• facebook
  • whatsapp
  • telegram

కోశ విధానం

 ఆర్థిక స్థిరత్వాన్ని అందించే సాధనం!



  వ్యక్తులు, సంస్థల ఆదాయాలపై ప్రభుత్వం పన్నులు పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. పెంచినప్పుడు ప్రజల పెట్టుబడులు అధికమవుతాయి, తగ్గించినప్పుడు వారి వ్యయాలు ఎక్కువుతాయి. ఈ రెండూ మార్కెట్‌లో ద్రవ్య చెలామణిని నియంత్రిస్తాయి. రోడ్లు, వంతెనలు, మెట్రోల వంటి మౌలిక సౌకర్యాల కోసం గవర్నమెంటు ఖర్చులు చేస్తుంది. దాంతో జనం ఉపాధి, ఆదాయం పెరుగుతాయి. సర్కారు వ్యయం, ఆదాయాన్ని మించితే ద్రవ్యలోటు ఏర్పడుతుంది. దాన్ని సరిదిద్దుకోవడానికి రుణాలు చేయాల్సి వస్తుంది. ఫలితంగా వడ్డీ రేట్లు అధికమై ఆ ప్రభావం రుణాలు, పెట్టుబడులపై పడుతుంది. ఆ విధంగా ప్రభుత్వం పన్నులు విధించడానికి, ఖర్చులు చేయడానికి, అప్పులు తీసుకోవడానికి విధానాలను రూపొందించుకుంటుంది. అదే కోశ విధానం. దాని ద్వారా సేవలు అందించి, ఉద్యోగాలు కల్పించి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధినీ సాధిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో అత్యంత కీలకమైన ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 ద్రవ్య విధానం కంటే కోశ విధానానికి జె.ఎం.కీన్స్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 1929-30 ఆర్థిక మాంద్యం - కీన్స్‌ జనరల్‌ థియరీ రచనతో కోశ విధానానికి ప్రాధాన్యం పెరిగింది. ఆర్థిక మాంద్య కాలంలో ద్రవ్య విధానం కంటే కోశ విధానం సమర్థంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ద్రవ్యవిధానం ఆర్‌బీఐకి, కోశ విధానం కేంద్ర ప్రభుత్వానికి చెందినవి.


* ఉత్పత్తి, ఉద్యోగితపై ప్రభుత్వ పన్నులు, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ రుణాల స్థూల ప్రభావమే కోశ విధానం (Fiscal Policy).  దీన్ని ప్రభుత్వ రాబడి, వ్యయం, రుణాలకు సంబంధించిన నిర్వహణ విధానంగానూ పేర్కొనవచ్చు.


ఆర్థికాభివృద్ధిలో కోశ విధానం పాత్ర:

నల్లధనం: కోశ విధానం ద్వారా పన్ను, పన్నేతర రాబడిని పెంచి మూలధన కల్పనకు దోహదపడవచ్చు. పన్ను ఎగవేతను అరికట్టి నల్లధనాన్ని తగ్గించవచ్చు.

ఉత్పత్తి, ఉద్యోగిత: వస్తువులపై పన్నుల ద్వారా ప్రభుత్వం వనరులను సేకరించి, వాటిని అవసరమైన పరిశ్రమల్లో పెట్టుబడిగా పెట్టి జాతీయాదాయం, స్థూల జాతీయోత్పత్తి పెంచవచ్చు.

పెట్టుబడులను ప్రోత్సహించడం: ప్రైవేటు రంగానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాయితీలు ఇచ్చి పెట్టుబడులు ప్రోత్సహించడానికి కోశవిధానం ఉపయోగపడుతుంది.

స్థిరత్వం: ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పన్నులు పెంచి ప్రజల చేతుల్లో ఉన్న డబ్బును, కొనుగోలు శక్తిని తగ్గించి సమష్టి డిమాండ్‌ను, సమష్టి సప్లయికి సరిపోయే విధంగా చేయడం.

అభిలషణీయ ఉపయోగం: పరిమిత వనరులను అభిలషణీయ స్థాయిలో ఉపయోగించడానికి, అనుత్పాదక వ్యయ నియంత్రణకు కోశ విధానం ఉపయోగపడుతుంది.

అభివృద్ధి: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పొదుపు రేటు, పెట్టుబడి రేటు తక్కువగా ఉంటాయి. అందువల్ల తలసరి ఆదాయం, వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తుల స్థాయి, ఉద్యోగిత స్థాయి అల్పంగా ఉంటాయి. ఈ పరిస్థితులను అధిగమించి ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి కోశ విధానం ఉపయోగపడుతుంది.

లక్ష్యాలు: * ఆర్థికాభివృద్ధిని సాధించడం. 

* వినియోగాన్ని నియంత్రించి పొదుపు, పెట్టుబడులను పెంపొందించడం. 

* ధరల స్థిరత్వాన్ని సాధించడం; ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించడం.

* ఉత్పాదకతను పెంచి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం.* సమర్థ వనరుల కేటాయింపు, ఆర్థిక - సాంఘిక అవసరాలకు అనుగుణంగా వనరుల కేటాయింపు.

* ఆదాయ పునఃపంపిణీ, సంపద ఆదాయ పంపిణీలో అసమానతలను తగ్గించడం.


కోశ విధానం - సాధనాలు:

పన్నులు: సంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం పన్నులు అంటే రాబడి సాధనాలు మాత్రమే. ఆధునిక కోశ ఆర్థికవేత్తల ప్రకారం పన్నులు అంటే రాబడి సాధనాలే కాకుండా ఆర్థిక వ్యవస్థలో సుస్థిరతను సాధించే సాధనాలు కూడా. ప్రైవేటు రంగంలో పొదుపు, పెట్టుబడులను నిరుత్సాహపరిచేదిగా పన్నుల విధానం ఉండకూడదు. ఆదాయం, సంపదలో వ్యత్యాసాలను తగ్గించేదిగా, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని నెలకొల్పగలిగేదిగా ఉండాలి.

ప్రభుత్వ వ్యయం: ఇది ఆర్థికాభివృద్ధి, ప్రజాసంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సుస్థిర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

ప్రభుత్వ రుణం: ఆర్థిక వ్యవస్థలో అదనంగా ఉన్న ద్రవ్యరాశిని స్వీకరించి రుణం రూపేణా భారీ పరిశ్రమల స్థాపనకు వినియోగించడం ద్రవ్యల్బణాన్ని తగ్గించేందుకు దోహదపడుతుంది.

లోటు బడ్జెట్‌: మాంద్యంలో ఆర్థిక సుస్థిరతకు లోటు బడ్జెట్‌ ఉపయోగపడుతుంది. 

* కోశ సాధనాల ద్వారా ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణాలను నియంత్రించవచ్చు.


భారత కోశ విధాన లక్ష్యాలు: ఇవి రెండు రకాలు. 

1) ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని మెరుగుపరచడం 

2) ప్రజలకు సాంఘిక న్యాయాన్ని అందించడం


ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యం: కోశ విధానం వృద్ధి సామర్థ్యాన్ని రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది.

ఎ) వనరుల సమీకరణ: 1950-51లో పన్ను - జీడీపీ నిష్పత్తి 6.3% గా ఉంటే 2010-20 నాటికి 19.2% కి పెరిగింది. పన్ను రాబడి పెరగడానికి కారణం కోశవిధానమే. వనరుల సమీకరణకు పన్నులే కాకుండా పన్నేతర రాబడి, ప్రభుత్వరంగ సంస్థల మిగులు పెంచడం, ప్రభుత్వ వ్యయంపై ఆంక్షలు లాంటివీ దోహదపడ్డాయి.

బి) సమర్థ వనరుల కేటాయింపు: వనరుల కేటాయింపు వృద్ధి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. సమర్థ, హేతుబద్ధమైన వనరుల కేటాయింపు వల్ల ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. ఉదా: సంస్కరణలకు ముందు పరోక్ష పన్నుల రాబడి ఎక్కువగా ఉండేది. సంస్కరణల ఫలితంగా ఆ వాటా తగ్గి ప్రత్యక్ష పన్నుల వాటా పెరుగుతోంది. కస్టమ్స్‌ సుంకాలు దేశీయ పరిశ్రమల రక్షణకు దోహదపడతాయి.

కోశ అసమతౌల్యం - లోటు విత్తం:  1980 దశకం మధ్య వరకు మొత్తం బడ్జెట్‌లో లోటు కనిపించేది. ఈ అంతరాన్ని ట్రెజరీ బిల్లులను హామీగా ఉంచి ఆర్‌బీఐ నుంచి అప్పు తీసుకోవడం ద్వారా అంటే లోటు విత్తం ద్వారా భర్తీ చేసేవారు. ప్రభుత్వం ఆర్‌బీఐ వద్ద సెక్యూరిటీలను ఉంచి రుణం తీసుకునేది. ఈ సెక్యూరిటీల ఆధారంగా ఆర్‌బీఐ ఎక్కువ నోట్లను చలామణిలోకి తీసుకురావడంతో ద్రవ్య సరఫరా ఎక్కువై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగేవి.

లోటు విత్తం ఆవశ్యకత: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి ప్రణాళికలకు సరిపడా ఆర్థిక వనరులు ఉండవు. అందుకే లోటు విత్తం అవసరమని కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది కాబట్టి లోటు విత్తం అవసరం.

దీర్ఘకాల కోశ విధానం: ప్రణాళిక విధానాన్ని కోశ విధానంతో సమన్వయపరిచే ఉద్దేశంతో దీర్ఘకాల కోశ విధానాన్ని 1985లో ఏడో ప్రణాళికలో రూపొందించారు. 1985-1990 కాలంలో అమలైన ఈ ప్రణాళికలో ముఖ్యాంశాలు ఉన్నాయి. 

* ఆదాయ పన్ను రేట్లు 1985లో నిర్ణయించినవే 1990 వరకు కొనసాగాయి. పన్ను రేటు పెరుగుతుందనే భయం లేకుండా పెట్టుబడులు పెంచడానికి వీలవుతుంది.


* చనిపోయిన వారి ఆస్తులపై విధించే పన్నును తొలగించడం.

* ఆదాయ పన్ను, సంపద పన్ను రేట్లు తగ్గించడం.

సంస్కరణల్లో భాగంగా  కోశ అసమతౌల్యాన్ని తొలగించడానికి స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు చేపట్టారు. అమెరికా బడ్జెట్‌ తరహాలో కోశ లోటును ప్రవేశపెట్టారు. కోశ అసమతౌల్యాన్ని కొలవడానికి సూచీలు రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు.

వడ్డీ చెల్లింపులు, వడ్డీయేతర వ్యయం: కోశ అసమతౌల్యానికి ప్రధాన కారణమైన వడ్డీ చెల్లింపులు పెరుగుతూనే వస్తున్నాయి. 2023-24 నాటికి రూ.10,79,971 కోట్లుగా అంచనా వేశారు. సబ్సిడీలు, రక్షణ వ్యయం, జీతభత్యాలు లాంటి వ్యయం; వడ్డీయేతర వ్యయం పెరగడం కూడా కోశ అసమతౌల్యానికి కారణం. సబ్సిడీల్లో సగం కంటే ఎక్కువ ఆహార సబ్సిడీలకే కేటాయిస్తారు.


భారతదేశంలో కోశ బాధ్యత (ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం): ఆర్థికమంత్రిగా యశ్వంత్‌ సిన్హా ఉన్న 2000 సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని లక్ష్యం దీర్ఘకాల స్థూల ఆర్థిక స్థిరత్వం. 2004, జులై 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో పలు ముఖ్యాంశాలు ఉన్నాయి. 

* రెవెన్యూ లోటును ఏటా 0.5% చొప్పున తగ్గిస్తూ 2008-09 నాటికి నిర్మూలించి, తర్వాత మిగులు చూపాలి.

* కోశ లోటును ప్రతి ఏడాది 0.5% చొప్పున తగ్గిస్తూ 2008-09 నాటికి 3%కి తీసుకురావాలి.

* ప్రతి మూడు నెలలకు ఆర్థిక మంత్రి ఆదాయ, వ్యయాలను సమీక్షించాలి.

* ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని అనుసరించే రాష్ట్రాలకు తక్కువ వడ్డీతో రుణాలు రీషెడ్యూల్‌ చేయడంతో పాటు పాత గ్రాంట్లు అందించాలి.

2007-08 నాటికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం తన రెవెన్యూ లోటును 1.1%కి, కోశ లోటును 2.5%కి తీసుకురాగలిగింది. అయితే 2008-09 నుంచి ఆర్థికమాద్యం ప్రభావంతో ప్రభుత్వం వ్యయాన్ని పెంచాల్సి రావడం, మరోవైపు పన్ను రేటు తగ్గించాల్సి రావడంతో రెవెన్యూ లోటు, కోశ లోటు రెండూ పెరుగుతూ వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం లక్ష్యాలను వాయిదా వేసింది.


ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సమీక్ష:  పన్ను రాబడి, జీడీపీ నిష్పత్తి కొంత తగ్గడం, వడ్డీ చెల్లింపులు, రాయితీలు, రక్షణ వ్యయం పెరగడం వల్ల కేంద్రం రెవెన్యూ లోటును తగ్గించలేకపోయింది. రెవెన్యూ లోటును సున్నా శాతానికి తీసుకురావాలంటే ప్రభుత్వం సాంఘిక వ్యయాన్ని తగ్గించాల్సి వస్తుంది. దీనివల్ల విద్య, ఆరోగ్యంపై వ్యయం తగ్గిపోతుంది.  

* సంస్కరణల తర్వాత మూలధన వ్యయం, జీడీపీ నిష్పత్తి తగ్గుతూ వస్తోంది.

* ప్రభుత్వ వ్యయం తగ్గడం వల్ల మానవవనరులు, అవస్థాపన సదుపాయాలపై పెట్టుబడులు తగ్గవచ్చు.

* ఈ చట్టం పన్ను, జీడీపీ నిష్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టలేదు.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సమీక్ష కమిటీ:  2016, మేలో ఎన్‌.కె.సింగ్‌ అధ్యక్షతన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంపై సమీక్ష కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 2017, జనవరిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో పలు ముఖ్యాంశాలు ఉన్నాయి. 

* ప్రభుత్వ రుణ, జీడీపీ నిష్పత్తి కోశ విధానానికి మధ్య కాల సంధానంగా ఉండాలి. 2023 నాటికి కేంద్ర, రాష్ట్రాలు దీన్ని 60%కి తీసుకురావాలి (కేంద్రం 40%, రాష్ట్రాలు 20%).

* 2020, మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వం జీడీపీలో కోశ లోటును 3% కి, 2022-23 నాటికి 2.5%కి తీసుకురావాలని సూచించింది. అయితే జాతీయ భద్రత, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పడిపోవడం లాంటి సందర్భాల్లో మినహాయింపు నిబంధనకు అవకాశం ఇచ్చింది.

* రెవెన్యూ లోటును ఏటా దశలవారీగా 0.25%కి తగ్గిస్తూ 2017లో ఉన్న 2.3% నుంచి 2023 నాటికి 0.8%కి తీసుకురావాలి.

* ప్రస్తుత ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం 2004 స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలి. ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు కోశమండలి ఏర్పాటు చేయాలి. ఇది జీడీపీ వృద్ధి, వస్తు ధరలు, పన్ను ప్రోత్సాహకాలపై సలహాలిస్తుంది.

* కేంద్ర వ్యయం కంటే రాష్ట్రాల వ్యయం ఎక్కువగా ఉంది. రాష్ట్ర రుణ నిష్పత్తిని ప్రస్తుతం ఉన్న 21% నుంచి 20%కి తగ్గించాలి.

* కోశ, ద్రవ్య విధానాలు స్థూల ఆర్థిక స్థిరత్వానికి, వృద్ధికి ఒకదానికొకటి పూరకంగా ఉండాలి.

 రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 07-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌