• facebook
  • whatsapp
  • telegram

 వస్త్ర, ఇనుము - ఉక్కు పరిశ్రమలు

నాగరికత చిహ్నాలు.. అవస్థాపన మూలాలు!

 

నాగరికతకు చిహ్నమైన వస్త్ర పరిశ్రమలు, అవస్థాపనా సౌకర్యాలకు మూలమైన ఇనుము-ఉక్కు పరిశ్రమలు మన దేశంలో మధ్యయుగం నుంచే ఉన్నాయి. వస్త్రాల ఉత్పత్తి మిల్లులతో మొదలై, పవర్‌లూమ్‌లతో శక్తిని సంతరించుకొని, హ్యాండ్‌లూమ్‌లుగా మన సంస్కృతిని ప్రతిబింబించాయి. ఇనుము-ఉక్కు వినియోగం ఇక్కడ పురాతన కాలంలోనే మొదలైంది. మధ్యలో కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ, స్వాతంత్య్రానంతరం ఆధునిక యుగంలో అభివృద్ధి పథంలో సాగాయి. దేశ ప్రగతిలో, ఉపాధి కల్పనలో కేంద్ర బిందువులుగా నిలిచిన ఈ పరిశ్రమల గురించి పోటీ పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి. 

 

 

ఏ దేశ ఆర్థిక ప్రగతి అయినా ప్రధానంగా పరిశ్రమలపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే భారత్‌లో వస్త్ర, ఇనుము-ఉక్కు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇక్కడి నిపుణులైన పనివారు అతి పలుచని, నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేసేవారు. ఉక్కు పరిశ్రమ కూడా ప్రాచీన కాలంలోనే మన దేశంలో అభివృద్ధి చెందింది అనడానికి నాటి రాజులు వాడిన నాణ్యమైన ఖడ్గాలు, బల్లాలు, ఇతర యుద్ధ పనిముట్లు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిషర్ల కాలంలో మన వద్ద ఉన్న ముడిసరకు వివిధ దేశాలకు ఎగుమతయ్యేది. అక్కడ తయారైన వస్తువులు మళ్లీ మనకు దిగుమతయ్యేవి. స్వాతంత్య్రానంతరం పంచవర్ష ప్రణాళికల కాలంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం పెరిగింది. మన దేశంలో పురాతన కాలంలోనే వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందినప్పటికీ పారిశ్రామికీకరణ తర్వాత బాగా ఊపందుకుంది. అన్ని పరిశ్రమలకు అవసరమైన ఇనుము-ఉక్కును కూడా ఇక్కడే తయారు చేసి ఇతర ఇండస్ట్రీల అభివృద్ధికి దోహదపడేలా ప్రణాళికలు రూపొందించారు. 


వస్త్ర పరిశ్రమ

మన దేశంలోని వస్త్ర పరిశ్రమ అతి పురాతనమైంది. సున్నితమైన, మృదువైన వస్త్రాల తయారీ ఇక్కడ చాలా కాలం నుంచి కొనసాగుతోంది. భారతీయ చేనేత వస్త్రాలకు నేటికీ దేశ, విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. 18వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం మొదట నూలు వస్త్ర రంగంలోనే ప్రారంభమైంది. నేడు ప్రపంచ వస్త్ర పరిశ్రమలో చైనా, భారత్, అమెరికాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 


భారత్‌లో మొదటి నూలు మిల్లు 1818లో కలకత్తాలో ప్రారంభమైంది. 1854లో బొంబాయిలో ప్రైవేటు పెట్టుబడిదారులు మరో నూలు మిల్లును స్థాపించారు. అప్పటి నుంచి నూలు పరిశ్రమ వేగం పుంజుకుంది. నాడు వస్త్ర పరిశ్రమలో నూలు వస్త్ర ఉత్పత్తి వల్ల మంచి లాభాలు వచ్చేవి. ఉత్పత్తిలో మన దేశం జపాన్, ఇంగ్లండ్‌ దేశాలతో పోటీ పడేది.దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం వస్త్ర పరిశ్రమ.మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1927లో దిగుమతి సుంకాలు విధించడంతో ఈ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనూ ఆ అభివృద్ధి కొనసాగింది. 1943లో సామాన్య ప్రజలు వాడే వస్త్రాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించి పంపిణీని క్రమబద్ధం చేసింది. ప్రస్తుతం ఈ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) 2%, విదేశీ మారక ద్రవ్య ఆదాయంలో 12% వస్త్ర పరిశ్రమ నుంచే లభిస్తోంది. వీటి ఎగుమతుల్లో 43% ఐరోపా, అమెరికా దేశాలకు జరుగుతున్నాయి.


వస్త్రాలను మూడు మార్గాల్లో ఉత్పత్తి చేస్తారు. అవి 1) మిల్లులు 2) పవర్‌లూమ్‌లు 3) హ్యాండ్‌లూమ్‌లు. ఇవి వేటికవే ప్రత్యేక గుర్తింపు, ఆకర్షణను కలిగి ఉంటాయి. 43.31 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మొదట్లో మిల్లుల ద్వారా వస్త్రాల ఉత్పత్తి చాలా ఎక్కువగా జరిగేది. వాటి ప్రాధాన్యం పవర్‌లూమ్‌లు వచ్చిన తర్వాత తగ్గిపోయింది. 1950-51లో మిల్లుల ద్వారా వస్త్రాల ఉత్పత్తి 80.69% ఉండగా, 2020-21 నాటికి అది 3.5%కి తగ్గింది. భారత్‌లో పవర్‌లూమ్‌ల ప్రవేశంతో చాలా మార్పులు జరిగాయి. 2017లో దేశంలో 24.86 లక్షల పవర్‌లూమ్‌లు ఉన్నాయి. సుమారు 57% వస్త్ర ఉత్పత్తి వాటి ద్వారా జరుగుతోంది. చేనేత వస్త్ర పరిశ్రమలు (హ్యాండ్‌లూమ్‌లు) మన దేశ సంస్కృతి, సంప్రదాయానికి చిహ్నాలు.  


నూలు వస్త్ర పరిశ్రమలు దేశవ్యాప్తంగా సుమారు 100 పట్టణాల్లో ఉన్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కేంద్రీకృతమయ్యాయి. ముంబయి నగరాన్ని ‘కాటన్‌ పోలీస్‌ ఆఫ్‌ ఇండియా’, ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఈస్ట్‌’గా పేర్కొంటారు. నూలు వస్త్ర పరిశ్రమలో మహారాష్ట్ర, గుజరాత్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అహ్మదాబాద్‌ నగరాన్ని ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు. మాంచెస్టర్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా కోయంబత్తూర్‌ (తమిళనాడు)ను, మాంచెస్టర్‌ ఆఫ్‌ నార్త్‌ ఇండియాగా కాన్పుర్‌ (యూపీ)ను వ్యవహరిస్తారు.


* ఉన్ని వస్త్ర పరిశ్రమను కాన్పుర్‌ సమీపంలోని ‘లాల్‌ ఇమ్లి’ వద్ద 1876లో ప్రారంభించారు. శ్రేష్ఠమైన ఉన్నిని జమ్ము-కశ్మీర్‌లో బకర్‌వాల్స్, రాజస్థాన్‌లో గుజ్జర్లు, హిమాచల్‌ప్రదేశ్‌లో గద్దీస్‌ ప్రజలు సేకరిస్తారు. ముడి ఉన్ని ఉత్పత్తిలో రాజస్థాన్, జమ్ము-కశ్మీర్, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఉన్నిలో ‘మెరినా’ రకం నాణ్యమైంది.


* జనపనార పరిశ్రమ కూడా మన దేశంలో చాలా పురాతనమైంది. మధ్యయుగంలో, బ్రిటిష్‌ పాలనా కాలంలో మన దేశంలో ప్రజలు ఈ వస్త్రాలనే ఉపయోగించారు. జనపనార పరిశ్రమను మొదట 1855లో కలకత్తాలోని రిష్రా వద్ద స్థాపించారు. జనపనారను ‘బంగారు పీచు’గా పిలుస్తారు. ఈ పరిశ్రమల కేంద్రంగా హుగ్లీ పరీవాహక ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ప్రపంచ జనుము ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉంటే, మొదటి స్థానాన్ని బంగ్లాదేశ్‌ ఆక్రమించింది. జనపనార వస్తువులు ఎక్కువగా అమెరికా, కెనడా, రష్యాలకు ఎగుమతి అవుతున్నాయి. జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను కలకత్తాలో 1971లో ఏర్పాటు చేశారు.


* పట్టు వస్త్రాలను వేల సంవత్సరాల క్రితమే చైనా, భారత్‌ల్లో తయారు చేశారు. మన దేశంలో ఆధునిక పట్టు పరిశ్రమను హావ్‌డా (హౌరా) వద్ద 1832లో స్థాపించారు. 1947 తర్వాత పట్టు పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. పట్టు పరిశ్రమను ‘వస్త్ర పరిశ్రమల రాణి’గా పిలుస్తారు. పట్టు ఉత్పత్తిలో చైనా, భారత్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.  వినియోగంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ఇండియాలో పట్టు ఉత్పత్తి 2020లో 36 వేల మెట్రిక్‌ టన్నులు ఉంది. అది 2021లో 34 వేల మెట్రిక్‌ టన్నులకు చేరింది.

 

ఇనుము-ఉక్కు పరిశ్రమ

ఐరోపా కంటే మూడు వేల సంవత్సరాలకు పూర్వమే భారత్‌లో లోహయుగం ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడి ఇనుము-ఉక్కు పరిశ్రమ అతిపురాతనమెంది. ఆధునిక పద్ధతిలో ఇనుము-ఉక్కు తయారీ 1875 నుంచి మొదలైంది. తొలి ఇనుము-ఉక్కు పరిశ్రమను కుల్టీ వద్ద  బెంగాల్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ ఏర్పాటు చేసింది. 1907లో టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ ‘సక్చీ’ అనే గ్రామం వద్ద ప్రారంభమైంది. ఆ ప్రాంతం తర్వాత జంషెద్‌పుర్‌గా మారింది. 1908లో ఇండియన్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ పరిశ్రమను ఒడిశాలోని హీరాపుర్‌లో స్థాపించారు. 1923లో మైసూరు వద్ద మైసూరు స్టేట్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వర్క్స్‌ మొదలైంది. దీన్నే తర్వాత భద్రావతి ఐరన్‌ అండ్‌ స్టీల్‌గా పిలుస్తున్నారు.


దుక్క ఇనుము ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో, చైనా మొదటి స్థానంలో ఉన్నాయి. ఇనుము వినియోగంలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో చైనా, అమెరికా ఉన్నాయి. మన దేశంలో తలసరి ఇనుము వినియోగం 2001లో 26 కేజీలు కాగా, 2020 నాటికి అది 74.7 కేజీలకు పెరిగింది. 2030 నాటికి 160 కేజీలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


టాటా ఐరన్‌ & స్టీల్‌ కంపెనీ (TISCO): ఇది 1907లో ఏర్పాటైంది. దీన్నే జంషెద్‌పుర్‌ టాటా కంపెనీగా పిలుస్తారు. 1911లో దీని ప్రారంభ వార్షిక ఉత్పత్తిలో 1.21 మిలియన్‌ టన్నుల పిగ్‌ ఐరన్, 1.1 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉన్నాయి.

ఇండియన్‌ ఐరన్‌ & స్టీల్‌ కంపెనీ (IISCO): దీని పేరు మీద మొత్తం మూడు ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. అవి 1) కుల్టీ (1864), 2) హీరాపుర్‌ (1908), 3) బర్న్‌పుర్‌ (1937).  వీటిని 1972, జులైలో ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. వాటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల టన్నుల ఉక్కు. ప్రస్తుతం 4 లక్షల టన్నుల పైగా పిగ్‌ ఐరన్, 3.5 లక్షల టన్నుల దుక్క ఇనుము, 3.8 లక్షల ఉక్కు ఉత్పత్తి చేస్తోంది.


విశ్వేశ్వరయ్య ఐరన్‌ & స్టీల్‌ లిమిటెడ్‌: దీన్ని 1923లో కర్ణాటకలోని షిమోగా జిల్లాలో భద్రావతి నది వద్ద మొదట మైసూరు ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ పేరుతో నెలకొల్పారు. 1962లో ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 1.38 లక్షల టన్నుల ఉక్కు.


రెండో ప్రణాళిక కాలంలో

ఇనుము-ఉక్కు ఉత్పత్తి పెంచేందుకు రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో భారత ప్రభుత్వం భిలాయ్, రూర్కెలా, దుర్గాపుర్‌లలో 3 ప్లాంట్లను ‘ది హిందూస్థాన్‌ స్టీల్‌ లిమిటెడ్‌’ పేరుతో నెలకొల్పింది. ఒక్కో ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల టన్నులు.

భిలాయ్‌ ఇనుము, ఉక్కు కర్మాగారం: దీన్ని 1957లో ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలోని భిలాయ్‌ వద్ద రష్యా ఆర్థిక సహకారంతో ప్రారంభించారు. 1959లో ఉత్పత్తి ప్రారంభమైంది. తొలుత ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల టన్నులుగా ఉంది. తర్వాత 52 లక్షల టన్నులకు చేరింది.

రూర్కెలా ఇనుము, ఉక్కు కర్మాగారం: దీన్ని ఒడిశాలోని సుందర్‌ఘర్‌ జిల్లా రూర్కెలాలో నాటి పశ్చిమ జర్మనీ సహకారంతో నెలకొల్పారు. 1959 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది.

దుర్గాపుర్‌ ఇనుము, ఉక్కు కర్మాగారం: పశ్చిమ బెంగాల్‌లోని, బర్థమాన్‌ జిల్లా దుర్గాపుర్‌లో నాటి యునైటైడ్‌ కింగ్‌డమ్‌ సహకారంతో 1959లో ఏర్పాటు చేశారు. 1962 నుంచి ఉత్పత్తి మొదలైంది.

బొకారో ఇనుము, ఉక్కు కర్మాగారం: 1964లో నాటి సోవియట్‌ యూనియన్‌ (రష్యా) సహకారంతో ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లా బొకారో - దామోదర్‌ నది పరీవాహక ప్రాంతంలో నిర్మించారు. ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల టన్నులు కాగా తర్వాత 40 లక్షల టన్నులకు పెంచారు. 100 లక్షల టన్నులు చేయాలన్నది లక్ష్యం.

సేలం స్టీల్‌ ప్లాంటు: తమిళనాడులోని సేలం జిల్లా సేలం దగ్గర నెలకొల్పారు. దీని వాణిజ్య ఉత్పత్తి 1982లో మొదలైంది. ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యం 32 వేల టన్నులు. 1991 నాటికి ఇది రెట్టింపైంది. 1995-96 నాటికి 80 వేల టన్నులకు చేరింది.

విజయనగర్‌ స్టీల్‌ ప్లాంటు: కర్ణాటకలోని బళ్లారి జిల్లా హోస్పేట దగ్గర్లోని తోర్నగల్‌ దగ్గర నెలకొల్పారు. దీని స్థాపిత సామర్థ్యం 32 లక్షల టన్నులు. తర్వాత ఇది రెట్టింపైంది.

విశాఖ స్టీల్‌ ప్లాంటు: దేశంలోనే సముద్ర తీరంలో నెలకొల్పిన మొదటి స్టీల్‌ ప్లాంటు. 1972లో దీనికి పునాది రాయి వేశారు. 1982, ఫిబ్రవరి వరకు నిర్మాణం ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు రెండు దశల్లో జరిగింది. 1992, మార్చి నాటికి మొదటి దశ, 1992, జులై నాటికి రెండో దశ పూర్తయ్యాయి. 1993-94 నాటికి సంపూర్ణ సామర్థ్యంతో ఉత్పత్తి మొదలైంది. ఇది ఎగుమతుల ప్రధానంగా నెలకొల్పిన స్టీల్‌ ప్లాంటు. ఇనుము, ఉక్కు ఉత్పత్తిలో  దేశంలోనే రెండో పెద్ద కర్మాగారంగా నిలిచింది.

* ఒడిశాలోని పారాదీప్‌ దగ్గర్లోని దైతారీ వద్ద దైతారీ ఉక్కు కర్మాగారాన్ని ప్రతిపాదించారు. ఒడిశాలోని కళింగనగర్‌ దగ్గరలో టాటా ఉక్కు కర్మాగారం, మహారాష్ట్రలోని రామ్‌గఢ్‌ వద్ద పెన్‌ తెహ్‌సిల్‌ దగ్గర దోల్వి ఉక్కు కర్మాగారం ఏర్పాటయ్యాయి. ఇవేకాక అనేక చిన్న ఉక్కు కర్మాగారాలు ప్రారంభమయ్యాయి. వాటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 వేల నుంచి 5 లక్షల టన్నులు.

 

జాతీయ ఉక్కు విధానం

మన దేశంలో 2007లో మొదటిసారిగా జాతీయ ఉక్కు విధానాన్ని రూపొందించారు. 2017లో జాతీయ ఉక్కు విధానంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అధిక వ్యయం చేయాలని నిర్ణయించారు. 2030-31 నాటికి దేశీయ ఉక్కు ఉత్పత్తిని, డిమాండ్‌కు అనుగుణంగా 300 మిలియన్‌ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2017లో దేశీయ తలసరి ఉక్కు వినియోగం 69 కేజీలుగా ఉంది. దీన్ని 2030-31 నాటికి 160 కిలోలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2020-21లో ఉక్కు మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచ స్పాంజ్‌ ఐరన్‌ ఉత్పత్తిలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది.

Posted Date : 24-02-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు