• facebook
  • whatsapp
  • telegram

అయస్కాంతత్వం

ఆకర్షించే అదృశ్య శక్తి!

  ఇంట్లో ఫ్రిజ్‌ తలుపులు కొద్దిగా తెరిచి వదిలేస్తే, కాసేపటికి వాటంతట అవే మూసుకుంటాయి.  క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల వెనుక నల్లటి చారల్లో వినియోగదారుడి సమాచారమంతా నిక్షిప్తమై ఉంటుంది. అవన్నీ అదృశ్య అయస్కాంతత్వం ప్రభావాలే. నిత్య జీవితంలో అడుగడుగునా ఉపయోగించే కప్‌ బోర్డులు, కంప్యూటర్లు, కంపాస్‌లు, టీవీలు, రేడియోలు, స్పీకర్లు మొదలు పిల్లల ఆటవస్తువుల వరకు అన్నింటిలోనూ  అయస్కాంతం ఉంటుంది. అందుకే జనరల్‌ సైన్స్‌ అధ్యయనంలో భాగంగా ఆ ఆకర్షణశక్తి నిర్వచనాలను, అస్కాంత పదార్థాల్లోని రకాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం తెలుసుకోవాలి. 

 

  క్రీ.పూ.120 లోనే మాగ్నటైట్‌ (Fe3O4)  అనే లోహ ఖనిజం. ఇనుము కోబాల్ట్, నికెల్‌ లాంటి ముక్కలను ఆకర్షిస్తుందని కనుక్కున్నారు. అందువల్ల ఈ ఖనిజానికి అయస్కాంతమనే పేరు వచ్చింది. అది ప్రదర్శించే ధర్మాలను అయస్కాంతత్వం పేరుతో అధ్యయనం చేస్తారు. ఆధునిక సిద్ధాంతం ప్రకారం పదార్థ అయస్కాంతత్వానికి కారణం పరమాణు కేంద్రకం చుట్టూ పరిభ్రమించే ఎలక్ట్రాన్‌లు అని రుజువైంది. 

 

అయస్కాంత పొడవు: అయస్కాంతంలో రెండు ధ్రువాల మధ్య దూరాన్ని అయస్కాంత పొడవు అంటారు. దీన్ని 2l తో సూచిస్తారు.

 

అయస్కాంత జ్యామితీయ పొడవు: అయస్కాంతం చివరల మధ్య దూరాన్ని అయస్కాంత జ్యామితీయ పొడవు అంటారు. దీన్ని L సూచిస్తారు.

 

ధ్రువసత్వం: ఒక అయస్కాంత ధ్రువం మరో అయస్కాంత ధ్రువాన్ని ఎంత బలంగా ఆకర్షిస్తుందో లేదా వికర్షిస్తుందో ఆ సత్వాన్నే ధ్రువసత్వం అంటారు. దీన్నిm తో సూచిస్తారు.

ధ్రువసత్వానికి SI ప్రమాణాలు ఆంపియర్‌-మీటర్‌ (A-m) , CGS ప్రమాణాలు బయెట్‌-సెం.మీ.

 

అయస్కాంత భ్రామకం: అయస్కాంత పొడవుకు, ధ్రువసత్వానికి మధ్య లబ్ధాన్నే అయస్కాంత భ్రామకం అంటారు. దీన్ని M తో సూచిస్తారు.

దీనికి SI ప్రమాణాలు ఆంపియర్‌-మీటర్‌2, CGS ప్రమాణాలు బయెట్‌-సెం.మీ.2

 

అయస్కాంత క్షేత్రం: అయస్కాంతాన్ని ఒక చోట ఉంచినప్పుడు దాని చుట్టూ ఉన్న ప్రదేశం పరివర్తన చెంది అది ఒక శక్తి స్థావరంగా రూపొందుతుంది. ఆ ప్రదేశాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు.

 

అయస్కాంత బలరేఖ (Magnetic line of force): అయస్కాంత క్షేత్రంలో ఏకాంక ఉత్తర ధ్రువం చలించే మార్గాన్ని అనుసరిస్తూ గీసిన ఊహాత్మక రేఖనే బలరేఖ లేదా క్షేత్రరేఖ అంటారు.

 

అయస్కాంత బలరేఖల ధర్మాలు: * ఈ రేఖలు ఎల్లప్పుడూ సంవృతాలు. ఇవి అయస్కాంతం బయట ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, అయస్కాంతం లోపల దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వైపుగా ప్రయాణిస్తాయి. ఇవి పరస్పరం ఖండించుకోవు.

 

* ఏదైనా అయస్కాంత బలరేఖకు ఒక బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశ అ బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తుంది.

 

* బలరేఖలు దగ్గరగా ఉంటే బలమైన అయస్కాంత క్షేత్రమని, దూరంగా ఉంటే బలహీన అయస్కాంత క్షేత్రమని అంటారు.

 

* అయస్కాంత బలరేఖలు ఒకేదిశలో, వరుస రేఖల మధ్యదూరం సమానంగా ఉన్నట్లయితే ఆ అయస్కాంత క్షేత్రాన్ని సమరీతి అయస్కాంత క్షేత్రం అంటారు. ఆ విధంగా లేకపోతే అసమరీతి అయస్కాంత క్షేత్రమని వ్యవహరిస్తారు.

 

అయస్కాంత ప్రవేశ్యశీలత  :  ఏదైనా ఒక పదార్థం తన ద్వారా అయస్కాంత బలరేఖలను ప్రవేశింపజేసుకునే తత్వాన్ని ప్రవేశ్యశీలత అంటారు. దీన్ని పరమ ప్రవేశ్యశీలత అని కూడా పిలుస్తారు.

శూన్యం/గాలి యానకం ప్రవేశ్యశీలత హెన్రీ/మీటర్‌

 

సాపేక్ష ప్రవేశ్యశీలత: యానకం ప్రవేశ్యశీలతకు శూన్య యానకం ప్రవేశ్యశీలతకు మధ్య ఉండే నిష్పత్తినే ఆ యానక సాపేక్ష ప్రవేశ్యశీలత అంటారు. దీన్ని తో సూచిస్తారు.

దీనికి ప్రమాణాలు ఉండవు.


అయస్కాంత అభివాహం: అయస్కాంత క్షేత్రంలో ఏదైనా వైశాల్యం ద్వారా ప్రయాణించే బలరేఖల సంఖ్యనే అయస్కాంత అభివాహం అంటారు. దీన్ని తో సూచిస్తారు.దీనికి SI ప్రమాణాలు వెబర్, CGS ప్రమాణాలు మాక్స్‌వెల్‌. ఒక వెబర్‌ = 108 మాక్స్‌వెల్స్‌

 

అయస్కాంత క్షేత్ర తీవ్రత/ అయస్కాంత ప్రేరణ/ అయస్కాంత అభివాహ సాంద్రత (B):  ప్రమాణ ఉత్తర ధ్రువంపై పనిచేసే బలాన్నే అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటారు లేదా ప్రమాణ వైశాల్యానికి ఉన్న అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత లేదా అయస్కాంత ప్రేరణ అంటారు. దీన్ని B తో సూచిస్తారు.

ప్రమాణాలు SI/MKS: న్యూటన్‌/ఆంపియర్‌-మీటర్‌

లేదా వెబర్‌/మీటర్‌2/టెస్లా

CGS డైన్‌/బయోట్‌-సెం.మీ. లేదా మాక్స్‌వెల్‌/సెం.మీ.2/ గాస్‌

1 టెస్లా = 104 గాస్‌

రిలక్టివిటి (Rm): అయస్కాంత ప్రవేశ్య శీలత విలోమాన్ని రిలక్టివిటి అంటారు.

ప్రమాణాలు: మీటర్‌/హెన్రీ

 

అయస్కాంత పదార్థాల రకాలు

అయస్కాంత ధర్మం ఆధారంగా పదార్థాలను రెండు రకాలుగా విభజించారు. 

 

అనయస్కాంత పదార్థాలు: బాహ్యా అయస్కాంత క్షేత్రం వల్ల ప్రభావితం కాని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు.

ఉదా: చెక్క, థర్మోకోల్‌ షీట్, ప్లాస్టిక్‌

 

అయస్కాంత పదార్థాలు: బాహ్య అయస్కాంత క్షేత్రం ప్రభావానికి లోనయ్యే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఇవి మూడు రకాలు.

 

1) డయా అయస్కాంత పదార్థాలు: బాహ్యా అయస్కాంత క్షేత్రంతో వికర్షించే పదార్థాలను డయా అయస్కాంత పదార్థాలు అంటారు. వీటి సాపేక్ష ప్రవేశ్య శీలత ఒకటి కంటే తక్కువ .

ఉదా: బిస్మత్, రాగి, సీసం, సిలికాన్, నీరు, గాజు, ఆల్కహాల్, పాదరసం, జడవాయువులు, వజ్రం, బంగారం, వెండి.

 

2) పారా అయస్కాంత పదార్థాలు: బాహ్య అయస్కాంత క్షేత్రంతో బలహీనంగా ఆకర్షితమయ్యే పదార్థాలను పారా అయస్కాంత పదార్థాలు అంటారు.

వీటి సాపేక్ష ప్రవేశ్య శీలత ఒకటి కంటే ఎక్కువ. 

ఉదా: అల్యూమినియం, ప్లాటినమ్, మాంగనీస్, క్రోమియం, ఆక్సిజన్‌.

 

3) ఫెర్రో అయస్కాంత పదార్థాలు: బాహ్యా అయస్కాంతంతో బలంగా ఆకర్షితమయ్యే పదార్థాలను ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటారు. వీటి సాపేక్ష ప్రవేశ్యశీలత విలువ ఒకటి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది .

ఉదా: ఇనుము, కోబాల్ట్, నికెల్, అల్నికో   లాంటి పదార్థాలు.

 

మన చుట్టూపక్కల ఉండే శాశ్వత అయస్కాంతాలను సాధారణంగా అల్నికో అనే పదార్థంతో తయారుచేస్తారు. 

ఉదా: రిఫ్రిజిరేటరీల డోర్‌ల వద్ద, రేడియోల్లో ఉంటాయి.

 

తాత్కాలిక అయస్కాంతాల కోసం విద్యుదయస్కాంతాలను ఉపయోగిస్తారు.

ఉదా: ఎలక్ట్రిక్‌ కాలింగ్‌ బెల్, ట్రాన్స్‌ఫార్మర్‌లలో ఉపయోగించే అయస్కాంతాలు.

 

రచయిత: వడ్డెబోయిన సురేష్‌ 


 

Posted Date : 01-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌