• facebook
  • whatsapp
  • telegram

సౌర కుటుంబం

అనంత విశ్వంలో సౌర పరివారం!

 


 


 సమస్త జీవరాశికి ప్రాణాధారమై, నిత్య ఉషోదయంతో అందరినీ నిద్రలేపే సూర్యుడు ఒక నక్షత్రం. దాని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కల వంటి అనేక ఖగోళ స్వరూపాలు విస్తరించి ఉంటాయి. సూర్యుడితో కలిపి అదంతా అనంత విశ్వంలో ఒక కుటుంబం. అందులో భాగమే భూమి. ప్రపంచానికి వెలుగులు పంచే ఆ ప్రచండ అగ్నిగోళం నుంచి వెలువడే ఉష్ణం, కాంతి ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. అందులో జరిగే రకరకాల చర్యలు భూగోళంపై విపరీత ప్రభావాన్ని చూపుతాయి. దానికి కారణమైన సూర్యుడి నిర్మాణం, సౌరకుటుంబం పరిధి, గ్రహాల్లో రకాలు తదితర వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ తన చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, అంతర గ్రహ ధూళి అనే ఖగోళ స్వరూపాల సముదాయాన్ని సౌరకుటుంబం అంటారు.


సూర్యుడు: ఒక మధ్యస్థ స్థాయి నక్షత్రం. సూర్య కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలు. సూర్యుడి వయసు 550 కోట్ల సంవత్సరాలు. భూమి కంటే సూర్యుడి పరిమాణం 13 లక్షల రెట్లు ఎక్కువ. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 25 రోజులు. అదే సూర్యుడు పాలపుంత కేంద్రకం చుట్టూ ఒకసారి తిరగడానికి 25 కోట్ల సంవత్సరాలు పడుతుంది. దీనినే కాస్మిక్‌ సంవత్సరం అంటారు. భూమికి అతిసమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న రెండో నక్షత్రం ప్రాగ్జిమా. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న సగటు దూరం 14.95 కోట్ల కిలోమీటర్లు లేదా 1 ఆస్ట్రోనామికల్‌ యూనిట్‌. సూర్యుడిలో హైడ్రోజన్‌ 71 శాతం, హీలియం 26.5 శాతం, మిగిలిన 2.5 శాతం ఇనుము, సిలికాన్, కార్బన్, ఆక్సిజన్‌ లాంటి పదార్థాలు ఉన్నాయి.


సూర్యుడి నిర్మాణం: ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని సూర్యుడి నిర్మాణాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. 

ఎ) సూర్యుడిని అంతరనిర్మాణం పరంగా, ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఆధారంగా మూడు భాగాలుగా విభజించవచ్చు.


1) కేంద్రక భాగం: ఇది సూర్యుడి అంతర్భాగంలో శక్తి జనక కేంద్రంగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 15 మిలియన్‌ డిగ్రీల కెల్విన్‌ వరకు ఉంటాయి.


2) విద్యుదయస్కాంత ప్రాంతం: కేంద్రక భాగంలో పుట్టిన శక్తి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో, సూర్యుడి ఉపరితలం వైపు, ఫొటాన్స్‌ రూపంలో ఉష్ణ సంవహన ప్రాంతం వైపు కదిలే ప్రాంతం.


3) ఉష్ణ సంవహన ప్రాంతం: ఈ ప్రాంతం నుంచి శక్తి ఉష్ణ సంవహన, వాయు ప్రవాహాల రూపంలో వేగంగా బుడగల మాదిరి సూర్యుడి ఉపరితలం వైపు చేరుతుంది.


బి) సూర్యుడి ఉపరితలం దృష్ట్యా వాతావరణంలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని అనుసరించి మూడు భాగాలుగా విభజించారు.


1) ఫొటోస్ఫియర్‌ లేదా కాంతి మండలం: ఇది మనకు ప్రకాశవంతంగా పగటి సమయంలో కనిపించే సూర్యుడి ఉపరితలం. ఇందులో ఉష్ణోగ్రత 6000 ాది ఉంటుంది. ఈ ప్రాంతంలోని నల్లటి కాంతిహీనమైన మచ్చలను సూర్యాంకాలు/సన్‌స్పాట్‌/బ్లాక్‌ స్పాట్‌ అని పిలుస్తారు. సూర్యాంకాల్లో పరిసర ప్రాంతాల కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి ్బ1000 ాది  1500 ాద్శి. సూర్యాంకాల నుంచి వెదజల్లే ఆవేశపూరిత విద్యుత్తు కణాల సమూహమే ‘సౌరజ్వాలలు’. ఇవి భూవాతావరణంలోని థర్మోస్ఫియర్‌ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అక్కడున్న ఎలక్టోమ్యాగ్నటిక్‌ రేడియేషన్‌ వితరణం చెంది భూమిపై ఉన్న సమాచార, ప్రచార వ్యవస్థల్లో అంతరాయాలు కలుగుతాయి.


* ప్రతి 11 ఏళ్లకు ఒకసారి సూర్యాంకాల నుంచి అత్యధిక పరిమాణంలో సౌరజ్వాలలు విడుదలవుతూ ఉంటాయి. వీటినే సౌర సునామీలు/సౌర తుపాన్లు అంటారు. ఇవి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తే భూమి మీద సమాచార ప్రసార వ్యవస్థలతో పాటు బ్యాంకింగ్‌ ఖాతాలు తారుమారు కావడం, విద్యుత్తు గ్రిడ్లు విఫలమవడం, వాతావరణంలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గడం లాంటి ఊహించని పరిణామాలు ఏర్పడి మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.


* సూర్యుడి ఫొటోస్ఫియర్‌ ప్రాంతంలో న్యూట్రాన్‌ అణువుల ఉద్గారం తక్కువ స్థాయిలో జరిగితే వాటిని సౌరపవనాలు అంటారు. ఇవి భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు అక్కడున్న దుమ్ము, ధూళి కణాలపై పడి వివర్తనం చెందినప్పుడు ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద ఎరుపు, నారింజ, ఆకుపచ్చ వర్ణపు పట్టీలు ఏర్పడతాయి. వీటినే అరోరాలుగా పిలుస్తారు. ఉత్తరార్ధ గోళంలో వీటిని అరోరా బోరియాలసిస్‌ అని, దక్షిణార్ధ గోళంలో అరోరా ఆస్ట్రాలిస్‌ అని పిలుస్తారు.


* భూ ఉపరితలం నుంచి దాదాపు 64 వేల కి.మీ. ఎత్తులో ఉన్న ఆవరణాన్ని అయస్కాంత ఆవరణం/వాన్‌ అలెన్‌ వికిరణ మేఖల అంటారు. ఇది సూర్యుడి వాతావరణం నుంచి వెదజల్లే ఈ సౌర జ్వాలల నుంచి భూవాతావరణాన్ని కాపాడుతుంది. సూర్యుడిపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం ‘ఆదిత్య’. సమాన సూర్యకాంతిని పొందే ప్రదేశాలను ‘ఐసోహెల్స్‌’ అంటారు.


2) క్రోమోస్ఫియర్‌/వర్ణావరణం: ఇది ఫొటోస్ఫియర్‌ పైన ఎరుపు, నారింజ రంగులో ఉండే భాగం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 32000ాది వరకు ఉంటాయి. ఈ ప్రాంతం సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. దానిపై మూలకాల ఉనికిని తెలియజేసే నల్లటి కాంతి హీనమైన రేఖలు ఏర్పడి ఉంటాయి. వీటిని ప్రాన్‌హోపర్‌ రేఖలు అంటారు.


3) కరోనా (సూర్యకాంతి పరివేశం): క్రోమోస్ఫియర్‌ పై భాగంలో అత్యధిక ఉష్ణోగ్రతలున్న ప్రాంతం. ఇది గ్రహణ సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. సూర్యుడిలోని థర్మో న్యూక్లియర్‌ చర్యలన్నీ ఇందులోనే జరుగుతాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 1,72,000ాది వరకు ఉంటుంది.సౌరకుటుంబ పరిధి: దీనిని గ్రహాల పరిధి, కూపియర్‌ బెల్ట్, పార్ట్‌ క్లౌడ్‌ రీజియన్‌ అని 3 భాగాలుగా విభజించవచ్చు.


1) గ్రహాల పరిధి: ఇందులో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్‌ ఉంటాయి.


గ్రహాలు: తమ ఊహాత్మక అక్షం చుట్టూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ, సూర్యుడి నుంచి వెలుతురు, వేడిమిని పొందే ఖగోళ స్వరూపాలనే గ్రహాలు అంటారు. ప్రస్తుతం సౌరకుటుంబంలో గ్రహాల సంఖ్య 8 మాత్రమే. గతంలో తొమ్మిదో గ్రహంగా ఉన్న ప్లూటోకు గ్రహస్థాయి లేదని, 2006, ఆగస్టు 24న చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌లో జరిగిన ఐఏయూ (ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ యూనియన్‌) సమావేశంలో తీర్మానించారు. దాన్ని మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. 


2) కూపియర్‌ బెల్ట్‌: నెప్ట్యూన్‌ గ్రహ కక్ష్యకు అవతల ఉన్న సౌరకుటుంబంలోని ప్రాంతాన్ని కూపియర్‌ బెల్ట్‌ అంటారు. ఇందులో తోకచుక్కలు, మరుగుజ్జు గ్రహాలు ఉంటాయి. 


3) పార్ట్‌ క్లౌడ్‌ రీజియన్‌: కూపియర్‌ బెల్ట్‌కు అవతల ఉన్న ఈ ప్రాంతంలో సుదూరంగా తోక చుక్కలు ఉంటాయి. దీనితో సౌరకుటుంబ పరిధి ఆగిపోతుంది.


గ్రహాల రకాలు: భూకక్ష్యను ఆధారంగా చేసుకొని గ్రహాలను రెండు రకాలుగా విభజించారు.


1) నిమ్నత గ్రహాలు: ఈ గ్రహాలు భూకక్ష్యకు లోపల, సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. అవి బుధుడు, శుక్రుడు.


2) ఉన్నత గ్రహాలు: ఈ గ్రహాల కక్ష్యలు భూకక్ష్యకు ఆవల ఉంటాయి. అవి అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు.


భౌతిక, రసాయన ధర్మాల ఆధారంగా గ్రహాలను రెండు రకాలుగా పేర్కొన్నారు.


1) అంతర/భౌమ/టెరెస్ట్రియల్‌ గ్రహాలు: పరిమాణంలో ఇవి చిన్నవిగా ఉంటాయి. శిలానిర్మితాలు, అధిక సాంద్రత, ఉష్ణోగ్రతలతో ఉంటాయి.


ఉదా: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు.


2) బాహ్య/జోవియస్‌ గ్రహాలు: ఇవి హైడ్రోజన్‌ లాంటి అనేక వాయువులు ద్రవీభవించడంతో ఏర్పడ్డాయి. తక్కువ సాంద్రత, ఉష్ణోగ్రతలతో ఉంటాయి.


ఉదా: బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు.


సూర్యుని నుంచి దూరాన్ని బట్టి చూస్తే గ్రహాలు కింది వరుస క్రమంలో ఉంటాయి.


పరిమాణాన్ని బట్టి అవరోహణ క్రమంలో గ్రహాలు:  1) బృహస్పతి 2) శని 3) యురేనస్‌ 4) నెప్ట్యూన్‌ 5) భూమి 6) శుక్రుడు 7) అంగారకుడు  8) బుధుడు


సౌరకుటుంబంలో తూర్పు నుంచి పడమరకు (ఎడమ నుంచి కుడికి సవ్యదిశలో భ్రమణం చేసే గ్రహాలు:  శుక్రుడు, వరుణుడు.


సౌర కుటుంబంలో గ్రహాల ఆత్మభ్రమణ కాలాల అవరోహణ క్రమం: 1) శుక్రుడు  2) బుధుడు 3) అంగారకుడు 4) భూమి 5) నెప్ట్యూన్‌ 6) యురేనస్‌ 7) శని  8) బృహస్పతి.


సౌర కుటుంబంలో అవరోహణ క్రమంలో గ్రహాల పరిభ్రమణ కాలాలు: 1) నెప్ట్యూన్‌ 2) యురేనస్‌  3) శని 4) బృహస్పతి 5) అంగారకుడు 6) భూమి 7) శుక్రుడు    8) బుధుడు


గ్రహాలు-కనుక్కున్నవారు: 1). శని    -గెలీలియో 2) వరుణుడు - విలియం హెర్షెల్‌  3) ఇంద్రుడు-జోహాన్‌ గల్, ఆడమ్స్, లి వెర్రియర్‌ 4) ప్లూటో- క్లయిడ్‌ టామ్‌ బాగ్, పెర్సివాల్‌ లోవెల్‌


* సౌరకుటుంబంలో బుధ గ్రహం నుంచి నెప్ట్యూన్‌ వైపు వెళ్లేకొద్దీ గ్రహాల కక్ష్య పరిమాణాలు పెరుగుతూ వాటి కోణీయ వేగాలు తగ్గుతాయి.

రచయిత: జయకర్‌ సక్కరి

Posted Date : 21-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌