• facebook
  • whatsapp
  • telegram

ఆరోగ్య‌రంగం

  దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అన్నారో మహాకవి. మానవ వనరులే ఏ దేశానికైనా మహా సంపద అన్నది ఇందులోని పరమార్థం. మానవ వనరులను నాణ్యంగా తీర్చిదిద్దడం.. వీటి కోసం నిధులు వెచ్చించడం.. వంటి కార్యక్రమాలు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. మానవ వనరుల అభివృద్ధిలో ప్రధానంగా ఖర్చు చేయాల్సిన అంశాల్లో ఆరోగ్య రంగం ఒకటి.ఈ నేపథ్యంలోతెలంగాణ మానవ వనరుల అభివృద్ధి గురించి తెలుసుకుందాం.

  దేశ ఆర్థికాభివృద్ధిలో మానవ వనరుల పాత్ర కీలకం. ఉత్పాదక స్థితిగతులు, సహజవనరులు, ముడి పదార్థాల నాణ్యత పెంపులో మానవ వనరులదే ప్రధానపాత్ర. ఇంతటి కీలకమైన మానవ వనరుల నాణ్యత వృద్ధి అనేది అక్షరాస్యత, ఆరోగ్య రంగం తదితర సామాజిక, సాంఘిక అవస్థాపన రంగాల మీద ఆధారపడి ఉంటుంది.

  మానవ వనరుల నాణ్యత, నైపుణ్యం పెరుగుదలలో - విద్య, వైద్య రంగాలు అత్యంత కీలకమైన అంశాలు.

  మానవ వనరుల అభివృద్ధి, ఉత్పాదక శక్తి పెంపులో అత్యంత కీలకమైన అంశాల్లో విద్య, శిక్షణ, ఆరోగ్య రంగాల పాత్ర అత్యంత ప్రధానం. ప్రజల ఆయుర్ధాయం పెంచే శక్తి, సమర్ధత, ఆరోగ్యం వంటి అంశాలపై చేసే వ్యయాలు మానవ వనరుల నాణ్యత, నైపుణ్యాల స్థితిని నిర్ణయిస్తాయి. - టి.డబ్ల్యూ. షుల్జ్వై

ద్యరంగం ప్రాధాన్యం

* మానవ వనరుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే ఉత్పాదక శక్తి పెరిగి మానవ మూలధనం నాణ్యత మెరుగవుతుంది.

* ఆరోగ్య రంగంపై ప్రభుత్వం చేసే వ్యయంలో పెంపు దేశంలో మానవ వనరుల నాణ్యతను పెంచుతుంది.

* వైద్య విద్య, వ్యాధి నివారణ చికిత్స, పౌష్ఠికాహారం స్థాయి లభ్యత .. లాంటి రంగాల్లో పెట్టుబడి రూపంలో వెచ్చిస్తే శ్రామికుల ఆరోగ్య స్థితి పెరిగి జాతీయ ఉత్పత్తి సహజంగానే పెరుగుతుంది.

* ప్రభుత్వంఅందించే సంతులిత, పౌష్ఠికాహారం, వైద్య సంరక్షణల వల్ల మానవ వనరుల ఆరోగ్యస్థితి మెరుగు పడుతుంది.

* మానవ వనరుల వృద్ధి, ఆర్థికాభివృద్ధి ప్రక్రియలు రెండూ జంటగా పనిచేస్తాయి. ఇవి విద్య, వైద్య రంగాల వృద్ధికి దోహదం చేసేలా ఉంటే మానవ వనరుల సమర్థత పెరిగి ఉత్పత్తి అధికమవుతుంది.

 

తెలంగాణ ఆరోగ్య రంగం

* తెలంగాణ ఆరోగ్య రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు 6 జిల్లాల్లో శిశుమరణాల రేటు (ఐఎమ్ఆర్) జాతీయ సగటు 40 కంటే చాలా ఎక్కువగా ఉంది.

* ఆదిలాబాద్ జిల్లాలో మాతృ మరణాల రేటు (ఎమ్ఎమ్ఆర్) 152. ఇది జాతీయ స్థాయి సగటు కంటే అధికం.

* ఆదిలాబాద్ జిల్లాలో ఆస్పత్రుల్లో కాకుండా ఇళ్ల వద్దే ప్రసవాలు అత్యధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

* ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ నిర్వహించిన జిల్లాస్థాయి కుటుంబ సర్వే 2012-13 ప్రకారం ఇళ్ల వద్ద ప్రసవాలు 11.5 శాతంగా ఉన్నాయి.

 

శిశుమరణాల రేటు (ఐఎమ్ఆర్)

* ఒక సంవత్సరంలో వెయ్యి జననాలకు మరణించిన శిశువుల (ఒక సంవత్సరం లోపు) నిష్పత్తిని ఇది తెలుపుతుంది.

* భారతదేశంలో ఈ నిష్పత్తి 40 కాగా, తెలంగాణలో 39.

 

అత్యధిక శిశుమరణాల రేటు ఉన్న జిల్లాలు

* మహబూబ్‌నగర్ (53)

* మెదక్ (49)

* నిజామాబాద్ (48)

* ఆదిలాబాద్ (48)

 

తక్కువ శిశుమరణాల రేటు ఉన్న జిల్లాలు

* హైదరాబాద్ (20)

* రంగారెడ్డి (33)

* కరీంనగర్ (37)

 

మాతృ మరణాల రేటు (ఎమ్ఎమ్ఆర్)

* ఒక ఏడాదిలో లక్ష మంది గర్భిణుల్లో ప్రసవ సమయంలో చనిపోయేవారి సంఖ్యను తెలిపే నిష్పత్తి. మాతృ మరణాల రేటు భారతదేశంలో 167గా (2011 - 13) ఉంది.

* తెలంగాణలో మాతృ మరణాల రేటు 92గా ఉంది. ఇది దేశ సగటు కంటే తక్కువ.

 

అత్యధిక మాతృ మరణాల రేటు ఉన్న జిల్లాలు

* ఆదిలాబాద్ (152)

* ఖమ్మం (99)

* మహబూబ్‌నగర్ (98)

 

మాతృ మరణాలరేటు తక్కువ ఉన్న జిల్లాలు

* హైదరాబాద్ (71)

* కరీంనగర్ (74)

* రంగారెడ్డి (78)

* వరంగల్ (78)

 

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

తెలంగాణలో ప్రధానంగా ఆరోగ్య రంగానికి సంబంధించి విస్తృతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మాతృ ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కింది సేవలు ప్రారంభించారు.

 

1. అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్ (ఆశా)

* సామాజిక ఆరోగ్య రంగ అభివృద్ధిలో 'ఆశా' కార్యక్రమం అత్యంత ప్రాధాన్యం పొందింది.

* ఆశా పథకం/కార్యక్రమం ప్రధానంగా పోషణ, మౌలిక పరిశుభ్రత, ఆరోగ్యజీవన విధానాలు, ఆరోగ్య సేవల సమాచారం... వీటన్నింటిపై అవగాహన కల్పిస్తుంది.

* గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తల సంఖ్య 28,019. ప్రస్తుతం 25,818 మంది ఉన్నారు.

* పట్టణ ప్రాంతాలకు 2660 ఆశా కార్యకర్తల పోస్టులను మంజూరుచేయగా 2502 మంది పనిచేస్తున్నారు.

 

24 గంటల మాతా శిశు కేంద్రాలు

* 24 గంటల మాతా శిశు కేంద్రాల ప్రధాన ఉద్దేశం నవజాత శిశువుల మరణాల తగ్గింపు, ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడటం.

* మొత్తం 340 ప్రజారోగ్య కేంద్రాలు ఉన్నాయి.

 

శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు

* తెలంగాణలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగాలు - 18

* నవజాత ఆరోగ్య స్థిరీకరణ విభాగాలు - 61

* నవజాత శిశు సంరక్షణ కార్నర్‌లు - 551

* ఈ కేంద్రాలన్నీ నవజాత శిశు సంరక్షణ ద్వారా శిశు మరణాలు తగ్గించడానికి ఉద్దేశించినవి.

 

గ్రామ ఆరోగ్య పోషణ కేంద్రాలు

* ఈ కేంద్రాలు సుమారు 32,143 గ్రామాల్లో ఉన్నాయి.

* ఈ కేంద్రాలు ప్రధానంగా వివాహ వయసుపై అవగాహన, గర్భిణుల నమోదు, వారి ఆరోగ్యంపై శ్రద్ధ, ఆస్పత్రుల్లో ప్రసవం, టీకాలు, తల్లిపాల విశిష్టత, సంతాన నిరోధం లాంటి సేవలు అందిస్తాయి.

 

కుటుంబ నియంత్రణ బీమా పథకం

* కుటుంబ నియంత్రణ బీమా పథకం ప్రధానంగా సంతాన నిరోధాన్ని అంగీకరించిన వారికి అధీకృత బీమా సంస్థ ద్వారా బీమాను కల్పించడం ఈ పథకం ప్రధాన ఆశయం.

 

గిరిజన ఆరోగ్య సేవలు

* గిరిజన జనాభా ఆధికంగా ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 3 ఐటీడీఏల ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.

 

జననీ శిశు సురక్ష పథకం

* అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో నగదు రహితంగా, ఉచితంగా పురుడు పోయడానికి, శిశువులకు ఏడాదిపాటు ఆరోగ్య రక్షణ కల్పనకు కేంద్రప్రభుత్వం తయారు చేసిన పథకం.

 

రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కే)

* భారత ప్రభుత్వం 10-19 సంవత్సరాల వయసు బాల బాలికలకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ, కౌన్సిలింగ్ సేవల నిర్వహణకు దీన్ని ప్రారంభించింది.

 

1993 ప్రపంచ అభివృద్ధి నివేదిక

 

ఆరోగ్యం ఆర్థికవృద్ధికి తోడ్పడే అంశాలు..

* శ్రామికుల అనారోగ్యం వల్ల ఉత్పత్తిలో ఏర్పడే నష్టాన్ని తగ్గించి ఆర్థిక వృద్ధి పెంపునకుఆరోగ్యం ప్రధాన కారకంగా పనిచేస్తుంది.

* మెరుగైన ఆరోగ్యం పాఠశాలలో పిల్లల నమోదును పెంచుతుంది. అంతేకాకుండా వారి అభ్యసన స్థాయి పెరిగేలా చేస్తుంది.

* అనారోగ్యంపై ఖర్చు చేసే ఆర్థిక వనరులను ఇతర ప్రత్యామ్నాయ ఉపయోగాలకు వాడే వీలును ఆరోగ్యం పెంచుతుంది. తద్వారా ప్రత్నామ్నాయ రంగాల వృద్ధి జరిగి ఆర్థికాభివృద్ధి, గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తుంది.

* ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా సంతులిత ఆహారం, పౌష్ఠికాహారం, వైద్య సంరక్షణల వ్యయంపై పెంపు తప్పనిసరిగా చేయాలి.

Posted Date : 26-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌