• facebook
  • whatsapp
  • telegram

వాస్తుశిల్పకళ - వారసత్వం

తెలంగాణ ప్రాచీనకాలం నుంచే కళలకు కాణాచిగా ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల కాలం నుంచే తెలుగునాట శిల్పకళ - వాస్తుశిల్పం పరిఢవిల్లింది. క్రీ.శ.6వ శతాబ్దం వరకు మహాయాన బౌద్ధమతం విరాజిల్లడంతో అమరావతి శిల్పకళ ఆవిర్భవించి, ఇక్ష్వాకుల కాలం నాటికి పరిపూర్ణతను సాధించింది. చాళుక్యుల కాలంలో ఉత్తర, దక్షిణాల మేలు కలయికగా సరికొత్త శిల్పకళారీతి 'వేసర శైలి' రూపుదిద్దుకుంది. మధ్యయుగంలోని కాకతీయుల కాలంలో తెలంగాణ శిల్పకళ - వాస్తుశిల్పం వైభవాన్ని సంతరించుకుంది. అనంతరం తెలంగాణలో కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల పాలనలో ఇస్లాం - పర్షియన్; తెలుగు - పర్షియన్ సంప్రదాయాల మేళవింపు ఒక నూతన శైలికి శ్రీకారం చుట్టింది. ఈ సంప్రదాయం భవన నిర్మాణాలు, వాస్తుశిల్పంపై విశేష ప్రభావాన్ని చూపింది. ఉత్తరాది మొగలాయిల వాస్తు - శిల్పకళ కూడా తెలంగాణ మధ్యయుగ వాస్తు - శిల్పకళపై తనదైన ముద్ర వేసింది. ఈ రెండూ వేర్వేరైనా ఆయాకాలాల్లోని వాస్తుశిల్పాల్లో శిల్పకళ అంతర్లీనంగా కనిపిస్తుంది.

 

శాతవాహనుల శిల్పకళ

తెలంగాణలో శిల్పకళకు శాతవాహనుల కాలంలోనే బీజాలు పడినట్లు తెలుస్తోంది. దక్కన్‌లో అభివృద్ధి చెందిన వాస్తు - శిల్పకళ 'అమరావతి శిల్పకళారీతి' ప్రాచుర్యాన్ని పొందింది. కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట, పెద్దబంకూర్, కోటిలింగాలు; ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, నల్లగొండ జిల్లాలోని ఫణిగిరిలో శిథిలావస్థలో ఉన్న బౌద్ధ స్తూపాలు, చైత్యాలు ఉన్నాయి. శాతవాహనుల కాలం నాటి అమరావతి శిల్పకళకు నాగార్జునకొండ ప్రధాన కేంద్రం. శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలం నాటి అనేక శిల్పాలు నాగార్జునకొండ ప్రాజెక్టు తవ్వకాల్లో లభించాయి. ప్రియుడు మధుపాత్రను అందిస్తుండగా ప్రియురాలు దాన్ని తిరస్కరిస్తున్నట్లుగా చెప్పిన శిల్పఖండం నాటి శిల్పకళా నైపుణ్యానికి తార్కాణం. ఒక చిత్రకారుడి మనోజ్ఞమైన భావనను సైతం తలదన్నేలా శిల్పి చూపిన ప్రతిభాకౌశలం అపూర్వం.

 

స్తూపాలు సమాధులు, ఆరాధ్య కేంద్రాలుగా ప్రతీతి. చైత్యాలు అంటే దేవాలయాలు, విహారాలు. ఇవి బౌద్ధ భిక్షువుల విశ్రాంతి కేంద్రాలు. ప్రధానంగా తెలంగాణలోని బౌద్ధ స్తూపాలన్నింటినీ సాంచీ స్తూప నమూనాను అనుసరించి నిర్మించారు. స్తూపం అనేది గుండ్రంగా రాతితో లేదా మట్టితో నిర్మించిన కట్టడం. దీనిపైన నిర్మించే 'డోమ్‌'ను 'అండ' అని, దానిపైన 'ఛత్రం' ఆకారంలో ఉండే నిర్మాణాన్ని 'హర్మిక' అని అంటారు. స్తూపాల చుట్టూ ప్రాకారాలను నిర్మించడం ఆనాటి సంప్రదాయం. వీటిపై బుద్ధుడి జాతక కథలను చెక్కేవారు. ప్రతి స్తూపానికి నాలుగు దిక్కుల్లో నాలుగు ఆయక స్తంభాలను నిర్మించడం ఆనవాయితీ. ఈ అంశాలన్నింటినీ ఫణిగిరి స్తూపంలో గమనించవచ్చు. ప్రధానంగా తెలంగాణలోని బౌద్ధ స్తూపాలన్నీ ఇటుకలతో నిర్మించినవే కావడం విశేషం.

 

ఇక్ష్వాకులు

ఇక్ష్వాకుల బౌద్ధుల వాస్తుశిల్ప కళకు పరాకాష్ఠ నాగార్జునకొండ. ఇక్కడ స్తూపం, చైత్యం అనే రెండు నిర్మాణాలు ఉన్నాయి. స్తూపం పలకలపైన బుద్ధుడి విగ్రహాలు, జాతక కథలను చెక్కారు. వీరికాలంలో మొదటిసారిగా హిందూ దేవాలయాల నిర్మాణం జరిగింది. ఇక్ష్వాకులు మొదట చైత్య నిర్మాణాల నమూనాలోనే ఆలయాలను నిర్మించారు. మొదటిసారిగా పుష్పభద్రస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక్ష్వాకుల కాలంలో ఆలయాలను ధ్వజ స్తంభాలు, మండపాలు, అంతరాలయం, గర్భగుడి ఉండేలా నిర్మించేవారు. బాదామి చాళుక్యులు దేవాలయాల నిర్మాణంలో నూతన శైలిని ప్రారంభించారు. చాళుక్యులు ఉత్తర, దక్షిణ భారతంలోని నగర, ద్రవిడ శైలుల కలబోతగా 'వేసర శైలి' అనే ఒక కొత్త శిల్పకళారీతికి శ్రీకారం చుట్టారు. ఈ శైలికి వేములవాడ, ధర్మపురి, అలంపూర్ దేవాలయాలు చక్కని నిదర్శనాలు. కొలనుపాక, శనిగరం, కోరుట్ల, వేములవాడలోని జైనమందిరాలను కూడా ఈ శైలిలోనే నిర్మించారు. వేములవాడ భీమేశ్వర, నాగేశ్వర, కేదారేశ్వర, రాజరాజేశ్వరాలయాల్లో కళ్యాణి చాళుక్యుల శైలి కనిపిస్తుంది.

 

కాకతీయులు

తెలంగాణ సంస్కృతి చరిత్రలో కాకతీయుల కాలం నాటి వాస్తుశిల్పకళ మహోన్నతంగా విలసిల్లింది. తొలి కాకతీయులు చాళుక్యుల కాలం నాటి వేసర శైలినే అనుసరించినప్పటికీ స్వతంత్రులయ్యాక తమదైన కాకతీయ శిల్పకళా సంప్రదాయానికి నాంది పలికారు. ఎత్తయిన వేదికలు, నునుపైన శిల్పాలతో కూడిన స్తంభాలు, లోకప్పులపైన శిల్పాలతో అలంకరణ, మండపాల చుట్టూ పిట్టగోడలు, కాకతీయుల శిలా తోరణం, హంసలు, పద్మాలు వారి శిల్పకళ ప్రత్యేకతలు. ఇసుక పునాదులపైన దేవాలయాలను నిర్మించడం కాకతీయుల విశిష్టత. మొదటి ప్రోలరాజు హన్మకొండలో నిర్మించిన సిద్ధేశ్వరాలయం, పద్మాక్షి ఆలయాలు జైన దేవాలయాలుగా ప్రసిద్ధిగాంచాయి. కాకతీయ శిల్పకళా వైభవానికి కీర్తిపతాకాలు హన్మకొండలోని 'వేయిస్తంభాల గుడి' (రుద్రేశ్వరాలయం), పాలంపేటలోని 'రామప్పగుడి'.

 

క్రీ.శ.1163లో రుద్రదేవుడు నిర్మించిన రుద్రేశ్వరాలయం త్రికూటాలయం. ముగ్గురు మూర్తులు శివుడు, విష్ణువు, సూర్యుడు కొలువై ఉన్న కూటమి కాబట్టి దీన్ని త్రికూటాలయంగా పిలుస్తారు. వరంగల్ కోట (ఖిలా వరంగల్)లోని స్వయంభూ దేవాలయాన్ని రెండో ప్రోలరాజు నిర్మించాడు. ఈ దేవాలయానికి నాలుగు దిక్కులా నాలుగు శిలాతోరణాలతో కూడిన ద్వారాలు ఉండటం అనేది నాటి శిల్పుల ప్రతిభ, నైపుణ్యానికి నిదర్శనం. గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు క్రీ.శ.1213లో రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఇది నక్షత్రాకారంలో ఉన్న ఏకేశ్వరాలయం. పైకప్పులోని శిలలపై రామాయణ, భాగవతం, శివపురాణాల్లోని కథలను చెక్కడం; వివిధ భంగిమల్లో మలచిన మదనిక, నాగినుల శిల్పాలు ఉండటం ఈ గుడి ప్రత్యేక లక్షణాలు. దీనిలోని నందీశ్వరుడి విగ్రహ శిల్పాన్ని ఎటు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లుగా ఉండటం 'నభూతోనభవిష్యతి'. రామప్ప దేవాలయం గోపురాన్ని నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించారు. ఇది ఆనాటి వాస్తుశిల్పంలోనే ఒక పెద్ద అద్భుతం. రేచర్ల రుద్రుడి కుమారుడైన రేచర్ల గణిపిరెడ్డి ఘనపురం (ములుగు)లో గణపేశ్వరాలయాలను నిర్మించాడు. ఇవే 'కోటగుళ్లు'గా ప్రాచుర్యం పొందాయి. కాకతీయుల సామంతరాజు నామిరెడ్డి పిల్లలమర్రిలో 'నామేశ్వరాలయాన్ని' నిర్మించాడు. కాకతీయుల కాలం నాటి శివాలయాలు వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్, ఐనవోలు, గూడూరు, ఇనుగుర్తి, కొండపర్తి, పాలంపేట, ఘనపురంలో; కరీంనగర్ జిల్లాలోని మంథని, రాయ్‌కల్, గొడిశాల, బెజ్జంకి, నగునూరు, కాళేశ్వరంలో; నల్లగొండ జిల్లాలోని నాగులపాడు, పానగల్లు, పిల్లలమర్రిలో; మహబూబ్‌నగర్ జిల్లాలోని జక్కారం, వడ్డెమాను, ముత్తారంలో ఉన్నాయి.

 

కుతుబ్‌షాహీలు

వీరు అద్భుతమైన వాస్తుకళా పోషకులుగా హైదరాబాద్ వాస్తు శిల్పకళకు ప్రపంచ ప్రఖ్యాతి కల్పించారు. భాగ్యనగరాన్ని నిర్మించి నగర సౌందర్యాన్ని ఇనుమడింపజేసే చరిత్రాత్మక కట్టడాలెన్నింటినో భావితరాలకు వారసత్వ సంపదగా అందించారు. కుతుబ్‌షాహీ పాలకులు చరిత్రలో నిలిచిపోయే రాజప్రాసాదాలు, కోటలు, స్మారకాలు (సమాధులు), ఆసుపత్రులు, మసీదులు, అశ్రుఖానాలు, చెరువులు, సరాయిలు ఎన్నింటినో నిర్మించారు. వీటిలో ప్రధానమైనవి భాగ్యనగర నిర్మాణం, చార్మినార్, మక్కామసీదు, టోలీ మసీదు, తారామతి బారాదరీ, మూసీపై పురానాపూల్ వంతెన. చార్మినార్, మక్కామసీదు అపూర్వ వాస్తు శిల్పానికి ప్రతీకలు. నేటికీ తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో చార్మినార్‌లో రాతిని, మక్కామసీదులో మట్టిని ఉపయోగించలేదని చాలా గొప్పగా చెప్పుకుంటారు. కుతుబ్‌షాహీల కాలం నాటి విశ్వవిఖ్యాత కట్టడం చార్మినార్. ఇది నాటి తాపీమేస్త్రీల కళానైపుణ్యం, భవన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం, ప్రభువుల వాస్తుశిల్ప కళాభిమానానికి నిలువెత్తు నిదర్శనం. నాలుగు ఎత్తయిన మినార్‌లతో నగరం నడిబొడ్డున సగర్వంగా నిలబడి నాలుగు శతాబ్దాలకుపైగా సుదీర్ఘచరిత్రకు సజీవసాక్ష్యంగా మిగిలిన ఈ నిర్మాణం మధ్యయుగ చరిత్రలోని వాస్తు శిల్ప కళాచాతుర్యానికి మచ్చుతునక. ఆనాడు నగరాన్ని పట్టిపీడించిన మహమ్మారి 'ప్లేగు' వ్యాధి స్మృతి చిహ్నంగా క్రీ.శ.1590-91లో సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా చార్మినార్‌ను నిర్మించాడు. భాగ్యనగర నిర్మాణం కుతుబ్‌షాహీల యుగంలో మరపురాని మహోజ్వల ఘట్టం. క్రీ.శ.1590 - 91లో ప్రారంభమైన హైదరాబాద్ నగర నిర్మాణం ఆసియా ఖండంలోనే విశిష్టమైందిగా ప్రాచుర్యాన్ని పొందింది. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న గోల్కొండ పట్టణ జనాభాను తరచూ మూసీనది వరదలు ముంచెత్తుతుండటంతో సుల్తాన్ మదిలో మూసీనదికి దక్షిణ దిక్కున ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచన కలిగింది. మహ్మద్ కులీకుతుబ్‌షా కొలువులోని ప్రముఖ పాలనావేత్త, సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త, వాస్తుశిల్పి అయిన 'మీర్ మొమిన్'

 

అస్త్రాబాదీ తన విశేషానుభవాన్ని ఉపయోగించి హైదరాబాద్ నగర నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించాడు. దీనికోసం తన మాతృదేశమైన ఇరాన్‌లోని 'ఇస్‌ఫహాన్' నగర నిర్మాణాన్ని నమూనాగా తీసుకున్నాడు. పర్షియన్ సంప్రదాయ ముద్రతో చార్మినార్ కేంద్రంగా ప్రధాన పరిపాలనా, ఆధ్యాత్మిక, వ్యాపార కేంద్రాలన్నీ దాని చుట్టూ విస్తరించి ఉండేలా నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. నాలుగు విశాలమైన రహదారుల కూడలిలో చార్మినార్ ఉండేలా బృహత్తరమైన ప్రణాళికతో సుందరమైన నగరాన్ని నిర్మించాడు. చార్మినార్‌కు సమీపంలో 'చార్‌కమాన్‌'ను కూడా కట్టించాడు. హైదరాబాద్ నగరానికి ఉత్తర సరిహద్దున గల 'నౌబత్‌ఘాట్‌'కు సమీపాన ఇబ్రహీం కులీకుతుబ్‌షా హుస్సేన్‌సాగర్ జలాశయాన్ని నిర్మించాడు. దీని నిర్మాణం సుల్తాన్ అల్లుడైన హుస్సేన్ షా వలీ స్వీయ పర్యవేక్షణలో జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలిపే మార్గంగా ఈ చెరువుకట్ట నేటికీ సేవలందిస్తోంది. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలోనే నిర్మించిన మరొక అద్భుతం మూసీనదిపై కట్టిన 'పురానాపూల్' వంతెన. మొత్తం ఈ వంతెన నిర్మాణంలో 22 ఆర్చ్‌లు ఉన్నాయి. ఇది 54 అడుగుల ఎత్తు, 600 అడుగుల పొడవు, 35 అడుగుల వెడల్పుతో గోల్కొండ - హైదరాబాద్ నగరాలను కలిపే వారధిగా నాటి నుంచి నేటికి ఉపయోగపడుతోంది. ఈ నిర్మాణ చాతుర్యానికి ముగ్దుడైన ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ దీన్ని పారిస్‌లోని 'ఫోంటో న్యుఫ్' నిర్మాణంతో పోల్చి ప్రశంసించాడు. సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా కాలంలో నిర్మించిన ధర్మాసుపత్రే 'దారుల్ - షిఫా'. సామాన్య ప్రజల వైద్యచికిత్సకు రెండంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో యునానీ వైద్య సదుపాయాన్ని కల్పించేవారు. కుతుబ్‌షాహీ ప్రభువుల ప్రధాన పరిపాలనకు కేంద్రం గోల్కొండ ఖిల్లా. ప్రభువుల పాలనా వ్యవహారాలన్నీ ఈ కోట నుంచే నిర్వహించేవారు. సుమారు రెండు శతాబ్దాల పాటు కుతుబ్‌షాహీ పాలకుల ప్రధాన కార్యస్థలంగా, అధికారానికి కేంద్రంగా, సార్వభౌమత్వానికి కీర్తిపతాకంగా నిలిచిన గోల్కొండ కోట నిర్మాణం మహాద్భుతం. భూమి ఉపరితలం నుంచి 400 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఈ కోట శత్రుదుర్బేధ్యంగా నిర్మితమైంది. కోట ప్రాకారాన్ని పటిష్ఠమైన గ్రానైట్ బండరాళ్లలో నిర్మించారు. కోట బయట మొత్తం ఎనిమిది దర్వాజాలు ఉంటాయి. వీటిలో ఫతే దర్వాజా ప్రధానమైంది. కోట లోపలి భవనాలైన బాలాహిస్సార్, దివాన్ - ప్యాలెస్, జామా మసీదు, నగీనాబాగ్, సిల్వాఖానాలు నాటి వాస్తుశిల్ప కళావైభవానికి ప్రతీకలు. గోల్కొండ కోట తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి, త్యాగాలకు నిదర్శనం. కుతుబ్‌షాహీల కట్టడాల్లో ప్రసిద్ధిగాంచిన పవిత్ర, ఆధ్యాత్మిక కట్టడం మక్కామసీదు. 'మక్కా'లో ప్రసిద్ధిగాంచిన ఒక మసీదు నమూనాలో దీన్ని నిర్మించడంతో 'మక్కామసీదు'గా ప్రాచుర్యాన్ని పొందింది.

 

సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా తమ రాజాస్థాన అధికారైన 'దరోగా' మీర్ - ఫజీయుల్లా - బేగ్, చౌదరి రాజయ్యల పర్యవేక్షణలో 'మక్కామసీదు' నిర్మాణానికి క్రీ.శ.1617లో శ్రీకారం చుట్టారు. సుమారు 77 ఏళ్లకు అంటే క్రీ.శ.1694లో ఈ నిర్మాణం పూర్తయ్యింది. మధ్యయుగ వాస్తు శిల్ప కళాచాతుర్యానికి మక్కామసీదు ఒక నిదర్శనం. పర్షియా, అరబ్ దేశాలకు చెందిన సుమారు ఎనిమిది వేల మంది తాపీమేస్త్రీలు, కూలీలు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ మసీదులో 15 ఆర్చ్‌లు; పొడవు 67 మీ., వెడల్పు 54 మీ., ఎత్తు 23 మీ. గల ప్రధానమైన హాలు ఉంది. మొత్తం పదివేల మంది ప్రజలు ఏకకాలంలో సామూహికంగా ప్రార్థనలు చేసే వీలుండటం ఈ మసీదు విశేషం. ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ మక్కామసీదు వాస్తుశిల్ప శైలికి, నిర్మాణ చాతుర్యం పట్ల ఆశ్చర్యానికి గురై రాసిన మాటలు మధ్యయుగ చరిత్రలోనే అజరామరంగా నిలిచాయి. దీని నిర్మాణానికి అవసరమైన రాళ్లను చేరవేయడానికి వేలాది ఎద్దుల బండ్లను తయారు చేశారని; మహ్మద్ ప్రవక్త కేశాలు, ఇతర పవిత్ర వస్తువులను ఈ మసీదులో భద్రపరిచారని తన రచనల్లో పేర్కొనడం మక్కామసీదు ప్రాశస్త్యాన్ని తెలియజేస్తోంది. సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా ఏకైక కుమార్తె హయత్ -భక్షీ- బేగం పాలనా వ్యవహారాల్లో పాల్గొనడమే కాకుండా పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. హైదరాబాద్‌కు తూర్పున 'హయత్‌నగర్‌'ను నిర్మించి అక్కడ ఒక రాజమహల్‌ను; వ్యాపారులు, బాటసారులు సేదతీరి, విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా కార్వాన్‌లో 'మా సాహెబ్ సరాయ్' నిర్మాణాన్ని చేపట్టింది. ఈమె తన గురువైన 'ఆకుంద్ - ముల్లా - అబ్దుల్‌మాలిక్' స్మారకార్థం ఖైరతాబాద్‌లో ఒక పెద్ద మసీదును కూడా నిర్మించింది. హయత్-భక్షీ- బేగం స్మారకార్థం ఆమె కుమారుడు అబ్దుల్లా కుతుబ్‌షా తన తల్లి సమాధి పక్కనే ఒక మసీదును అద్భుతమైన వాస్తుశిల్ప కళా నైపుణ్యంతో నిర్మించాడు. దీన్నే 'బజీ మసీదు' అని కూడా పిలుస్తారు. కుతుబ్‌షాహీ ప్రభువులు మధ్యయుగ వాస్తుశిల్ప కళకు ఎంత ప్రాభావాన్ని కల్పించారో, వారు తమ పూర్వీకుల సమాధుల నిర్మాణంలోనూ అదే వాస్తుశిల్ప కళాచాతుర్యాన్ని ప్రదర్శించారు. వీరి వాస్తు శిల్పుల నైపుణ్యం ఏడు సమాధుల్లో కనిపిస్తుంది. మహ్మద్ కులీకుతుబ్‌షా, ఇబ్రహీం కుతుబ్‌షా, మహ్మద్ కుతుబ్‌షా, అబ్దుల్లా కుతుబ్‌షా, బేగం హయత్ భక్షీ, జంషీద్ కులీ, సుల్తాన్ కులీ కుతుబ్-ఉల్-ముల్క్ సమాధులను గోల్కొండ కోటకు సమీపాన నిర్మించారు. ఇవి అద్భుతమైన వాస్తుశిల్ప కళకు నిదర్శనంగా, తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద కట్టడాలుగా ప్రసిద్ధిగాంచి, దేశ విదేశీ పర్యటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 

అసఫ్‌జాహీల వాస్తు శిల్పం

ఆధునిక హైదరాబాద్‌కు ఆయువు పట్టు, అద్భుతమైన వాస్తు శిల్పం తొణికిసలాడే కట్టడాలను అసఫ్‌జాహీలు నిర్మించారు. ప్రత్యేకించి నవాబు మీర్ఉస్మాన్ అలీఖాన్ వాస్తుశిల్ప వికాసానికి గణనీయమైన కృషిచేశారు. ఈ కాలం నాటి ప్రసిద్ధిచెందిన కట్టడాల్లో సమకాలీన సంస్కృతి, నాగరికత ప్రతిఫలిస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా ఆసుపత్రి భవనాలను ఇండో - మొగలాయిక్ వాస్తు శైలిలో; హైకోర్టు భవనాన్ని ఇండో - సెరసానిక్, అసెంబ్లీ భవనాన్ని రాజస్థానీ - సెరసానిక్ వాస్తు శైలిలో నిర్మించారు. సిటీ కళాశాల, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భవనాలు, జూబ్లీహిల్స్, పబ్లిక్‌గార్డెన్స్, చార్మినార్ యునానీ ఆసుపత్రి, అసిఫియా గ్రంథాలయం, జూడీ మసీదు, టౌన్‌హాలు, ఇడెన్‌బాగ్ లాంటివి నిజాం ప్రభువుల కాలం నాటి వాస్తుశిల్ప కళానైపుణ్యానికి నిదర్శనాలు. ఈజిప్టు విశ్వవిద్యాలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బెల్జియం వాస్తుశిల్పి జాస్పర్ నిజాం రాజు కోరిక మేరకు 1933లో హైదరాబాద్‌కు వచ్చారు. భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల్లోని చారిత్రక కట్టడాలను పరిశీలించి 'హిందూ - ఇస్లామిక్ (పర్షియన్) - యురోపియన్' వాస్తు శైలుల సమ్మేళనంతో 1934 - 39 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలను నిర్మించారు. దీని నిర్మాణంలో నిజాం హైదరాబాద్ రాజ్య వాస్తుశిల్పి నవాబ్ జైన్‌యార్ జంగ్, ప్రముఖ వాస్తుశిల్పి సయ్యద్ అలీరజాలు ప్రధానపాత్ర పోషించారు. తెలంగాణ జాతికి, తెలంగాణ సాంస్కృతిక - వాస్తు శిల్ప చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే తరతరాల వారసత్వ కళా సంపదను అందించారు.

Posted Date : 12-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు