• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ సాహిత్యం

* దశాబ్దాల తెలంగాణ ప్రస్థానం
* ఎందరో ప్రముఖులు.. ఎన్నో రూపాలు
 

     ఆది నుంచీ తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో.. చైతన్య పరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర. సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా.. ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళా రూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు. నవలలు, కవితలు, పాటలు, నాటికలు, నాటకాలు, బుర్రకథలు, హరికథలు, ఒగ్గుకథలు, వీధి భాగోతాలు.. ఒకటేమిటి అనేక రూపాల్లో చైతన్యాన్ని నింపగలిగారు. దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న తెలంగాణ సాహిత్యపు విశేషాల సమాహారమిది..
 

అభ్యుదయ సాహిత్యానికి 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటం స్వర్ణయుగం. తెలంగాణ ప్రజలతోపాటు ఎన్నో ప్రాంతాల్లోని ఎందరినో ప్రభావితం చేసింది. పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాటస్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి. తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను.. బుర్రకథ, ఒగ్గుకథ, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజా కళారూపాలను సుసంపన్నం చేశారు.

 

పోరాట గీతాలు

సుద్దాల హన్మంతు, తిరునగరి రామాంజనేయులు, దాశరథి, కాళోజీ, సోమసుందర్, సుంకర సత్యనారాయణ తదితరులు ఎన్నో పోరాట గీతాలు రాశారు. సుద్దాల హన్మంతు 'పల్లెటూరి పిల్లగాడా!' పాటతో తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 'వెట్టిచాకిరి విధానమో రైతన్నా.. ఎంత జెప్పినా తీరదో కూలన్నా..' అనే గీతంలో ప్రతిఫలం లేకుండా చేసిన వెట్టిని గుండెలవిసి పోయేలా వివరించారు సుద్దాల. నిజాం నవాబుపై రాసిన గీతాల్లో యాదగిరి రాసి, పాడిన 'నైజాం సర్కరోడా' పాట తెలంగాణ ప్రజల నోళ్లలో ఇప్పటికీ, ఎప్పటికీ నానుతూనే ఉంటుంది.

దాశరథి కృష్ణమాచార్య 'ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ జైలు గోడలపై బొగ్గుతోనే పద్యాలు రాశారు. 'సైసై గోపాలరెడ్డీ! నీవు, నిలిచావు ప్రాణాలొడ్డి..' అంటూ స్మృతి గీతాలు రాశారు తిరునగరి. 'మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లల చంపి మనల బంధించిన..' అంటూ ఉద్యమ సందేశాన్నందిచారు కాళోజీ.

 

ప్రజా కళారూపాలు

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజా కళారూపాలు. తిరునగరి రామాంజనేయులు తన పాటలతోపాటు హరికథలు, బుర్రకథలు అల్లి ప్రజల్లో చైతన్యం నింపారు. సుద్దాల హన్మంతు గొల్లసుద్దులు, పిట్టలదొర వేషం, బుర్రకథ తదితర ప్రక్రియలతో ప్రజలను కదిలించారు. సుంకర-వాసిరెడ్డిల 'మాభూమి' నాటకం చాలా ప్రాచుర్యం పొందింది. సుంకర సత్యనారాయణ 'కష్టజీవి' బుర్రకథను వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చారు. 'ఆంధ్ర మహాసభ కాఫిర్ల సంఘం..' అందులో చేరకూడదు అంటూ ప్రచారం చేసే వారిని దెబ్బతీసేందుకు తిరునగరి 'వీరబందగీ'; పోరాటం తీవ్రమవుతున్న దశలో 'తెలంగాణ వీరయోధులు' బుర్రకథలు రాసి ప్రదర్శించారు. చెర్విరాల బాగయ్య 'షోయబుల్లాఖాన్', చౌడవరపు విశ్వనాథం 'ఆంధ్రమహాసభ' లాంటివి పోరాట కాలంలో ప్రజలను చైతన్య పరిచాయి. ఉద్యమ కాలంలో ప్రజా కళారూపాలకు లభిస్తున్న ఆదరణను సహించలేని నాటి నిజాం ప్రభుత్వం 'కష్టజీవి', 'తెలంగాణ వీరయోధులు' బుర్రకథలను, 'మాభూమి' నాటకాన్ని నిషేధించింది.

'వీర తెలంగాణ' గొల్లసుద్దులను తిరునగరి ప్రదర్శించారు. 'అంబ పలుకు జగదాంబ పలుకు' అంటూ సాగే బుడబుక్కల కథ, నందన.. అంటూ పంతులు కంచు పళ్లెం మీద దరువేస్తూ పాడే చెంచుల కళా రూపం, పిట్టలదొర లాంటి కళారూపాలు అణగారిన వర్గాల్లో చైతన్య జ్వాలలు రగిల్చాయి.

 

పోరాట నవలలు

తెలుగు సాహిత్యం గర్వించదగిన నవలా సాహిత్యాన్ని తెలంగాణ రైతాంగ పోరాటం సృష్టించింది. వీటిలో పోరాటం కొనసాగుతుండగా 1947లో బొల్లిముంత శివరామకృష్ణ రాసిన 'మృత్యుంజయులు', లక్ష్మీకాంత మోహన్ రాసిన 'సింహగర్జన'(1950) వెలువడ్డాయి. పోరాట విరమణ తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన 'ప్రజల మనిషి'(1955), 'గంగు'(1965) నవలలు వెలువడ్డాయి. వీటిలో 'ప్రజల మనిషి' తెలంగాణ గురించి తెలంగాణ వ్యక్తి రాసిన తొలి నవల. ఇది 1934-40 మధ్య తెలంగాణ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఆళ్వారుస్వామి 1946-53 మధ్య దీర్ఘకాలం జైల్లో ఉన్నప్పుడు ఈ నవలను రాశారు. ఇది 1955 జనవరిలో వెలువడింది. 1940-45 మధ్య తెలంగాణ పోరాటాన్ని చిత్రించిన గంగు నవల ఆళ్వారు స్వామి అకాలమరణం(1961)తో అసంపూర్తిగా మిగిలిపోయింది. 1965 జనవరిలో అసంపూర్ణ నవలగానే అది ప్రచురితమైంది. 1947 నాటి తెలంగాణ గురించి మహీధర రామ్మోహన్‌రావు రాసిన 'ఓనమాలు' 1956 మార్చిలో వెలువడింది. ఆయన మరో నవల 'మృత్యువు నీడల్లో' 1962లో వెలువడింది.
 

వట్టికోటకు కొనసాగింపుగా, తనదైన శైలిలో నవలా రచనకు పూనుకున్నారు దాశరథి రంగాచార్య. 1938కి పూర్వపు తెలంగాణ జన జీవితాలను చిత్రిస్తూ.. 'చిల్లర దేవుళ్లు'(1969) రాశారు. 1942-48 మధ్య కాలం నాటి పరిస్థితులతో 'మోదుగు పూలు'(1971), 1948-68 నాటి తెలంగాణ స్థితిగతులతో 'జనపథం'(1976) నవలలు రాశారు. తెలంగాణ పాత్రోచిత భాషతో వచ్చిన చిల్లరదేవుళ్లు నవల ఆనాడు చర్చనీయాంశమైంది. ఈ నవలను కాకతీయ పిక్చర్స్ వారు సినిమాగా తీశారు. అది 1977లో విడుదలైంది. రేడియోలో నాటకంగా ప్రసారం అయ్యింది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువాదమైంది కూడా. 1971లోనే ఈ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆ కాలంలోనే గొల్లపూడి నారాయణరావు 'తెలుగుగడ్డ' నవల తెలంగాణ ప్రజల దయనీయ జీవితాలను కళ్లకు కట్టింది. ఇటీవల కాలంలో వచ్చిన 'సంగం' (తిరునగరి రామాంజనేయులు), 'బందూక్' (కందిమళ్ల ప్రతాపరెడ్డి), 'మలుపు తిరిగిన రథచక్రాలు' (ముదిగంటి సుజాతారెడ్డి), 'కాలరేఖలు' (అంపశయ్య నవీన్) .... తెలంగాణ ఇతివృత్తంతో వచ్చిన నవలలు.

 

పోరాట కథలు

నిజాం ప్రభుత్వం నిర్బంధానికి గురై జైలు జీవితాన్ని గడిపిన వట్టికోట ఆళ్వారుస్వామి 'జైలు లోపల' పేరుతో కథలు రాశారు. పొట్లపల్లి రామారావు 'జైలు' కథలు వెలువరించారు. హైదరాబాద్ సంస్థానం రద్దవుతున్న చివరి రోజుల్లో నవాబుల జీవితాలు, హిందూ ముస్లింల సంబంధాలను వివరిస్తూ నెల్లూరి కేశవస్వామి 'చార్మినార్' కథలు రాశారు. తెలంగాణ పోరాటం తర్వాతి కాలం నాటి జనజీవితాలను చిత్రిస్తూ కాంచినేపల్లి చిన వెంకట రామారావు 'మన ఊళ్లో కూడానా?' కథల సంపుటిని వెలువరించారు.

 

ఆధునిక సాహిత్యం

మానవతావాద కవిత్వం: నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సల్పిన దాశరథి 'తిమిరంతో సమరం;' సమకాలీన ఉద్యమ చైతన్యాన్ని జీర్ణించుకుని మానవతను వినిపించిన డాక్టర్ సి.నారాయణరెడ్డి 'విశ్వగీతి' నుంచి 'విశ్వంభర' వరకు.. 'సమదర్శనం' నుంచి 'మట్టీ మనిషీ ఆకాశం' వరకు సాగిన ఆయన కవితాయాత్ర; ప్రజల గొడవనే 'నా గొడవ'గా భావించిన కాళోజీ; ప్రాచీన, ఆధునిక సాహితీ సంప్రదాయాలకు నిలయమైన బాపురెడ్డి పద్య, గేయ, వచన కావ్యాలు సమత మమతల సంగమంగా కనిపిస్తాయి. 'తంగేడుపూలు' నుంచి 'జలగీతం' వరకు కొనసాగిన డాక్టర్ ఎన్.గోపి కవితా ప్రస్థానంలో మనవతా దృక్పథమే అంతః సూత్రంగా కనిపిస్తుంది.

 

దిగంబర కవిత్వం: తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అభ్యుదయ సాహిత్యం విస్తృతంగా వెలువడింది. తర్వాతి రోజుల్లో స్తబ్దత ఏర్పడింది. దాన్ని తొలిగించి జాతిలో చైతన్యం రేకెత్తించాలన్న ఉద్దేశంతో దిగంబర కవులు కవితా రంగంలో ప్రవేశించారు. 1965-68 మధ్య కాలంలో మూడు కవితా సంపుటాలను వెలువరించారు. వారు కవితలకు 'దిక్‌'లు అని పేరు పెట్టారు. ఆరుగురు దిగంబర కవుల్లో చెరబండరాజు (బద్దం భాస్కర్ రెడ్డి), జ్వాలాముఖి (ఏవీ రాఘవాచార్యులు), నిఖిలేశ్వర్ (యాదవరెడ్డి) తెలంగాణ ప్రాంతీయులు.

 

విప్లవ కవిత్వం: నక్సల్ బరి, శ్రీకాకుళం ఉద్యమ ప్రేరణతో 1970లో విప్లవ రచయిత సంఘం(విరసం) ఆవిర్భవించింది. 1969-70 మధ్య 'తిరగబడు', 'లే', 'మార్చ్', 'ఝంజ', 'విప్లవం వర్థిల్లాలి' లాంటి కవితా సంపుటాలు వెలువడి విప్లవ కవితా దృక్పథానికి విస్తృతిని చేకూర్చాయి. దిగంబర కవుల్లో కొందరు విరసంలో చేరారు. విప్లవ కవిత్వంలో పాటకు చాలా ప్రాముఖ్యం లభించింది. శివసాగర్ రాసిన నరుడో భాస్కరుడా!, చెల్లీ చెంద్రమ్మా!.. గూడ అంజయ్య రాసిన 'ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా!' లాంటి పాటలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాయి. గద్దర్, వంగపండు ప్రసాదరావు లాంటివారి పాటలు విస్తృత ప్రాచుర్యం పొందాయి.

 

మినీ కవిత్వం: వచన కవితలోని అస్పష్టత, సుదీర్ఘతలను పరిహరించే ఉద్దేశంతో ఆధునిక కాలంలో మినీ కవిత ఆవిర్భవించింది. సంక్షిప్తత, కొసమెరుపు మినీ కవితకు ప్రాణం. అలిశెట్టి ప్రభాకర్ కార్టూన్ కవితలు, దేవిప్రియ లాంటి వారి రాజకీయ వ్యాఖ్యాన కవితలు వర్తమాన పరిస్థితులకు అద్దం పడతాయి. మినీ కవితకు విశేషమైన ప్రాచుర్యం కల్పించినవారు అలిశెట్టి ప్రభాకర్. 'ఎర్ర పావురాలు', 'మంటల జెండాలు', 'చురకలు', 'సంక్షోభగీతం', 'రక్తలేఖ', 'సిటీలైఫ్' లాంటి మినీ కవితా సంకలనాలు వెలువరించారు. హైకులు, నానీలు కూడా మినీకవిత రూపాలే. హైకూ రూపంలో పెన్నా శివరామకృష్ణ కవితా సంపుటాలు వెలువరించారు. డాక్టర్ ఎన్.గోపి ప్రారంభించిన 'నానీ'లు జీవితానుభూతులను చిత్రిస్తాయి.

 

స్త్రీవాద కవిత్వం: 1981లో ప్రచురితమైన రేవతీదేవి 34 కవితల 'శిలాలోలిత' స్త్రీవాద సంపుటాలకు నాంది పలికింది. స్త్రీల సమస్యలను స్త్రీలే శక్తిమంతంగా ప్రదర్శించగలరన్నది స్త్రీవాదుల అభిప్రాయం. 1990లో త్రిపురనేని 'గురిచూసి పాడేపాట పేరుతో స్త్రీవాద కవితల సంకలనాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి స్త్రీవాద కవిత్వం విస్తృతంగా వెలువడుతోంది. 1993లో ****అస్మతవారు 'నీలి మేఘాలు' పేరుతో కవితలు సేకరించి ప్రచురించారు. షాజహానా, అనిశెట్టి రజిత, 'శిలాలోలిత' (పి. లక్ష్మి), జాజుల గౌరి, జూపాక సుభద్ర తదితరులు తెలంగాణ స్త్రీవాద కవయిత్రులు.

 

దళితవాద కవిత్వం: 90వ దశకంలో వినిపించిన బలమైన గొంతుక దళితవాదం. జయధీర్ తిరుమలరావు సంపాదకత్వంలో 1993లో 'దళిత గీతాలు', త్రిపురనేని శ్రీనివాస్, జి. లక్ష్మినరసయ్య సంపాదకత్వంలో 1995లో 'చిక్కనవుతున్న పాట', 'పదునెక్కిన పాట' సంకలనాలు వెలువడ్డాయి. దళిత ఐక్యవేదిక తరపున బీఎస్ రాములు 'ప్రవహించే పాట - ఆంధ్రప్రదేశ్ దళిత గీతాలు' ప్రచురించారు. 'బహువచనం', 'దండోరా', 'మేమే', 'నిశాని', 'గుండెడప్పు', 'మూలవాసుల పాటలు'.. లాంటి సంకలనాలు ప్రాచుర్యం పొందాయి. జూలూరి గౌరీశంకర్, బన్న ఐలయ్య, కలేకూరి ప్రసాద్ తదితరులు ప్రత్యేక కావ్యాలు వెలువరించారు.

 

మైనార్టీ కవిత్వం: ఇతర వెనకబడిన వర్గాలవారి మాదిరిగానే ముస్లింలు కూడా అన్యాయాలకు గురవుతన్నారన్న అభిప్రాయంతో మైనార్టీవాదం, ముస్లింవాదం వెలుగులోకి వచ్చాయి. నల్గొండ ప్రాంతం నుంచి వెలువడిన 'బహువచనం', 'మేమే సంకలనాలు', 'బీసీ కవుల ప్రత్యేక సంచిక' లాంటివి బహుజన కవిత్వానికి ప్రాతినిధ్యం వహించాయి. వర్గీకరణ పేరుతో దళిత వాదులు రెండు వర్గాలుగా చీలిపోవడం మంచి పరిణామం కాదంటూ మాస్టార్జీ లాంటివారు హెచ్చరిస్తూ పాటలు రాశారు. ముస్లింలలో నెలకొన్న దారిద్య్రం, అభద్రతా భావం, ఛాందసత్వం వస్తువులుగా చేసుకుని యాకుబ్, స్కైబాబా, దిలావర్, అఫ్సర్, ఖదీర్, ఖాజా, షాజహానా లాంటివారు కవితలు రాశారు. మైనార్టీవాద కవిత్వానికి మచ్చుతునక 'జల్ జలా' కవితా సంపుటి.

 

అస్తిత్వ పోరాట కవిత్వం: తెలంగాణ దుర్భర పరిస్థితులకు అద్దం పడుతూ ప్రాంతీయ స్పృహతో కూడిన కవిత్వాన్ని తెలంగాణ కవులు వెలువరించారు. 'పొక్కిలి' (జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో) 'మత్తడి' (సుంకిరెడ్డి సురేంద్రరాజు), 'కరువు' (మల్లేశం లక్ష్మయ్య) 'పరిచయిక'(సిరిసిల్ల సాహితీ సమితి) లాంటి కవితా సంకలనాలు ప్రాంతీయ అస్తిత్వ ధోరణిలో వెలువడ్డాయి. కాశీం 'పొలమారిన పాలమూరు', వడ్డేబోయిన శ్రీనివాస్ 'పడావు' లాంటి దీర్ఘ కవితలు తెలంగాణ వాస్తవికతను చిత్రించాయి.

Posted Date : 12-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు