• facebook
  • whatsapp
  • telegram

ముఖ్యమంత్రి

భారత పార్లమెంటరీ విధానం ప్రకారం రాష్ట్రంలో గవర్నర్ నామమాత్ర కార్యనిర్వహణ అధికారి. వాస్తవంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వంలోని మంత్రిమండలి కార్యనిర్వహణ వర్గంగా అధికారాలను చెలాయిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వాధిపతి.

నియామకం

ఆర్టికల్ 164(1) ప్రకారం గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తారు. సాధారణ(సార్వత్రిక) ఎన్నికల తర్వాత మెజార్టీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాకపోతే రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కూటమిగా ఏర్పడినప్పుడు కూటమి నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తారు. ఏ పార్టీకీ మెజార్టీ లేనప్పుడు, పార్టీల కూటమి ఏర్పడనప్పుడు గవర్నర్ తన విచక్షణ అధికారాలతో ఏ వ్యక్తినైనా ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. అయితే ముఖ్యమంత్రిగా నియమితుడైన వ్యక్తి రాష్ట్ర శాసనసభలో తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

 

అర్హతలు

భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రి పదవికి కావాల్సిన అర్హతలు పేర్కొనలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వర్గం శాసనశాఖ నుంచి ఆవిర్భవిస్తుంది. ఈమేరకు ముఖ్యమంత్రి విధానసభలో సభ్యుడిగా ఉండాలి. కాబట్టి విధానసభ సభ్యులకు నిర్దేశించిన అర్హతలే ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తాయి. అయితే శాసనసభలో సభ్యుడు కాని వ్యక్తిని కూడా ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 6 నెలలల్లోపు అతడు శాసనసభ సభ్యుడిగా ఎన్నిక కావాలి.

 

పదవీకాలం

ముఖ్యమంత్రి పదవికి నిర్దిష్ట కాలపరిమితి లేదు. ఆర్టికల్ 164(1) ప్రకారం గవర్నర్ సంతృప్తి చెందినంత కాలం ముఖ్యమంత్రి ఆ పదవిలో కొనసాగుతారు. వాస్తవంగా రాష్ట్ర శాసనసభలో మెజార్టీ ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతారు. ఇక్కడ గవర్నర్ సంతృప్తి అంటే శాసనసభలో మెజార్టీ అని అర్థం చేసుకోవాలి.

 

అధికారాలు - విధులు

1. గవర్నర్‌కు ముఖ్య సలహాదారు

ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్‌కు విధి నిర్వహణలో సహాయపడటానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది. ఆర్టికల్ 164(1) ప్రకారం ముఖ్యమంత్రి సూచించిన వారిని గవర్నర్ మంత్రులుగా నియమిస్తారు. మంత్రులను నియమించడం, వారికి శాఖలు కేటాయించడం, మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించడంలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో గవర్నర్ పాత్ర లాంఛనప్రాయమే.

ముఖ్యమంత్రితో విభేదించే మంత్రులను.. వారి మంత్రి పదవికి రాజీనామా చేయమని ముఖ్యమంత్రి కోరవచ్చు లేదా వారిని మంత్రిపదవి నుంచి తొలగించమని గవర్నర్‌కు సిఫార్సు చేయవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి సూచించిన వారినే గవర్నర్ వివిధ ప్రభుత్వ పదవుల్లో నియమిస్తారు.

 

2. మంత్రిమండలి నాయకుడు

ముఖ్యమంత్రి మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. మంత్రులకు సలహాలు, సూచనలు ఇస్తారు. వారి మధ్య సమన్వయం ఉండేలా చూస్తారు. వారిని నియంత్రించే అధికారం కూడా ముఖ్యమంత్రికి ఉంటుంది. ఒకవేళ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసినా లేదా మరణించినా మొత్తం మంత్రిమండలి రద్దవుతుంది.

 

3. శాసనసభకు నాయకుడు

ముఖ్యమంత్రి విధానసభకు నాయకుడు. విధానసభ సక్రమంగా జరగడానికి సభ నిర్వహణలో స్పీకర్‌కు తగిన మద్దతు ఇస్తారు. విధానసభను సమావేశపరచమని లేదా రద్దు చేయమని కూడా గవర్నర్‌ను కోరవచ్చు. విధానసభ సమావేశాల్లో లేనప్పుడు ముఖ్యమంత్రి గవర్నర్‌తో ఆర్డినెన్స్ జారీ చేయిస్తారు.

 

4. గవర్నర్ - మంత్రిమండలి మధ్య వారధి

ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్‌కు, మంత్రిమండలికి మధ్య ముఖ్యమంత్రి సమాచార వారధిగా పని చేస్తారు. మంత్రిమండలి తీసుకున్న పాలనా నిర్ణయాలు, శాసన ప్రతిపాదనలు గవర్నర్‌కు; గవర్నర్ సలహాలు, సూచనలు మంత్రిమండలికి తెలియజేస్తారు.

 

5. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి

ముఖ్యమంత్రి రాష్ట్రప్రభుత్వం తరపున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలుచేస్తున్న కార్యక్రమాలను అధికారికంగా ప్రకటిస్తారు.

 

6. రాష్ట్ర ప్రజల నాయకుడు

ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు తగిన సహాయం, ఉపశమన చర్యలకు ఆదేశాలు జారీచేస్తారు.

 

7. ఇతర అధికారాలు

ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రణాళిక బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జోనల్ కౌన్సిల్‌కు రొటేషన్ పద్ధతిలో వైస్‌ఛైర్మన్‌గా పనిచేస్తారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే జాతీయాభివృద్ధి మండలి, అంతర్‌రాష్ట్ర మండలిలో సభ్యుడిగా ఉంటారు.

 

రాష్ట్ర మంత్రిమండలి

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్‌కు విధి నిర్వహణలో సహాయపడటానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది. ఆర్టికల్ 164(1) ప్రకారం ముఖ్యమంత్రి సూచించిన వారిని గవర్నర్ మంత్రులుగా నియమిస్తారు. రాష్ట్ర మంత్రులు - క్యాబినెట్, రాష్ట్ర, డిప్యూటీ మంత్రులుగా ఉంటారు.

మంత్రులుగా నియమించడానికి భారత రాజ్యాంగం ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు పేర్కొనలేదు. అయితే 164(1) ప్రకారం రాష్ట్ర శాసనసభలో సభ్యత్వం లేని వ్యక్తి మంత్రిగా 6 నెలల కంటే మించి కొనసాగకూడదు. దీని ప్రకారం రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాని వ్యక్తిని మంత్రిగా నియమించవచ్చు. 6 నెలల లోపు విధానసభ లేదా విధాన పరిషత్ (విధాన పరిషత్‌ను విధాన మండలి లేదా శాసన మండలి లేదా కౌన్సిల్ అని కూడా అంటారు) సభ్యుడు కావాల్సి ఉంటుంది. ఈమేరకు శాసనసభ్యుడిగా ఎన్నిక కావాల్సిన అర్హతలు మంత్రులకు ఉండాలి.
ఆర్టికల్ 164(3) ప్రకారం రాష్ట్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆర్టికల్ 164(2) ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర శాసనసభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది. ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు చెలాయిస్తుంది.

 

జీతభత్యాలు

ఆర్టికల్ 164(5) ప్రకారం మంత్రుల జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ ఎప్పటికప్పుడు నిర్ధారిస్తుంది. అప్పటివరకు రెండో షెడ్యూల్‌లో ఉదహరించిన జీతభత్యాలు వారికి చెల్లిస్తారు.

 

Posted Date : 23-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌