• facebook
  • whatsapp
  • telegram

రోబోటిక్స్‌ సాంకేతికత

అబ్బురపరిచే మరతరం!


ఇంటి పనులు, తోట పనులు చకచకా చక్కబెడతాయి. పరిశ్రమల్లో పెద్ద పెద్ద బరువులను ఎత్తేస్తాయి. గాలి లేని ప్రదేశాల్లోనూ గనులను తవ్వేస్తాయి. మందుపాతరలను కనిపెడతాయి.  వ్యవసాయం, వైద్యం, ఆరోగ్య రంగాలతోపాటు సముద్ర గర్భంలో, అంతరిక్షంలోనూ అవలీలగా పనిచేస్తాయి. టీ, కాఫీలు తెచ్చి ఇస్తాయి. నగరంలో ఏం చూడాలో కూడా చెప్పేస్తాయి. అచ్చం మనిషిలా కనిపించడమే కాదు, అలాగే ఆలోచిస్తూ, అబ్బురపరుస్తూ సమాజంలో సాటి పౌరులుగా మారబోతున్న మరమనుషుల గురించి పోటీ పరీక్షార్థులు తప్పకుండా తెలుసుకోవాలి.


మనిషికి సాధ్యంకాని పనులు చేయడం, వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లడం, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను తట్టుకోవడం ఇవన్నీ కేవలం మర మనుషులకు (రోబోలకు) మాత్రమే సాధ్యం. రాబోయే రోజుల్లో రోబోలు మన నిత్య జీవితంలో భాగమవుతాయనే దాంట్లో సందేహం లేదు. రోబోటిక్స్‌ అనే పదాన్ని ప్రతిపాదించింది ఇసాక్‌ ఆసిమోవ్‌ అనే రచయిత. రోబోట్‌ అనే పదానికి అర్థం బానిస. రోబోటిక్స్‌ అనేది రోబోల డిజైన్‌ నమూనా తయారీ, అనువర్తనాల గురించి తెలిపే ఇంజినీరింగ్‌ సాంకేతికత.

 

రక రకాలు

మొదటి తరం: ఇవి స్థిరమైనవి. ఒక చోట నుంచే వివిధ రకాల పనులు నిర్వహిస్తాయి. వీటిని మొదట వాహనరంగ పరిశ్రమల్లో వినియోగించారు. వేడి వస్తువులను కదిలించడం, పెయింటింగ్, వెల్డింగ్‌లతోపాటు అధిక బరువున్న వస్తువులను జరపడం వంటి పనులు చేస్తాయి.

రెండో తరం: ఇవి కదులుతాయి. పరిశ్రమల్లో బరువైన వస్తువులను ఒకచోట నుంచి మరొక చోటుకు మార్చడం, లోడింగ్, అన్‌లోడింగ్‌ లాంటి పనులు నిర్వహిస్తాయి.

మూడో తరం: ఇవి సెన్సర్‌లతో సమాచారాన్ని గ్రహిస్తాయి, విశ్లేషిస్తాయి.

నాలుగో తరం: ఇవి మనిషి ఆకారాన్ని పోలి ఉంటాయి. వీటికి కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌- ఏఐ) ఉండటం వల్ల మనిషిలాగే ఆలోచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నడవడం, మెట్లు ఎక్కడం, వస్తువులను ఒకచోటు నుంచి మరొక చోటుకు తీసుకెళ్లడం లాంటివి చేస్తుంటాయి.

హ్యూమనాయిడ్‌ రోబో: మనిషిని పోలిన శరీర భాగాలను కలిగి ఉంటాయి. కృత్రిమ మేధతో పనిచేస్తాయి. 

ఆండ్రాయిడ్‌ రోబో: వీటినే బయోనిక్‌ మ్యాన్, సింథటిక్‌ హ్యూమన్, సింథటిక్‌ ఆర్గానిజమ్‌ వంటి పేర్లతో పిలుస్తారు. ఇవి బయటకు మనిషిలా, లోపల రోబోలా ఉంటాయి. శరీరం స్టీలుతో ఉండి దానిపై మానవ చర్మం, కండరాల వంటి పదార్థాలతో కప్పి ఉంటుంది. అందుకే రూపంలో అచ్చం మనిషిలా కనిపిస్తాయి. ముఖ కవళికల్లో మార్పులు ప్రదర్శించడం, వ్యక్తులను గుర్తించడం, సామాజిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం వీటి ప్రత్యేకత.

 

రోబోలతో ప్రయోజనాలు

కర్మాగారాల్లో, వాహన రంగ పరిశ్రమల్లో, వివిధ పని ప్రదేశాల్లో మనుషులకు బదులుగా రోబోలను వాడటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వీటివల్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఎక్కువ సమయం పనిచేస్తాయి. సెలవులు తీసుకోవు, వేతనాలు అడగవు, అలసిపోవు, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. మనిషి వెళ్లలేని ప్రదేశాలకు, వెళ్లి పనులు చేస్తాయి. ఖర్చు తగ్గుతుంది, పనిలో నాణ్యత పెరుగుతుంది.

 

వివిధ రంగాల్లో అనువర్తనాలు

పారిశ్రామిక రంగం: పరిశ్రమల్లో ఇనుప వస్తువులకు రంధ్రాలు చేయడం, బరువైన వస్తువులు ఎత్తడం, శూన్య ప్రదేశంలో పెయింటింగ్‌ చేయడం వంటి క్లిష్టతర పనులకు ఉపయోగపడతాయి.

గృహ అవసరాలు: ఇంటి పని, తోటపని చేయడానికి రోబోలను వినియోగిస్తున్నారు. వ్యక్తిగత పనులు చేయడానికి, వినోదానికీ వాడుతున్నారు.

నిర్మాణ రంగం: భవనాలు, ఇళ్లు కట్టడానికి రోబోలను వినియోగిస్తున్నారు. భవనాల పెయింటింగ్, ఎత్తయిన ప్రదేశాల్లో పనులకు ఉపయోగిస్తున్నారు.

గనుల తవ్వకం: రోబోలను భూగర్భ గనుల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువ లోతుకు వెళ్లి, గాలి లేని ప్రదేశాల్లో పనిచేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి.

రక్షణ రంగం: ఈ రంగంలో వాడే రోబోలను మిలటరీ రోబోలు అంటారు. కొన్నిప్రాంతాల్లో సైనికులకు బదులుగా గస్తీ నిర్వహించడానికి వాడుతున్నారు. మందుపాతరలు కనిపెట్టి వెలికితీయడానికి వినియోగిస్తున్నారు. జీవ, రసాయనిక, అణ్వాయుధాలను కూడా తట్టుకుని యుద్ధరంగంలో ఇవి విధులు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

విపత్తు నిర్వహణ: రోబోలను విపత్తు నిర్వహణ సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాల్లోకి వెళ్లడానికి, భూకంపాలు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటానికి వినియోగిస్తున్నారు.

అంతరిక్ష రంగం: అంతరిక్షంలో ఉండే వ్యోమగాములకు సహాయంగా రోబోలను పంపుతున్నారు. అంతరిక్ష కేంద్రానికి మరమ్మతులు చేయడం, వివిధ పరికరాల బిగింపు, వంటి పనులు చేస్తున్నాయి. చంద్రుడిపైకి, అంగారకుడి పైకి వివిధ సంస్థలు ఈ మరమనుషులను పంపించి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.

సముద్రగర్భంలో: సముద్రంలో ఉన్న ఇంధన గొట్టాలను తనిఖీ చేయడం, కేబుళ్లను పరిశీలించడం వంటి వాటికి రోబోలను ఉపయోగిస్తున్నారు. సముద్ర గర్భంలో ఖనిజ లవణాలను గుర్తించడానికి, తవ్వడానికి ఇవి సాయపడుతున్నాయి.

ఆరోగ్య, వైద్య రంగంలో: ఆసుపత్రుల్లో రోగుల వివరాలు సేకరించడానికి, రోగులకు సహాయం అందించడానికి రోబోలు ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా క్షిష్టతరమైన, ఎక్కువ సమయం పట్టే శస్త్రచికిత్సలను అత్యంత కచ్చితత్వంతో చేయడానికి సాయపడుతున్నాయి,

వ్యవసాయ రంగంలో: ఫలవృక్షాల నుంచి ఫలాలు దెబ్బతినకుండా కోయడానికి, ప్యాకింగ్‌ చేయడానికి రోబోటిక్‌ యంత్రాలను వినియోగిస్తున్నారు.

 

ప్రముఖ రోబోలు- ప్రత్యేకతలు

ఆసిమో: దీని పూర్తి పేరు అడ్వాన్స్‌డ్‌ స్టెప్‌ ఇన్‌ ఇన్నోవేటివ్‌ మొబిలిటీ. దీన్ని హోండా సంస్థ 2000 సంవత్సరంలో రూపొందించింది. ఇది మొదటి హ్యూమనాయిడ్‌ రోబో. మనిషిలాగా నడుస్తుంది.

అసేయుట్‌-1, అసేయుట్‌-2: వీటిని రాజస్థాన్‌లోని బిట్స్‌పిలానీకి చెందిన సెంటర్‌ ఫర్‌ రోబోటిక్స్‌ ఇంటలిజెంట్‌ సిస్టం రూపొందించింది.

నటరాజా: ఐఐటీ-ముంబయి వారు రూపొందించారు.

లక్ష్మీ: ఇది బ్యాంకింగ్‌ రోబో. తమిళనాడులోని కుంభకోణం నగరంలో సిటీ బ్యాంకులో సేవలందిస్తోంది.

కిరోబో: జపాన్‌లోని టయోటా కంపెనీ దీన్ని రూపొందించింది. ఇది మనుషుల ముఖాలను గుర్తుపడుతుంది.

మిత్ర: మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న మొదటి హ్యూమనాయిడ్‌ రోబో ఇది. ఇన్‌వెంటో టెక్నాలజీ సంస్థ తయారుచేసింది. ప్రస్తుతం దానిని బెంగళూరులోని సిటీ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో ఉంచారు.

సోఫియా: ఇది ఆండ్రాయిడ్, హ్యూమనాయిడ్‌ రోబో. హాంకాంగ్‌లోని హాన్సన్‌ రోబోటిక్స్‌ సంస్థ రూపొందించింది. 2018లో హైదరాబాద్‌లో జరిగిన ‘వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ’ సదస్సులో దీన్ని ప్రదర్శించారు.

చిట్టి: దీన్ని ప్రస్తుతం బెంగళూరులోని రామచంద్ర ఆస్పత్రి న్యూరో ఐసీయూలో ఉపయోగిస్తున్నారు.

వ్యోమ్‌ మిత్ర: ఇది మహిళా రోబో, హాఫ్‌ హ్యూమనాయిడ్‌ రోబో. అంటే మొండెం ఉండి చేతులు మాత్రమే కలిగి మనిషిని పోలి ఉంటుంది. తిరువనంతపురంలోని ఇస్రోకు చెందిన ఇనర్షియల్‌ సిస్టమ్స్‌ యూనిట్‌ దీన్ని రూపొందించింది. ఇస్రో చేపట్టే మొదటి రెండు మానవరహిత అంతరిక్ష యాత్రల్లో వ్యోమ్‌ మిత్ర ఉంటుంది.  స్పేస్‌ క్యాప్సూల్‌లోని వివిధ పరికరాలను ఈ రోబో నియంత్రిస్తుంది.

జియా-జియా: చైనాలోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ దీన్ని రూపొందించింది.

రాస్‌: కృత్రిమ మేధ కలిగిన లాయర్‌ రోబో. తీర్పులను పరిశీలించడానికి, న్యాయవాదులకు సహాయం చేయడానికి ఐబీఎం సంస్థ దీన్ని రూపొందించింది.

అట్లాస్‌: ఆంత్రోమార్ఫిక్‌ హ్యూమనాయిడ్‌ రోబో. అమెరికాకు చెందిన బోస్టన్‌ డైనమిక్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది విపత్తు నిర్వహణకు ఉపయోగపడుతుంది.

దీక్ష్: డీఆర్‌డీవోకు చెందిన మిలటరీ రోబో. బాంబులు, మందుపాతరలను గుర్తిస్తుంది, నిర్వీర్యం చేస్తుంది. దీన్ని 2015లో ఆధునీకరించి రసాయనిక, జీవ, అణ్వాయుధ సంబంధ పదార్థాలను గుర్తించడానికి ఉపయోగిస్తున్నారు.

డీఈఆర్‌: దీన్ని జపాన్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది ముఖ కవళికలను మార్చగలదు.

కెంపా: కృత్రిమ మేధ కలిగిన ఈ హ్యూమనాయిడ్‌ రోబోను సిరెనా టెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంచారు.  ఆ నగరంలోని దర్శనీయ ప్రదేశాల గురించి ఆంగ్ల, కన్నడ భాషల్లో ప్రయాణికులకు వివరిస్తుంది.

రోబో కాప్‌: ఇది పోలీసు రోబో. ప్రస్తుతం హైదరాబాద్‌లో నేర నివారణ, ట్రాఫిక్‌ విభాగాల్లో సేవలందిస్తోంది. దీన్ని కార్యాలయాల్లో, మాల్స్, విమానాశ్రయం వంటి వాటిలో వినియోగిస్తారు.

భారత్‌లో రోబోటిక్స్‌పై పరిశోధన చేస్తున్న సంస్థలు: * సెంటర్‌ ఫర్‌ ఆర్టీఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌ (సీఏఐఆర్‌) - బెంగళూరు. ఈ సంస్థ చాతుర్‌ రోబోను అభివృద్ధి చేసింది. దృష్టి సెన్సర్లు ఉన్న ‘చాతుర్‌’కు వస్తువులను పట్టుకునే సామర్థ్యం ఉంది.

* సెంటర్‌ ఫర్‌ రోబోటిక్స్‌ రిసెర్చ్‌- ఐఐటీ, కాన్పుర్‌.

 

భారత్‌లో రోబోటిక్స్‌ పరిశ్రమ సవాళ్లు:  

* రోబోల తయారీకి ఖర్చు ఎక్కువ.

* ఈ రంగంలో నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరత.

* రోబోల తయారీకి కావాల్సిన హార్డ్‌వేర్‌ లభ్యత తక్కువ.

 

మాదిరి ప్రశ్నలు


1. రోబోలను పరిశ్రమల్లో వాడటం వల్ల కలిగే లాభాలు-

1) ఉత్పత్తి పెరుగుతుంది     2) నాణ్యత పెరుగుతుంది      3) ఖర్చు తగ్గుతుంది      4) పైవన్నీ


2. ఆండ్రాయిడ్‌ రోబోను కింది ఏ పేర్లతో పిలుస్తారు?

1) బయోనిక్‌ మ్యాన్‌     2) సింథటిక్‌ హ్యూమన్‌     3) సింథటిక్‌ ఆర్గనిజమ్‌     4) పైవన్నీ


3. ‘ఇస్రో’ గగన్‌యాన్‌ ప్రాజెక్టు కోసం రూపొందించిన హాఫ్‌ హ్యూమనాయిడ్‌ రోబో పేరు-

1) గగన్‌మిత్ర      2) వ్యోమమిత్ర      3) ఆకాశమిత్ర    4) అంతరిక్ష మిత్ర


4. మానవుడిలా రూపం, ఆకారం, శరీరం ఉన్న రోబోను ఏమంటారు?

1) హ్యూమనాయిడ్‌ రోబో    2) హ్యూమన్‌ రోబో       3) ఆండ్రాయిడ్‌ రోబో     4) కీరోబో


5. డీఆర్‌డీవో సంస్థ మందుపాతరలను గుర్తించడానికి, వెలికితీయడానికి రూపొందించిన మిలటరీ రోబో?

1) దీక్ష్      2) రాస్‌     3) చిట్టి       4) అట్లాస్‌

సమాధానాలు: 1-4,     2-4,     3-2,    4-3,     5-1.

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 

Posted Date : 12-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌