• facebook
  • whatsapp
  • telegram

నిర్భయ చట్టం

నేపథ్యం 


దిల్లీకి చెందిన పారామెడికల్‌ విద్యార్థినిపై 2012, డిసెంబరు 16న సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 


 భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కొత్త చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. 


 ప్రస్తుత చట్టాలను సమీక్షించి, నిందితులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైన చట్టాల రూపకల్పనకు ప్రభుత్వం 2012, డిసెంబరు 23న ఒక కమిటీని నియమించింది. దీనికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌ శరణ్‌ వర్మ అధ్యక్షత వహించారు.


వర్మ కమిటీ


సభ్యులు: జస్టిస్‌ లీలాసేథ్‌ - హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, గోపాల్‌ సుబ్రమణియం - మాజీ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా. 


 జస్టిస్‌ వర్మ కమిటీ 2013, జనవరి 23న 630 పేజీలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఇందులోని సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2013, ఫిబ్రవరి 1న ‘ఆర్డినెన్స్‌’ను రూపొందించింది. ఇది 2013, ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చింది. 


 ఈ ఆర్డినెన్స్‌ స్థానంలో కేంద్ర కేబినెట్‌ ‘నేర న్యాయ సవరణ బిల్లు- 2013’ను రూపొందించింది. దీన్ని 2013, మార్చి 19న లోక్‌ సభ, మార్చి 21న రాజ్యసభ ఆమోదించాయి. ఈ బిల్లుపై 2013, ఏప్రిల్‌ 2న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇది మొదట ఆర్డినెన్స్‌ రూపంలో వచ్చింది కాబట్టి ఈ బిల్లు 2013, ఫిబ్రవరి 3 నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలి.


నిర్భయ నిధి 


బాధితులకు ఆర్థిక సహకారం, భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్లతో ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేసింది. వీరికి అందించే ఆర్థిక సహకారం కింది విధంగా ఉంటుంది.


* అత్యాచారం - రూ.3 లక్షలు  


* యాసిడ్‌ దాడి - రూ.3 లక్షలు


* పూర్తి అంగవైకల్యం - రూ.2 లక్షలు  


* పాక్షిక అంగవైకల్యం - రూ.లక్ష


* మైనర్‌ బాలిక - రూ.2 లక్షలు


* నిర్భయ చట్టాన్ని ‘నేర న్యాయ చట్టం, 2013’గా పేర్కొంటారు. దీని ప్రకారం నిర్భయ నిందితులైన అక్షయ్‌ ఠాకూర్, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌లను 2020, మార్చి 20న దిల్లీలోని తీహార్‌జైలులో ఉరి తీశారు.


బాలనేరస్తులు - వివరణ


నిర్భయ చట్టంలోని సెక్షన్‌ 2( k ) ప్రకారం, 18 ఏళ్లలోపు వయసువారిని బాలనేరస్తులుగా పరిగణిస్తారు. ఈ వయసులో నేరాలు చేసిన వారిని విచారించే అధికారం జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు ఉంటుంది. వీరు తమ వయసు ధ్రువీకరణ కోసం సర్టిఫికెట్‌ను సమర్పించాలి.


 మహిళలపై జరిగిన నేరాల గురించి ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించొచ్చు. దర్యాప్తును మాత్రం నేరం జరిగిన ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌ అధికారులు చేపడతారు.


 నిర్భయ ఘటన తర్వాత మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో టెలికాం విభాగం 181 ఫోన్‌ నంబరును అందుబాటులోకి తెచ్చింది.


ఉషా మెహ్రా కమిషన్‌


నిర్భయ ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ప్రభుత్వం భావించింది. నిర్భయ ఘటనకు దారి తీసిన కారణాలను పరిశీలించి, ఇలాంటివి జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై, భవిష్యత్తులో మహిళకు భద్రతను కల్పించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉషా మెహ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది.


గృహహింస నిరోధక చట్టం, 2005


మహిళలను శారీరక, మానసిక, ఆర్థిక వేధింపుల నుంచి రక్షించటానికి భారత ప్రభుత్వం 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని రూపొందించింది. ఇది 2006, అక్టోబరు 26 నుంచి అమల్లోకి వచ్చింది. 


ముఖ్యాంశాలు: మహిళలపై శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులను నేరంగా పరిగణిస్తారు. హింసకు గురైన మహిళకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (పీఓ)ను నియమిస్తుంది.


ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (పీఓ): వీరు ప్రభుత్వ ఉద్యోగులు/ ఎన్‌జీఓ అవ్వొచ్చు. సామాజిక రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. సాధ్యమైనంతవరకు మహిళలనే పీఓగా నియమిస్తారు.


 ఎవరైనా మహిళ హింసకు గురైనప్పుడు స్వయంగా లేదా ఆమె తరఫున మరొకరు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదులను లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా ఇవ్వొచ్చు. వీటిని పీఓకు ఇవ్వాలి. మౌఖిక( oral )ఫిర్యాదులను పీఓ రికార్డు చేసి, ఫిర్యాదుదారులకి ఉచితంగా ఒక నకలు ఇవ్వాలి. ఫిర్యాదు అందిన వెంటనే పీఓ సంబంధిత అంశాన్ని ఆ ప్రాంత మెజిస్ట్రేట్‌/ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కి పంపాలి. పీఓ తన విధి నిర్వహణలో విఫలమైతే ఏడాది జైలు శిక్ష, రూ.20,000 జరిమానా విధిస్తారు.


రకాలు: గృహహింస 4 రకాలు.


1. భౌతిక గృహహింస: గాయపరచడం, చిత్రహింసలు పెట్టడం.


2. లైంగిక గృహహింస: ఇష్టం లేకుండా లైంగిక చర్యకు బలవంతం చేయడం.


3. మానసిక గృహహింస: జంతువులు, పక్షులతో పోల్చి కించపరచడం, ప్రాథమిక అవసరాలకు దూరం చేయడం.


4. ఆర్థికపరమైన గృహహింస: మహిళల నుంచి బలవంతంగా నగదును తీసుకోవడం, ఆర్థికపరమైన స్వేచ్ఛను నియంత్రించడం.

POCSO Act 2012
 

లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో  Protection of Children from Sexual Offences (POCSO) Act, 2012ను రూపొందించారు.


ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:


 బాలలు అంటే 18 ఏళ్లలోపు వారు.


 బాలలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడిన వారికి శిక్షలు విధించడం, పోర్నోగ్రఫీ నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.


ఈ చట్టం ప్రకారం విధించే శిక్షలు..


* అశ్లీల ప్రయోజనాలకు పిల్లలను వినియోగించడం: గరిష్ఠంగా అయిదేళ్ల జైలు శిక్ష. 


* చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు: కనిష్ఠంగా పదేళ్లు, గరిష్ఠంగా జీవితఖైదు.


* తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు: జీవిత ఖైదు.


POCSO సవరణ చట్టం, 2019:


 2018లో జమ్మూ-కశ్మీర్‌లో కథువాలో 8 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఈ కేసులో బాధితురాలికి సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో 2012 నాటి POCSO చట్టాన్ని సవరించారు.


 2019లో  Amendments in the Protection of Children from Sexual Offences  ను రూపొందించారు. ఈ చట్టం 2020, మార్చి 9 నుంచి అమల్లోకి వచ్చింది.


ముఖ్యాంశాలు:


ఈ చట్టం ప్రకారం, బాధితులకు 30 రోజుల్లో పరిహారాన్ని చెల్లించాలి.


 చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కనీస శిక్షను 7 నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. 16 ఏళ్లలోపు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారికి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు.


 తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కనీస శిక్షను 10 నుంచి 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. గరిష్ఠంగా మరణశిక్ష విధిస్తారు. 


 బాలల పోర్నోగ్రఫీకి సంబంధించిన పరికరాలను నిల్వ చేసేవారికి 3 నుంచి 5 సంవత్సరాల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు.


యాసిడ్‌ దాడుల నియంత్రణ - సుప్రీంకోర్టు మార్గదర్శకాలు


దేశంలో మహిళలపై జరుగుతున్న యాసిడ్‌ దాడులను నివారించేందుకు జస్టిస్‌ ఆర్‌.ఎం.లోథా నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ వివిధ మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో ప్రధానమైంది విచ్చలవిడిగా రసాయనాలను విక్రయించడంపై నిషేధం విధించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం. 2014, మార్చి 31లోగా కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ మార్గదర్శకాలను జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


మార్గదర్శకాలు: యాసిడ్‌ కొనుగోలుదారుల సమాచారాన్ని, చిరునామాను విక్రయదారులు తప్పనిసరిగా నమోదు చేయాలి.


 యాసిడ్‌ను వినియోగించే విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాలు వాటి వినియోగ వివరాలను నమోదు చేయాలి.


 18 ఏళ్లు నిండి, చిరునామా ధ్రువపత్రాన్ని చూపించిన వారికి మాత్రమే యాసిడ్‌ను విక్రయించాలి.


 యాసిడ్‌ దాడి బాధితురాలికి చికిత్స, పునరావాసం కింద ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనీసం రూ.3 లక్షలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి. ఘటన జరిగిన 15  రోజుల్లోగా తక్షణ సాయం కింద రూ.లక్ష అందించాలి.


 ప్రభుత్వం జారీచేసిన ‘ఫొటో గుర్తింపు కార్డు’ కలిగిన వారికి మాత్రమే యాసిడ్‌ను విక్రయించాలి.


 యాసిడ్‌ నిల్వల వివరాలను విక్రయదారుడు సంబంధిత సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట 15 రోజుల్లోగా సమర్పించాలి. లేకపోతే రూ.50,000 జరిమానా విధించాలి.


నిర్భయ చట్టం ప్రకారం విధించే శిక్షలు


యాసిడ్‌ దాడి 10 సం. జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా.


అత్యాచారం 7 సం. జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష.


మరణం/ శాశ్వత అంగవైకల్యానికి యావజ్జీవం లేదా మరణ శిక్ష.


మానవ అక్రమ రవాణా 7 - 10 సం. జైలు శిక్ష.


విడిపోయిన భార్యపై భర్త అత్యాచారం చేస్తే 2 సం. జైలు శిక్ష.


అధికారం చెలాయించే వ్యక్తి  లైంగికచర్యలకు పాల్పడితే  5 - 10 సం. జైలుశిక్ష


వాయరిజమ్‌  1 - 3 సం. జైలుశిక్ష


వేధింపులు 1 - 3 సం. జైలు శిక్ష


 


బంగారు సత్యనారాయణ

విషయ నిపుణులు 

Posted Date : 28-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌