• facebook
  • whatsapp
  • telegram

ముఖ్యమంత్రి - మంత్రిమండలి  అడ్వకేట్ జనరల్

   ముఖ్యమంత్రి కావాలంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ రాష్ట్ర విధానసభలో మెజారిటీ పార్టీ నాయకుడై ఉండాలి లేదా మెజారిటీ కూటమికి చెందిన నాయకుడై ఉండాలి. విధానసభలో లేదా, పరిషత్‌లో లేదా సభ్యుడై ఉండాలి. సభ్యుడుకాని వారిని కూడా గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. కూటమికి ఉదాహరణగా ఇటీవల కర్ణాటకలో కుమారస్వామిని పేర్కొనవచ్చు.

* రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ అంటే గవర్నర్, ముఖ్యమంత్రిని - మంత్రిమండలిగా పేర్కొనవచ్చు. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవిని 1935 చట్టం ప్రకారం ప్రవేశపెట్టారు.

* రాజ్యాంగం VIవ భాగంలో 163, 164, 166, 167 నిబంధనల్లో ముఖ్యమంత్రి, మంత్రిమండలి గురించి వివరించారు.

* నిబంధన 163 (1) ప్రకారం రాష్ట్ర గవర్నర్‌కు విధి నిర్వహణలో సహాయ సహకారాలు అందించడానికి ముఖ్యమంత్రి, మంత్రిమండలి వ్యవస్థను ఏర్పాటు చేశారు.

* నిబంధన 164 (1) ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. అతడి సలహాతో ఇతర మంత్రులను నియమిస్తారు. మంత్రులు వ్యక్తిగతంగా గవర్నర్‌కు బాధ్యత వహిస్తారు.

* నిబంధన 164 (2) ప్రకారం మంత్రులు సమష్టిగా రాష్ట్ర విధానసభకు బాధ్యత వహిస్తారు. కేంద్రంలో ప్రధానిలా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాష్ట్ర పాలనా బాధ్యతలు నిర్వహిస్తాడు.

నిబంధన 164 ప్రకారం రాష్ట్రంలో సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్ర విధానసభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు.

* విధాన సభలో ఏ పార్టీకి మెజారిటీ లేకపోతే, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు. మిగిలిన పార్టీలతో పొత్తు పెట్టుకుని మెజారిటీ సభ్యుల మద్దతును పొందగలిగే పార్టీ లేదా, పార్టీల నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించి, నిర్ణీత గడువు లోపల విధానసభలో మెజారిటీ నిరూపించుకోమని కోరవచ్చు.

* ముఖ్యమంత్రి పదవీకాలం 5 సంవత్సరాలు. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు విధానసభలో మెజారిటీ ఉన్నంతవరకు, గవర్నర్ విశ్వాసమున్నంత వరకు పదవిలో ఉంటారు.

* రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణాధికారి అయిన ముఖ్యమంత్రి రాష్ట్రపాలనలో ముఖ్యుడు. కింది అధికారాలతో తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు.

* విధానసభలో జరిగే చర్చల్లో ముఖ్యమంత్రి అధికార పార్టీకి నాయకత్వం వహించి, సభాకార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి స్పీకర్‌కు సహకరిస్తారు.

* సభలో చర్చల సమయంలో, ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి కల్పించుకుని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. తద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం లభిస్తుంది.

* రాష్ట్ర మంత్రిమండలి సభ్యులను ఎంపిక చేసేది, వారికి శాఖలు కేటాయించేది ముఖ్యమంత్రి. ఆయన సలహాతో గవర్నర్ మంత్రులను నియమిస్తారు.

* ముఖ్యమంత్రి మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. మంత్రిమండలి విధానాలను ప్రభావితం చేస్తాడు.

* మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్‌కు తెలియజేయడం, గవర్నర్ సూచనలను మంత్రిమండలికి తెలియజేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి విధి. గవర్నర్‌కు మంత్రిమండలికి వారధిగా వ్యవహరిస్తాడు.

* రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ప్రకటిస్తారు. శాసనసభలో, వెలుపల ముఖ్యమంత్రి ప్రకటనలు, విధానాలకు చట్టబద్ధత ఉంటుంది.

* ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ విధానాల అమలుకు పార్టీ సహకారం కోరతారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయకర్తలా వ్యవహరిస్తారు.

రాష్ట్ర ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని, వివిధ ప్రాంతాల్లో పర్యటించి, ఉపద్రవాలు సంభవించినప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టడం, వివిధ సంక్షేమ పథకాలు అమల్లో ప్రజలు భాగస్వాములయ్యేలా చూడటం మొదలైన కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజానాయకుడిగా పనిచేస్తారు.

* వివిధ శాఖల అధికారుల సహాయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తారు. ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలనలో, ప్రజా సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో పాలుపంచుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారు.

 

 రాష్ట్ర మంత్రిమండలి

విధి నిర్వహణలో గవర్నర్‌కు సహాయం, సలహాలు అందించడానికి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిబంధన 163 ప్రకారం మంత్రిమండలిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ప్రధాన విధాన రూపకల్పన సంస్థగా మంత్రిమండలి వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిపై పాలనాపరమైన నియంత్రణ కలిగి ఉంటుంది.

* రాజ్యాంగరీత్యా తమను నియమించే గవర్నర్‌కు, తమ నియామకానికి కారకుడైన ముఖ్యమంత్రికి మంత్రులు బద్ధులై ఉంటారు.

* రాజ్యాంగం మంత్రులకు ప్రత్యేక అర్హతలేవీ సూచించలేదు. ముఖ్యమంత్రితో సహా అందరూ శాసనసభ్యులై ఉండాలి. శాసనసభలో సభ్యత్వం లేకపోతే నియమించినప్పటి నుంచి ఆరునెలల్లోపు శాసనసభ్యుడిగా ఎన్నిక అవ్వాలి. లేకపోతే పదవిని కోల్పోతారు.

* మంత్రులకు ప్రత్యేకంగా కాలపరిమితి లేదు. గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినంత కాలం అధికారంలో ఉంటారు (నిబంధన 164). విధానసభలో మెజారిటీ ఉన్నంతవరకు అధికారంలో ఉంటారు.

* మంత్రుల జీతభత్యాలను విధానసభ నిర్ణయిస్తుంది.

* ముఖ్యమంత్రి సలహాపై రాష్ట్ర గవర్నర్ మంత్రులను తొలగించవచ్చు. అందుకు ఏ కారణాలు చూపించాల్సిన అవసరం లేదు.

* ముఖ్యమంత్రి, మంత్రిమండలి తాము చేసే పనులకు సమష్టిగా విధానసభకు బాధ్యత వహిస్తారు.

 

అధికారాలు విధులు

* పబ్లిక్ బిల్లులను రూపొందించి, సభలో ప్రవేశపెట్టి, ఆమోదింప చేయడం.

* వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయడం.

* రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూపొందించి, శాసనసభలో ప్రవేశపెట్టి సభలో ఆమోదింపచేసుకోవడం.

విధానసభ సమావేశాల్లో సభ్యులకు సమాచారం ఇవ్వడం.

 ప్రభుత్వ వ్యవహారాలపై గవర్నర్‌కు సలహాలివ్వడం.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టడం.

* గవర్నర్ పేరుతో వివిధ పదవులకు నియామకాలు చేపట్టడం మొదలైనవి మంత్రిమండలి విధులు.
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు

* ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు

ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా, దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య (1960 - 62)

* ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి

* ఆంధ్రప్రదేశ్‌లో రెండు అంతకంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా చేసినవారు:

నీలం సంజీవరెడ్డి; కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి; నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్‌ రెడ్డి

* తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి - నందమూరి తారక రామారావు (1983)

* ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసింది - నారా చంద్రబాబు నాయుడు

* తక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసింది - నాదెండ్ల భాస్కర రావు

* ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ముఖ్యమంత్రి - కిరణ్ కుమార్‌ రెడ్డి
 

భారతదేశంలో రాష్ట్రాలు

* 1935 చట్టం ప్రకారం దేశంలో 11 రాష్ట్రాలుండేవి.

* 1947లో స్వాతంత్య్రం వచ్చే నాటికి 14 రాష్ట్రాలు ఉండేవి.
 

సంవత్సరం                       ఏర్పాటైన రాష్ట్రం

* 1960                        గుజరాత్ (15వ రాష్ట్రం)

* 1963                        నాగాలాండ్ (16వ రాష్ట్రం)

* 1966                        హరియాణా (17వ రాష్ట్రం)

* 1971                        హిమాచల్‌ప్రదేశ్ (18వ రాష్ట్రం)

* 1972                        మణిపూర్ (19వ రాష్ట్రం)

* 1972                        త్రిపుర (20వ రాష్ట్రం)

* 1972                        మేఘాలయ (21వ రాష్ట్రం)

* 1975                        సిక్కిం (22వ రాష్ట్రం)

* 1987                        అరుణాచల్‌ప్రదేశ్ (23వ రాష్ట్రం)

* 1987                        మిజోరాం (24వ రాష్ట్రం)

* 1987                        గోవా (25వ రాష్ట్రం)

* 2000                        ఉత్తరాఖండ్ (26వ రాష్ట్రం)

* 2000                        చత్తీస్‌గఢ్ (27వ రాష్ట్రం)

* 2000                        ఝార్ఖండ్ (28వ రాష్ట్రం)

* 2014                        తెలంగాణ (29వ రాష్ట్రం)

 

రాష్ట్ర అడ్వకేట్ జనరల్

కేంద్ర ప్రభుత్వంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాలాగా, రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ రాజ్యాంగపరమైన పదవి. రాజ్యాంగ నిబంధన 165 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య న్యాయ సలహాదారుగా అడ్వకేట్ జనరల్ వ్యవహరిస్తారు.

* అడ్వకేట్ జనరల్‌ను గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకు పదవిలో కొనసాగవచ్చు.

* హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలుండాలి.

* జీతభత్యాలు, సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఉంటాయి.

* అడ్వకేట్ జనరల్ జీతభత్యాలను రాష్ట్ర గవర్నర్ నిర్ణయిస్తారు. వీటిని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

 

విధులు:

* రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య న్యాయ సలహాదారు. రాష్ట్రంలో ఏ కోర్టులోనైనా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించవచ్చు.

* గవర్నర్ సూచించిన ఇతర న్యాయవిధులు నిర్వర్తిస్తారు.

* శాసనసభా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఓటు హక్కు ఉండదు.

* ఆంధ్రప్రదేశ్ తొలి అడ్వకేట్ జనరల్ డి. నరసరాజు.

* ఏపీ ప్రస్తుత అడ్వకేట్ జనరల్ డి. శ్రీనివాస్.

* తెలంగాణ తొలి అడ్వకేట్ జనరల్ కె. రామకృష్ణారెడ్డి.

 

Posted Date : 27-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌