• facebook
  • whatsapp
  • telegram

భార‌త ప్రధాన‌మంత్రి - విధులు, అధికారాలు

  భారతదేశంలో ప్రధానమంత్రికి విశేష అధికారాలున్నాయి. దేశ పాలన వ్యవహారాల్లో ఆయనే కీలకం. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు - భారత ప్రధానమంత్రి విధులు, అధికారాలు.. తదితర అంశాలపై అవగాహన సాధిస్తే జనరల్ స్టడీస్ విభాగంలో ఈ అంశంపై అడిగే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం బ్రిటన్ ప్రధాని మాదిరిగానే భారత ప్రధానమంత్రి కూడా మకుటం లేని మహారాజు. అతడి నాయకత్వంలోని మంత్రిమండలి వాస్తవ కార్య నిర్వహణ ఆధికారాలను చెలాయిస్తుంది.
భారత ప్రధానమంత్రిగా నియమితుడయ్యే వ్యక్తికి పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యత్వం ఉండాలి. ఒకవేళ సభ్యుడు కాకపోతే 6 నెలల్లోపు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావాలి. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. సాధారణ ఎన్నికల తర్వాత మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ఏ పార్టీకీ అవసరమైన మెజార్టీ రాకపోతే, పార్టీలకు కూటమి నాయకుడిని ప్రధానిగా నియమిస్తారు. ఈ రెండు పరిస్థితులూ లేనప్పుడు రాష్ట్రపతి తన విచక్షణాధికారాలతో ఎవరినైనా ప్రధానమంత్రిగా నియమించవచ్చు. అయితే అతడు లోక్‌సభలో మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

 

పదవీకాలం అయిదేళ్లు

ప్రధానమంత్రి పదవీకాలం 5 సంవత్సరాలు. అయితే ఇది లోక్‌సభలో మెజార్టీపై ఆధారపడి ఉంటుంది. లోక్‌సభలో మెజార్టీ కోల్పోతే ఎప్పుడైనా ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు.

 

అధికారాలు.. విధులు

భారత ప్రధానమంత్రి అధికారాలు బ్రిటన్ ప్రధానమంత్రిని పోలి ఉంటాయి.

 

మంత్రిమండలి నియామకం

కేంద్ర మంత్రులను నియమించడానికి, వారికి శాఖలు కేటాయించడానికి, మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయడానికి ప్రధానమంత్రి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. తనతో విభేదించేవారిని మంత్రివర్గం నుంచి తొలగించే అధికారం అతడికి ఉంటుంది. ప్రధానమంత్రి మంత్రిమండలికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. క్యాబినెట్ సమావేశాలకు అజెండా నిర్ణయిస్తారు. మంత్రులంతా వ్యక్తిగతంగా ప్రధానమంత్రికి బాధ్యత వహిస్తారు. ప్రధానమంత్రి రాజీనామాచేస్తే మొత్తం మంత్రిమండలి రద్దవుతుంది.

 

లోక్‌సభ నాయకుడు

ప్రధానమంత్రి లోక్‌సభ నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ విధానాలను పార్లమెంటులో ప్రకటించడం, ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టి అవి ఆమోదం పొందేలా చేయడంలో ప్రముఖపాత్ర పోషిస్తారు. ప్రధానమంత్రి సలహాతోనే రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేస్తారు.

 

రాష్ట్రపతి - మంత్రిమండలి సంధానకర్త

ప్రధానమంత్రి రాష్ట్రపతికి, మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు, శాసన సంబంధ ప్రతిపాదనలు రాష్ట్రపతికి తెలియజేస్తారు. రాష్ట్రపతి అభిప్రాయాలను తిరిగి మంత్రిమండలికి తెలియజేస్తారు.

 

విదేశాంగ విధాన రూపశిల్పి

ప్రధానమంత్రి విదేశాంగ శాఖను స్వయంగా నిర్వహించినా, నిర్వహించక పోయినా విదేశాంగ విధానంలో కీలకపాత్ర పోషిస్తారు. అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం, ఇతర దేశాలతో మైత్రీ సంబంధాలు ఏర్పరచుకోవడం, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కీలకపాత్ర వహిస్తారు.

 

ఇతర అధికారాలు

నీతి ఆయోగ్ (ప్రణాళిక సంఘం), జాతీయాభివృద్ధి మండలి, జాతీయ భద్రతమండలి, అంతర్‌రాష్ట్ర కౌన్సిల్, జాతీయ జనాభా నియంత్రణ మండలికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రుల సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఈ విధంగా ప్రధానమంత్రి దేశ పాలనలో కీలకపాత్ర వహిస్తారు.

 

మంత్రి మండలి

రాజ్యాంగంలో ఆర్టికల్ 74(1) ప్రకారం భారత రాష్ట్రపతికి విధుల నిర్వహణలో సహాయపడటానికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది. ఇది సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..1) క్యాబినెట్ మంత్రులు 2) స్టేట్ మంత్రులు 3) డిప్యూటీ మంత్రులు
సాధారణంగా పార్టీలో ఎక్కువ ప్రాబల్యం, పాలనానుభవం ఉన్నవారిని క్యాబినెట్ మంత్రులుగా ప్రధాని నియమిస్తారు. వీరు కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, రైల్వేలు, వ్యవసాయం తదితర శాఖలకు మంత్రులుగా ఉంటారు. క్యాబినెట్ మంత్రులు తమ శాఖలకు అధిపతులుగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. క్యాబినెట్ మంత్రులు వారానికి ఒకసారి ప్రధానిమంత్రి నాయకత్వంలో సమావేశం అవుతారు.
స్టేట్ మంత్రులు మంత్రిమండలి రెండోస్థాయికి చెందినవారు. వీరు తమ శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తూ, విధి నిర్వహణలో ప్రధానమంత్రికి నేరుగా బాధ్యత వహిస్తారు. సాధారణంగా క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొనరు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొంటారు.
డిప్యూటీ మంత్రులు మంత్రిమండలిలో మూడోస్థాయికి చెందినవారు. వీరికి ఎలాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. క్యాబినెట్ మంత్రులకు సహాయపడటానికి ఒకరు లేదా ఇద్దరు డిప్యూటీ మంత్రులను నియమిస్తారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు.

 

మంత్రిమండలి నియామకం

కేంద్ర మంత్రిమండలి కోసం ప్రధానమంత్రి సూచించిన వారిని మంత్రులుగా రాష్ట్రపతి నియమిస్తారు.

 

అధికారాలు - విధులు

ప్రభుత్వ విధానాలు, పథకాలను మంత్రిమండలి రూపొందిస్తుంది. బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి అవి ఆమోదం పొందేలా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులకు అభ్యర్థులను నియమిస్తుంది. విదేశాంగ విధానాన్ని రూపొందిస్తుంది. అంతర్జాతీయ ఒప్పందాలు చేస్తుంది.

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌