• facebook
  • whatsapp
  • telegram

హైదరాబాదు రాజ్యంలో స్వాతంత్య్ర పోరాటం - గాంధీ పర్యటనలు

నిజాం నిరంకుశత్వంపై సత్యాగ్రహం!

  భారత స్వాతంత్రోద్యమ కాలంలో హైదరాబాదు రాజ్యంలోనూ ప్రజలు చైతన్యవంతులై కదిలారు. నిజాం నిరంకుశ పాలనపై రాజీ లేని పోరాటాలు చేశారు. గాంధీజీ సత్యాగ్రహ మార్గమే వారికి ఆయుధమైంది. ఆయన మార్గదర్శకత్వాన్ని పాటిస్తూ ఇక్కడి నాయకులు జనంలో స్వాతంత్య్రకాంక్ష రగిలించారు. సామాజిక దురాచారాలపైనా పోరాడారు. నిషేధాలకు, నిర్బంధాలకు వెరవకుండా ముందుకు సాగారు. ఈ ప్రాంతాల్లో మహాత్ముడు పర్యటించిన ప్రతిసారీ పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచారు. స్వరాజ్యనిధికి భారీగా విరాళాలు అందించారు. మరికొందరు నేతాజీతోనూ కలిసి పనిచేశారు. ఈ ముఖ్య ఘట్టాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

  హైదరాబాద్‌ నిజాం రాజ్యంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కావు. ఆ నిరంకుశ పాలన వద్దంటూ గొప్ప ప్రజాఉద్యమం సాగింది. బ్రిటిష్‌ ఆధీనంలోని భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న క్రమంలో దాని ప్రభావం హైదరాబాదు రాజ్యంపైనా ఉండేది. మరోవైపు భారత జాతీయ కాంగ్రెస్‌ పేరును సంస్థానాల ప్రజలు ఉపయోగించుకోకూడదని కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించారు. ఫలితంగా హైదరాబాదు రాజ్య కాంగ్రెస్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ సంస్థ నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాటం ప్రారంభించింది.

 

హైదరాబాద్‌ రాజ్య కాంగ్రెస్‌:  క్రీ.శ.1918లో భారత జాతీయ కాంగ్రెస్‌ శాఖగా హైదరాబాదు జిల్లా కాంగ్రెసు సంఘం ఉండేది. దీనికి వామన్‌ నాయక్‌ అధ్యక్షుడు. 1937లో సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన హరిపురలో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో దేశీయ సంస్థానాల్లో జరిగే ప్రజాందోళనలకు భారత జాతీయ కాంగ్రెస్‌ పేరు ఉపయోగించకూడదని, అలాంటి ఆందోళనల్లో జాతీయ నాయకులు పాల్గొనకూడదని తీర్మానించారు. దీంతో నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటును డిమాండు చేసేందుకు హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ను 1938, జనవరి 29న నెలకొల్పారు. రామానందతీర్థ 1938, జూన్‌ 9న ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటుచేసి, అందులో 1200 మంది సభ్యులను చేర్పించారు. 1938, సెప్టెంబరు 9న హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ సభ నిర్వహించాలనుకున్నారు. అయితే సెప్టెంబరు 8వ తేదీనే హైదరాబాదు ప్రధాని అక్బర్‌ హైదరీ ఈ సంస్థను నిషేధించాడు. స్టేట్‌ కాంగ్రెసును ఒక మత సంస్థ అని నిజాం ప్రభుత్వం వాదించింది. దీంతో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని తాత్కాలిక కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది. నిషేధం ఎత్తివేయాలని ప్రధాని అక్బర్‌ హైదరీతో మందముల నరసింగరావు చర్చలు జరిపారు. ఇందుకు నవాబు బహదూర్‌ యార్‌ జంగ్‌ (ఎంఐఎం అధ్యక్షుడు) మధ్యవర్తిగా వ్యవహరించారు. ఈ చర్చలనే సింగ్‌-జంగ్‌ చర్చలని పిలుస్తారు. ఇవి విఫలమయ్యాయి. స్టేట్‌ కాంగ్రెస్‌పై నిషేధం ఎత్తివేయడానికి సత్యాగ్రహం చేయాలన్న వీరి నిర్ణయాన్ని మహాత్మాగాంధీ ఆమోదించారు. సత్యాగ్రహం చేసేందుకు ఒక కార్యవర్గాన్ని స్టేట్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. అధ్యక్షుడిగా గోవిందరావు నానల్, కార్యదర్శిగా రామకృష్ణ దూత్, సభ్యులుగా రావినారాయణ రెడ్డి, జనార్దనరావు దేశాయి, శ్రీనివాసరావు బోరీకర్‌ వ్యవహరించారు. 18 జట్లుగా 400 మంది సత్యాగ్రహులు ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ 18 జట్లకు 18 మంది డిక్టేటర్‌లు (నాయకులు) నియమితులయ్యారు. మొదటి డిక్టేటర్‌గా స్వామిరామానంద తీర్థ, చివరి డిక్టేటర్‌గా కాశీనాథరావు వైద్య వ్యవహరించారు. ఈయన సహచరులైన రావి నారాయణరెడ్డి, రామకృష్ణ దూత్, జనార్దన్‌రావు దేశాయి, గోవిందరావు నానల్‌లు 1938, అక్టోబరు 24న రెసిడెన్సీలోని బొమ్మలబావి వద్ద సత్యాగ్రహం చేయగా పోలీసులు నిర్బంధించారు. 1938, అక్టోబరు 27న సత్యాగ్రహం చేస్తున్న రామానంద తీర్థను అదుపులోకి తీసుకున్నారు. గాంధీజీ ఆదేశాలతో ఈ సత్యాగ్రహాన్ని ఆపేస్తున్నట్టు చివరి డిక్టేటర్‌ కాశీనాథరావు వైద్య 1938, డిసెంబరు 24న ప్రకటించారు. 1939-40లో స్టేట్‌ కాంగ్రెస్‌ ప్రతినిధిగా కాశీనాథరావు వైద్య కాంగ్రెస్‌పై నిషేధం తొలగించే విషయంలో సంప్రదింపులు జరిపారు. అనేక చర్చల అనంతరం ప్రధాని చటారీ నవాబు హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌పై ఉన్న నిషేధాన్ని 1946, ఏప్రిల్‌లో తొలగించారు. 1947, మే లో రామానంద తీర్థ అధ్యక్షతన హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ అధికార సమావేశం జరిగింది. రజాకార్లు, పోలీసు దళాలను ఎదుర్కొనేందుకు సర్దార్‌ జమలాపురం కేశవరావు నాయకత్వంలో కార్యాచరణ సమితి ఏర్పాటైంది.

 

వ్యక్తి సత్యాగ్రహం: భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా వ్యక్తి సత్యాగ్రహం జరిగింది. హైదరాబాద్‌ రాజ్యం నుంచి ప్రముఖ నాయకుడైన రామానంద తీర్థ సేవాగ్రామ్‌కు వెళ్లి మహాత్మాగాంధీ అనుమతి తీసుకొని హైదరాబాదుకు తిరిగొచ్చి 1940, సెప్టెంబరు 11న వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించారు. ప్రభుత్వం ఆయనను అరెస్ట్‌ చేసి జైలు శిక్ష విధించింది. ఈ సత్యాగ్రహోద్యమంలో రామానందతో పాటు హీరాలాల్‌ కోటేచాప్రాణేశాచార్య, మోతీలాల్‌ మంత్రి, శ్రీనివాసరావు హవల్దార్, దేవరం భాయ్‌ చౌహాన్, అచ్యుతరావు దేశ్‌పాండే మొదలైనవారు అరెస్టయ్యారు.

 

క్విట్‌ ఇండియా ఉద్యమం: రామానంద తీర్థ భారత జాతీయ కాంగ్రెసు సమావేశానికి ముందు రోజు బొంబాయి వెళ్లి మహాత్మాగాంధీతో మాట్లాడి క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఆయన అనుమతి తీసుకొని హైదరాబాదు బయలుదేరారు. తీర్థ స్టేట్‌ కాంగ్రెస్‌ ఆకాంక్షలను ఒక ఉత్తరం ద్వారా డాక్టర్‌ మెల్కోటేకు పంపించి నిజాంకు పంపించమన్నాడు. అయితే నాంపల్లి రైల్వేస్టేషన్‌లో రామానంద తీర్థను నిజాం ప్రభుత్వం నిర్బంధించింది. దీంతో డాక్టర్‌ మెల్కోటే స్టేట్‌ కాంగ్రెస్‌ పక్షాన సంతకం చేసి నిజాంకు పంపగా, మెల్కోటేను కూడా ప్రభుత్వం నిర్బంధించింది. పండిత నరేంద్రజీ, హరిశ్చంద్ర హెడా, విమలాబాయి మెల్కోటే, బి.రామకృష్ణారావు, జి.రామచార్, వందేమాతరం రామచంద్రరావు, కృష్ణాదూబే (కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు) మొదలైనవారు ఈ ఉద్యమంలో అరెస్టయ్యారు. మహారాష్ట్ర పరిషత్తు కార్యదర్శి అయిన గోవింద దాసు షరాఫ్‌ను ఔరంగాబాదులో ప్రభుత్వం నిర్బంధించింది.

  హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసినందుకు పద్మజా నాయుడును ప్రభుత్వం నిర్బంధించింది. జాతీయ నాయకురాలైన అరుణా అసఫ్‌ అలీ రహస్యంగా హైదరాబాద్‌లో పర్యటించి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. ప్రజల్లో నిజాం వ్యతిరేక భావాలను తొలగించడానికి బీబీసీలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ రష్‌ బ్రూక్‌ విలియమ్స్‌ను నిజాం హైదరాబాద్‌కు పిలిపించారు. బ్రిటిష్‌ ఇండియా ప్రజల మాదిరిగా హైదరాబాద్‌ ప్రజలు కూడా రాజకీయ స్వేచ్ఛను, పౌరహక్కులను అనుభవిస్తున్నారంటూ రష్‌ బ్రూక్‌ రాసిన వ్యాసాలను వివిధ పత్రికలు, జర్నల్స్‌లో ప్రచురించారు. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ తరహా ప్రచారం ఆగిపోయింది. క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశం వెలుపల సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో హైదరాబాద్‌కు చెందిన అబిద్‌ హసన్‌ సఫ్రాని, ప్రొఫెసర్‌ సురేశ్‌ చంద్ర, అలీ సుల్తాన్‌లు చేరి జర్మనీలో సుభాష్‌ చంద్రబోస్‌తో సన్నిహితంగా ఉండి పనిచేశారు.

 

తెలంగాణలో గాంధీజీ పర్యటనలు: స్వాతంత్రోద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ తెలంగాణలో మూడు సార్లు పర్యటించారు. స్వరాజ్య నిధి వసూలు చేయడానికి, మద్యపానం, అంటరానితనం నిర్మూలనలో భాగంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం కలిగించారు.

 

మొదటి హైదరాబాదు పర్యటన: మహాత్మాగాంధీ మొదటి హైదరాబాదు పర్యటన 1929, ఏప్రిల్‌లో జరిగింది. తిలక్‌ స్వరాజ్య నిధికి విరాళాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. కృష్ణ స్వామి ముదిరాజ్‌ తన ఆంధ్ర వాలంటీరు బృందంతో వాడి రైల్వేస్టేషన్‌కు వెళ్లి గాంధీకి స్వాగతం పలికి నాంపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. వివేకవర్థని మైదానంలో వామన్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన సభలో గాంధీజీ ప్రసంగించారు. మాడపాటి హనుమంతరావు, మందముల నరసింగరావు, ఆర్‌.ఎస్‌.నాయక్, రాజా బన్సీలాల్, ముకుందదాస్‌ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సభ అనంతరం రూ.12 వేలు విరాళం వసూలైంది. ఇదే పర్యటనలో కృష్ణస్వామి ముదిరాజ్‌ చుడీబజారులో స్థాపించిన బాలికా హిందీ పాఠశాలను గాంధీ సందర్శించారు. 1929, ఏప్రిల్‌ 7న సుల్తాన్‌ బజారులోని ప్రేమ్‌ థియేటర్‌లో గాంధీ గౌరవార్థం మహిళా సభను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన విజయవాడకు వెళ్లారు.

 

రెండో పర్యటన: గాంధీజీ 1934, మార్చి 9న రెండోసారి హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ పర్యటనను సరోజినీ నాయుడు పర్యవేక్షించారు. హరిజన సేవాదళం ప్రధాన కార్యదర్శి రావి నారాయణరెడ్డి, ఎల్‌.ఆర్‌.దాచా, బసంతరావు, కుమారి పద్మజా నాయుడు గాంధీకి స్వాగతం పలకడానికి వెళ్లి ఆయనను వికారాబాద్‌ స్టేషన్‌లో కలుసుకున్నారు. సరోజినీ నాయుడు మొదట గాంధీకి స్వాగతం పలికి, ఆయన మెడలో ఖద్దరు నూలు హారం వేసి, తన నివాసమైన ఆబిడ్స్‌లోని గోల్డెన్‌ థ్రెషోల్డ్‌ (బంగారు గడప)కు తీసుకెళ్లారు. గాంధీతో పాటు మీర్‌ బెహద్‌ మొదలైన వారు వచ్చారు. అనంతరం గాంధీ ఆది హిందూ విద్యాలయాన్ని సందర్శించి అక్కడి నుంచి వివేకవర్థని మైదానానికి తరలివెళ్లారు. ఆ మైదానంలో హరిజన సేవక సంఘం అధ్యక్షుడైన వామన్‌ నాయక్‌ గాంధీకి స్వాగతపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గాంధీ హరిజన నిధికి ప్రజలు విరాళాలిచ్చారు. అదేరోజు సాయంత్రం సికింద్రాబాద్‌లోని కర్బలా మైదానంలో పెద్ద సభ జరిగింది. గాంధీకి బాజీ కృష్ణారావు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మొత్తం రూ.10 వేల వరకు పోగయింది.

 

మూడో పర్యటన: 1946, జనవరి చివరి వారంలో గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాల్లో పాల్గొనేందుకు మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. ఎం.ఎస్‌.రాజలింగం మద్రాసుకు వెళ్లి గాంధీతో మాట్లాడి ఆయన పర్యటనను వరంగల్‌ జిల్లాలో ఏర్పాటు చేశారు. గాంధీ తెలంగాణ పర్యటన కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో సభ ఏర్పాటు చేశారు. కృష్ణ బజాజ్, ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య, ఎం.ఎస్‌.రాజలింగం తదితరులు హాజరయ్యారు. ఈ సభలో గాంధీ ప్రసంగించారు. తర్వాత నేటి ఖమ్మం  ప్రాంతంలోని డోర్నకల్, గుండ్రాతి మడుగు, మానుకోట మొదలైన ప్రాంతాల్లో పర్యటించి ఉపన్యాసాలిచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు గాంధీకి స్వరాజ్య నిధి కోసం విరాళాలు సమర్పించారు. 1946, ఫిబ్రవరి 5న గాంధీ వరంగల్‌కు వెళ్లారు. హన్మకొండ విద్యార్థి సంఘాల వాలంటీర్లు 800 మంది ‘స్వతంత్ర భారత్‌ కీ జై’ అనే నినాదాలతో వరంగల్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. వరంగల్‌ ప్రజలను ఉద్దేశించి గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు తమ ఆభరణాలను గాంధీకి విరాళంగా ఇచ్చారు. ఆహ్వాన సంఘం పక్షాన హయగ్రీవాచారి గాంధీ హరిజన నిధికి రూ.15 వేలు, చందా కాంతయ్య రూ.5 వేలు అందజేశారు. గాంధీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల అధ్యాపకుల నుంచి సంజాయిషీ కోరింది. కొందరిపై చర్యలు తీసుకోగా, మరికొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

 

  అరుణా అసఫ్‌ అలీ పర్యటన: భారత జాతీయ నాయకురాలైన అరుణా అసఫ్‌ అలీ వరంగల్‌ను సందర్శించి, బ్రిటిష్‌ పాలకులకు పట్టిన గతే నిజాంకు, అతడి తాబేదార్లకు పడుతుందని, స్వతంత్ర భారత్‌లో స్వతంత్ర సంస్థానాలకు తావులేదని గంభీర ప్రసంగం చేశారు. ఆమె ప్రసంగం ప్రజల్లో నూతనోత్సాహం నింపింది.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌