• facebook
  • whatsapp
  • telegram

  శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రతిపాదనలు - సూచనలు

 ఆరు మార్గాలతోనూ అంతు పట్టని పరిష్కారం! 


 

భిన్న వాదనలు, డిమాండ్లతో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున జరగడంతో రాష్ట్రంలో రాజకీయ, పరిపాలనా స్తబ్దతలు ఏర్పడ్డాయి. సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించింది. చరిత్రతో పాటు సమకాలీన పరిస్థితులను అన్నిరకాలుగా పరిశీలించి ఆరు రకాల ప్రతిపాదనలతో నివేదిక రూపొందించింది. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతం వివక్షకు గురికాకూడదని, సమస్య తీవ్రంగానే ఉన్నప్పటికీ పరిష్కార మార్గాలూ ఉన్నాయని చెప్పింది. తెలంగాణవాదానికి సంఘీభావం ప్రకటిస్తూనే, సమైక్యానికే మొగ్గు చూపింది. ఈ కమిటీ చేసిన అధ్యయనం, విశ్లేషణ, సూచించిన పరిష్కారాలను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. కమిటీని, నివేదికను తెలంగాణ సమాజం తిరస్కరించిన తీరు, ఆ తర్వాత కేంద్రం  దాన్ని పక్కన పెట్టిన విధానాన్ని అర్థం చేసుకోవాలి.


శ్రీకృష్ణ కమిటీ తన పరిశీలనల సారాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించింది. అందులోని తొమ్మిదో అధ్యాయంలో ‘మన ముందున్న మార్గం’ అనే శీర్షికలో ఆరు ప్రతిపాదనలు చేసింది.


1) ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించడం: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించడమంటే ఈ సమస్యను శాంతిభద్రతల సమస్యగా పరిగణించడం. కేంద్రం ప్రమేయం ఎక్కువగా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించుకోవడం. గత 54 ఏళ్ల చరిత్రను గమనిస్తే వివిధ వర్గాలకు ప్రభుత్వంలో, పార్టీలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా తెలంగాణ సమస్యను రాజకీయ కోణంలో పరిష్కరిస్తూ వచ్చారు. అదేక్రమంలో ప్రస్తుతం కూడా పరిష్కరించవచ్చని భావించినప్పటికీ, పరిస్థితి హింసాత్మకంగా మారే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ (నేటి భారాస)తో గద్దర్‌ నెలకొల్పిన ‘తెలంగాణ ప్రజాఫ్రంట్‌’ చేతులు కలపడాన్ని గమనిస్తే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆందోళనలు భావోద్వేగాలతో తీవ్రంగా కొనసాగే ప్రమాదం ఉంది.


* ఈ నేపథ్యంలో యథాతథ స్థితిని కొనసాగించడం సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది. ఏదో ఒక రకంగా ఈ పరిస్థితి మార్చడం అనివార్యమని భావిస్తూ ఇది చిట్టచివరిగా పరిశీలించాల్సిన ప్రత్యామ్నాయమని కమిటీ అభిప్రాయపడింది.

2) రాష్ట్రాన్ని సీమాంధ్రగా, తెలంగాణగా విభజించడం - హైదరాబాదు నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం - రెండు రాష్ట్రాలకు రెండు కొత్త రాజధాని నగరాలను అభివృద్ధి చేయడం: హైదరాబాదుకు సంబంధించి ఈ సమస్య ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాన్ని శ్రీకృష్ణ కమిటీ బెల్జియంలోని బ్రసెల్స్‌ మెట్రోపాలిటన్‌ నగరంతో పోల్చింది. ఏపీని రెండుగా విభజిస్తే హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. రెండు రాష్ట్రాలు తమ సొంత రాజధానులు ఏర్పాటు చేసుకునే వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతంలో వచ్చే ఆదాయం అంతా కేంద్రానికే చెందుతుంది. అయితే మూడు ప్రాంతాలకు ఆదాయం వచ్చే విధంగా దీన్ని పంచుకోవచ్చు.


* ఈ పరిష్కార మార్గంలో ఉన్న ప్రధాన లోపం తెలంగాణ ప్రజలు హైదరాబాదును వదులుకోవడానికి ఇష్టపడక మళ్లీ ఆందోళనలు చేస్తే, పెద్దఎత్తున ఉద్రిక్తత తలెత్తుతుంది. ఈ ఐచ్ఛికం (ఆప్షన్‌) కూడా ఆచరణ సాధ్యం కాదని కమిటీ తనకు తానుగా పేర్కొంది.

3) రాష్ట్రాన్ని రాయల తెలంగాణగా, ఆంధ్రగా విభజించడం - హైదరాబాద్‌ని రాయల తెలంగాణకు రాజధానిగా చేయడం: రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు ఈ ఆప్షన్‌ను రెండో ప్రాధాన్యం కింద కమిటీ ముందు ఉంచారు. వీరు తమ తొలి ఐచ్ఛికంగా సమైక్యాంధ్రనే కోరుకున్నారు. ఏఐఎంఐఎం కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ కావాలని కోరుకుంటూనే ఒకవేళ విభజన తప్పనిసరైతే, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను కలపడం వల్ల ముస్లింలకు ప్రయోజనం ఉంటుందని పేర్కొంది.


* ఈ ఐచ్ఛికాన్ని కూడా ఇటు తెలంగాణవాదులు కానీ, సమైక్యాంధ్ర వాదులు కానీ అంగీకరించరు. ఈ సిఫార్సు చేస్తే  తెలంగాణ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆర్థికపరంగా ఈ ప్రత్యామ్నాయ ఐచ్ఛికం సరైనదే అయినప్పటికీ మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ఇది కూడా ఆచరణ సాధ్యం కాదని కమిటీ భావించింది.

4) రాష్ట్రాన్ని సీమాంధ్రగా, తెలంగాణగా విభజించడం, హైదరాబాద్‌ నగర భౌగోళిక పరిధిని విస్తరించి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి నల్గొండ జిల్లా ద్వారా గుంటూరు జిల్లాకు, మహబూబ్‌నగర్‌ జిల్లా ద్వారా కర్నూలుకు భౌగోళికంగా అనుసంధానాన్ని కలిగి ఉండటం: ఈ ప్రతిపాదన హైదరాబాదు నగరం ప్రపంచస్థాయి నగరంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయనే వాదన నుంచి వచ్చింది. హైదరాబాదు నగర సరిహద్దులను ఈ మధ్యకాలంలో గణనీయంగా విస్తరించారు. గతంలో ఎంసీహెచ్‌లో ఉన్న 175 చ.కి.మీ. పరిధి నుంచి జీహెచ్‌ఎంసీలో 625 చ.కి.మీ.కు విస్తరించారు. ఇటీవల దీన్ని హెచ్‌ఎండీఏ పరిధిలో 7,073 చ.కి.మీ.ల విస్తీర్ణానికి విస్తరించారు. ఇది గోవా రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం కంటే రెట్టింపు. ఈ ఐచ్ఛికంలో హైదరాబాద్‌ను 12 వేల చ.కి.మీ.లతో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రతిపాదించారు. దీనిలో 67 మండలాలు, 1,330 గ్రామాలు ఉంటాయి.


* రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ నగరంతో భౌగోళిక సంబంధాలు ఉంటాయి. ఇది ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు రాజధానిగా ఉంటూనే చండీగఢ్‌ తరహాలో కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. కానీ, తెలంగాణవాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలను విస్తరించి కేంద్రపాలిత ప్రాంతంలో కలపడాన్ని తెలంగాణవాదులు అంగీకరించరని కమిటీ వివరించింది.

5) రాష్ట్రాన్ని ఇప్పుడున్న సరిహద్దులతోనే సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించడం, హైదరాబాద్‌ని తెలంగాణకు రాజధాని చేయడం, సీమాంధ్రకు మరో కొత్త రాజధానిని నిర్మించడం:  ఈ ఐచ్ఛిక ప్రత్యామ్నాయంలో ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, సీమాంధ్రగా విభజించడం; సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేసే వరకు తాత్కాలికంగా రెండు రాష్ట్రాలకు హైదరాబాదు రాజధానిగా కొనసాగడం. ఈ ఐచ్ఛికం వల్ల ప్రత్యేక రాష్ట్రం కావాలనే తెలంగాణ ప్రజల డిమాండు, దాని కోసం వారు చేస్తున్న పోరాటం, తమకు అన్యాయం జరిగిందనే వారి భావనలతో ఏకీభవించినట్లు అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో శ్రీకృష్ణ కమిటీ పర్యటించినప్పుడు, ఎక్కువ శాతం ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నట్టు ప్రత్యక్షంగా గమనించింది.


* ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతానికి చెందిన మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. కానీ కొన్ని తీవ్రమైన సమస్యలు కూడా ఏర్పడతాయి. రాష్ట్రంలోని మిగతా రెండు ప్రాంతాలపై పడే ప్రభావాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అందువల్ల అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ ప్రతిపాదనను రెండో ఉత్తమ ప్రత్యామ్నాయంగా కమిటీ భావించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే రాష్ట్ర విభజన జరగాలని, అది అన్నిప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉండాలని కమిటీ పేర్కొంది.


6) రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం రాజ్యాంగ, చట్టపరమైన చర్యలు చేపట్టడం. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి, రాజ్యాధికారంలో సముచిత స్థానం కోసం చట్టబద్ధంగా సాధికారత కలిగిన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల శ్రేయస్సుకు సమైక్యతే కీలకమైందని, రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ప్రస్తుత సమస్యకు పరిష్కారం సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది. 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం స్ఫూర్తిగా తెలంగాణ ప్రాంతీయ మండలికి విధులు, నిధులు సమకూర్చడం ద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగిస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చు. ఈ నమూనా వల్ల రాయలసీమ నుంచి కూడా ఇలాంటి ప్రత్యేక మండలి కోసం డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే సమైక్య ప్రతిపాదన అమలులో కష్టనష్టాలు ఎదురవడం ఖాయం.


*‘‘జాతీయ దృక్పథంతో చూసిప్పుడు ఇది మా ముందున్న అత్యుత్తమ పురోగామి ప్రతిపాదనగా నిలుస్తోంది’’ అని కమిటీ అభిప్రాయపడింది. అధికార వికేంద్రీకరణతో అందరి శ్రేయస్సును కాంక్షిస్తూ సమ్మిళిత అభివృద్ధి సాధించాలన్న జాతీయ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన నమూనాను ఈ ప్రతిపాదన సూచిస్తోందని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో తలెత్తుతున్న ప్రాంతీయ, విభజన ఆకాంక్షలను సంతృప్తి పరచడానికి కూడా ఉపకరిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. అంతేకాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైన ప్రాంతీయ వాదనలు ఉన్నాయో వాటికి ఇది స్ఫూర్తిగా ఉంటుందని తెలిపింది. ఈ కారణాల వల్ల కమిటీ ఈ చివరి ఐచ్ఛిక ప్రతిపాదనను అత్యుత్తమంగా పరిగణించింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక సంక్షేమానికి తోడ్పడుతుందని భావించింది.

తెలంగాణవాదుల ప్రతిస్పందన (పర్యవసానాలు): సమైక్యాంధ్రలో యాభై ఏళ్ల పైనే గడిచిన కాలగమనంలో వివిధ సందర్భాల్లో ఏర్పాటైన చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగబద్ధ ఉత్తర్వులు, రాజ్యాంగ సవరణ (32వ) కమిషన్‌లు, శాసనసభా కమిటీలేవీ తెలంగాణకు ప్రయోజనం కలిగించలేకపోయాయి. అవన్నీ నామమాత్రపు ఏర్పాట్లే. ఫజల్‌ అలీ కమిషన్‌ అభిప్రాయపడినట్లు రాజ్యాంగపరమైన ఏర్పాట్లు తెలంగాణకు సరిపోవని సమైక్య రాష్ట్రం నిర్ద్వందంగా నిరూపించింది. నేడు తెలంగాణ ప్రజలు కోరుతోంది మరో చట్టబద్ధ సంస్థను కాదు. రాజ్యాంగానికి లోబడి స్వయం పాలనాధికారం ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే. ఇది తప్ప మరేదీ తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచదు. ఆరో ప్రత్యామ్నాయం ఇప్పటికే రాష్ట్రంలో విఫల ప్రయోగమైందని, మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమేనని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేశారు.


* తెలంగాణ వస్తే లక్షలాది ఉద్యోగాలు వచ్చేస్తాయన్న భరోసాలో తేలియాడుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత; పదోన్నతులు వచ్చేస్తాయని ఆశపడుతున్న ఉద్యోగులు, లాయర్లు; రైతులు తదితరులంతా కమిటీ చేసిన ఆరో ప్రతిపాదనతో ఏమాత్రం సంతృప్తి చెందకపోవచ్చు. దాంతో హింసాత్మక ఉద్యమాలకు పాల్పడవచ్చు.


ముగింపు వాక్యాలు: తన నివేదిక రాష్ట్రంలోని ఎక్కువమందికి సంతృప్తికరంగా ఉంటుందని శ్రీకృష్ణ కమిటీ భావించింది. అంతేకాకుండా చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న తెలంగాణ సమస్యకు కేంద్రం ఒక పరిష్కారాన్ని చూపిస్తుందని అభిప్రాయపడింది. ఈ పరిష్కారం కాలపరీక్షకు నిలుస్తుందని ఆశించింది. ‘‘వాస్తవాలను అంగీకరించకపోవడం మూర్ఖత్వం.. వాస్తవాలను సూటిగా ఎదుర్కొనకపోతే ఆ వాస్తవాలే తిరగబడి ప్రతీకారం తీర్చుకుంటాయి.’’ అన్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మాటతో శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ముగించింది.

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి


 

 

Posted Date : 15-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌