• facebook
  • whatsapp
  • telegram

బయోపెస్టిసైడ్‌లు  (జీవ వ్యాధిజనక నాశకాలు)

 ప్రకృతి హితంగా చీడపీడల సంహారం! 
 


 

పంట దిగుబడులు పెరగడానికి, అధిక ఆహారోత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతున్నారు. హానికరమైన ఈ మందుల అవశేషాలు ఆహారం ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. పండించే రైతు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నాడు. మరోవైపు స్వచ్ఛమైన ఆహారం లభించడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న జీవ పురుగుమందుల వినియోగం, అవసరంపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. తక్కువ ఖర్చుతో పర్యావరణహితంగా పనిచేసే వాటి ప్రయోజనాలతోపాటు ప్రతికూలతలనూ తెలుసుకోవాలి.

పంట మొక్కలపై ఆశించే క్రిమికీటకాలను నివారించడానికి వాడే సూక్ష్మజీవులను లేదా మొక్కల నుంచి తీసిన రసాయనాలను బయోపెస్టిసైడ్‌లు అంటారు. వీటినే జీవ పురుగు మందులుగా పిలుస్తారు. ఇవి వివిధ రకాల పంట మొక్కలపై ఆశించే కొన్నిరకాల బ్యాక్టీరియా, శిలీంధ్ర, కీటక వ్యాధులను నియంత్రిస్తాయి. వీటి తయారీకి ఉపయోగించే సూక్ష్మజీవి, రసాయనాల ఆధారంగా వాటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు. 

1) బ్యాక్టీరియా బయోపెస్టిసైడ్‌లు    2) శిలీంధ్ర బయోపెస్టిసైడ్‌లు 

3) వైరస్‌ బయోపెస్టిసైడ్‌లు    4) మొక్కల ఉత్పన్నాల బయోపెస్టిసైడ్‌లు

 

1) బ్యాక్టీరియా బయోపెస్టిసైడ్‌లు:  అనేక రకాల బాసిల్లస్‌ జాతి బ్యాక్టీరియాలను కీటక నాశనులుగా, శిలీంధ్ర వ్యాధులను నియంత్రించడానికి వాడుతున్నారు.

కీటకాలను అదుపులో ఉంచడానికి వాడే బ్యాక్టీరియా: బ్యాక్టీరియాను బయోపెస్టిసైడ్‌లుగా వాడినప్పుడు అవి కీటకాల్లోకి వెళ్లి విషపదార్థాన్ని ఉత్పత్తి చేసి కీటకాలను చంపి వ్యాధులను నియంత్రిస్తాయి.

ఉదా:

* బాసిల్లస్‌ థురియెంజెనిసిస్‌ (బీటీ బ్యాక్టీరియా). ఇది అతి ఎక్కువగా వాడే బ్యాక్టీరియా బయోపెస్టిసైడ్‌. దీనిని పత్తిలో కాయతొలుచు పురుగు; క్యాబేజీ, పొగాకుపై ఆశించే కీటకాల నియంత్రణకు ఉపయోగిస్తున్నారు. 

* బాసిల్లస్‌ పాపిల్లే, బాసిల్లస్‌ లెంటిమార్బస్‌ బ్యాక్టీరియాలను జపనీస్‌ బీటిల్‌ కీటకాన్ని నియంత్రించడానికి వినియోగిస్తున్నారు.

* బాసిల్లస్‌ సిరస్‌ బ్యాక్టీరియాను ఎర్ర గొంగళి పురుగుల నియంత్రణకు వాడుతున్నారు.


శిలీంధ్ర వ్యాధులు నియంత్రించడానికి వాడే బ్యాక్టీరియా బయో పెస్టిసైడ్‌లు: ఈ బ్యాక్టీరియాలు యాంటీ బయోటిక్‌లను (శిలీంధ్ర నాశకాలు) స్రవించి మొక్కలను ఆశించే శిలీంధ్రాలను నియంత్రిస్తాయి. 

ఉదా:

* సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌: సజ్జపై శిలీంధ్రం వల్ల కలిగే డౌనిమిల్‌ డ్యూ వ్యాధిని; టమాట, పొగాకుపై శిలీంధ్రం వల్ల కలిగే డాంపింగ్‌ ఆఫ్‌ వ్యాధిని నియంత్రిస్తాయి.

* బాసిల్లస్‌ సబ్‌టిలిస్‌: ఈ బ్యాక్టీరియా గోధుమ, బార్లీపై రైజోక్టోనియా సొలానీ, ప్యుసేరియం లాంటి శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధులను నియంత్రిస్తుంది.

 

2) శిలీంధ్రాలతో బయోపెస్టిసైడ్‌లు: శిలీంధ్రాలు కీటకాలపై పెరిగి వాటి సంఖ్యను అదుపు చేసి బయోపెస్టిసైడ్‌లుగా పనిచేస్తాయి. కొన్ని శిలీంధ్రాలు ప్రత్యేక ఎంజైమ్‌లను స్రవించి వ్యాధులను కలిగించే శిలీంధ్రాలను నియంత్రిస్తాయి.

ఉదా:

* బవేరియా బాసియానా శిలీంధ్రం కాఫీ బెర్రిబోరర్‌ కీటకాన్ని, వరి కాండం తొలుచు పురుగును నియంత్రిస్తుంది.

* ప్యుసేరియం పాల్లిడోరోసియమ్‌ శిలీంధ్రం ఆఫిడ్స్‌ కీటకాలను అదుపు చేస్తుంది. 

* హిర్సుటెల్లా థాంసోని శిలీంధ్రం సిట్రస్‌ మైట్స్‌ కీటకాలను నియంత్రిస్తుంది.

* ట్రైకోడర్మా విరిడి అనే శిలీంధ్రం అనేక రకాల మొక్కల చీడపీడలను నివారిస్తుంది. 

* గ్లొమాస్‌ మోసియే శిలీంధ్రం సోయాబీన్, ఆవ మొక్కలపై రైజాక్టీనియా సొలానీ శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధులను నియంత్రిస్తుంది.

 

3) వైరస్‌ బయోపెస్టిసైడ్‌లు: హానికర కీటకాలను చంపి మొక్కల వ్యాధులను నియంత్రించే కొన్నిరకాల వైరస్‌లను కూడా బయో పురుగుమందులుగా వాడుతున్నారు.

ఉదా:

* గ్రాన్యులోసిస్‌ వైరస్‌ను చెరకు కాండం తొలుచు పురుగు నియంత్రణకు వాడుతున్నారు.

* హీలియాంథిస్‌ న్యూక్లియర్‌ పాలిహెడరోసిస్‌ వైరస్‌ను పత్తి, మొక్కజొన్న, జొన్న లాంటివాటిని నష్టపరిచే హీలియాంథిస్‌ గొంగళి పురుగు నివారణకు వినియోగిస్తున్నారు. 

 

4) మొక్కల ఉత్పన్నాల బయోపెస్టిసైడ్‌లు: కొన్నిరకాల మొక్కల్లో వివిధ భాగాల నుంచి సంగ్రహించిన పదార్థాలను, పలు పంటలను ఆశించే క్రిమికీటకాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. 

ఉదా:

* బ్రాసికా నైగ్రా (ఆవాలు) పత్రాల నుంచి తీసిన రసాన్ని జనుము కాండం కుళ్లు తెగులు నివారణకు వినియోగిస్తారు. 

* ఆముదం విత్తనాల నూనెను మొక్కజొన్నపై ఆశించే ఆఫిడ్స్, గొంగళిపురుగు కీటకాల నియంత్రణకు వాడతారు.

* సిట్రోనెల్లా గడ్డిపత్రాల నుంచి తీసిన బాష్పశీల నూనెను జనుము, వేరుశనగ, కూరగాయల పంటలను ఆశించే కాండం కుళ్లు తెగులు, వేరుకుళ్లు తెగులు నివారణకు వాడతారు.

* ఉమ్మెత్త పత్రాల నుంచి తీసిన రసాన్ని వరి, గోధుమ పంటలపై శిలీంధ్రం వల్ల కలిగే బ్రౌన్‌రస్ట్‌ వ్యాధి నివారణకు వినియోగిస్తున్నారు. 

* తులసి పత్రాల రసాన్ని కూరగాయల మొక్కలపై ఆశించే లీఫ్‌ మైనర్స్, ఆకుముడత తెగులు నియంత్రణకు వాడుతున్నారు. 

* బొప్పాయి పత్రాల నుంచి తీసిన నిష్కరణలను వరి, గోధుమ, మొక్కజొన్న లాంటి మొక్కలను ఆశించే గొంగళిపురుగులు, ఆఫిడ్స్‌ ఆకు పురుగుల నివారణకు ఉపయోగిస్తున్నారు.

* బిళ్ల గన్నేరు వేరు, పత్రాల నుంచి తీసిన రసాయనాలను పత్తిపై ఆశించే వైట్‌ఫ్లై నివారణకు వాడతారు.

* సీతాఫలం పత్రాలు, విత్తనాల నుంచి తీసిన రసాయనాలను వరి, గోధుమ పంటలపై ఆశించే డైమండ్‌ బ్లాక్‌ మాత్‌లను అదుపుచేయడానికి వాడుతున్నారు.

జీవ పురుగుమందుల ఉపయోగాలు: * రసాయనిక పురుగుమందులను పంటలపై చల్లే సమయంలో, చల్లిన తర్వాత గాలి, నేల, నీటిలోకి ప్రవేశించి కాలుష్యాన్ని కలిగిస్తాయి. కానీ జీవ పురుగుమందులతో ఎలాంటి కాలుష్యం ఉండదు.

* ఇవి సూక్ష్మజీవులతో విచ్ఛిన్నమై ప్రకృతిలో కలిసిపోతాయి. కానీ రసాయన ఉత్పత్తుల అవశేషాలు ఏళ్ల తరబడి అలాగే ఉంటాయి.

* రసాయన పురుగుమందులు ఆహార వలయంలోకి ప్రవేశించి జీవుల్లో జీవ సంచయనం (బయోమాగ్నిఫికేషన్‌) చెందుతాయి. జీవ పురుగుమందుల వల్ల అలాంటి ప్రమాదం ఉండదు.

* రసాయన ఉత్పత్తులతో పంటకు హాని చేసే కీటకాలతో పాటు మేలు చేసేవి కూడా చనిపోతాయి. దీనివల్ల మొక్కల్లో పరపరాగ సంపర్కం తగ్గుతుంది. జీవ మందులు హానిచేసే కీటకాల మీద మాత్రమే ప్రభావం చూపుతాయి.

* రసాయన ఉత్పత్తులతో కీటకాలు క్రమంగా వాటిపై నిరోధకతను సంపాదించుకుంటాయి. జీవ మందుల విషయంలో ఈ ప్రభావం ఉండదు.

* రసాయన ఉత్పత్తులు మోతాదుకు మించి చల్లడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయి. జీవ మందుల విషయంలో ఎలాంటి దుష్ప్రభావం ఉండదు.

* రసాయన పురుగుమందుల ధర ఎక్కువ. జీవ మందులు తక్కువ ధరకే లభ్యమవుతాయి.

* జీవ పురుగుమందులు వాడటం వల్ల సుస్థిర వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం సాధ్యమవుతుంది.

 

పరిమితులు:

* ప్రస్తుతం వీటిని అన్ని పంటలకు వాడటం లేదు. అన్నిరకాల చీడపీడలను వీటితో నియంత్రించడం సాధ్యం కాదు.

* ఎక్కువమంది రైతులకు వీటిపై అవగాహన లేదు. ప్రభుత్వం వీటి గురించి అవగాహన కల్పించాలి.

* రసాయన మందుల మాదిరిగా వీటిని తేలికగా పంటలపై చల్లడం కుదరదు. అందుకు కొద్దిపాటి శిక్షణ అవసరం.

 

జీవ పురుగుమందుల వాడకానికి ప్రభుత్వ చర్యలు:

* భారత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జీవ పురుగుమందుల వాడకాన్ని ప్రచారం చేస్తోంది.

* వీటి ఉత్పత్తి, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేసింది.

* సేంద్రియ వ్యవసాయం, నాచురల్‌ ఫార్మింగ్‌ (ప్రకృతి వ్యవసాయం)లో భాగంగా వీటిని ప్రోత్సహిస్తోంది.

 

మాదిరి ప్రశ్నలు

1. కింది ఏ సూక్ష్మజీవులను వివిధ రకాల పంటలపై బయోపెస్టిసైడ్‌లుగా వాడుతున్నారు?

1) బ్యాక్టీరియా    2) శిలీంధ్రాలు    3) వైరస్‌     4) పైవన్నీ 

 

 

2. బయోపెస్టిసైడ్‌లకు సంబంధించి కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) ఇవి నిర్ణీత చీడ పీడలపై మాత్రమే పనిచేస్తాయి.

2) వీటివల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతాయి.  

3) ఇవి మేలు చేసే కీటకాలను చంపవు. 

4) కీటకాలు నిరోధకతను పెంపొందించుకోవు.

 

 

3. కింది ఏ బ్యాక్టీరియాను పత్తి పంటలో కాయతొలుచు పురుగు నివారణకు బయోపెస్టిసైడ్‌గా వాడుతున్నారు?

1) బాసిల్లస్‌ థురియెంజెనిసిస్‌     2) బాసిల్లస్‌ మైకాయిడిస్‌ 

3) సూడోమోనాస్‌ డీనైట్రిఫికెన్స్‌    4) రైజోబియం సొలాని 

 

 

4. బయోపెస్టిసైడ్‌గా వాడే బ్యాక్టీరియా కింది వేటిని నియంత్రిస్తుంది?

1) వైరస్, శిలీంధ్ర వ్యాధులు     2) వైరస్, బ్యాక్టీరియా వ్యాధులు 

3) శిలీంధ్ర, కీటక వ్యాధులు     4) వైరస్, కీటక వ్యాధులు 

 

 

5. సజ్జపై శిలీంధ్రం వల్ల కలిగే డౌనిమిల్‌ డ్యూ వ్యాధిని నియంత్రించడానికి బయోపెస్టిసైడ్‌గా దేన్ని వాడుతున్నారు?

1) కీటకం     2) బ్యాక్టీరియా    3) వైరస్‌     4) శిలీంధ్రం 

 

 

6. ఏ మొక్క పత్రాల నుంచి తీసిన బాష్పశీల నూనెను జనుము, వేరుశనగ, కూరగాయల పంటలను ఆశించే కాండం కుళ్లు తెగులు నివారణకు వాడుతున్నారు?

1) ఆముదం      2) ఉమ్మెత్త        3) సిట్రోనెల్లా    4) బొప్పాయి

 

 

7. మొక్కజొన్నపై ఆశించే ఆఫిడ్స్, గొంగళి పురుగు నివారణకు ఏ మొక్క నుంచి లభించే ఆహారయోగ్యం కాని విత్తనాల నూనెను వాడుతున్నారు?

1) ఆవ      2) ఆముదం    3) వేరుశనగ    4) కుసుమ

 

 

8. ఏ మొక్కల వివిధ భాగాల నుంచి తీసిన నిష్కరణలను పంట మొక్కలపై వ్యాధుల నివారణకు వాడుతున్నారు?

1) ఆవ, ఆముదం     2) సిట్రోనెల్లా, ఉమ్మెత్త     3) తులసి, బొప్పాయి, బిళ్ల గన్నేరు     4) పైవన్నీ

 

 

9. కాఫీ బెర్రిబోరర్‌ కీటకాన్ని, వరి కాండం తొలుచు పురుగు కీటకాన్ని నియంత్రించడానికి ఏ శిలీంధ్రాన్ని బయోపెస్టిసైడ్‌గా వాడుతున్నారు?

1) రైజోపస్‌ మ్యూకాయిడిస్‌     2) సూడోమోనాస్‌ మైకాయిసిస్‌     3) బవేరియా బాసియానా    4) ఈస్ట్‌

 

 

10. చెరకు కాండం తొలుచు పురుగు నివారణకు ఏ వైరస్‌ను బయోపెస్టిసైడ్‌గా వాడుతున్నారు?

1) గ్రాన్యులోసిస్‌ వైరస్‌   2) సార్స్‌ వైరస్‌     3) రెటిక్యులో వైరస్‌    4) అడినో వైరస్‌

సమాధానాలు: 1-4; 2-2; 3-1; 4-3; 5-2; 6-3; 7-2; 8-4; 9-3; 10-1.

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

Posted Date : 07-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌