• facebook
  • whatsapp
  • telegram

మలిదశ ఉద్యమం - అస్తిత్వ పోరాటం 

సమరమై సాగిన సాంస్కృతిక చైతన్యం!

 

  అన్యాయాలు, దోపిడీలు, అసమానతలు, అవహేళనలు, ఆవేదనల నుంచి పుట్టిన తెలంగాణ పోరాటం ప్రజా ఉద్యమంగా మారి, ఉద్ధృతస్థాయికి చేరడానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. పండగలు, జాతరల నిర్వహణ సంస్కృతిని ప్రతిబింబించింది. స్థానికుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. కళాకారుల ఆకలి కేకల గానం జనాన్ని జాగృతం చేసింది. పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగాలకు చిహ్నమైన స్తూపం నిత్య స్ఫూర్తికి సంకేతంగా నిలిచింది. సామాజిక ప్రత్యేకతలకు ప్రతీకగా జరిగిన తెలంగాణ తల్లి రూపకల్పన అందరిలో ఉత్తేజాన్ని నింపింది. పలు రకాల కార్యక్రమాలు, ప్రదర్శనలు ప్రజల్లో ఐకమత్యాన్ని పెంచాయి. గతకాలపు సాయుధ పోరాటాలు నిరంతర ప్రేరణకు సాయపడ్డాయి. అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే ఆరాటం సాంస్కృతిక చైతన్యమై, సమరంగా సాగిన సంఘటనల వివరాలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


  

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ పోరాటమే కాదు. సాంస్కృతిక అస్తిత్వవాదానికి ప్రతీకగా నిలిచిన సామాజిక విప్లవం. తెలంగాణ భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు కేంద్ర బిందువు. విభిన్న ప్రాంతాలు, మతాలు, భాషలకు చెందిన వారంతా ఇక్కడ నివసించడంతో హైదరాబాదు ప్రత్యేక సంస్కృతిని గంగా-జమున తహజీబ్‌ (సంస్కృతి)గా అభివర్ణిస్తారు.


భాష, యాస, సంస్కృతి, ఆత్మగౌరవం తదితరాలు తెలంగాణ ప్రత్యేక అస్తిత్వానికి ప్రాతిపదికలు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ సంస్కృతి అస్తిత్వం మసకబారింది. తెలంగాణ కోల్పోయిన భాష, సాంస్కృతిక వైభవాన్ని, వనరులను, ఉద్యోగాలను, తత్ఫలితంగా ఏర్పడిన సామాజిక అసమానతలను మలిదశ ఉద్యమం ప్రధానంగా ప్రచారం చేసింది. అదే సమయంలో కవులు, కళాకారులు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకొని ఆట, పాటలను భిన్న రూపాల్లో ఊరూరా ప్రదర్శించారు. ప్రజలందరినీ కార్యోన్ముఖులను చేశారు.


1990 దశకంలో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం తర్వాత ఇక్కడి ప్రజలు తాము కోల్పోయిన అస్తిత్వం కోసం పోరాడారు. అదే తరహాలో మలి ఉద్యమ కాలంలోనూ తెలంగాణ పండగలు, జాతరలు, గ్రామదేవతలు, భాష, యాస, జానపద కళల ద్వారా తెలంగాణ అస్తిత్వ వాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రత్యేక రాష్ట్రవాదాన్ని బలోపేతం చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలు, దోపిడీలు, ఎదురైన అవహేళనలు, ప్రజల వేదన, ఆవేదన జానపద గేయాల్లో ప్రతిబింబించాయి.


ఉదా: ఇంకిపోయిన చెరువులు, వాగులు, వంకలు, ఎండిన పంట పొలాలు, ప్రజల వలసలు వంటి పరిస్థితులను వర్ణించడం నాటి దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి.

 

బాక్స్‌

ప్రజా ఉద్యమాన్ని మలిచిన పాటలు


గద్దర్‌: అమ్మా తెలంగాణమా - ఆకలి కేకల గానమా 


పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా! కోట్లాది ప్రాణమా.... 


జయరాజ్‌: ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిచిందిరా!


శివుడు: తలాపున పారుతోంది గోదారి - నీ చేను నీ చెలకా ఎడారి!


గోపాల్‌: ఆకాశానా మబ్బుల్లారా - పాలమూరు వచ్చిపోరా!


గోరటి వెంకన్న:  పల్లె కన్నీరు పెడుతుందో - కనిపించని కుట్రల, తల్లీ బంధీయై పోతుందో కనిపించని కుట్రల!


అందెశ్రీ: సూడు తెలంగాణ సుక్క నీళ్లు లేని దాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ!


జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం


దరువు ఎల్లన్న: వీరులారా వందనం - విద్యార్థీ అమరులారా వందనం!


మిట్టపల్లి సురేందర్‌:  రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదు రా! 


నందిని సిధారెడ్డి: నాగేటి చాల్లల్లో నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, పారేటి నీళ్లల్ల పానాదులల్ల, పూసేటి పువ్వుల పునాసలల్ల!

మొదలైన పాటలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజాఉద్యమంగా మలిచాయి.


తెలంగాణ అస్తిత్వ పోరాటంలో ప్రతీకాత్మక వ్యక్తీకరణలు: తెలంగాణ విశిష్ట సంస్కృతికి బతుకమ్మ, బోనాలు, బొడ్డెమ్మ మొదలైన పండగలతో పాటు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహం (ప్రతిమ), తెలంగాణ ధూం ధాం, అలయ్‌ బలయ్, తెలంగాణ రైతుల సాయుధ పోరాట స్ఫూర్తి అస్తిత్వ ప్రతీకలుగా నిలిచి ఉద్యమంలో కీలకపాత్ర వహించాయి.


అమరవీరుల స్మారక స్తూపం: 1969 నాటి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన 369 మంది విద్యార్థుల స్మృతి చిహ్నంగా దీన్ని హైదరాబాదులోని రాష్ట్ర శాసనసభ భవన సముదాయానికి ఎదురుగా ఉన్న గన్‌పార్కులో నిర్మించారు. దీన్ని గన్‌పార్కు అనడానికి కారణం నాటి ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టి కాల్చి చంపడమే. దానికి ప్రతీకగా ఈ పార్కులో ఫిరంగులను కూడా ఏర్పాటు చేశారు. అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలని మొదటిసారిగా పోరాడిన వ్యక్తి 1969 జై తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు శ్రీధర్‌రెడ్డి. స్మారక స్తూపాన్ని నిర్మించాలని 1970, జనవరి 17న హైదరాబాదు నగర మేయర్‌ లక్ష్మీనారాయణ అధ్యక్షతన మున్సిపల్‌ కార్పొరేషన్‌ తీర్మానం చేసింది. దీనిని నాటి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ 1970, ఫిబ్రవరి 23న మేయర్‌ లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1969 తెలంగాణ ఉద్యమ సారథి మర్రి చెన్నారెడ్డిని ఆహ్వానించారు. నాటి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే నాగం కృష్ణ, ఇతర ఎమ్మెల్యేలు మాణిక్‌ రెడ్డి, ఎమ్‌.ఎమ్‌.ఆషీమ్‌ కూడా పాల్గొన్నారు. కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ అనేకమంది ఉద్యమకారులు గన్‌పార్క్‌కు చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


ఈ స్మృతి స్తూప ఆకృతిని హైదరాబాదులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ప్రఖ్యాత శిల్పి ప్రొఫెసర్‌ ఎక్కా యాదగిరిరావు రూపొందించారు. దీని ఎత్తు 25 అడుగులు. పీఠభాగాన్ని నల్లటి గ్రానైట్‌ శిలతో నిర్మించారు. ఇది అమరవీరుల స్మృతిలో జేఎన్‌టీయూ సంతాపాన్ని తెలియజేస్తుంది. స్తూపం పీఠభాగంలో నలువైపులా తొమ్మిది బుల్లెట్ల రంధ్రాలు చేశారు. తుపాకీ తూటాలను అణచివేతకు, నిరంకుశ, విచక్షణారహిత పోలీసు కాల్పుల్లో అమాయక విద్యార్థుల అకాల మరణానికి ప్రతీకలుగా పేర్కొన్నారు. తొమ్మిది సంఖ్య 1970 నాటి తెలంగాణలోని తొమ్మిది జిల్లాలను సూచిస్తుంది. అంతేకాకుండా తొమ్మిదిని తొంభైగా భావిస్తూ నాలుగువైపుల్లో గుణిస్తే (90 × 4 = 360) వస్తుంది. దానిని 369 మంది అమరులైన విద్యార్థులకు గుర్తుగా వివరించారు.


స్తూపాన్ని ట్రెపీజియం ఆకృతిలో నిర్మించారు. అది ఓర్పు, సహనం, సత్యాన్ని తెలియజేస్తుంది. ట్రెపీజియాన్ని ఎర్రటి గ్రానైట్‌ శిలతో నిర్మించడం సాహసానికి, త్యాగానికి నిదర్శనం. దీని మీద గల మకరతోరణం అమరవీరులకు స్వాగత తోరణంగా నిలిచి శ్రద్ధాంజలి ఘటించడాన్ని సూచిస్తుంది. స్తూపంపై చెక్కిన అశోక చక్రం శాంతి, ధర్మాలను, రాజ్యాంగ హక్కులను సూచిస్తుంది. జాగృతిని, గతిశీలతను కూడా పేర్కొంటుంది. స్తూపం శీర్ష భాగంలో తెలుపు వర్ణంలో తొమ్మిది రేకులున్న తెల్లని మల్లెపువ్వు ఉంటుంది. అది తాజాదనాన్ని, విద్యార్థుల అమరత్వాన్ని ప్రతిబింబిస్తుంది. తెల్లని పూలు శాంతిని, స్వచ్ఛతను, కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తాయి.


1970, ఫిబ్రవరి 25న సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ వద్ద మరో అమరవీరుల స్తూప నిర్మాణానికి నాటి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ మ్యాడం రామచంద్రయ్య శంకుస్థాపన చేశారు. ఈ రెండు స్తూపాల నిర్మాణం 1975లో పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీటిని అధికారికంగా ఏ ప్రభుత్వం కూడా ఆవిష్కరించకపోవడం గమనార్హం. మలిదశ ఉద్యమ కాలంలో ముఖ్య సంఘటనలన్నీ గన్‌పార్క్‌లోని స్తూపం సాక్షిగానే మొదలయ్యాయి.


తెలంగాణ తల్లి విగ్రహం: స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ రూపొందించిన భారతమాత, మద్రాసు రాష్ట్రంలో జరిగిన ప్రత్యేక ఆంధ్రోద్యమ కాలంలో రూపుదిద్దుకున్న ఆంధ్రమాత, 1975లో ప్రపంచ తెలుగు మహాసభల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన తెలుగుతల్లి విగ్రహాలు (ప్రతిమలు), తెలంగాణ తల్లి రూపకల్పనకు ప్రేరణగా నిలిచాయి. తెలంగాణ తల్లి గురించి మొదటగా దాశరథి కృష్ణమాచారి తాను రాసిన గేయంలో ప్రస్తావించారు..


‘‘కోటి వెలుగుల బంగారు కొండ కింద - పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దుపొద్దున అందాల పూలు పూసె - నా తెలంగాణ తల్లి కంజాత వల్లి’  అని ప్రశంసిస్తూ కోటి రతనాల వీణ నా తెలంగాణ అని గొప్పగా అభివర్ణించారు.


అప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు తల్లికి సమాంతరంగా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ తల్లిని రూపొందించుకోవాలని ఉద్యమ నేత కేసీఆర్‌ సూచించారు. అందుకనుగుణంగా తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు బి.ఎస్‌.రాములు మార్గదర్శకత్వంలో కంప్యూటర్‌లో డిజైన్‌ చేసినవారు నిర్మల్‌కు చెందిన బైరోజు వెంకట రమణాచారి. మొదటిసారిగా తెలంగాణ తల్లి చిత్రాన్ని దేవులపల్లి అమర్‌ సంపాదకత్వంలో ప్రచురించే ప్రజాతంత్ర అనే వారపత్రిక కవర్‌ పేజీపై ముద్రించారు. ఆ ముఖచిత్రం ఆధారంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నాటి తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి, నల్గొండ జిల్లా (నేటి యాదాద్రి-భువనగిరి)లోని మోత్కూరు మండలం బేగంపేట గ్రామంలో తొలిసారిగా ఆవిష్కరించారు.


సాధారణ మహిళగా రూపొందిన తెలంగాణ తల్లిని రాజా రవివర్మ రూపొందించిన భారత మాతను పోలి ఉండే విధంగా పట్టువస్త్రాలు, కిరీటం, నగలతో వైభవంగా తీర్చిదిద్దాలని కేసీఆర్‌ సూచించారు. దాంతో ప్రొఫెసర్‌ గంగాధర్, పసునూరి దయాకర్, వెంకట రమణాచారి కలిసి తెలంగాణ తల్లి చిత్రానికి మళ్లీ రూపకల్పన చేశారు. దీనికి ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్, ప్రఖ్యాత శిల్పి ప్రొఫెసర్‌ ఎక్కా యాదగిరిరావు, దుర్గం రవీందర్‌ సహకారం అందించారు. ఆ విధంగా రూపొందిన తెలంగాణ తల్లి చిత్రపటం ఆధారంగా పసునూరి దయాకర్‌ భారీస్థాయిలో మట్టి విగ్రహాలను రూపొందించి తెలంగాణ ప్రాంతమంతా ప్రతిష్ఠింపజేశారు. 2007, నవంబరు 15న తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కేసీఆర్‌ ప్రతిష్ఠించారు.


తెలంగాణ తల్లి విగ్రహ విశిష్టతలు: తెలంగాణ తల్లి వజ్రాలు పొదిగిన కిరీటంతో, బంగారు ఆభరణాలతో, పట్టువస్త్రాలతో వైభవంగా నిలబడి ఉంటుంది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన పోచంపల్లి/గద్వాల్‌ పట్టుచీరతో, మెడలో కంఠహారం, పొడవైన బంగారు హారంతో; నడుముకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్, జాకోబు వజ్రాలు పొదిగిన బంగారు వడ్డాణంతో, తలపై రాజసం ఉట్టిపడే కోహినూర్, జాకోబు వజ్రాలు పొదిగిన కిరీటంతో దేవతామూర్తిగా తీర్చిదిద్దారు. కాలివేళ్లకు తెలంగాణ ప్రత్యేక హస్తకళను సూచించే కరీంనగర్‌ ఫిలిగ్రీ మెట్టెలు పెట్టారు. ఇక్కడి ప్రత్యేక సంస్కృతిని సూచించే బతుకమ్మను ఎడమచేతిలో, మెట్టపంటగా విరివిగా పండే మొక్కజొన్న కంకిని కుడిచేత్తో పట్టుకుని నిర్మలమైన చల్లనిచూపుతో తెలంగాణ ప్రజలను ఆశీర్వదించే దేవతామూర్తిగా రూపొందించారు. మలి ఉద్యమకాలంలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా ప్రతిష్ఠించి ఉద్యమాన్ని బలోపేతం చేశారు.


ధూం ధాం - జానపద జాతర: తెలంగాణ ధూం ధాం, జానపద ప్రదర్శనలు ఆట, పాటలు తెలంగాణ ఉద్యమాన్ని హోరెత్తించాయి. దీని అధ్యక్షుడు రసమయి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి అంతదపుల నాగరాజు. ధూం ధాం కార్యక్రమాన్ని మొదటిసారిగా 2002, సెప్టెంబరు 30న కామారెడ్డిలో నాగరాజే నిర్వహించాడు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతమంతా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాల్లో గద్దర్, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, విమలక్క అరుణోదయ కళాకారులు, దరువు ఎల్లన్న, అంబటి వెంకన్న, వరంగల్‌ శ్రీనివాస్, గూడ అంజయ్య, అందెశ్రీ పాల్గొన్నారు. ధూం ధాంతో పాటు తెలంగాణ కవులు, కళాకారులు, గాయకుల కృషి కూడా ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది.


అలయ్‌ - బలయ్‌: ఈ కార్యక్రమం తెలంగాణ ప్రత్యేక సంస్కృతికి ప్రతీక. ఇది హిందూ, ముస్లింల ఐక్యతను సూచిస్తుంది. ఉద్యమంలో భాగంగా దీనిని మొదటిసారి బండారు దత్తాత్రేయ ప్రారôభించారు.దసరా తర్వాత రోజున ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించారు.దీనినే దసరా మిలాప్‌ అని కూడా అంటారు.


తెలంగాణ రైతుల సాయుధ పోరాటం (1946-51): తెలంగాణ ప్రజలు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాటి పాలకులు, రజాకార్లు, భూస్వాములపై వీరోచితంగా చేసిన పోరాటం కూడా తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమే. మహిళలు కూడా బందూకులు (తుపాకులు) చేత పట్టి నిజాం సేనలు, రజాకార్లను ఎదిరించారు. ఆ పోరాటాలు, నాటి పాటలు తెలంగాణ మలిఉద్యమ కాలంలో అన్నివర్గాల ప్రజలకు స్ఫూర్తినిచ్చి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, రాస్తారోకో, రోడ్లపై వంటా వార్పు మొదలైన ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాయి.

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి

 

 

Posted Date : 12-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌