• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో మత వైవిధ్యం

     భారత దక్షిణాపథాన.. ప్రధానంగా తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన నాటి రాజుల కాలంలో వివిధ మతాలు ప్రాచుర్యం పొందాయి. ఒక్కో వంశీకుల కాలంలో ఒక్కో మతానికి విశేష స్థానం దక్కింది. శాతవాహనుల కాలం నుంచి కుతుబ్‌షాహీల వరకు వివిధ మతాలను ఆదరించినా.. మత సహనానికి పెద్దపీట వేయడం విశేషం. ఈ క్రమంలో అనేక ప్రఖ్యాత దేవాలయాలు.. వాటికి అనుసంధానంగా చెరువులు, ఇతర కట్టడాలు వంటివి నిర్మించిన పాలకులెందరో చరిత్రలో నిలిచిపోయారు. ఆనాటి మత పరిస్థితులు.. కాలక్రమేణా పరిణామాలు.. తదితర అంశాలపై అధ్యయన సమాచారం పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేకం..
 

    క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఉత్తర భారతాన రాజకీయ రంగంలో బౌద్ధ, జైన మతాలు సరికొత్త సంచలనాన్ని సృష్టించాయి. క్రమేపీ శాతవాహనుల కాలం నాటికి దక్షిణాన స్థిరపడ్డాయి. ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల కాలంలో విశేషంగా వ్యాప్తి చెందిన ఈ మతాలు కాకతీయుల కాలం నాటికి కనుమరుగయ్యాయి. శైవ, వైష్ణవ మతాలు బాగా విస్తృతం కావడంతో మహా విష్ణువు దశావతారాల్లో బుద్ధుడు కూడా ఒక అవతారమని భావించేవారు. అలాగే కుతుబ్‌షాహీల కాలంలో తెలంగాణ ప్రాంతం మతపరంగా ఒక కొత్త మిశ్రమ సంస్కృతిని ఏర్పరుచుకుంది.

 

శాతవాహనుల కాలం

శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితుల్లో ఒక విశిష్టత కనిపిస్తుంది. చక్రవర్తులు వైదిక మతాన్ని అనుసరించి ఈ మతోద్ధరణకు కృషి చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణికి ఉన్న 'ఏక బ్రాహ్మణ', 'ఆగమ నిలయ' లాంటి బిరుదులను బట్టి అతడు వర్ణాశ్రమ ధర్మాన్ని పరిరక్షించినట్లు తెలుస్తోంది. గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ఆధారంగా గౌతమీపుత్ర శాతకర్ణి వర్ణసాంకర్యాన్ని నిరోధించాడని చెప్పవచ్చు. శాతవాహన రాజులు యజ్ఞ యాగాది వైదిక క్రతువులు, అశ్వమేధ, రాజసూయ యాగాలు నిర్వహించారు. ఇంద్రుడు, వాసుదేవుడు, వరుణుడు తదితర హిందూ దేవతలను ఆరాధించారు. అయితే వీరి కాలంలో ఎక్కడా హిందూ దేవాలయాలున్న దాఖలాలు లేవు. పాలకులు మతం విషయంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ప్రభువులు వైదిక మతాన్ని అనుసరించగా రాణులు, అంతఃపుర స్త్రీలు, సామాన్య ప్రజలు బౌద్ధ మతాన్ని ఆరాధించారు. ఇందుకు నిదర్శనం తెలంగాణ ప్రాంతంలో విశేషంగా కనిపించే బౌద్ధ కట్టడ నిర్మాణాలే. అద్భుతమైన శిల్పకళతో బౌద్ధుల చైత్యాలు (ప్రార్థనా మందిరాలు), విహారాలు (విశ్రాంతి మందిరాలు), స్తూపాలు (సమాధులు - స్మారక మందిరాలు) లాంటివి నిర్మించారు. నల్గొండ జిల్లా కొండాపూర్, ఫణిగరి, నాగార్జున కొండల్లోనూ.. కరీంనగర్ జిల్లా పెద్ద బంకూర్, ధూళికట్ట తదితర ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలున్నాయి.
బాణుడి 'హర్షచరిత్ర' ప్రకారం మలి శాతవాహన చక్రవర్తుల్లో సుప్రసిద్ధుడైన యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధ మతాన్ని ఆచరించాడు. ఆచార్య నాగార్జునుడిని గురువుగా ఆరాధించి, అతడి సంస్మరణార్థం శ్రీ పర్వతం వద్ద ఒక చైత్యాన్ని నిర్మించాడు. ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమిత గ్రంథాన్ని మహాయాన బౌద్ధ మతానికి కరదీపికగా భావించేవారు. ఆచార్య నాగార్జునుడు 'సుహృల్లేఖ'ను రచించి యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితమిచ్చాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడి ఆధ్వర్యంలో తెలుగునేలపై మహాయాన బౌద్ధమతం విశేష ప్రాభవం పొందింది. తొలి శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడు మొదట జైన మతాభిమాని అని కరీంగనర్ జిల్లా మునులగుట్ట వద్ద లభించిన పురావస్తు ఆధారాల (నాణేలు) ద్వారా తెలుస్తోంది.

 

ఇక్ష్వాకుల కాలం

ఇక్ష్వాకుల వంశ పాలకుడు వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు కూడా అశ్వమేధ, రాజసూయాది యాగాల్ని నిర్వహించి వైదిక మతాన్ని అనుసరించినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా ఆదరించాడు. వీర పురుషదత్తుడు తొలుత వైదిక మతాన్నే అనుసరించినప్పటికీ తర్వాత బౌద్ధమతాన్ని ప్రోత్సహించడానికి బౌద్ధ విహారాలకు, మహా చైత్యాలకు భూరి విరాళాలిచ్చాడు.. దానధర్మాలు చేశాడు. నాగార్జున కొండలో లభ్యమైన శాసనాధారాల్ని బట్టి రాజ కుటుంబాలకు చెందిన మహిళలు కూడా బౌద్ధ మహామఠాలకు (విజయపురి) దానాలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్ష్వాకుల కాలంలో విజయపురి ప్రపంచంలోనే అతిపెద్ద మహాయాన బౌద్ధక్షేత్రంగా పేరు పొందింది. అయితే ఎహూవుల చాంతమూలుడు మాత్రం వైదిక మతాన్నే అనుసరించాడు. హిందూ-వైదిక పురాణ దేవతలకు గుళ్లు కట్టించాడు. బౌద్ధమతాన్ని కూడా ప్రోత్సహించాడు. వీరగళ్(అంటే రాజు కోసం జీవించి, మరణించే అంగరక్షకులు)ల జ్ఞాపకార్థం విగ్రహాలు ప్రతిష్ఠించే సంప్రదాయం ఇక్ష్వాకుల నుంచే ప్రారంభమైంది.

 

విష్ణు కుండినుల కాలం

విష్ణు కుండినుల పాలకుడైన గోవిందవర్మ మొదట బౌద్ధమతాన్ని అనుసరించినప్పటికీ తర్వాత శైవమతాన్ని అవలంబించాడు. బౌద్ధ బిక్షువులకు, బ్రాహ్మణులకు, పేదలకు విశేషంగా దానధర్మాలు చేశాడు. అతడి భార్య, కుమార్తె (ప్రిత్వీముల) ఇంద్రపురిలోని బౌద్ధ సంఘానికి విహారాన్ని నిర్మించి ఇచ్చినట్లు తెలుస్తోంది. జయాశ్రయుడనే బిరుదున్న రెండో మాధవ వర్మ 11 అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగం లాంటి ఎన్నో అగ్ని స్తోమ యాగాలు చేశాడు. హిరణ్యగర్భ, పౌండరీక యాగాలు కూడా చేశాడు. రెండో విక్రమేంద్రవర్మ శైవ మతస్థుడైనప్పటికీ ఇంద్రపురిలో ఉన్న బౌద్ధ విహారానికి తన వంతు ప్రోత్సాహాన్ని అందించాడు. విష్ణుకుండినుల్లో చివరివాడైన నాలుగో మాధవవర్మ తన రాజ్య, వంశ కీర్తి ప్రతిష్ఠలను ద్విగుణీకృతం చేయాలన్న సంకల్పంతో హిందూ మతాలను ఆచరించాడు. అశ్వమేధం లాంటి వైదిక యజ్ఞ యాగాదులను నిర్వహించాడు. దక్షిణాదిన దేవాలయాలను నిర్మించడమనే సంప్రదాయం వీరి కాలంలోనే మొదలైంది. విజయపురిలో యాగశాల, ప్రముఖ దేవతలైన పుష్పభద్ర(శివ), మహాసేన, అష్టభుజ(విష్ణువు), హారితి(శక్తి) దేవాలయాలను నిర్మించారు. విజయపురిలోని శ్రీపర్వతలోయ బౌద్ధ మతానికి ఏవిధంగా కేంద్ర బిందువైందో.. అదేరీతిలో విజయపురి సమీపంలోని మంచికల్లు శివ, విష్ణు, శక్తి క్షేత్రంగా ప్రఖ్యాతి చెందింది. ఇంతటి ప్రాభవం ఉన్న బౌద్ధమతం క్రీ.శ. 7వ శతాబ్దం నాటికి క్రమేపీ క్షీణించసాగింది. పౌరాణిక హిందూ మతంలో బుద్ధుడిని అంతర్లీనంగా భావించి ఆరాధించేవారు.

 

శైవ మతానికి ప్రాచుర్యం

శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినుల కాలంలో వర్ధిల్లిన బౌద్ధ, జైన మతాల ప్రాబల్యానికి దీటుగా చాళుక్య పాలకులు శైవ మతానికి ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం చేశారు. చాళుక్య వంశంలోని పాలకులు అనేక యజ్ఞ, యాగాది క్రతువులను క్రమం తప్పకుండా వివిధ సందర్భాల్లో నిర్వహించేవారు. తెలంగాణలో ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, పోలవాస నాయకుల కాలంలో శైవమతానికి విశేష ఆదరణ, ప్రోత్సాహం లభించాయి. వీరి కాలంలో శ్రీశైల క్షేత్రం బహుళ ప్రాచుర్యం పొందింది. శ్రీశైల క్షేత్రానికి.. ప్రముఖ శైవ క్షేత్రాలైన త్రిపురాంతకం - తూర్పు, ఆలంపూర్ - పడమర, సిద్ధవటం - దక్షిణ, ఉమామహేశ్వరం - ఉత్తర ద్వారాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలంపూర్‌లోని శిల్పాల్లో బుద్ధుడు యోగముద్రలో ఉన్నట్లుగా చిత్రించి ఉంటుంది. విష్ణువు మిగతా అవతారాలు ఆ బుద్ధుడి చుట్టూ ఉన్నట్లుగా చెక్కారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వీరి కాలంలో ప్రధాన శైవక్షేత్రంగా వెలిసింది. ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల కాలంలో విశేష ఆదరణ పొందిన బౌద్ధ మతానికి వీరి కాలంలో క్రమంగా ఆదరణ తగ్గింది. అయితే జైన మతానికి మాత్రం ఆదరణ, ప్రోత్సాహం తగ్గలేదు. వేములవాడ చాళుక్యరాజు రెండో అరికేసరి కాలంలో 'త్రిభువన తిలక' అనే జైన బసతిని నిర్మించారు. ప్రముఖ కన్నడ కవి.. పంపకవి సోదరుడైన జిన వల్లభుడు చక్రేశ్వరితో కూడిన 24 మంది జైన తీర్థంకరుల విగ్రహాలను ప్రతిష్ఠించాడు. ఈ కాలానికి చెందిన బద్దెగ రాజు శుభధామ జినాలయాన్ని నిర్మించి ప్రఖ్యాత జైన కవి అయిన సోమదేవున్ని గురువుగా నియమించాడు. వీరి కాలంలోనే పటాన్‌చెరువు, బోధన్, ఉజ్జలి, కొలనుపాక, పెద కోడుమూరు, తొగరకుంట ప్రముఖ జైన క్షేత్రాలుగా వెలుగొందాయి. ఇవన్నీ పాలకుల భూరి విరాళాలు, దానధర్మాలతో పాటు, ప్రజల ఆదరణ వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాలుగా విలసిల్లాయి.

 

వైష్ణవ మత ప్రాచుర్యం

క్రీ.శ. 10వ శతాబ్ది నాటికి తెలంగాణలో ప్రధాన పరిణామాలు.. శైవ మతానికి ప్రాబల్యం పెరగడం.. శైవ, జైన మతాల్లో అంతఃకలహాలు చెలరేగడం.. క్రమంగా ఇది పౌరాణిక శైవమతానికి దారులు వేసింది. ఇదే కాలంలో తెలంగాణ ప్రాంతంలో శైవమతంతో పాటు వైష్ణవ మతం కూడా ప్రాచుర్యాన్ని పొందింది. బూరుగుగడ్డ, మక్తల్, లింగగిరి ప్రాంతాలు ప్రముఖ వైష్ణవ మత ప్రాంతాలుగా పేరుపొందాయి. విష్ణుకుండినుల పాలకుడైన మాధవవర్మ శ్రీ పర్వతస్వామిని ఆరాధిస్తూ తనను ఆ స్వామితో సరిసమానంగా ఊహించుకున్నాడు. వైష్ణవ మతారాధకుల్లో సామాన్యంగా కనిపించే లక్షణం భక్తుడు-భగవంతుడూ వేరు కాదనే భావన. వైష్ణవుల్లో భగవంతుడు అవతార పురుషుడనేది గట్టి విశ్వాసం. బుద్ధుడు కూడా ఆ అవతార పరంపరలో విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకడనే భావన ఏర్పడింది. వైదిక బ్రాహ్మణ మతానికి బదులుగా పౌరాణిక మతం వచ్చి, దేవాలయాల్లోని పూజా విధానానికి నాంది పలికింది. భక్తి భావం పెరిగి, పూజాది ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేవారు. ఫలితంగా క్రీ.శ. 10వ శతాబ్దం నుంచే దేవాలయాల నిర్మాణాలు ఎక్కువయ్యాయి.

 

కాకతీయుల కాలం

కాకతీయుల కాలంలో జరిగిన ప్రధాన మత పరిణామం జైన, బౌద్ధ మతాలు క్షీణించడం. విష్ణుమూర్తి దశావతారాల్లో బుద్ధుడిని తొమ్మిదో అవతారంగా భావించడం.. బౌద్ధం పౌరాణిక హిందూ మతంలో విలీనం కావడం కనిపిస్తాయి. క్రీ.శ. 12వ శతాబ్దం వరకు.. అంటే తొలి కాకతీయుల కాలం దాకా పాలకులు జైన మతాన్ని అవలంబించారు. మలి కాకతీయులైన రెండో ప్రోలరాజు నుంచి తెలంగాణలో శైవ మత ప్రాచుర్యం ప్రారంభమైంది. ఈ కాలంలోనే జైన-శైవ మతాల మధ్య సంఘర్షణలు మొదలయ్యాయి. కర్ణాటకలో ప్రారంభమైన వీరశైవ మత ఉద్యమం ప్రభావంతో పాల్కురికి సోమనాథుడు తెలుగుదేశంలో వీరశైవ మత ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. తన రచనల ద్వారా వీరశైవానికి ప్రాభవం తెచ్చాడు. విశేషమేమంటే వీరశైవ మతానికి ప్రాచుర్యం కల్పించిన సోమనాథుడు జన్మించిన పాలకుర్తి.. పరమ భాగవతుడైన పోతన జన్మస్థలం బమ్మెర.. రెండూ ఇరుగు పొరుగు గ్రామాలు. వీరశైవ మత గ్రంథాలను ఆగమాలని, గురువులను జంగములని అంటారు. వీరశైవ ఉద్యమ ప్రభంజనంలో తెలంగాణలోని పటాన్‌చెరువు ప్రాంతంలోని జైన వసతులు విధ్వంసానికి గురైనట్లు పాల్కురికి సోమన తన 'పండితారాధ్య చర్రిత'లో ప్రస్తావించాడు. తెలంగాణలో వర్ధమానపురం, హన్మకొండ, వరంగల్, పటాన్‌చెరువు, పూడూరు, ఆలంపూర్, కొలనుపాక, వేములవాడ, పొట్లపల్లి ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న జైన తీర్థంకరుల శిలా విగ్రహాలే ఇందుకు నిదర్శనం. హన్మకొండలోని నేటి పద్మాక్షమ్మ గుట్ట తొలుత జైన క్షేత్రమే. క్రమేపీ తెలంగాణలోని అనేక జైన మతాలయాలను శైవాలయాలుగా మార్చడంతో జైనమతం కనుమరుగైంది. శైవ మతం విస్తృతమైంది. శైవమతంలో కాలాముఖ, కాపాలిక, పాశుపత, వీరశైవం, ఆరాధ్యశైవం లాంటి శాఖలు ఉద్భవించాయి. కాకతీయ పాలకులు-కాలాముఖ, పాశుపత శైవాన్ని ఆచరించి, శైవాచార్యులకు భూదానాలు చేశారు. రెండో బేతరాజు హన్మకొండలో శివపురాన్ని నిర్మించి కాలాముఖ శైవాచార్యుడైన రామేశ్వర పండితుడికి మాన్యంగా ఇచ్చాడు. కాకతీయ మహాదేవుని శివ గురువు ధ్రువేశ్వర పండితుడు. ఆ కాలం నాటి శివాచార్యుల్లో విశ్వేశ్వర శివాచార్యులు సుప్రసిద్ధులు. గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రునికి కూడా విశ్వేశ్వర శివగురువే శివదీక్షను ఇచ్చాడు. రుద్రమదేవి తమ గురువైన విశ్వేశ్వర శివాచార్యుడికి.. గోళకీ మఠాన్ని నెలకొల్పేందుకు వీలుగా వెలగపూడితో పాటు మందడ గ్రామాన్ని దానం చేసినట్లు మల్కాపురం శాసనం ద్వారా తెలుస్తోంది. శ్రీపతి, మల్లికార్జున, మంచన పండితులు కలిసి ఆరాధ్య శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. పండిత త్రయంగా ప్రసిద్ధి చెందిన వీరు ఆ సంప్రదాయానికి ప్రాచుర్యం కల్పించారు.

 

ఆర్థిక వనరులుగా దేవాలయాలు

కాకతీయులు దేవాలయాల నిర్మాణాన్ని పుణ్యకార్యంగా భావించి అనేక ఆలయాలను నిర్మించారు. దేవాలయాల్లోనే శాసనాలు వేయించారు. వాటికి దగ్గర్లోనే చెరువులను నిర్మించే సంప్రదాయానికి కూడా వీరే శ్రీకారం చుట్టారు. ఈ చెరువుల నుంచి వ్యవసాయానికి సాగునీరు అందించడం ద్వారా దేవాలయాలకు ఆర్థిక పురిపుష్టిని కల్పించేవారు. దీన్నిబట్టి ఆ కాలం నాటి దేవాలయాలు కేవలం సాంఘిక, సాంస్కృతిక కేంద్రాలుగానే కాకుండా ఆర్థిక వనరులుగా కొనసాగినట్లుగా తెలుస్తోంది. వివిధ వృత్తి పనులు చేసుకునేవారు, కళాకారులు ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దేవాలయాల మీద ఆధారపడేవారు. కాకతీయుల కాలం నాటి ప్రధాన, ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో హన్మకొండ వేయి స్తంభాల గుడి, పాలంపేట రామప్పగుడి, వరంగల్ భద్రకాళి ఆలయం.. నాగులపాడు, పిల్లలమర్రి, ఐనవోలు ఆలయాలున్నాయి. దుర్గాష్టమి, దసరా, దీపావళి, సంక్రాంతి, మహా శివరాత్రి, ఉగాది, ఏరువాక లాంటివి ఆనాటి హిందువుల ముఖ్యమైన పండగలు. కాకతీయుల కాలంలో మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేవారు. ఏటా కొత్తగా వ్యవసాయం, సేద్యపు పనులు ప్రారంభించడానికి ముందు 'ఏరువాక' పండగ నిర్వహించేవారు. ఎల్లమ్మ, కాకతమ్మ, ఏకవీర, పోలేరమ్మ, మారమ్మ, మల్లారమ్మ గ్రామదేవతలతో పాటు దుర్గ, పార్వతి, శివుడు, విష్ణువు అవతారాలను పూజించేవారు. వీరి కాలంలోనే బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్న కేశవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. అప్పట్లో మధ్వాచార్యుల అనుచరులను మధ్వులు అని పిలిచేవారు. తెలంగాణలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదగిరి గుట్ట. కాకతీయల కాలంలో శైవం - వైష్ణవం మధ్య సమన్వయం సాధించడానికి తిక్కన హరిహరనాథ తత్వాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. ఈ విధంగా పౌరాణిక హిందూ మతం సర్వమత సమభావనను ప్రతిపాదించింది. కుల దేవతలు, గ్రామ దేవతలు, వీరుల ఆరాధన కూడా కాకతీయుల కాలంలో కొనసాగింది. ఓరుగల్లులో ఈ గ్రామ దేవతల పూజలు, పల్నాటి వీరుల పూజలు జరిగినట్లు 'క్రీడాభిరామం' ద్వారా తెలుస్తోంది. 

 

పద్మనాయకుల కాలం

కాకతీయుల అనంతరం రేచర్ల పద్మనాయకులు వైష్ణవ మతాన్ని అనుసరించారు. సర్వజ్ఞ సింగభూపాలుడు గొప్ప వైష్ణవ మతాభిమాని. మాదానాయకుడు కూడా రామానుజాచార్యుల కుమారుడైన వెంకటాచార్యుడి శిష్యుడై వైష్ణవ మతాన్ని అవలంబించాడు. పాలకులు వైష్ణవ మతాన్ని ఆచరించగా సామాన్య ప్రజలు తీవ్రవాద శైవంపై ఆదరాభిమానాలు చూపించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వీరి కాలంలోనే 'రణము కుడుపు' అనే ఆచారం ప్రారంభమైంది. 'రణము కుడుపు' అంటే మృతుల రక్త మాంసాలతో బియ్యం కలిపి వండిన ఆహారాన్ని రణ దేవతలకు, భూత ప్రేతాలకు నివేదన చేయడం. శైవ-వైష్ణవాల మధ్య పోటాపోటీ ఉన్నప్పటికీ ప్రజలు సామరస్య పూర్వకంగా మెలిగి మత సహనాన్ని పాటించారు.

 

కుతుబ్‌షాహీల కాలం

కుతుబ్‌షాహీ పాలకులు పరమత సహనం పాటించి రాజ్యాన్ని పరిపాలించారు. నాటి పాలకులు ముస్లింలు కాగా రాజ్యంలోని అత్యధిక శాతం ప్రజలు హిందువులు. గోల్కొండ పాలకులు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. కుల, మత భేదం లేకుండా మ్తొతం 14 పండగలను జాతీయ పర్వదినాలుగా ప్రకటించారు. మహమ్మద్ కులీ కుతుబ్‌షా 'వసంతోత్సవాల'ను ప్రారంభించాడు. గోల్కొండ బోనాల పండగ నాటి నుంచే నిర్వహించేవారు. నేటికీ తెలంగాణలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలు మొదట గోల్కొడ కోట నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. హిందూ ముస్లింల సామరస్యానికి ప్రతీక పీర్ల పండగ. హిందూ ముస్లింల సఖ్యత, హిందువులను ఉద్యోగాల్లో నియమించడం వంటి పరిణామాలు మొగలులు గోల్కొండపై దండెత్తడానికి దారితీశాయి. హిందూ ముస్లింల సఖ్యత, సామరస్యం కుతుబ్‌షాహీల కాలంలో అత్యున్నత స్థితికి చేరుకుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను రూపుమాపి, కాలజ్ఞాన తత్వాల ద్వారా మత సామరస్యానికి కృషి చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ కాలానికే చెందివాడు కావడం విశేషం. గోల్కొండ ప్రభువులు క్రైస్తవుల కోసం మచిలీపట్నంలో చర్చిని కూడా నిర్మించి తమ ఔన్నత్వాన్ని నిరూపించుకున్నారు.

Posted Date : 12-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు