• facebook
  • whatsapp
  • telegram

నీటి వనరులు

  తెలంగాణలో వ్యవసాయానికి బావులే ప్రధాన సాగునీటి వనరులు.. తరువాతి స్థానంలో కాలువలు, చెరువులు ఉన్నాయి. బావులు సమృద్ధిగా సాగునీరు అందించాలంటే సకాలంలో, అవసరం మేర వర్షాలు కురవాలి. ఈ వర్షాలకు నైరుతి రుతు పవనాలే పెద్దదిక్కు. అవి ముఖం చాటేస్తే సాగు ప్రశ్నార్థకమై పోతుంటుంది. ఫలితంగా ఏటేటా స్థూల, నికర సాగు విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

* తెలంగాణ సాగునీటి చిత్రం

* నైరుతి రుతుపవనాలే ఆధారం

  తెలంగాణలో వ్యవసాయం ప్రధానంగా వర్షాలపైనే ఆధారపడి ఉంది. రాష్ట్ర సగటు వర్షపాతంలో 80 శాతం నైరుతి రుతుపవనాల మీదే ఆధారం. వర్షపునీరు వివిధ ప్రాంతాల మధ్య పలు రకాలుగా పంపిణీ అవుతుంది. వర్షాధారిత వ్యవసాయ విధానం.. గోదావరి, కృష్ణా నదుల మిగులు జలాలను సరైన రీతిలో వాడకపోవడం.. తెలంగాణ వ్యవసాయరంగం వెనుకబాటుకు కారణాలుగా చెప్పవచ్చు.

 

సాగు వ్యవసాయ నిష్పత్తి (ఇరిగేషన్ రేషియో)

  సాగు వ్యవసాయ నిష్పత్తినే నీటిపారుదల నిష్పత్తి అనవచ్చు. 2008-09లో సాగు నీటిపారుదల నిష్పత్తి 44.53 శాతం ఉండగా అది 2009-10 నాటికి 37.72 శాతానికి తగ్గింది. 2010-11లో అది 44.64 శాతం ఉండగా 2013-14 నాటికి 46.14 శాతానికి పెరిగింది. 2014-15 ఖరీఫ్‌లో నీటిపారుదల నిష్పత్తి 35.86 శాతంగా ఉంది.

 

నీటి వనరులు

  తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి వనరుల్లో బావులే ప్రధానం. తర్వాత వరుసగా కాలువులు, చెరువులు ఉన్నాయి. వర్షపాతం సరిగా లేనందువల్ల రాష్ట్రంలో బావులపై ఆధారపడే వ్యవసాయదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

* 2008-09లో సాగునీరందిన నికర విస్తీర్ణం 18.82 లక్షల హెక్టార్లు ఉండగా ఇందులో అత్యధికంగా 72.09 శాతం విస్తీర్ణానికి బావుల ద్వారా నీటివసతి సమకూరింది. చెరువుల ద్వారా 13.03 శాతం, కాలువల ద్వారా 11.55 శాతం విస్తీర్ణానికి సాగునీరందింది.

* 2013-14లో సాగునీరందిన నికర విస్తీర్ణం 22.89 లక్షల హెక్టార్లు.. ఇందులో 74.83 శాతం బావుల ద్వారా, 10.05 శాతం చెరువుల ద్వారా, 12.67 శాతం కాలువల ద్వారా సాగయింది.

చెరువులు: తెలంగాణలో నీటి పారుదల సౌకర్యాలు అందించే వనరుల్లో చెరువుల వాటా 2008-09 నాటికి 13.03 శాతం. 2009-10 నాటికి 3.82 శాతం కాగా 2014-15 ఖరీఫ్ నాటికి 6.05 శాతానికి పెరిగింది.

కాలువలు: నీటి పారుదల వనరుల్లో కాలువల వాటా 2008-09లో 11.55 శాతం. 2014-15 ఖరీఫ్ నాటికి 10.52 శాతానికి తగ్గింది.
పై నీటి వనరుల గణాంకాల ఆధారంగా.. 2014 ఖరీఫ్ నాటికి మొత్తం నీటి వనరుల్లో వరుస క్రమంలో బావులు, కాలువలు, చెరువులు నీటివసతిని అందిస్తున్నట్లు అర్థమవుతుంది.

 

స్థూల నీటిపారుదల నిష్పత్తి

  తెలంగాణలో స్థూల నీటి పారుదల నిష్పత్తిలో కొంతమేర హెచ్చుతగ్గులు ఉన్నాయి. 2007-08లో 24.46 లక్షల హెక్టార్లు ఉండగా 2010-11 నాటికి అది 29.99 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఈ నిష్పత్తి 2012-13 నాటికి 25.57 లక్షలకు తగ్గినప్పటికీ 2013-14 నాటికి 31.64 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2014-15 ఖరీఫ్ సాగులో నీటిపారుదల విస్తీర్ణం 14.98 లక్షల హెక్టార్లుగా ఉంది.

 

నికర నీటిపారుదల నిష్పత్తి

  తెలంగాణలో నికర నీటిపారుదల నిష్పత్తిలో కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి. 2007-08లో నికర నీటి వసతి 17.49 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇది 2010-11 నాటికి 20.04 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2011-12లో 19.85 లక్షల హెక్టార్ల నుంచి 2013-14 నాటికి 22.89 లక్షల హెక్టార్లకు పెరిగింది. తద్వారా నికర నీటిపారుదల నిష్పత్తిలో పెరుగుదల ఉందని చెప్పవచ్చు. 2014-15 ఖరీఫ్ నాటికి నికరంగా 14.87 హెక్టార్ల విస్తీర్ణానికి జలవనరులు అందుబాటులో ఉన్నట్లు చెప్పవచ్చు.

 

నీటి సాగు సాంద్రత

  బావులు, జలాశయాల్లాంటి అన్ని వనరుల నుంచి స్థూలంగా సాగునీరు అందే విస్తీర్ణంలో నికర సాగునీటి విస్తీర్ణాన్ని 'నీటి సాగు సాంద్రత' అంటారు. 2007-08లో నీటి సాగు సాంద్రత 1.40 ఉండగా 2010-11 నాటికి 1.50కు పెరిగింది. ఇది క్రమంగా 2011-12 నుంచి 2013-14 నాటికి 1.44 నుంచి 1.38కు తగ్గింది. 2014-15 ఖరీఫ్ నాటికి నీటి సాగు సాంద్రత 1.01గా ఉంది.

* బావుల కింద స్థూల నీటివసతి 2007-08లో 18.23 లక్షల హెక్టార్లుండగా 2013-14 నాటికి 23.36 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2014-15 ఖరీఫ్ నాటికి బావులు 4.41 లక్షల హెక్టార్లకు నీటివసతిని అందిస్తున్నాయి.

* బావుల కింద నికర నీటివసతి 2007-08లో 13.14 లక్షల హెక్టార్లుండగా 2013-14 నాటికి 17.13 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2014-15 ఖరీఫ్‌లో ఇది 4.41 లక్షల హెక్టార్లుగా ఉంది.

* బావుల కింద సేద్య నీటి సాగు సాంద్రత 2007-08లో 1.39 ఉండగా అది 2013-14లో 1.36గా ఉంది. 2014-15 ఖరీఫ్‌లో 1.00 ఉంది.

 

ముఖ్యాంశాలు

* తెలంగాణలో నికర సాగు విస్తీర్ణం 2008-09తో పోలిస్తే 2009-10 నాటికి 2.68 లక్షల హెక్టార్లు తగ్గింది. 2009-10తో పోలిస్తే 2013-14 నాటికి క్రమంగా 10.03 లక్షల హెక్టార్ల మేర పెరుగుతూ వచ్చింది.

* సాగునీరు అందిన నికర విస్తీర్ణం 2008-09 నుంచి 2009-10 నాటికి 3.89 లక్షల హెక్టార్లు తగ్గింది. 2009-10తో పోలిస్తే 2013-14 నాటికి క్రమంగా 7.96 లక్షల హెక్టార్ల మేర పెరుగుతూ వచ్చింది.
* తెలంగాణలోని మొత్తం జలవనరుల్లో బావులే ఎక్కువ నీటి వసతిని అందిస్తున్నాయి.

Posted Date : 26-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌