• facebook
  • whatsapp
  • telegram

సహజ వనరులు

* సహజ వనరుల ప్రాధాన్యం
* ఆర్థిక అభివృద్ధికి దోహదం
  సహజ వనరులు ప్రకృతి ప్రసాదిత ఆస్తులు.. అభివృద్ధికి సూచికలు.. మానవ జీవన సంపదలు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సహజ వనరుల్లో భూమి అతి పెద్ద సంపద. తినడానికి తిండినిచ్చే పంటలు పండేవి ఈ భూమిపైనే. ఉండటానికి మంచి ఇల్లు కట్టుకోవాలన్నా భూమి తప్పనిసరి.. భూమిపై పెరిగే పచ్చని చెట్లు, ప్రవహించే నదులు.. భూమి లోపలి జలాలు.. ఇలా మనిషి బతకడానికి మూలమైన అంశాలన్నీ ప్రసాదించేది భూమి. అందుకే ఒక ప్రాంతంలో ఉండే సహజ వనరులు ఆ ప్రాంత ఆర్థికప్రగతిలో కీలకమవుతాయి. ఇలాంటి వనరుల ప్రాధాన్యం.. తెలంగాణ రాష్ట్రంలో సహజ సంపద.. తదితర అంశాల గురించి తెలుసుకుందాం.
ప్రకృతి ప్రసాదించే సహజ వనరుల్లో భూమి, నీరు, మత్స్య సంపద, అడవులు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం ప్రధానమైనవి. ఇవన్నీ ఉచితంగా లభిస్తాయి కాబట్టి వీటిని ప్రకృతి వనరులు అంటారు. సహజ వనరులను ఆర్థికాభివృద్ధికి ప్రధాన, కీలకమైన అంశాలుగా ఆర్థికవేత్తలు గుర్తించారు. భారత ప్రణాళిక సంఘం (దీని స్థానంలో తాజాగా నీతి ఆయోగ్ ఏర్పడింది) నిరుపయోగమైన సహజ, మానవ వనరులున్న ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించింది. ఈ వనరులను అభిలషణీయంగా ఉపయోగించి సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రణాళికలు రూపొందించింది.

 

వర్గీకరణ

సహజ వనరులను రెండు రకాలుగా వర్గీరిస్తారు.

1. పునరుత్పత్తి చేయగల సహజ వనరులు.

2. పునరుత్పత్తి చేయలేని సహజ వనరులు.

పునరుత్పత్తి చేయగల సహజ వనరులు వాడకం వల్ల పరిమాణం తగ్గకుండా తిరిగి ఉత్పన్నం చేయగలిగేవి. ఉదా: సూర్యరశ్మి, గాలి, నీరు, అటవీ సంపద. అయితే వీటిని కూడా ఒక స్థాయి దాటిన తర్వాత వినియోగిస్తే తిరిగి ఉత్పన్నం చేయడం కష్టం కావచ్చు. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో అడుగంటుతున్న నీటి వనరులను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

పునరుత్పత్తి చేయలేని సహజ వనరులు వాడకం వల్ల కొన్ని నిల్వలు అంతరించిపోతాయి. వాటిని తిరిగి ఉత్పన్నం చేయడం సాధ్యం కాదు. ఉదా: బొగ్గు, చమురు, ఖనిజాలు.

 

అభివృద్ధిలో ప్రాధాన్యం

  ఒక దేశ అభివృద్ధిలో సహజ వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. ఆర్థికాభివృద్ధికి, వనరుల పరిమాణానికి మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది. ఆర్ధర్ లూయిస్ భావనతో బౌమల్ ఏకీభవించి వనరుల పరిమితి ఆర్థికాభివృద్ధిని నిర్దేశిస్తుందని తెలిపాడు. హరడ్ క్షీణ ప్రతిఫలాలను ఖండిస్తూ ఆర్థికాభివృద్ధిలో వనరుల లభ్యత ప్రధానాంశం కాదని వాదించాడు. జాతీయాదాయం ఒక స్థాయికి పెరిగాక ఆర్థికాభివృద్ధిలో సహజ వనరుల ప్రాధాన్యం తగ్గుతుంది. అయినప్పటికీ దేశ స్థితిగతులను బట్టి, నేటికీ అన్ని దేశాల్లో ప్రజలు సహజవనరులపైనే ఆధార పడుతున్నారు.

 

సహజ వనరులతో సర్వతోముఖాభివృద్ధి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అన్ని రంగాల (వ్యవసాయ, పారిశ్రామిక, సేవా) అభివృద్ధికి సహజ వనరులు తోడ్పడతాయి. ఇవి రాష్ట్ర ఆర్థిక స్వరూపాన్ని అభివృద్ధి దశకు తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

* అభివృద్ధి ప్రారంభంలో సహజ వనరుల స్థాయి, పరిమాణం, వినియోగం తప్పనిసరిగా ఉంటుంది.

* భూమి, భూసారం, వాతావరణం, నీటివనరులు, అటవీ సంపద లాంటి సహజ వనరుల అభిలషణీయ వినియోగం, సత్వర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

* అనుకూల భౌగోళిక పరిస్థితులు రాష్ట్రంలో రవాణా సదుపాయాలు, వాణిజ్యం, పరిశ్రమల స్థాపన లాంటి రంగాల అభివృద్ధికి కృషి చేస్తాయి.

* ఖనిజ సంపద భారీ పరిశ్రమలు, ఇంజినీరింగ్, విద్యుత్తు, రసాయన పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలను అందించి పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

* అటవీ సంపద, నీటివనరులు.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కృషి చేస్తాయి.

 

భూమి

  సహజ వనరులన్నింటిలో అత్యంత ముఖ్యమైంది భూమి. మానవుడు, ఇతర జీవరాశులు ఆవాసం ఏర్పరచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వ్యవసాయానికి, పరిశ్రమల స్థాపనకు, అడవుల పెంపునకు భూవనరులు అత్యంత అవసరం. రైలు, రోడ్డు లాంటి రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందాలంటే భూమి ఉపరితలం వల్లే సాధ్యమవుతుంది. భూవైశాల్యంతోపాటు భూసారం, భూమి స్వభావం రాష్ట్ర అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.

 

తెలంగాణ భూభాగం

  ఒక దేశం అభివృద్ధి చెందే ప్రారంభ సమయంలో లేదా ప్రాథమిక దశలో ఆర్థికాభివృద్ధి ఒక ప్రాంతంలో లభ్యమయ్యే సహజ వనరులకు పరిమితమై ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. తర్వాత విదేశీ మారక ద్రవ్య ఆర్జన, మూలధన వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయి

- ఇర్వింగ్ ఫిషర్

* తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూ విస్తీర్ణం 114.84 లక్షల హెక్టార్లు.

* అడవుల విస్తీర్ణం 27.43 లక్షల హెక్టార్లు. మొత్తం భూ విస్తీర్ణంలో ఇది 23.89 శాతం.

* సాగుభూమి విస్తీర్ణం 49.61 లక్షల హెక్టార్లు. మొత్తం విస్తీర్ణంలో ఇది 43.20 శాతం.

* పడావు భూములు 9.60 లక్షల హెక్టార్లు. మొత్తం విస్తీర్ణంలో ఇది 8.36 శాతం.

* వ్యవసాయేతర ప్రయోజనాలకు 7.79 శాతం భూములు వినియోగమవుతున్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 8.95 లక్షల హెక్టార్లు.

* రాష్ట్రంలో సాగుకు పనికి రాని భూములు, బంజరు భూములు 6.15 లక్షల హెక్టార్లు. మొత్తం భూవిస్తీర్ణంలో ఇది 5.36 శాతం.

* ఇతర పడావు భూములు 6.24 శాతం ఉండగా.. వీటి విస్తీర్ణం సుమారు 7.17 లక్షల హెక్టార్లు.

  సహజ వనరుల లభ్యత, స్థాయి, వినియోగం అనేవి ఒక దేశ ఉత్పత్తి పెరుగుదలతోపాటు సామాజిక, సాంఘిక, సాంకేతిక, వ్యవస్థాపూర్వక ప్రగతిశీల మార్పుల పరిమాణం, పోకడలను నిర్దేశిస్తాయి.

- ఆర్ధర్ లూయిస్* రాష్ట్రంలో భూమి సాగు చేయడానికి వీలైనప్పటికీ 1.55 శాతం భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వీటి విస్తీర్ణం 1.78 లక్షల హెక్టార్లు.

* శాశ్వత పచ్చిక బయళ్లు, మేత బయళ్లు 3.01 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉండగా ఇది మొత్తం భూవిస్తీర్ణంలో 2.62 శాతంగా ఉంది. మిగిలిన నికర సాగులో చేర్చని వృక్షాలు, తోపుల కింద భూమి 1.14 లక్షల హెక్టార్లు కాగా ఇది మొత్తం భూవిస్తీర్ణంలో 0.99 శాతంగా ఉంది.

Posted Date : 26-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌