• facebook
  • whatsapp
  • telegram

ఇస్రో - వరుస విజయాలు

అంతరిక్షంలో అయిదు నౌకల అద్భుతాలు!


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. అయిదు వాహక నౌకలను రూపొందించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఉపగ్రహ సేవలు, వాణిజ్య పరంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో రికార్డులు నెలకొల్పుతోంది. అంతరిక్ష వాణిజ్యంలో ఇతర దేశాలు, ప్రైవేటు సంస్థలతో పోటీపడుతూ వరుస విజయాలను నమోదు చేస్తోంది. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఇస్రో ఘనతను, విజయాలను తెలుసుకోవాలి. 

 


అంతరిక్ష వాహక నౌకలనే రాకెట్లు అంటారు. అవి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడతాయి. వాటిని అభివృద్ధి చేయడంలో, ప్రయోగించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో గణనీయమైన పురోగతి సాధించింది. వాహక నౌకల సాంకేతికతలో భారతదేశం అగ్ర దేశాలతో పోటీ పడుతోంది. ఇస్రో ఇప్పటివరకు 5 వాహక నౌకలను రూపొందించింది. అవి

1) SLV - శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ 

2) ASLV - ఆగ్‌మెంటెడ్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ 

3) PSLV - పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌

4) GSLV - జియోసింక్రొనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌

5) SSLV  - స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌.

వీటిలో మొదటి రెండింటిని ఇస్రో ప్రస్తుతం ఉపయోగించడం లేదు. గత కొన్నేళ్లుగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో వాడినవి PSLV, GSLV. ఈ రెండింటిలో PSLV ద్వారా ఇప్పటివరకు అత్యధికంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో ఇటీవల రూపొందించిన కొత్త వాహక నౌక SSLV.

 

SSLV ప్రత్యేకతలు: ఈ వాహక నౌక 34 మీటర్ల పొడవు, 2 మీ. వ్యాసం (డయామీటర్‌)తో ఉంటుంది. దీనిలో ఘన ఇంధనంతో కూడిన 3 దశలుంటాయి. చివరి దశలో (VTM - Velocity Trimming Module) ద్రవ ఇంధనం ఉంటుంది. ఇది ప్రయోగ దశలో మొత్తం 120 టన్నుల బరువు ఉంటుంది. ఈ వాహక నౌక 500 కిలోల ఉపగ్రహాలను 500 కి.మీ. దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. దీనిద్వారా ఒకేసారి అనేక ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. SSLV వాహక నౌకను తక్కువ ఖర్చుతో కొద్ది సమయంలో సిద్ధం చేయవచ్చు. విదేశీ ఉపగ్రహాలను వాణిజ్యపరంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఇది అనువైంది. విదేశీ అంతరిక్ష సంస్థలు, ప్రైవేటు సంస్థలతో నెలకొన్న పోటీ దృష్ట్యా దీన్ని నిర్మించడం, ప్రయోగించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇస్రో తన అవసరాలకు అనుగుణంగా వేగంగా నిర్మిస్తున్న వాహక నౌక ఇది.

 

SSLV- D1: SSLV వాహక నౌకల్లో ఇస్రో నిర్మించిన మొదటి వాహక నౌక ఇది. దీన్నే SSLV-D1/EOS-02 మిషన్‌ అని కూడా పిలుస్తారు. 2022, ఆగస్టు 7న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ వాహక నౌకలో 145 కిలోల EOS-02 అనే భూపరిశీలన ఉపగ్రహాన్ని ఉంచారు. దీంతో పాటు 8 కిలోల బరువైన ఆజాదీ శాట్‌-1 (azaadi sat) ను ఉంచారు. SSLV - 01 రాకెట్‌ నింగిలోకి సజావుగానే వెళ్లినప్పటికీ ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైంది.

 

SSLV - D2: దీన్ని SSLV - D2/EOS- 07 మిషన్‌ అంటారు. దీని ద్వారా 2023, ఫిబ్రవరి 10న ఇస్రో 3 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో విజయవంతమైన మొదటి SSLV వాహక నౌకగా SSLV - D2 నిలిచింది. ఈ ప్రయోగం కూడా ‘షార్‌’ నుంచే జరిగింది. SSLV - D2  ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో మొదటిది EOS- 07 , రెండోది జానస్‌- 1, మూడోది ఆజాదీ శాట్‌ - 2.

 

GSLV - MK - III: ఇది వాహక నౌకల్లో 3వ రకం. వీటిలో మొదటిది GSLV - MK - I  (సాధారణ GSLV). రెండోది GSLV - MK - II. GSLV - MK - III వాహక నౌకను ఇస్రో ఇప్పటివరకు ఆరు సార్లు విజయవంతంగా ప్రయోగించింది. దీనిలో మొదటిది GSLV - MK - III - X. GSLV - MK - III/ CARE మిషన్‌ అంటారు. (CARE = క్య్రూ మాడ్యూల్‌ అట్మాస్ఫియరిక్‌ రిఎంట్రీ ఎక్స్‌పరిమెంట్‌) ఇది మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించింది. ప్రయోగం నిర్వహించిన తేదీ 2014, డిసెంబరు 18.

GSLV - MK - III - D1: 2017, జూన్‌ 5న ఈ వాహక నౌక ద్వారా GSAT - 19 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

GSLV - MK - III - D2:  2018, నవంబరు 14న దీని ద్వారా GSAT - 29 ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

GSLV - MK - III - M1: దీని ద్వారా 2019, జులై 22న చంద్రయాన్‌ - 2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

 

GSLV - MK - IIIఇటీవల ప్రయోగాలు

GSLV - MK - III - M2 ( LVM3 -M2): ఈ వాహక నౌక ద్వారా 2022, అక్టోబరు 23న యునైటెడ్‌ కింగ్‌ డమ్‌కు చెందిన వన్‌వెబ్‌ సంస్థ వారి 36 ఉపగ్రహాలను లో ఎర్త్‌ ఆర్బిట్‌ (దిగువ భూ ఉపగ్రహ కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష కార్యక్రమాల వాణిజ్య అవసరాలకు ఏర్పాటుచేసిన న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (NSIL) ద్వారా జరిగింది. LVM3 - M2 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన 36 ఉపగ్రహాల బరువు 5,796 కిలోలు. ఇది LVM3 వాహక నౌక మొదటి వాణిజ్యపరమైన ప్రయోగం. NSIL తో వన్‌వెబ్‌ వారి మొదటి ప్రయోగం.

GSLV - MK - III - M3: దీన్నే LVM3 - M3  వన్‌ వెబ్‌ ఇండియా - 2 మిషన్‌గా పిలుస్తారు. ఈ వాహక నౌక 2023, మార్చి 26న వన్‌వెబ్‌ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను 450 కి.మీ. కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. వీటి మొత్తం బరువు 5,805 కిలోలు. ఇది LVM3 ద్వారా జరిపిన రెండో వాణిజ్య ప్రయోగం.

 

ఇస్రో 200వ సౌండింగ్‌ రాకెట్‌: ఇస్రో 2022,  డిసెంబరు 23న తన 200వ సౌండింగ్‌ రాకెట్‌ అయిన RH - 200ను విజయవంతంగా ప్రయోగించింది. భారతదేశ మొదటి స్వదేశీ రాకెట్‌ RH - 75. దీన్ని 1967, నవంబరు 20న ప్రయోగించారు.


 

మాదిరి ప్రశ్నలు

1. ఇస్రో మొదటిసారిగా కింది ఏ స్వదేశీ వాహక నౌక సహాయంతో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది?

1) SLV - 3 E2      2) SLV - 1 E1      3) PSLV - C2         4) ASLV - D1

జ: SLV - 3 E2

 

2. కిందివాటిలో బిళీలిజు ప్రత్యేకతలు

1) దీనిలో 3 దశలు ఉంటాయి        2) 3వ దశ క్రయోజెనిక్‌ దశ

3) దీని ద్వారా భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చు.       4) పైవన్నీ 

జ: పైవన్నీ ​​​​​​​

 

3. ఇస్రో రూపొందించిన ఏ వాహకనౌక అత్యధిక సార్లు విజయం సాధించి ఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది?

1) GSLV        2) PSLV          3) SSLV              4) ASLV

జ: PSLV          ​​​​​​​

 

4. కింది ఏ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను 2023, మార్చి 26న GSLV - MK - III - M3  ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టారు?

1) ఆంట్రిక్స్‌ కార్పొరేషన్‌     2) స్పేస్‌ ఎక్స్‌ లిమిటెడ్‌      3) వన్‌వెబ్‌        4) స్కైరూట్‌

జ: వన్‌వెబ్‌        ​​​​​​​

 

5. GSLV - MK - III - M1 ద్వారా ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు?

1) CARE                2) GSAT- 19        3) GSAT - 29        4) చంద్రయాన్‌ - 2

జ: చంద్రయాన్‌ - 2​​​​​​​

 

6. ఇతర దేశాల ఉపగ్రహాలను వాణిజ్యపరంగా, డిమాండ్‌ ఉన్నప్పుడు కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఇటీవల రూపొందించిన వాహకనౌక?

1) ASLV         2) SSLV         3) PSLV         4) GSLV

జ: SSLV        

డాక్ట‌ర్‌ బి. న‌రేశ్‌

Posted Date : 07-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌