• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలు  

సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!


భారతదేశం పటిష్ఠమైన సమాఖ్య వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అందుకు తగినట్లుగా ప్రభుత్వాల పరిధులు, శాసనాలు చేయాల్సిన అంశాలతో జాబితాలు సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజించారు. దేశ సమైక్యత, సమగ్రత లక్ష్యం కావడంతో జాతీయ ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు దక్కాయి. సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్ర వ్యవస్థగా వ్యవహరించే విధంగా రూపొందిన ఈ శాసన సంబంధాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో జరిగిన సవరణలు, రాష్ట్ర చట్టాలపై కేంద్రం నియంత్రణ తదితర వివరాలను సమగ్రంగా తెలుసుకోవాలి.


పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఏయే అంశాలపై శాసనాలు చేయవచ్చో వివరించే ప్రక్రియనే ‘కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలు’గా పేర్కొంటారు. పార్లమెంటు రూపొందించే శాసనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. రాష్ట్ర శాసనసభలు రూపొందించే శాసనాలు సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధికి మాత్రమే పరిమితమవుతాయి.

అధికారాల విభజన: రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్రాల మధ్య మూడు రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు.


1) కేంద్ర జాబితా: దీనిలో ప్రారంభంలో 97 అంశాలు ఉండేవి. ప్రస్తుతం 98 ఉన్నాయి. ఈ జాబితాలో జాతీయ ప్రాధాన్యం ఉన్న రక్షణ, కరెన్సీ, రైల్వేలు, తంతితపాలా, విదేశీ వ్యవహారాలు, విమాన, నౌకాయానం, బ్యాంకింగ్, పౌరసత్వం, అఖిలభారత సర్వీసులు, జనాభా లెక్కలు, సర్వే ఆఫ్‌ ఇండియా, నల్లమందు, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికార పరిధి లాంటి అంశాలు ఉన్నాయి.

* 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రజాప్రయోజనాల దృష్ట్యా వస్తువుల ఉత్పత్తి, పంపిణీ అనే అంశాన్ని (33వ ఎంట్రీ) ఈ జాబితా నుంచి తొలగించారు.

* 1956లో 6వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘అంతర్‌ రాష్ట్ర వ్యాపార వాణిజ్యం’పై పన్నులు విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఈ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు (ఎంట్రీ 92(A) అంశం ద్వారా).

* 1982లో 46వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల్లో వస్తువుల దిగుమతిపై కన్‌సైన్‌మెంట్‌ ట్యాక్స్‌ను విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఈ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు. (ఎంట్రీ 92 (B))

* 2004లో 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సేవలపై పన్నులు విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఈ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు (ఎంట్రీ 92(C)).

* 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలోని ఎంట్రీ 92, 92(C)లను తొలగించారు.

* కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

 

2) రాష్ట్ర జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 66 అంశాలు ఉండేవి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ జాబితాలోని 5 అంశాలు (విద్య, అడవులు, తూనికలు-కొలతలు, న్యాయ వ్యవహారాలు, జనాభా నియంత్రణ) తొలగించి ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేశారు.

* 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 52, 55 అంశాలను తొలగించారు.

* ప్రస్తుతం రాష్ట్ర జాబితాలోని అంశాలు 59. వీటిలో కీలకమైనవి శాంతిభద్రతలు, వ్యవసాయం, స్థానిక స్వపరిపాలన, జైళ్లు, మార్కెట్లు, వినోదం, ఆరోగ్యం, భూములు, భవనాలు, సత్రాలు, దస్తావేజులు, భూమిశిస్తు, శ్మశాన వాటికలు, పశుసంపద మొదలైనవి. రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది.

* రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 249, 250, 252 ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.

 

3) ఉమ్మడి జాబితా: ఈ జాబితాలో ప్రాంతీయ ప్రాధాన్యం, జాతీయ దృక్పథానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రారంభంలో దీనిలో 47 అంశాలు ఉండేవి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేయడంతో 52కు చేరింది. ఈ జాబితాలో కీలకమైనవి వివాహం, విడాకులు, సామాజిక, ఆర్థిక ప్రణాళికలు, పత్రికలు, ధరల నియంత్రణ, సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, న్యాయవాద వృత్తి, ఇతర వృత్తులు, వార్తాపత్రికలు, కర్మాగారాలు, జ్యుడీషియల్‌ స్టాంపులు, కార్మిక సంఘాలు.

* ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలకు ఉంటుంది. అయితే ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనాల మధ్య వైరుధ్యం ఏర్పడితే పార్లమెంటు శాసనమే చెల్లుబాటవుతుంది.

* ఈ మూడు జాబితాల్లో లేని వాటిని ‘అవశిష్ట అంశాలు’ అంటారు. వీటిపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఏదైనా ఒక అంశం అవశిష్టాంశమా, కాదా అని సుప్రీంకోర్టు ధ్రువీకరిస్తుంది.

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని శ్రీఖివ భాగంలో 245 నుంచి 255 వరకు ఉన్న ఆర్టికల్స్‌ కేంద్రం, రాష్ట్రాల మధ్య శాసన సంబంధాల గురించి పేర్కొంటున్నాయి.

ఆర్టికల్‌ 245: పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధిని తెలియజేస్తుంది.

ఆర్టికల్‌ 245(1): పార్లమెంటు రూపొందించే శాసనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. రాష్ట్ర శాసనసభలు రూపొందించే శాసనాలు సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధికి మాత్రమే వర్తిస్తాయి.

ఆర్టికల్‌ 245(2): పార్లమెంటు రూపొందించే శాసనాలు ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకూ వర్తిస్తాయి.

ఆర్టికల్‌ 246: పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగ పరిధికి లోబడి రూపొందించే శాసనాల రూపకల్పనను వివరిస్తుంది.

ఆర్టికల్‌ 246(1): రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలు రూపొందించే సర్వాధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.

ఆర్టికల్‌ 246(2): రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. అయితే ఈ జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు రూపొందించిన శాసనానికి, రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనానికి మధ్య విభేదాలు వస్తే పార్లమెంటు చేసిన శాసనమే కొనసాగుతుంది.

ఆర్టికల్‌ 246(3): 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

సుప్రీంకోర్టు తీర్పు:  వాదియా జు( స్టేట్‌ ఆఫ్‌ బాంబే కేసు: భారత ప్రభుత్వం రూపొందించే ఆదాయ పన్ను చట్టాలు భారత్‌లో శాఖలు ఉన్న విదేశీ సంస్థలకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఆర్టికల్‌ 247: కేంద్ర జాబితాలోని పేర్కొన్న అంశాలపై పార్లమెంటు రూపొందించిన శాసనాలను సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన అదనపు న్యాయస్థానాలను ఏర్పాటుచేసే అధికారం పార్లమెంటుకు ఉంది.

ఆర్టికల్‌ 248: అవశిష్టాంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. దీనికి స్ఫూర్తి కెనడా రాజ్యాంగం. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో లేని విషయాలను, నూతనంగా వచ్చే అంశాలను ‘అవశిష్టాంశాలు’ అంటారు.

ఆర్టికల్‌ 249: జాతీయ ప్రయోజనాలరీత్యా రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు శాసనాన్ని రూపొందిస్తుంది. దీని కోసం ముందుగా రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. రాజ్యసభ చేసిన తీర్మానాన్ని అనుసరించి పార్లమెంటు రూపొందించిన చట్టం ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఈ చట్టాన్ని కొనసాగించాలంటే మరో తీర్మానాన్ని ఆమోదించాలి. ఆ విధంగా ఎంతకాలమైనా పొడిగించవచ్చు.

ఆర్టికల్‌ 250: రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే, ఆర్టికల్‌ 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఈ విధంగా పార్లమెంటు రూపొందించిన శాసనాలు జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు కొనసాగి రద్దవుతాయి.

ఆర్టికల్‌ 251: ఆర్టికల్‌ 249, 250 ప్రకారం పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రూపొందించిన శాసనాలకు వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభ ఎలాంటి శాసనాలు రూపొందించరాదు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది.

ఆర్టికల్‌ 252: రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించాలని పార్లమెంటును కోరితే రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందించిన శాసనాలు సంబంధిత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి.

ఉదా: * ఎస్టేట్‌ సుంకం చట్టం-1955 

* ప్రైజ్‌ కాంపిటీషన్‌ చట్టం-1955 

* వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 

* జలకాలుష్య సంరక్షణ చట్టం-1974 

* పట్టణ ఆస్తుల భూపరిమితి చట్టం-1976

పార్లమెంటు రూపొందించిన ఈ చట్టాలను సవరించే లేదా రద్దు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఈ చట్టాలను ఇతర రాష్ట్రాలు శాసనసభ తీర్మానం ద్వారా తమకు కూడా అన్వయించుకోవచ్చు.

ఆర్టికల్‌ 253: భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు, శాంతి సంధి లాంటివి మనదేశంలో అమలుపరిచే సందర్భంలో పార్లమెంటు రూపొందించే శాసనాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల శాసనాలు అవరోధంగా ఉంటే వాటిని పార్లమెంటు సవరించవచ్చు.

ఉదా: * యూఎన్‌ఓ ప్రత్యేక సౌకర్యాలు, రక్షణల చట్టం-1947 

* జెనీవా ఒప్పంద చట్టం-1960 

* హైజాకింగ్‌ వ్యతిరేక చట్టం-1982

ఆర్టికల్‌ 254: ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు రూపొందించినప్పుడు రెండింటి మధ్య విభేదాలు వస్తే పార్లమెంటు రూపొందించిన శాసనమే చెల్లుతుంది. అయితే ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశంపై కేంద్రం గతంలో రూపొందించిన శాసనానికి విరుద్ధంగా రాష్ట్రాలు రాష్ట్రపతి అనుమతితో ప్రత్యేక శాసనం రూపొందించినప్పుడు రాష్ట్ర శాసనమే చెల్లుబాటు అవుతుంది.

ఆర్టికల్‌ 255: కీలకమైన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి, శాసనసభలో ప్రవేశపెట్టాలంటే గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి.

ఆర్టికల్‌ 200: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ రాష్ట్రపతికి రిజర్వ్‌ చేయవచ్చు.

ఆర్టికల్‌ 201: రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్రపతికి రిజర్వ్‌ చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 27-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌