• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ చరిత్రలో 1969

* ప్రత్యేక రాష్ట్రానికి పునాది అప్పుడే
* ఖమ్మం జిల్లాలో రాజుకున్న ఉద్యమం
 

తెలంగాణ ఉద్యమ చ‌రిత్రలో 2014కు ఎంత స్థానం ఉందో.. 1969కీ అంతే ప్రాధాన్యం ఉంది. ఎన్నో ర‌కాలుగా దీనికి ప్రత్యేక‌త‌లున్నాయి. 'తెలంగాణ‌కు రాష్ట్రం అక్కర్లేదు ర‌క్షణ‌లుంటే చాలు అనుకున్న చాలామంది మ‌న‌సు మార్చిన సంవ‌త్సరమ‌ది. విశాలాంధ్ర కావాల‌ని బ‌లంగా కోరుకున్న తెలంగాణ‌లోని చాలామంది ప్రగ‌తిశీలురతోనూ ప్రత్యేకానికి జై కొట్టించిన సంవ‌త్సరమ‌ది. వాడ‌వాడ‌లా, గోడ‌గోడ‌లా ప్రత్యేకం కోసం నిన‌దించి, యావ‌త్ తెలంగాణ‌ను ఉడికించి, ఊరించి ఉసూరుమ‌నిపించింది 1969. తెలుగునాట అనేకానేక రాజ‌కీయ‌, సామాజిక మార్పుల‌కు పునాదిగా నిలిచిన ఆ ఏటి ప‌రిణామాల‌పై రాజ‌కీయ ప‌రిశీల‌కులు, జ‌య‌శంక‌ర్ తెలంగాణ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ సంచాల‌కులు వి. ప్రకాశ్ విశ్లేష‌ణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం..
 

మీర్ మహబూబ్ అలీఖాన్ నుంచి మొదలు పెడితే 2014లో ఆవిర్భావం దాకా తెలంగాణలో వచ్చిన ప్రతి దశ ఉద్యమం కూడా ఉద్యోగులు, నియామకాల సమస్యలతోనే ముడిపడి ఉంది. ప్రత్యేక తెలంగాణకు బలమైన పునాది వేసిన 1969 ఉద్యమం కూడా ఇదే అంశంతో మొదలైంది. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ ప్రకారం ముల్కీ నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత కూడా కొనసాగించాలి. కానీ వాటిని అప్పటి పాలకులు ఉల్లంఘించారు. దీంతో తెలంగాణ రక్షణల(సేఫ్‌గార్డ్స్) కోసం ఉద్యమం ఆరంభమైంది. రక్షణలు అమలు కావాలంటూ నినదించారు. మొదటిసారి 1959 మార్చి 21న చట్టపరంగా వెలువడిన ఈ రక్షణల నిబంధనలను ప్రతి ఐదేళ్లకోసారి పునరుద్ధరించాలి. 1964లో తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఒత్తిడి మేరకు పునరుద్ధరించారు. తర్వాత 1969లో పునరుద్ధరించాలి. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. ప్రాంతీయ కమిటీ పరిధిలో ఉద్యోగుల అంశం లేకపోవడంతో వారి మాట వినడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. 1968 దాకా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రాంతీయ కమిటీకి మధ్య ఉద్యోగుల అంశంపై వాదోపవాదాలు కొనసాగుతుండేవి. ఉద్యోగులు, ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఇచ్చే నివేదికలను ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మధ్యలో దామోదరం సంజీవయ్య గానీ ఎన్నడూ పట్టించుకోలేదు. వీరిలో దామోదరం సంజీవయ్య మాత్రం ఓ శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై గవర్నర్ వద్ద పంచాయతీ పెడితే.. 'నిబంధనల ప్రకారం ఉద్యోగుల అంశం ప్రాంతీయ కమిటీ పరిధిలో లేదు కాబట్టి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు'అని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల తరపున మాట్లాడేవారు లేకుండా పోయారు. ఈ మానసిక సంఘర్షణ ఉద్యమం రూపం దాల్చింది. అంతకుముందే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని గమనించిన ప్రభుత్వం 1968, ఏప్రిల్ 30న ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన నాన్‌ముల్కీలను తొలగించి, వారి స్థానంలో అర్హతగల ముల్కీలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఇది జీవో 36 కంటే ముందు వచ్చింది. కానీ దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. పంచాయతీరాజ్, విద్యుత్తు, వ్యవసాయ విభాగాల్లో మాత్రమే దీన్ని అమలు చేశారు. దీంతో విద్యుత్తు శాఖలోని ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విద్యుత్తు బోర్డు, కార్పొరేషన్లలో ముల్కీ నిబంధనలు వర్తించవంటూ జస్టిస్ కుప్పుస్వామి తీర్పిచ్చారు. మరో వారం రోజుల్లో మిగిలిన విభాగాల కేసులు జస్టిస్ చిన్నప్పరెడ్డి వద్దకు వచ్చాయి. 1969, ఫిబ్రవరి 3న ముల్కీ నిబంధనలను ఆయన కొట్టేశారు. తదనంతర పరిణామాల్లో తెలంగాణకు రక్షణలు(సేఫ్‌గార్డ్స్) కావాలంటూ ఉద్యమం ఆరంభమైంది.

ఈ ఉద్యమం ఉద్దేశాలు రెండు. మొదటిది.. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అమలు చేయడం. రెండోది.. రిట్రెంచ్‌మెంట్ పేరుతో ఉద్యోగులను తీసేయొద్దు. మరోవైపు 1969 నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఉద్యోగులను తగ్గించుకోవాలంటూ కేంద్రం కూడా హెచ్చరించింది. దీంతో బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం తాత్కాలికంగా నియమించిన వారందరినీ తీసేయాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణ వారిని ఎక్కువగా ఉద్యోగాల నుంచి తీసేసి, ఆంధ్రులను మాత్రం అలాగే కొనసాగించారు. దీనిపై తెలంగాణ ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమైంది.

 

దీక్షాపర్వం

విద్యార్థులను రంగంలోకి దించకుండా ఉద్యమం నడపడం కష్టమనీ, వారు ఆమరణ దీక్షకు కూర్చుంటేనే ఉద్యమం రాజుకుంటుందని భావించారు. ఖమ్మం విద్యార్థి సంఘాల నేతలను అడిగితే విద్యార్థి ఎన్నికల్లో గెలిచినవారు అంగీకరించలేదు. ఓడిపోయిన సంఘం నేత రవీంద్రనాథ్ (డిగ్రీ రెండో సంవత్సరం) ముందుకొచ్చారు. అయితే అప్పటికప్పుడు నిరశన దీక్ష మొదలెట్టకుండా కొలిశెట్టి రామదాసు, రామసుధాకర రాజు, విఎల్ నరసింహారావు తొలుత జిల్లాల పర్యటన చేసి, ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ నేతలను సమీకరించారు. వరంగల్‌లో స్వతంత్ర ఎమ్మెల్యే పురుషోత్తంరావు, హయగ్రీవారావు, రఘోత్తమరెడ్డి, సిద్ధులు వంటివారు వీరితో కలిశారు. హైదరాబాద్‌లో అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ నేతలు మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డిలను కలసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల వివరాలను వారికిచ్చి కరపత్రం తయారు చేయించారు. (మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డి రూపొందించిన ఆ కరపత్రానికి తర్వాతి కాలంలో ప్రభుత్వం సమాధానం చెప్పింది). ఇలా అందర్నీ సమీకరించుకున్నాక 1969 జనవరి 8న (ఈ తేదీ 9న అంటూ ప్రచారంలో ఉంది. అది సరికాదు) ఖమ్మంలో రవీంద్రనాథ్‌తో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభింపజేశారు. రవీంద్రనాథ్ దీక్ష రక్షణల కోసమే తప్ప ప్రత్యేక తెలంగాణ కోసం కాదు. 8వ తేదీన వరంగల్ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యే తక్కళ్ళపల్లి పురుషోత్తంరావు సారథ్యంలో అఖిలపక్ష బృందం ఖమ్మం వెళ్లి రవీంద్రనాథ్ దీక్షకు మద్దతు పలికింది. రామదాసు, సుధాకరరాజు, నరసింహారావులు తెలంగాణ కోసం ఉద్యమమనే తమ భావనను తొలుత బయటపెట్టకుండా రక్షణల కోసమే రవీంద్రనాథ్‌తో ఖమ్మంలో దీక్ష మొదలు పెట్టించారు. ఆయనతో పాటు కవిరాజమూర్తి (మున్సిపల్ వైస్‌ఛైర్మన్) కూడా దీక్షకు మద్దతుగా కూర్చున్నారు. 'మీరు (రామదాసు తదితరులు) లేవమనే దాకా నేను దీక్షలోంచి లేవ'నంటూ రవీంద్రనాథ్ రాసిచ్చారు. మరోవైపు కేటీపీఎస్‌లో ఉద్యోగాల కోసం జనవరి 10న పాల్వంచలో పోటు కృష్ణమూర్తిని నిరాహార దీక్షకు కూర్చోబెట్టారు. ఆయన కేటీపీఎస్‌లో క్యాజువల్ ఉద్యోగి. ఖమ్మంలో కంటే పాల్వంచలో చాలా ఘర్షణలు జరిగాయి. పోలీసు కాల్పులు కూడా జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు వచ్చి కృష్ణమూర్తికి తిలకం దిద్ది వెళ్లారు. గ్రామీణ ప్రాంతం కావడంతో ఈ దీక్ష అంతగా ప్రచారంలోకి రాలేదు.

 

రెండుగా చీలిన విద్యార్థులు

రవీంద్రనాథ్ దీక్ష విద్యార్థుల్లో బాగా పాకింది. దీనికి మద్దతుగా హైదరాబాద్‌లో వేడి రాజుకోవడం మొదలైంది. దీంతో విషయం హైదరాబాద్‌కు మారింది. ఉద్యమంలోకి విద్యార్థులు దిగుతున్నారని, ఉద్యమం ప్రత్యేక తెలంగాణ వైపు మళ్లే అవకాశముందని ఇంటలిజెన్స్ నివేదికలు రావడంతో జనవరి 15న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి - పునరాలోచనలో పడ్డారు. తెలంగాణకు అప్పటికే హామీ ఇచ్చిన ముల్కీ రక్షణలను అమలు చేసి ఉద్యమాన్ని చల్లార్చాలని ఆయన భావించారు. కానీ నిప్పురవ్వ దావానలంగా మారినట్లు తెలంగాణ అంతటా ఇది అంటుకుంది. ఎక్కడా విద్యార్థులు బడులు, కాలేజీలకు వెళ్లలేదు. అందరినీ ఒకేచోటికి తేవడంలో రవీంద్రనాథ్ దీక్ష సఫలమైంది. విద్యార్థులంతా రోడ్లమీదికొచ్చారు. ఉస్మానియాలో తొలుత కొంతమంది విద్యార్థులను ముఖ్యమంత్రి బహ్మానందరెడ్డి తనవైపు తిప్పుకున్నారు. అప్పట్లో ప్రతి కాలేజీకీ విద్యార్థి సంఘం ఉండేది. ఇవికాక అన్ని కాలేజీలకు కలిపి మరో సమాఖ్య ఉండేది. దాన్ని ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాల యూనియన్ అనేవారు. ఆ సమాఖ్యకు వెంకట్రాంరెడ్డి అధ్యక్షుడైతే, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్. రామదాసు ప్రేరణతో కార్యదర్శి మల్లికార్జున్ తెలంగాణ డిమాండ్‌కు మద్దతిస్తే, అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి రక్షణలు చాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో జనవరి 15న తరగతుల బాయ్‌కాట్‌కు పిలుపిచ్చారు కూడా. రక్షణలను డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ నుంచి బయల్దేరిన ఊరేగింపులో నిజాం కాలేజీ దగ్గరకు వచ్చేసరికి మల్లికార్జున్ వర్గం ప్రత్యేక తెలంగాణ అంటూ నినదించింది. అలా జనవరి 15న విద్యార్థులు రెండుగా చీలిపోయారు. ఒకే ఊరేగింపు, రెండు వాదనలు.. మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డి, జలీల్‌పాషా, పుల్లారెడ్డి, పులి వీరన్నలు ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చారు. 16న వెంకట్రాంరెడ్డివర్గం తెలంగాణకు రక్షణలు కోరుతూ సచివాలయం వద్ద దీక్షాశిబిరం ఆరంభించింది. ప్రభుత్వం కూడా వెంకట్రాంరెడ్డి వర్గం డిమాండ్లకు సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు పంపించింది. బ్రహ్మానందరెడ్డి అధికారిక నివాసం ఆనందనిలయంలో 18, 19 తేదీల్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. తెలంగాణకు రక్షణలు ఇవ్వాల్సిందేనంటూ 45 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి సంతకం చేశారు. ఈ తీర్మానంలో రెండు నిర్ణయాలు.. మొదటిది - తెలంగాణ మిగులు నిధులపై తేల్చేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నిపుణులతో కమిటీ వేయాలి. రెండోది - 1969, ఫిబ్రవరి 28లోపు నాన్‌ముల్కీలందరినీ ఆంధ్రకు పంపించాలి. అక్కడ పోస్టుల్లేకుంటే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించైనా పంపించాలి. దీని ఆధారంగానే జనవరి 21న జీవో విడుదల చేశారు. అదే జీవో నెం 36. ఈ తీర్మానంలోని మరో ముఖ్యాంశం ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను ఖండిస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేయడం.

 

రవీంద్రనాథ్.. రామదాసు

అఖిలపక్షం తీర్మానాల నేపథ్యంలో ఖమ్మంలో రవీంద్రనాథ్ దీక్షను విరమింపజేయాలంటూ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి - ఎమ్మెల్యే పురుషోత్తంరావు, జలగం వెంగళరావులకు పురమాయించారు. రక్షణలు అమలు చేస్తున్నాం కాబట్టి ఆందోళన మానాలంటూ పిలుపిచ్చారు. ఉస్మానియా సంఘాల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి ఆ ప్రకటనకు మద్దతివ్వడం విశేషం. దీంతో తమ డిమాండ్ ప్రత్యేక రాష్ట్రమే తప్ప రక్షణలు కావంటూ మల్లికార్జున్ తదితరులు ఎదురు తిరిగారు. మరోవైపు ఖమ్మంలో.. రవీంద్రనాథ్ దీక్షకు రామదాసు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దీక్ష విరమింపజేయడానికని జనవరి 20న పురుషోత్తంరావు వచ్చారు. రక్షణలు అమలు కాబోతున్నాయి కాబట్టి దీక్ష అవసరం లేదంటూ వివరించారు. కానీ రామదాసు అంగీకరించలేదు. ఆయన్ను రవీంద్రనాథ్ దగ్గరకు కూడా వెళ్లనివ్వలేదు. దీంతో దీక్ష విరమణ బాధ్యతను జలగం వెంగళరావుకు అప్పగించారు. ఆయన ఖమ్మంలో ఉండి విశ్వప్రయత్నాలు చేశారు. రవీంద్రనాథ్ తండ్రి ద్వారా ప్రయత్నించారు. 21న దీక్ష విరమణ అంటూ చొక్కారావు (తెలంగాణ ప్రాంతీయ కమిటీ)ద్వారా పత్రికా ప్రకటన కూడా విడుదల చేయించారు. కానీ రామదాసు అంగీకరించకపోవడంతో రవీంద్రనాథ్ దీక్ష విరమించలేదు. చనిపోతే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని భావించిన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి చర్చల కోసం రామదాసును జనవరి 22న హైదరాబాద్‌కు పిలిపించారు.

ఖమ్మంలో నిషేధాజ్ఞలు విధించి, లాఠీఛార్జీ ద్వారా అందరినీ చెదరగొట్టి 22వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో రవీంద్రనాథ్ దీక్షను భగ్నం చేశారు. హైదరాబాద్‌లో రాత్రి పదిన్నరకు ముఖ్యమంత్రిని కలుసుకున్న రామదాసుకు 'మీవాడు దీక్ష విరమించాడ'న్న సమాచారం చల్లగా చెప్పేశారు. జలగం వెంగళరావు సాయంతో మొత్తానికి రవీంద్రనాథ్ దీక్ష భగ్నమైంది. దీనిపై విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రవీంద్రనాథ్‌కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. మరోవైపు ఇల్లెందులో పోటు కృష్ణమూర్తి దీక్ష కొనసాగింది. ఒక్క సంస్థలో ఉద్యోగాల గురించి అంత పట్టింపు ఎందుకంటూ ప్రత్యేక జీవో ద్వారా కేటీపీఎస్‌లో ముల్కీ నిబంధనల్ని కొనసాగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆంధ్ర ఉద్యోగులను పంపించి, తెలంగాణవారికి ఉద్యోగాలివ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జీవోను చూశాక జనవరి 23న పోటు కృష్ణమూర్తి ఘనంగా దీక్ష విరమించారు. అక్కడితో ఉద్యమ చరిత్రలో రామదాసు బృందం కార్యకలాపాలు పరిమితమయ్యాయి. అలా ఉద్యమ నిప్పును రగిలించింది మాత్రం కొలిశెట్టి రామదాసే.

 

సత్యమూర్తి పాత్ర

ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన తమ్మనపల్లి సీతారామాంజనేయులు (కాకతీయ థియేటర్స్ యజమాని)కి వరంగల్‌లో రైసుమిల్లులుండేవి. ఆ సమయంలో వరంగల్‌లో మొత్తం 20 రైసు మిల్లులుంటే రెండు మాత్రమే ఆంధ్ర నుంచి వచ్చిన వారివి. మిగిలినవన్నీ స్థానికులవే. అయితే బియ్యం సేకరణను మాత్రం ప్రభుత్వం ఆంధ్రులకు సంబంధించిన రెండు మిల్లులకే ఇచ్చేది. దీంతో కొన్నేళ్లలో మిగిలిన మిల్లులు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఇది చాలామందికి రుచించలేదు. వాణిజ్యరంగంలోనూ ఆగ్రహం పెల్లుబికింది. కానీ రక్షణల అమలుకోసం ఫిబ్రవరి 28 దాకా సమయమిద్దామని ఎమ్మెల్యే పురుషోత్తంరావు అందరినీ ఒప్పించారు. పురుషోత్తంరావు పిలుపుతో విద్యార్థుల్లోనూ స్తబ్ధత వచ్చింది. ఇదంతా జరుగుతున్న సమయంలో అప్పటికే శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమంతో సంబంధమున్న కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి (శివసాగర్‌గా ప్రసిద్ధి చెందారు) వరంగల్‌లోని సెయింట్ గాబ్రియెల్ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. విద్యార్థుల్లో ఆవేశాన్ని, వేడి చల్లారకుండా ఉండాలనే ఉద్దేశంతో సత్యమూర్తి పదిమందితో కలిసి సీతారామాంజనేయులు రైసుమిల్లులు, ఆంధ్రులకు సంబంధించిన కొన్ని దుకాణాలపై (పాపులర్ షూమార్టు) దాడులు చేయించి విధ్వంసం సృష్టించారు. ఆ ఆరోపణలపై సత్యమూర్తిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. చాలాకాలంపాటు ఆయన జైల్లో ఉన్నారు. ఇదే సందర్భంలో ఉద్యమ నేపథ్యంలో అరెస్టయిన విద్యార్థులు చాలామందిని జైల్లో సత్యమూర్తి ప్రభావితం చేశారంటారు. ఆ సమయంలో ఎంతమంది విద్యార్థులు అరెస్టయ్యారంటే.. జైళ్లు సరిపోకపోవడంతో కాకతీయ మెడికల్ కాలేజీకి సెలవులు ప్రకటించి జైలుగా మార్చారు. ఈ సంఘటనల భయంతో కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని ఆంధ్ర కుటుంబాలు ఆంధ్రకు తిరిగి వెళ్లిపోయాయి. దీంతో ఆ సమయంలో ఆంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. వాటిని చల్లార్చడానికి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి వెళ్లాల్సి వచ్చింది. జనవరి 29న కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఆర్ఈసీలో విధ్వంసం జరిగింది. భయంతో వెళ్లిపోయిన ఆంధ్ర విద్యార్థుల గదుల తాళాలను పగలగొట్టి వస్తువులను తగలబెట్టారు. ఈ విధ్వంసం సత్యమూర్తి చేయించాడనే ఆరోపణ ఉంది. నల్గొండ, కోదాడ ప్రాంతాల్లోనూ ఇలాంటి దాడులు జరిగాయి. అయితే చాలామటుకు ఉద్యమ నాయకులు ఆంధ్ర ప్రాంత ప్రజలకు అండగా నిలిచారు. పొగాకు లారీకి వరంగల్‌లో నిప్పు పెట్టారు. బాష్పవాయు ప్రయోగాలు, కాల్పులు, లాఠీఛార్జీలు తెలంగాణలో నిత్యకృత్యమయ్యాయి. జనవరి 30న మిలిటరీని కూడా దించారు. 30న గజ్వేల్, స్టేషన్ ఘన్‌పూర్‌లో కాల్పులు జరిగాయి. ఫిబ్రవరి 1న శ్రీశైలం ఈగలపెంట వద్ద (అప్పుడు డ్యామ్ నిర్మాణం కొనసాగుతోంది) తెలంగాణ ఉద్యోగుల ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ సంఘటన తర్వాత ఆందోళన సింగరేణికి పాకింది. ఫిబ్రవరి 16 దాకా అన్ని విద్యాసంస్థలకు సెలవిచ్చారు. 17న తరగతులు ఆరంభమైనా ఎవరూ హాజరుకాలేదు. ఆందోళనలు యథావిధిగా కొనసాగాయి.

 

ఆద్యుడు కొలిశెట్టి రామదాసు

టీఎన్‌జీవో అధ్యక్షుడు కె.ఆర్.అమోస్, కార్యదర్శి ఎస్.ఎన్.చారి సారథ్యంలో 1968 జులై 10న తెలంగాణ హక్కుల రక్షణ దినంగా నిర్వహించారు. అంతకుముందే ఖమ్మం జిల్లా ఇల్లెందులో నిప్పు రాజుకుంది. ఇల్లెందులోని అనేక విభాగాల్లో కృష్ణా, విజయవాడ నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలొచ్చాయి. ఇల్లెందు స్థానికులకు మాత్రం లభించలేదు. కేటీపీఎస్‌లోనూ ఉద్యోగులు అక్కడి నుంచే వచ్చారు. దీంతో తెలంగాణ రాకుంటే ఏమీ రాదంటూ.. కొలిశెట్టి రామదాసు తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేశారు. ఆయన సింగరేణిలో పనిచేసి, మద్రాసులో ఉన్నత చదువుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతకుముందు ఖమ్మం డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘ నేతగా కూడా పనిచేశారు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యంగా ఏర్పడ్డ తొలి సంఘం ఇల్లెందు తెలంగాణ ప్రాంతీయ సమితి. అలా తెలంగాణ ఉద్యమం ఆరంభమైంది కూడా ఇల్లెందులోనే. ఉద్యమ ఆరంభంలో కొలిశెట్టి రామదాసు పాత్ర చాలా కీలకమైంది. తెలంగాణ ఉద్యమానికి ఒకరకంగా ఆద్యుడు ఆయనే! ఇప్పటికీ బతికే ఉన్నారు. కానీ జ్ఞాపకశక్తి లోపించింది. కొద్ది నెలల తర్వాత రామసుధాకరరాజు (ఉపాధ్యాయ సంఘ నేత), వి.ఎల్.నరసింహారావు (కేటీపీఎస్‌లో ఉద్యోగి)లు ఆయనతో కలిశారు. కేటీపీఎస్‌లో ఉద్యోగాలు రావాలన్నా.. తెలంగాణ ఉద్యోగుల హక్కులు రక్షించాలన్నా.. తెలంగాణ రావాలన్నది వీరి భావన. అయితే ఉన్నఫళంగా తెలంగాణ అంటే వచ్చే మద్దతు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో రక్షణల కోసం ఉద్యమం మొదలు పెట్టారు.

 

మార్చి 3న తొలి బంద్

ఖమ్మంలో ముగిసింది... హైదరాబాద్‌లో మొదలైంది. రక్షణల అమలు కోసం ప్రభుత్వానికి సమయం ఇవ్వాలంటూ రక్షణల ఉద్యమానికి విరామమిద్దామని పురుషోత్తం రావు తదితరులు ప్రకటించగా మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డిలు మాత్రం ససేమిరా అన్నారు. నిజాం కాలేజీ వద్ద లాఠీఛార్జీ జరిగింది. మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డి, పులి వీరన్నలను జైల్లో పెట్టారు. నాయకత్వాన్ని అరెస్టుల ద్వారా ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. ఇక తమతో కాదంటూ మల్లికార్జున్ బృందం నిరుత్సాహ పడింది. రక్షణల అమలు కోసం ఆశతో చూస్తున్న నేతలొకవైపు.. తెలంగాణ రానిదే రక్షణలు అమలుకావంటూ నినదిస్తున్న విద్యార్థులు మరోవైపు.. మధ్యలో రక్షణల అమలు కోసం ఇచ్చిన జీవో ఇంకోవైపు.. ఉస్మానియా యూనివర్సిటీలో ఉపకులపతి డీఎస్ రెడ్డితో మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డిలు చర్చలు జరిపారు. రక్షణలు అమలవుతుంటే ఉద్యమం అవసరం లేదంటూ ఉపకులపతి నచ్చచెబుతున్న వేళ.. మెదక్ జిల్లాలో కాల్పులు జరిగి చాలామంది చనిపోయారంటూ వార్త రావడంతో విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఉద్యమం మళ్లీ రాజుకుంది. ప్రభుత్వం ఒకవైపు కాల్పుల్లో చంపుతుంటే ఉద్యమం విరమించుకోవాల్సిన అవసరమే లేదంటూ మల్లికార్జున్ బృందం నిర్ణయించింది. రవీంద్రనాథ్, పోటు కృష్ణమూర్తిల దీక్ష విరమణ తర్వాత మెదక్ జిల్లా సదాశివపేటలో కాల్పులు జరిగాయి. హైస్కూల్ పిల్లలు, యువకుల ఊరేగింపు సందర్భంగా ఎస్ఐని ఘెరావ్ చేయడంతో ఆయన కాల్పులకు ఆదేశాలిచ్చాడు. 25 మందికి గాయాలయ్యాయి. ఆ కాల్పుల్లో 19 ఏళ్ల శంకర్ అనే యువకుడు (జనవరి 27న) చనిపోయాడు. తెలంగాణ కోసం మరణించిన తొలి అమరుడు అతనే. ఆయన విద్యార్థి అని విద్యార్థి సంఘాలంటే, కాదని కలెక్టర్ నివేదిక ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ కోసం ప్రాణాలు విడిచిన తొలి అమరవీరుడు శంకర్. అదే కాల్పుల్లో గాయపడిన కృష్ణ మరికొద్ది రోజుల తర్వాత మరణించాడు. ఉద్యమంలోకి ఉద్యోగులను కూడా సమీకరిద్దామంటూ.. అప్పటి జర్నలిస్టులు పీఎన్‌స్వామి, ప్రతాప్‌కిశోర్, మామిడి రమాకాంతరావు, ఆదిరాజు వెంకటేశ్వరరావు, రఘువీరరావులతోపాటు డాక్టర్ గోపాలకృష్ణ, మదన్‌మోహన్ (అడ్వకేట్)లు మల్లికార్జున్ బృందంలో ధైర్యం నూరిపోశారు. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేసి గౌలిగూడలోని వతందార్ల సంఘంలో సమావేశమయ్యారు. అలా విద్యార్థుల ఉద్యమంలోకి మేధావులు కూడా చేరారు. రాజకీయ నేత ఎస్.వెంకట్రాంరెడ్డి (చెన్నారెడ్డి సహచరుడు) ఈ సమావేశానికి హాజరయ్యారు. 1969 మార్చి 3న తెలంగాణ బంద్‌కు మల్లికార్జున్ ద్వారా పిలుపిచ్చారు. తెలంగాణ కోసం జరిగిన తొలి బంద్ ఇదే.

మల్లికార్జున్ సారథ్యంలో విద్యార్థులు అన్ని జిల్లాల్లో తిరిగి మరింతమంది విద్యార్థులను సమీకరించారు. మార్చి 3 బంద్ విజయవంతమైంది. బస్సుల దహనాలు, లాఠీఛార్జీలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. సదాశివపేట సంఘటన జరిగి ఉండకుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో! మల్లికార్జున్ బృందం కూడా చల్లబడేదేమో! కానీ నాటి నుంచి నేటిదాకా ఉద్యమం చల్లబడుతున్నప్పుడల్లా ఏదో ఓ సంఘటన ఆజ్యం పోస్తునే వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఉద్యమ వ్యతిరేకశక్తులే ఉద్యమానికి ఊపిరిలూదాయి.

Posted Date : 12-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌