధికారాలు, హోదా, జీతభత్యాలు ఉంటాయి.

* రాజ్యాంగ నిబంధన 124(3) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి భారత పౌరుడై ఉండాలి. కనీసం 5 సంవత్సరాలు ఏదైనా హైకోర్టు న్యాయమూర్తిగా లేదా, 10 సంవత్సరాలు హైకోర్టులో న్యాయవాదిగా అనుభవం ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో ప్రజ్ఞావంతుడైన న్యాయశాస్త్ర కోవిదుడై ఉండాలి.

* రాజ్యాంగం న్యాయమూర్తుల నియామకానికి అర్హతలు సూచించింది కానీ ప్రధాన న్యాయమూర్తి నియామకానికి అర్హతలను పేర్కొనలేదు. సంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు.

* సీనియారిటీ నియమాన్ని అతిక్రమించి మొదటిసారిగా 1973లో జస్టిస్ ఎ.ఎన్.రేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. తిరిగి రెండోసారి 1977 - 78లో కూడా సీనియారిటీ నియమాన్ని అతిక్రమించి జస్టిస్ ఎం.హెచ్.బేగ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

* ఈ పర్యవసానాల కారణంగా 1993లో తొమ్మిది మంది సభ్యులున్న సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్, సీనియారిటీ నియమాన్ని తప్పక పాటించాలని తీర్పు చెప్పింది.

* న్యాయమూర్తుల నియామకాన్ని ప్రస్తుతం కలోజియం (న్యాయమండలి) సిఫారసుల మేరకు రాష్ట్రపతి చేస్తున్నారు.

* 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకూ ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగవచ్చు. ముందుగా రాజీనామా చేయాలనుకుంటే రాష్ట్రపతికి రాజీనామాను సమర్పించాలి.

* సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించడానికి, న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడటానికి రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించారు.

* న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని తప్పక సంప్రదించాలి. కాబట్టి రాజకీయ జోక్యానికి వీలుండదు.

* పదవిలో ఉండగా న్యాయమూర్తుల జీతభత్యాలు తగ్గించకూడదు. వేతనాలను సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

* న్యాయమూర్తులపై అభిశంసన తీర్మాన సమయంలో తప్ప వారి వ్యవహారాలను పార్లమెంట్‌లో చర్చించకూడదు.

* ఏవైనా అభియోగాలున్న న్యాయమూర్తులను తొలగించడానికి పార్లమెంట్‌లో మహాభియోగ తీర్మానాన్ని ఆమోదించాలంటే ప్రత్యేక మెజారిటీ అవసరం.

* అసమర్థత, అభియోగాల కారణంగా న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే వీలు పార్లమెంట్‌కు ఉంది.

* న్యాయమూర్తుల తొలగింపుకు ఉభయసభల్లోని ఏదో ఒకదానిలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభలో అయితే కనీసం 100 మంది, రాజ్యసభలో అయితే కనీసం 50 మంది సభ్యులు తీర్మానంపై సంతకాలు చేయాలి.

* తీర్మానాన్ని పరిశీలించడానికి ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయ శాస్త్రవేత్తలతో ఒక కమిటీని వేస్తారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను, తీర్మానాన్ని సభ పరిశీలిస్తుంది.

* తర్వాత ఉభయ సభల్లో మెజారిటీ సభ్యులు హాజరై, హాజరైనవారిలో 2/3వ వంతు సభ్యులు తీర్మానాన్ని ఆమోదించి, రాష్ట్రపతికి పంపిస్తే న్యాయమూర్తిని రాష్ట్రపతి తొలగిస్తారు.

* 1991 - 93లో జస్టిస్ వి. రామస్వామిపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఓటింగులో పాల్గొనకపోవడం వల్ల తీర్మానానికి అవసరమైన మెజారిటీ లభించక, వీగిపోయింది.

* సుప్రీంకోర్టు దిల్లీలో పనిచేస్తుంది. రాష్ట్రపతి అనుమతితో దేశంలోని ఇతర ప్రాంతాల్లో సమావేశం జరపవచ్చు.

 

అధికారాలు, విధులు

రాజ్యాంగ నిబంధన 131 ప్రకారం సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు, కేంద్ర చట్టాలకు సంబంధించిన వివాదాలు, రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలు, విదేశాలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు, ప్రాథమిక హక్కులకు సంబంధించిన వివాదాలను నేరుగా విచారణకు స్వీకరించి పరిష్కరించవచ్చు.

* రాజ్యాంగ నిబంధనలు 132, 133, 134 ప్రకారం కింది కోర్టు తీర్పులపై వచ్చిన అప్పీళ్లను విచారించే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. నిబంధన 132(1) ప్రకారం సుప్రీంకోర్టు అప్పీలు స్వీకరించాలంటే ముందుగా తీర్పు చెప్పిన హైకోర్టు అనుమతి ఉండాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పులు రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేవైనా, అర్థ వివరణ ఇవ్వాల్సినవైనా అయితే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి అనుమతిస్తుంది.

* హైకోర్టు ధ్రువీకరించకపోయినా, సుప్రీంకోర్టు అభిప్రాయంలో రాజ్యాంగపరమైన అర్థ వివరణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని భావించినప్పుడు, కింది కోర్టు ఒక వ్యక్తిని నేరస్థుడు కాదని పరిగణించినప్పుడు, హైకోర్టు కూడా నేరస్థుడిగా నిర్ధారించి, మరణశిక్ష విధించినప్పుడు సుప్రీంకోర్టు అప్పీలు స్వీకరించవచ్చు.

* నిబంధన 136 ప్రకారం హైకోర్టు, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితో అప్పీలును స్వీకరించవచ్చు.

* పార్లమెంట్ చేయబోయే చట్టాల విషయంలో, ప్రభుత్వ చర్యల విషయంలో, రాజ్యాంగపరమైన సందేహాలు కలిగితే నిబంధన 143(1) ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు.

*సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి అనుసరించాలనే నిబంధన లేదు. రాష్ట్రపతి అభ్యర్థనను సుప్రీంకోర్టు మన్నించాలనే నిబంధనలేదు. కింది కోర్టులు మాత్రం సుప్రీంకోర్టు అభిప్రాయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.

 

కోర్ట్ ఆఫ్ రికార్డ్

సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను ప్రచురించి, భద్రపరుస్తుంది. ఆ తీర్పులను న్యాయస్థానాలు మార్గదర్శకాలుగా అనుసరిస్తాయి. వీటిని 'పూర్వీకాలు' అంటారు. వీటిని ధిక్కరిస్తే, న్యాయస్థానాల ధిక్కరణ నేరంగా పరిగణించి, శిక్షిస్తారు.

సుప్రీంకోర్టు తీర్పులను పునఃపరిశీలించవచ్చు. తీర్పు ఇచ్చిన బెంచి సభ్యుల కంటే ఎక్కువ సభ్యులున్న బెంచ్ మాత్రమే పునఃపరిశీలించవచ్చు.

* సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వం నియమించే వివిధ విచారణా సంఘాలకు అధ్యక్షత వహించి, ఆయా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి.

* మన దేశంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుదే. నిబంధన 32 ప్రకారం ప్రాథమిక హక్కుల రక్షణ కోసం హెబియస్ కార్పస్; మాండమస్; ప్రొహిబిషన్; కోవారంటో; సెర్షియోరరి మొదలైన రిట్‌లను జారీచేయవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు, చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లయితే, వాటిని సమీక్షించి, అవి చెల్లవు అని చెప్పే న్యాయ సమీక్షాధికారం సుప్రీంకోర్టుకు ఉంది.

* ప్రభుత్వ చర్యల నుంచి లిఖిత రాజ్యాంగ రక్షణ, ప్రాథమిక హక్కుల రక్షణకు న్యాయ సమీక్షాధికారం దోహదపడుతుంది.

* గోలక్‌నాథ్ కేసు, బ్యాంకుల జాతీయీకరణ లాంటి కేసుల్లో సుప్రీంకోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది.

* 42వ రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షాధికారాన్ని పరిమితం చేయాలని ప్రయత్నించినా 43, 44 సవరణల ద్వారా పునరుద్ధరించారు.

* నిబంధనలు 13(1); 13(2) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధులను నిర్ణయించడానికి రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడానికి, ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీంకోర్టుకు అధికారం కల్పిస్తున్నాయి.

* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని 'చీఫ్ జస్టిస్' అని సంబోధించాలి.

 

కొందరు ప్రధాన న్యాయమూర్తులు

* పూర్వ ఫెడరల్ కోర్ట్ చివరి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జె. కానియా.

* బేరు బారి కేసు విచారణలో న్యాయ నిర్ణేత సిన్హా (1959 - 64).

* గోలక్‌నాథ్ కేసు విచారణలో న్యాయ నిర్ణేత కె. సుబ్బారావు (1966 - 67).

కేశవానంద భారతి కేసు విచారణలో న్యాయ నిర్ణేత ఎస్.ఎం.సిక్రి (1971 - 73).

* తాత్కాలిక రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా (1968 - 70).

* ఎక్కువకాలం చీఫ్ జస్టిస్‌గా పనిచేసింది వై.వి. చంద్రచూడ్ (1978 - 85).

* అతి తక్కువకాలం చీఫ్ జస్టిస్‌గా పనిచేసింది కె.ఎన్. సింగ్. 1991, నవంబరు 25 నుంచి డిసెంబరు 12 వరకు పద్దెనిమిది రోజులపాటు పనిచేశారు.
* తొలి దళిత చీఫ్ జస్టిస్ కె.జి. బాలకృష్ణన్. ఈయన జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.

Posted Date : 16-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌