• facebook
  • whatsapp
  • telegram

నేల కాలుష్యం

 
భూసారం ఆగమాగం!

 

 


నేలలు సారాన్ని కోల్పోతున్నాయి. పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఆహార కొరత ఏర్పడుతోంది. అందరి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కారణం నేల కాలుష్యం. పరిశ్రమల విషపూరిత వ్యర్థాలను భూమిలోకి వదిలేస్తున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. రేడియో ధార్మికాలను నేలలోకి నెట్టేస్తున్నారు. దీంతో మట్టి సహజత్వాన్ని కోల్పోయి హానికరంగా మారుతోంది. భూసారం ఆగమాగమైపోతోంది. అది అన్ని రకాల విపరిణామాలకు దారితీస్తోంది. పర్యావరణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశాలను, నివారణ మార్గాలను తెలుసుకోవాలి. పలు రకాల పోటీ పరీక్షల్లో వాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. 

సహజ వనరుల్లో మృత్తికలు/నేలలు అత్యంత ప్రధానమైనవి. భూమిని ఆవరించి ఉన్న శిలావరణంపై జీవ సంబంధమైన పదార్థాలు, అనేక లవణాలు, రసాయనాలతో కూడిన వదులుగా ఉండే పొరను నేలగా పిలుస్తారు. నేలలో ఉన్న భౌతిక, రసాయనిక ధర్మాల ఆధారంగా ఎర్రనేలలు, నల్లనేలలు, ఒండ్రు నేలలు, పర్వతాలపై ఉండే లేటరైట్‌ నేలలు లాంటి ఎన్నో రకాలు భూగోళాన్ని ఆవరించి ఉంటాయి. మనిషికి ఆహారాన్ని ఇచ్చే పంటలు, అవసరాలు తీర్చే వృక్షాలు ఈ నేలల ఆధారంగానే వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. రాతిపై ఒక సెంటీమీటరు మందం ఉన్న మృత్తిక ఏర్పడాలంటే కనీసం 400 ఏళ్లు పడుతుందని ఒక అంచనా. అంత ప్రాముఖ్యం ఉన్న మృత్తికల్లో వివిధ రకాల వ్యర్థ పదార్థాలు కలవడంతో సహజ లక్షణాలను కోల్పోయి నేల కాలుష్యం లేదా భూకాలుష్యం జరుగుతోంది.


వ్యవసాయ, పారిశ్రామిక, గృహ సంబంధ వ్యర్థాలు; మురుగు నీరు, భార లోహాలు, ఘనపదార్థాలు నేలలో కలవడం వల్ల ఏర్పడే దాన్ని ధనాత్మక నేల కాలుష్యంగా పిలుస్తారు. అడవుల నరికివేత, పశువులు అతిగా మేత మేయడం, గనుల తవ్వకాలు, బ్లాస్టింగ్, మట్టి తవ్వకాలు, అశాస్త్రీయ వ్యవసాయ విధానాల కారణంగా నేల సహజ నిర్మాణం దెబ్బతినడం కూడా నేల కాలుష్యమే. దీన్ని రుణాత్మక నేల కాలుష్యం అంటారు.


నేల కాలుష్య కారకాలు


పారిశ్రామిక వ్యర్థాలు: ఆధునిక మానవుడి అభివృద్ధికి పరిశ్రమలే సోపానాలు. అయితే పరిశ్రమల నుంచి వెలువడే ఆమ్లాలు, క్షారాలు, విష సేంద్రియ పదార్థాలు, పాదరసం, సీసం, రాగి, జింక్, కాడ్మియం, సైనైడ్లు, థియోసైనేట్స్‌ లాంటి అనేక రసాయన పదార్థాలు నేలపై వ్యర్థాలుగా పడేయడం నేల కాలుష్యానికి ప్రధాన కారణం.


ఎరువులు, క్రిమిసంహారక మందులు: ప్రస్తుత వ్యవసాయ రంగంలో అధిక పంట దిగుబడికి ఎరువులు, పురుగుమందులు, కలుపు మొక్కల నివారిణులు, శిలీంధ్రనాశనుల వినియోగం తప్పనిసరిగా మారింది. వీటి అవశేషాలు నేలలో కలిసి నేల కలుషితంగా మారడమే కాకుండా భూగర్భ జలాల్లో చేరి మానవ మనుగడను దెబ్బతీస్తున్నాయి.


మానవ వినియోగ వ్యర్థాలు: గృహావసరాలకు లేదా వాణిజ్యపరంగా వినియోగించగా మిగిలిన వ్యర్థాలను నేలపై చెత్తకుప్పల దగ్గర పారవేయడంతో నేల కాలుష్యం పెరిగిపోతోంది.


ఉదా: పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, గ్లాసులు, పేపరు వేస్ట్‌లు, గృహ నిర్మాణంలో మిగిలే కాంక్రీట్, మిగిలిన ఆహార పదార్థాలు లాంటివన్నీ కాలుష్య కారకాలే.


రేడియోధార్మిక వ్యర్థాలు: అణు విద్యుత్తు కేంద్రాలు, అణు రియాక్టర్ల నుంచి వెలువడిన యురేనియం, థోరియం లాంటి రేడియోధార్మిక పదార్థాలు, ద్రావణాలు నేలలో కలిసి భూమిని కలుషితం చేస్తుంటాయి.


జీవన సంబంధ కారకాలు: మానవులు, జంతువులు, పక్షుల మలమూత్రాలు నేలను చేరతాయి. ఈ విసర్జకాల్లో రోగకారక సూక్ష్మజీవులు ఉండటం వల్ల నేల కలుషితమవుతుంది. ఈ విధంగా నేల స్వభావాన్ని మార్చి మొక్కల వేర్లపై దాడి జరిగి పంటల సామర్థ్యం తగ్గుతుంది.


గనుల తవ్వకాలతో కాలుష్యం: ఇనుము, బొగ్గు లాంటి గనుల తవ్వకాలు జరిగినప్పుడు వెలువడే భారలోహ, కర్బన, ధూళి కణాలు నేల మీద పోగుపడి నేల కాలుష్యానికి దారిదీస్తాయి. ఇవి నేల గాఢతను మారుస్తాయి. దానివల్ల గనుల ప్రాంతాల్లో వ్యవసాయ ఫలసాయం తగ్గిపోతుంది.
 

వ్యర్థ పదార్థం నేలలో విచ్ఛిన్నానికి పట్టే కాలం (సుమారుగా)
కాగితం నెల
ఊలు ఒక సంవత్సరం
చెక్క 10-15 సంవత్సరాలు
తోలు వస్తువులు 50 సంవత్సరాలు
అల్యూమినియం వస్తువులు 100 సంవత్సరాలు
డిస్పోజబుల్‌ డైపర్స్‌ 500 సంవత్సరాలు
పాలిథీన్‌ క్యారీ బ్యాగులు లక్ష సంవత్సరాలు


నేల కాలుష్య ప్రభావాలు:


వ్యవసాయంపై: నేల కాలుష్యానికి గురైతే మొదట వ్యవసాయంపై ప్రభావం చూపుతుంది. వివిధ కాలుష్యాలతో నేలల సారం తగ్గిపోతుంది. తద్వారా పంట దిగుబడి తగ్గి ప్రజలకు ఆహార కొరత ఏర్పడుతుంది. నేలలో నైట్రోజన్‌ సార్ధకత, లవణాలు తగ్గుతాయి. నేల క్రమక్షయం పెరిగి చెరువులు, జలాశయాల్లో పూడిక చేరుతుంది.


ఆరోగ్యంపై: ప్రమాదకరమైన రసాయనాలు భూగర్భ జలాల్లో కలిసిపోతాయి. కొన్ని భార లోహాలు మొక్కల ద్వారా మానవ, జంతు శరీరాల్లోకి బయోమాగ్నిఫికేషన్‌ జరిగి వ్యాధులు వస్తాయి. వ్యర్థాలు కుళ్లి హానికర వాయువులు విడుదలై వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. రేడియోధార్మిక పదార్థాలు విడుదల చేసే కిరణాలు జీవుల మనుగడకు ప్రమాదకరంగా మారతాయి.


పర్యావరణంపై: నేల కాలుష్యం వల్ల వృక్ష సంపద తగ్గి పర్యావరణ అసమతౌల్యత ఏర్పడుతుంది. జీవజాతుల మధ్య సమగ్రత దెబ్బతింటుంది. ఆహార గొలుసులు విచ్ఛిన్నమవుతాయి.

నగరాలపై ప్రభావం: నగరాల్లోని వ్యర్థాల కారణంగా మురుగు నీటిపారుదల పెద్ద సమస్యగా మారుతుంది. జనాభా పెరగడం వల్ల  నగరపాలక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ పెనుభారంగా మారుతుంది. నగరాల్లో మురికివాడలు పెరిగిపోతున్నాయి.

ఉదా: మన దేశంలో అతిపెద్ద మురికివాడ సెంట్రల్‌ ముంబయిలోని ధారావి ప్రాంతం. ఇది ప్రపంచంలోని పెద్ద మురికి వాడల్లో ఒకటి.


నివారణ మార్గాలు


* పురుగుమందుల వాడకాన్ని తగ్గించి వీటికి ప్రత్యామ్నాయంగా జీవామృతం, బీజామృతం లాంటి పర్యావరణ హితమైన క్రిమిసంహారిణులు వాడాలి.


రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ ఎరువులు, వర్మీకంపోస్టు లాంటి ఎరువులు వినియోగించాలి.


* కలుపు మొక్కల నివారణ ఔషధాలను నియంత్రించి అవి మొక్కలు పెరగకుండా యాజమాన్య పద్ధతుల్లో మార్పు తీసుకురావాలి.


* పారిశ్రామిక విసర్జితాలను భూమిలోకి విడుదల చేయకుండా వాటిని శుద్ధి చేసి పునర్వినియోగంలోకి తీసుకురావాలి.


పారిశ్రామిక ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌గా వృక్షాలను విరివిగా పెంచాలి.


పారిశ్రామిక వ్యర్థాల నుంచి రసాయనాలను తొలగించి భూమిలో చిన్న గుంతల్లో విడిచిపెట్టాలి.


గృహాల నుంచి వెలువడిన బయోగ్యాస్, బయోమాస్‌ లాంటి వ్యర్థాలను విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించాలి.


* వినియోగ వ్యర్థాలను రీసైక్లింగ్‌ విధానంలో వినియోగించుకోవడం వల్ల నేలపై కాలుష్యాలను సమర్థంగా తగ్గించడం సాధ్యమవుతుంది.


* సూపర్‌ థర్మల్‌ కేంద్రాల నుంచి వెలువడిన బూడిదను (ఫ్లైయాష్‌) ఇటుకల నిర్మాణంలో వినియోగించవచ్చు.


* న్యూక్లియర్‌ రియాక్టర్ల నుంచి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలను కాలుష్య రహిత పదార్థాలుగా చేయడంలో తగిన చర్యలు చేపట్టాలి.


మాదిరి ప్రశ్నలు

1. కాడ్మియం కాలుష్యం ఏ వ్యాధికి కారణం అవుతుంది?

 1) బ్లాక్‌ ఫుట్‌           2) మినమాటా 

3) మలేరియా           4) ఇటాయి-ఇటాయి 


2. బెంగాల్‌ మైదాన ప్రాంతాలు ప్రధానంగా ఏ భూకాలుష్యానికి గురవు తున్నాయి?

 1) కాడ్మియం    2) క్రోమియం    3) కాపర్‌    4) సీసం


3. భూకాలుష్యాల్లో సుదీర్ఘకాలం నిర్వీర్యం కాని వ్యర్థ పదార్థం ఏది?

1) ఖనిజోద్గ్రహణ వల్ల వెలువడే వ్యర్థాలు    2) అణుధార్మిక వ్యర్థం

 3) బయోమెడికల్‌ వ్యర్థాలు        4) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం


4. ఇటీవల జపాన్‌ ప్రభుత్వం ఏ మహా సముద్రంలోకి ఫుకుషిమా దైచి అనే అణు రియాక్టర్‌ నుంచి అణుధార్మిక వ్యర్థ జలాలను విడుదల చేస్తోంది?

1) పసిఫిక్‌ మహాసముద్రం        2) హిందూ మహాసముద్రం

3) అట్లాంటిక్‌ మహాసముద్రం        4) ఆర్కిటిక్‌ మహాసముద్రం


5. ఏ వ్యర్థాలు భూమిలో విచ్ఛిన్నం కావడానికి సుదీర్ఘకాలం పడుతుంది?

 1) అల్యూమినియం వస్తువులు    2) ఊలు వస్తువులు

  3) తోలు వస్తువులు        4) ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు


6. అశాస్త్రీయ వ్యవసాయ విధానాల వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతినడాన్ని ఏవిధంగా భావిస్తారు?

 1) రుణాత్మక నేల కాలుష్యం        2) ధనాత్మక నేలకాలుష్యం

 3) న్యూట్రల్‌ నేల కాలుష్యం        4) అసాధారణ నేలకాలుష్యం


7. కిందివాటిలో ప్రాథమిక కాలుష్యకాలు ఏవి?

  1) హైడ్రో కార్బన్లు  2) నైట్రేట్స్‌ 3) సల్ఫేట్స్‌  4) పైవన్నీ


8. హరిత విప్లవం సందర్భంలో పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల నేల కాలుష్యానికి గురై ఏర్పడిన నిస్సారమైన నేలలను ఏమని పిలుస్తారు?

1) రే నేలలు   2) కల్లార్‌ నేలలు   

3) ఉషర్‌ నేలలు   4) రకర్‌ నేలలు


9. నేల కాలుష్యం వల్ల ఏర్పడిన ప్రతిఫల కాలుష్యం ఏది?

1) వాయు కాలుష్యం  2) భూగర్భ జలాల కాలుష్యం

3) ఓజోన్‌ కాలుష్యం  4) జీవ కాలుష్యం


10. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కణయుత కాలుష్యాన్ని తొలగించడానికి ఏ సాంకేతిక పద్ధతి సరైంది?

1) ఎలక్ట్రో డయాలసిస్‌   2) వెట్‌ స్క్రబ్బర్స్‌

3) ఫ్యాబ్రిక్‌ ఫిల్టర్స్‌  4) ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్స్‌


సమాధానాలు

1-4; 2-1; 3-2; 4-1; 5-4; 6-1; 7-4; 8-1; 9-2; 10-4. 


 


రచయిత: జల్లు సద్గుణ
 

Posted Date : 04-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు