• facebook
  • whatsapp
  • telegram

సూర్యచంద్రులపై ఇస్రో ప్రయోగాలు


భాస్కరుడిపై భారత్‌ దృష్టి!

చంద్రుడిపై ఇటీవల విజయవంతంగా రోవర్‌ను దించిన ఇస్రో, ఇప్పుడు సూర్యుడిపై దృష్టి పెట్టి ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అది సౌర గాలులు, తుపానులను పరిశీలించడంతోపాటు భాస్కరుడి కిరణాలు, అయస్కాంత క్షేత్రాలు భూమిపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. మరో చంద్రమండల యాత్రకూ ప్రక్రియ సాగుతోంది.  ఈ విధంగా అంతరిక్ష రంగంలో ఇస్రో వేగంగా వేస్తున్న అడుగులు, భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆ ప్రయోగాల వివరాలు, ఇస్రో భవిష్యత్తు కార్యక్రమాలు, ఇతర శాస్త్రసాంకేతిక విజయాల గురించి తెలుసుకోవాలి. 


  

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో 2023, సెప్టెంబరు 2న పీఎస్‌ఎల్‌వీ-సీ57 వాహక నౌక సహాయంతో ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని పీఎస్‌ఎల్‌వీ- సీ57/ఆదిత్య ఎల్‌-1 మిషన్‌గా పిలుస్తున్నారు. భూకక్ష్యలో ఉన్న ఉపగ్రహం 16 రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతూ క్రమంగా అయిదుసార్లు కక్ష్యను పెంచుకుని సూర్యుడి వైపు వెళుతుంది. ఈ దశలో ఉపగ్రహం సుమారు 125 రోజులు ప్రయాణించి భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్‌-1 లోకి చేరుతుంది. ఉపగ్రహం ఇక్కడ ఆదిత్యుడి వైపు ఉండి తనలోని పరికరాల సహాయంతో పరిశోధన సాగిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఎలాంటి అవాంతరాలు, గ్రహణాలు లేకుండా నిరంతరం భానుడిని గమనిస్తూ పరిశోధన సాగించడానికి వీలవుతుంది.


ఉపగ్రహ ప్రత్యేకతలు:

* ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం బరువు 1475 కిలోలు.  


* ఉపగ్రహంలో ఎల్‌ఏఎమ్‌ - లిక్విడ్‌ అపోజి మోటార్‌ ఉంటుంది. ఇది ఉపగ్రహాన్ని నిర్ణీత ఎల్‌-1 ప్రదేశంలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. 


* ఉపగ్రహంలో 7 పరికరాలున్నాయి. అవి... 


1) విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ) 


2) సోలార్‌ అల్ట్రా వయోలెట్‌ ఇమేజింగ్‌ టెలీస్కోప్‌ 


3) హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ 


4) ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ 


5) ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య 


6) సోలార్‌ లోఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ 


7) అడ్వాన్స్‌డ్‌ ట్రై ఆగ్జియల్‌ హై రిజల్యూషన్‌ డిజిటల్‌ మాగ్నెటోమీటర్స్‌ 


* ఈ పరికరాల్లో వీఈఎల్‌సీ రోజుకు 1440 చిత్రాలను తీసి భూమికి పంపుతుంది.


* ఈ ప్రయోగాన్ని ఇండియన్‌ సోలార్‌ మిషన్‌గా పిలుస్తున్నారు. 


* ఇది సూర్యుడిని అధ్యయనం చేయడానికి ప్రయోగించిన స్పేస్‌ బేస్డ్‌ అబ్జర్వేటరీ.


* ఇస్రోకు ముందు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, అమెరికా, రష్యా, జపాన్, చైనాలు మాత్రమే సూర్యుడి అధ్యయనానికి ఉపగ్రహ ప్రయోగాలు/మిషన్‌లను చేపట్టాయి.


ఆదిత్య ఎల్‌-1 ఉపయోగాలు: 


* ఈ ఉపగ్రహం సూర్యుడిలో జరిగే చర్యలు, వాటివల్ల ఏర్పడే పరిణామాల అధ్యయనానికి ఉపయోగపడుతుంది.


* సౌరగాలుల అధ్యయనం, వీటివల్ల ఉపగ్రహాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు కలిగే హాని గురించి పరిశీలించడానికి ఈ ప్రయోగం పనికొస్తుంది.


* ఈ ప్రయోగం వల్ల సూర్య కిరణాలు, ఉష్ణోగ్రత, అయస్కాంత క్షేత్రం లాంటివి భూమిని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుస్తుంది.


* ఆదిత్య ఎల్‌-1తో సౌరవ్యవస్థ, సూర్యుడి కరోనా, అంతరిక్ష వాతావరణం, కరోనా ఉష్ణోగ్రత, ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్‌ లాంటి వాటి గురించి తెలుసుకునేందుకు వీలవుతుంది.


* ఈ ప్రయోగానికి ఉపయోగించిన పీఎస్‌ఎల్‌వీ - సీ57 వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ - ఎక్స్‌ఎల్‌ రకానికి చెందింది. ఇది పీఎస్‌ఎల్‌వీ వరుసల్లో 59వ వాహక నౌక.


భారత్, జపాన్‌ చంద్రమండల యాత్ర: ఇస్రో జాక్సా (జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ)తో కలిసి మరొక చంద్రమండల యాత్ర చేపట్టనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు దీన్ని చంద్రమండల యాత్ర-4గా పిలుస్తున్నారు. ఈ ప్రయోగాన్ని లూనార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ మిషన్‌ (లుపెక్స్‌)గా కూడా పేర్కొంటున్నారు. చంద్రయాన్‌-3 మాదిరిగానే ఇందులో ల్యాండర్, రోవర్‌ ఉంటాయి. ఇవి అత్యంత ఆధునికమైనవి. ల్యాండర్, రోవర్‌ను రాత్రిపూట కూడా పనిచేయించే విధంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రయాన్‌-3 పగటిపూట మాత్రమే పనిచేస్తుంది. చంద్రయాన్‌-4లో చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలాన్ని తవ్వడానికి కావాల్సిన పరికరాలు కూడా ఉన్నాయి. జపాన్‌ ఈ మిషన్‌కు వాహక నౌకను, రోవర్‌ను అందిస్తే ఇస్రో ల్యాండర్‌ను సమకూరుస్తోంది.


చంద్రయాన్‌-3 ఫలితాలు:

* ల్యాండర్‌ విక్రమ్‌లో ఉన్న ‘చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మోఫిజికల్‌ ఎక్స్‌పరిమెంట్‌’ చంద్రుడి ఉపరితలంపై, 10 సెం.మీ. లోపల ఉన్న మట్టిలో ఉష్ణోగ్రతల్లో తేడా ఉన్నట్లు గుర్తించింది.


* ప్రజ్ఞాన్‌ రోవర్‌లోని ‘లేసర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోపీ’ పరికరం జాబిల్లి ఉపరితలంపై అల్యూమినియం, సల్ఫర్, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్‌ లాంటి మూలకాలున్నట్లు కనుక్కుంది.


* ల్యాండర్‌లోని ఐఎల్‌ఎస్‌ఏ పరికరం చందమామపై ప్రకంపనలను నమోదు చేసింది.


రోవర్‌ను నిద్రాణ స్థితిలోకి పంపిన ఇస్రో:  చంద్రుడి దక్షిణధ్రువ ప్రాంతంలో తిరిగిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ను మరింతకాలం పనిచేయించడానికి ఇస్రో దాన్ని నిద్రాణ స్థితిలోకి పంపింది. ఇస్రో రోవర్‌లోని పరికరాలను స్విచ్ఛాఫ్‌ చేసింది. ఇప్పటికే దీనిలోని బ్యాటరీలను పూర్తిగా ఛార్జింగ్‌ చేశారు. రోవర్‌ తిరిగి చంద్రుడిపై వెలుతురు ఉండే రోజుల్లో పనిచేయడం ప్రారంభిస్తుందని ఆశిస్తున్నారు. రోవర్‌ అది దిగిన ప్రదేశం నుంచి 100 మీటర్లు ప్రయాణించిందని ఇస్రో ప్రకటించింది.


చంద్రుడిపై భారత్‌ అడుగిడిన ప్రదేశానికి పేర్లు:
 

* భారత ప్రధానమంత్రి మోదీ చంద్రుడిపై చంద్రయాన్‌-3 దిగిన ప్రాంతాన్ని శివశక్తిగా, 2019లో చంద్రయాన్‌-2 కూలిపోయిన ప్రదేశాన్ని ‘తిరంగా’గా ప్రకటించారు.


* విక్రమ్‌ ల్యాండర్‌ శౌర్యానికి ప్రతీకగా, రోవర్‌ ప్రజ్ఞాన్‌ను ధైర్యానికి ప్రతీకగా పేర్కొన్నారు. 


* చంద్రయాన్‌-3 సాఫీగా చంద్రుడిపై అడుగుపెట్టిన ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవం (నేషనల్‌ స్పేస్‌ డే)గా ప్రకటించారు.


చంద్రయాన్‌-3 హాప్‌ ప్రయోగం: భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు జాబిల్లి ఉపరితలంపై ఉన్న ల్యాండర్‌కు సంబంధించిన మరో అద్భుత ప్రయోగాన్ని నిర్వహించారు. దీన్ని హాప్‌ ప్రయోగంగా చెప్పవచ్చు. ఈ ప్రయోగంలో భాగంగా ల్యాండర్‌లోని ఇంజిన్లను మండించి సుమారు 40 సెంటీమీటర్లు పైకి లేపి, తిరిగి 30 నుంచి 40 సెంటీమీటర్ల పక్కకు క్షేమంగా కిందకు దింపారు. అంటే చంద్రుడిపై రెండోసారి ల్యాండర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ ప్రయోగం భవిష్యత్తులో చంద్రుడి పైనుంచి మట్టిని భూమిపైకి తీసుకురావడానికి, చందమామ పైకి మానవులను పంపడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.


నిద్రాణస్థితిలోకి ల్యాండర్‌: ల్యాండర్‌లోని పరికరాలతో చంద్రుడిపై పరిశోధనలను ఇస్రో పూర్తిచేసింది. హాప్‌ ప్రయోగాన్ని నిర్వహించి ల్యాండర్‌ను నిద్రాణ స్థితిలోకి పంపింది. జాబిల్లిపై తిరిగి సూర్యోదయం అయ్యే సెప్టెంబరు 22 తర్వాత ల్యాండర్, రోవర్లను తిరిగి పనిచేయించాలని భావిస్తోంది.


మాదిరి ప్రశ్నలు 


1. ఇస్రో ఏ వాహకనౌక సహాయంతో ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని చేపట్టింది?

1) పీఎస్‌ఎల్‌వీ- సీ59    2) పీఎస్‌ఎల్‌వీ- సీ57    

3) పీఎస్‌ఎల్‌వీ- సీ54    4) పీఎస్‌ఎల్‌వీ- సీ60



2. సూర్యుడి గురించి పరిశోధన చేయడానికి ఇస్రో ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించిన తేదీ? 

1) 2023, ఆగస్టు 10     2) 2023, సెప్టెంబరు 6   

3) 2023, సెప్టెంబరు 2    4) 2023, ఆగస్టు 18 



3. ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం ఏ విధంగా ఉపయోగపడుతుంది?

1) సౌరవ్యవస్థ అధ్యయనానికి

2) సౌర కరోనా, ఫొటోస్ఫియర్‌ అధ్యయనానికి

3) క్రోమోస్ఫియర్‌ అధ్యయనానికి

4) పైవన్నీ

 

4. కిందివాటిలో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగ ప్రత్యేకతలు?

1) ఈ ఉపగ్రహం భూమి నుంచి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ పాయింట్‌ వద్ద ఉంటుంది.

2) సౌర వాతావరణం, సౌరగాలుల గురించి అధ్యయనం చేస్తుంది.

3) ఈ ఉపగ్రహంలో 6 పరికరాలున్నాయి

4) పైవన్నీ


 

5. భారత్, ఏ దేశంతో కలిసి లూనార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌ను చేపట్టింది?

1) అమెరికా  2) రష్యా   3) జపాన్‌  4) ఫ్రాన్స్‌



6. చంద్రయాన్‌-3 ప్రయోగంలో హాప్‌ ప్రయోగం దేనికి సంబంధించింది?

1) చంద్రుడిపై ఉన్న మూలకాలను పరిశీలించడానికి

2) ల్యాండర్‌ను రెండోసారి సేఫ్‌ ల్యాండింగ్‌ చేయడానికి

3) చంద్రుడి దక్షిణధ్రువంపై నీటిని కనుక్కునేందుకు

4) రోవర్‌ను నిద్రాణ స్థితిలో పంపడానికి


సమాధానాలు: 1-2,   2-3,  3-4,   4-4,  5-3,   6-2.


రచయిత: డాక్టర్‌ బి.నరేష్‌

 

 

Posted Date : 16-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌