• facebook
  • whatsapp
  • telegram

రవాణా సౌకర్యాలు - రైల్వేలు

ప్రాంతాలను కలుపుతూ.. ప్రగతికి బాటలు వేస్తూ!

 

దేశంలో పెద్ద ఎత్తున ప్రాంతాలను కలుపుతూ, ప్రజలను ఏకం చేస్తూ పట్టాలపై ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది భారతీయ రైల్వే. బొగ్గు బళ్లతో మొదలైన ప్రస్థానం బులెట్‌ రైళ్ల వరకు దూసుకొచ్చింది. మరింత ఆధునికీకరణ వైపు వేగంగా సాగిపోతోంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధికి బాటలు వేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వేల విస్తరణ, కాలానుగుణంగా వచ్చిన మార్పులు తదితర వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  

 

 

  మానవ అవసరాలు తీర్చే సేవా పరిశ్రమల్లో రవాణా ప్రధానమైంది. ఈ రంగంలో రైల్వేలది ప్రత్యేక స్థానం. స్టీమ్‌ ఇంజిన్‌ను కనిపెట్టడంతో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తొలుత ప్యాసింజరు రైళ్లు, తర్వాత ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు వచ్చాయి. నేడు మెరుపు వేగంతో దూసుకెళ్లే బుల్లెట్‌ రైలు అందుబాటులో ఉంది. రైల్వే పితామహుడిగా జార్జ్‌ స్టీఫెన్‌సన్‌ (బ్రిటన్‌) ప్రసిద్ధి.

  విశాలమైన భారతదేశంలో అంతర్గత రవాణా, ఆర్థికాభివృద్ధిలో రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో బ్రిటిష్‌ హయాంలో మొదట సైనిక అవసరాల కోసం రైల్వే వ్యవస్థ ఏర్పాటుచేశారు. దేశ రక్షణ, తరచుగా సంభవించే కరవు కాటకాల నుంచి ప్రజల్ని రక్షించడానికి ఇవి ఉపయోగపడ్డాయి. దేశంలో మొదటి రైల్వే మార్గం 1853లో ముంబయి నుంచి థానే వరకు 34 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. ఆ తర్వాత 1854లో ఈస్ట్‌ ఇండియా రైల్వే పేరుతో హౌరా - హుగ్లీ మధ్య 37 కి.మీ. మేర ట్రాక్‌ వేశారు. 1870లో కలకత్తా - బొంబాయి, మొగల్‌సరాయ్‌ - లాహోర్‌ లైన్లు వేయగా, 1871లో బొంబాయి - మద్రాసు మార్గం పూర్తయ్యింది.  అక్కడి నుంచి 18 సంవత్సరాల్లో (1853-1871) దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ రైలు మార్గాలు నిర్మించారు.

  స్వాతంత్య్రం నాటికి ఎక్కువ రైలు మార్గాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. భారత్‌లో ఉన్న 42  మార్గాలన్నీ (సంస్థానాల అధీనంలో ఉండేవి) కలిసి భారతీయ రైల్వే అవతరించింది. 1951లో దేశంలో రైల్వేలను ఆరు ప్రాంతీయ విభాగాలుగా చేశారు. 1985 నాటికి ఆవిరి యంత్రాల స్థానంలో డీజిల్, విద్యుత్తు యంత్రాలు ప్రవేశించాయి. 1995లో రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థను కంప్యూటరీకరించారు. ప్రపంచంలో చైనా మిలటరీ తర్వాత అత్యధిక ఉద్యోగాలు కల్పించే సంస్థగా భారతీయ రైల్వే రికార్డు సృష్టించింది. రైల్వే నెట్‌వర్క్‌లో భారత్‌ది ప్రపంచంలో నాలుగో స్థానం. ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ మనదే. ఒకే యాజమాన్య సంస్థ పరంగా (సింగిల్‌ మేనేజ్‌మెంట్‌)     ప్రపంచంలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా నిలుస్తోంది.

 

ప్రభావిత అంశాలు

* మన దేశంలో ఉత్తరాదిన మైదానాలు, అధిక జనాభా, వ్యవసాయాభివృద్ధి వంటివి రైల్వేల   అభివృద్ధికి కలిసొచ్చే అంశాలు. అదే దక్షిణ భాగంలో పీఠభూమి, ఎత్తుపల్లాలు ఎక్కువ ఉండటం; తూర్పు, పశ్చిమ తీరప్రాంతాల్లోని వరద ప్రాంతాలు రైల్వేల అభివృద్ధికి కొంత అడ్డంకిగా మారాయి. నదీ వ్యవస్థ ఎక్కువగా ఉన్నచోట వంతెనల నిర్మాణానికి అధిక వ్యయం అవుతుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము-కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి పర్వత ప్రాంతాల్లో రైల్వే లైన్ల నిర్మాణానికి ఎన్నో ప్రతికూలతలున్నాయి. రాజస్థాన్‌లోని ఇసుక తిన్నెలు, మధ్యప్రదేశ్‌ -  ఒడిశాలో అటవీ ప్రాంతం వంటివీ ట్రాక్‌ల నిర్మాణానికి   ఇబ్బందికరమే.

* ఆర్థికంగా లాభదాయకంగా ఉండే ప్రాంతాల్లో రైల్వేల నిర్మాణం త్వరగా జరుగుతుంది. అధికంగా పంటలు పండే ప్రాంతాలు, ముడిఖనిజాల నిల్వలు ఎక్కువున్న ప్రదేశాలు, పారిశ్రామిక ప్రాంతాలు ఇందుకు ఉదాహరణ. ః బ్రిటిష్‌ కాలంలో రైల్వేలు ఎక్కువగా ప్రధాన నగరాలు, ఓడరేవులు, ముడి ఖనిజాలు దొరికే ప్రాంతాలకే పరిమితమయ్యాయి. స్వాతంత్య్రానంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నాయకులు రైల్వే మంత్రులు అవడం, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఇతర  ప్రాంతాల్లోనూ రైల్వేల విస్తరణ, అభివృద్ధి జరిగింది.

 

రైల్వే గేజ్‌లు

  రైలు పట్టాల మధ్య దూరాన్ని ‘గేజ్‌’ అంటారు. దేశంలో ప్రధానంగా మూడు రకాల రైల్వే గేజ్‌లు ఉన్నాయి. అవి న్యారో గేజ్, మీటర్‌ గేజ్, బ్రాడ్‌ గేజ్‌. ఇవే కాకుండా లైట్‌ గేజ్, స్టాండర్డ్‌ గేజ్‌ కూడా ఉన్నాయి.

  అన్ని న్యారో గేజ్, మీటర్‌ గేజ్‌ మార్గాలను బ్రాడ్‌గేజ్‌లుగా మార్చేందుకు యూనీ గేజ్‌ ప్రాజెక్ట్‌(1991) ప్రారంభించారు. సిమ్లా, డార్జిలింగ్, ఊటీ, మారతన్‌ మార్గాలు ఈ ప్రాజెక్టు పరిధిలోకి రావు. *   దేశంలో రైల్వే ట్రాక్‌ పొడవు (31.03.2022 నాటికి) 1,28,305 కిలోమీటర్లు. రన్నింగ్‌ ట్రాక్‌ పొడవు 1,02,831 కి.మీ. మొత్తం రైల్వే మార్గం పొడవు 68,043 కిలోమీటర్లు. ప్రస్తుతం 18 రైల్వే జోన్లు ఉన్నాయి.

*   దేశంలో ఏర్పాటైన మొదటి రైల్వే జోన్‌ - దక్షిణ రైల్వే 

*   పొడవైన మార్గం ఉన్న రైల్వే జోన్‌ - ఉత్తర రైల్వే     

* అతిపెద్ద రైల్వే జోన్‌ - ఉత్తర రైల్వే

*  అధిక రైల్వే జోన్లు ఉన్న రాష్ట్రం - పశ్చిమ బెంగాల్‌ (3)

*  అతిచిన్న పేరున్న రైల్వేస్టేషన్లు - ఇబ్‌ (ఒడిశా),  ఓడ్‌ (గుజరాత్‌) 

*   అతిపెద్ద పేరున్న రైల్వేస్టేషన్‌ - పురుచ్చి తలైవార డాక్టర్‌ ఎం.జి.రామచంద్రన్‌ రైల్వేస్టేషన్‌ 

*   దేశంలో నాలుగుదిక్కులా ఉన్న చివరి రైల్వేస్టేషన్లు ఉత్తరాన - బారాముల్లా (జమ్ము-కశ్మీర్‌),  తూర్పున - తిన్సుకియాలైన్‌ - లిడో,  పశ్చిమాన - నాలియా (గుజరాత్‌),  దక్షిణాన - కన్యాకుమారి 

*   మూడు గేజ్‌ల ట్రాక్‌ ఉన్న రైల్వేస్టేషన్‌ - సిలిగురి, న్యూజల్‌పాయ్‌గురి 

*   రెండు రాష్ట్రాల సరిహద్దు ఉన్న స్టేషన్‌ - నవాపుర్‌ (మహారాష్ట్ర - గుజరాత్‌)

*   అత్యంత ఎత్తులో ఉన్న స్టేషన్‌ - ఘమ్‌ (డార్జిలింగ్‌ - హిమాలయన్‌ రైల్వే - 2,258 మీటర్లు) 

*  వై-ఫై సేవలు మొదట ప్రారంభించిన రైల్వేస్టేషన్‌ - ముంబయి 

* ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం - గోరఖ్‌పుర్‌ (1.36 కి.మీ)

* మొదటి ప్రైవేటు రైల్వేస్టేషన్‌ - హబీబ్‌గంజ్‌ (మధ్యప్రదేశ్‌)* మొదటి పొడవైన రైల్‌-కమ్‌-రోడ్‌ వంతెన - బోగిబిల్‌ వంతెన

*  పొడవైన రైల్వే సొరంగం - బనిహల్‌ *  ఎక్కువ దూరం ప్రయాణించే రైలు - వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (4,282    కి.మీ.) 

*   అత్యంత వేగంగా ప్రయాణించే రైలు - వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌/ ట్రెయిన్‌- 18 

*  అతి పురాతన, ఇప్పటికీ సేవలందిస్తున్న రైలు - ఫెయిరీ క్వీన్‌ 

*   గిన్నిస్‌ బుక్‌ రికార్డుకు ఎక్కిన రైలు - ఫెయిరీ క్వీన్‌

*  మొదటి ఎలక్ట్రిక్‌ రైలు - దక్కన్‌ క్వీన్‌ 

*   సంచార వైద్యశాలగా సేవలందిస్తున్న రైలు - లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌

*  పేదలు, మధ్య తరగతికి ఏసీ సేవలందించే రైలు - గరీబ్‌రథ్‌    

*  ఎయిడ్స్‌పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన రైలు - రెడ్‌ రిబ్బన్‌ ఎక్స్‌ప్రెస్‌

*  ఆయుర్వేద మందులు, వైద్యసేవలు అందిస్తున్న రైలు - ధన్వంతరి ఎక్స్‌ప్రెస్‌

*  తక్కువ దూరం ప్రయాణించే రైలు: నాగ్‌పుర్‌ - అజ్ని ప్యాసింజర్‌ (2 కి.మీ.) *  నెమ్మదిగా ప్రయాణించే రైలు : ఊటీ - నీలగిరి రైలు (గంటకు 10 కి.మీ.)

*  మొదటి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ - రాజధాని

*   దేశంలో మొదటి ప్రైవేటు రైలు - తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌

*  అత్యంత విలాసవంతమైన రైలు - మహారాజాస్‌ ఎక్స్‌ప్రెస్‌

*  కంటైనర్‌ రవాణా కోసం ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ: కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, ప్రధాన కార్యాలయం న్యూదిల్లీ.  

*  నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేస్‌ - వడోదర (గుజరాత్‌)

*  దేశంలో తొలి అండర్‌వాటర్‌ మెట్రో - కోల్‌కతా (హుగ్లీ నదిలో)

 

హరిత రైలు నడవా (గ్రీన్‌ రైల్‌ కారిడార్‌)

రైలు మార్గంలో వ్యర్థ పదార్థాలు సున్నా స్థాయికి తగ్గించడం, బయో టాయిలెట్లు వాడటం దీని ఉద్దేశం. స్వచ్ఛ రైలు - స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఈ నడవా ఏర్పాటుచేశారు.

 

మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం (ఎంఎంటీఎస్‌)

దేశంలోని ప్రధాన నగరాలను, వాటి శివారు ప్రాంతాలతో అనుసంధానిస్తూ రవాణా సౌకర్యాలు కల్పించడం ఎంఎంటీఎస్‌ ఉద్దేశం. ముంబయి ఎంఎంటీస్‌ అత్యంత రద్దీగా ఉంటుంది. హైదరాబాద్‌లో 2003లో ఫలక్‌నుమా - లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్‌ ప్రారంభమైంది.

 

మాస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఎంఆర్‌టీఎస్‌)

దీన్నే మెట్రో రైల్‌ అని కూడా పిలుస్తారు. దేశంలో మొదటగా 1984లో   కోల్‌కతాలో మెట్రో ప్రారంభమైంది. ప్రస్తుతం 11 నగరాల్లో ఈ సదుపాయం ఉంది. మెట్రో రైల్‌ పితామహుడు ఇ.శ్రీధరన్‌.

 

వజ్ర చతుర్భుజి (డైమండ్‌ క్వాడ్రిలాటరల్‌)

దేశంలోని నాలుగు ప్రధాన నగరాలను (దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా) హైస్పీడ్‌ రైళ్లతో కలిపేందుకు ప్రారంభించిన పథకం. ఈ నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గించడం ముఖ్య ఉద్దేశం. ఈ రైళ్ల వేగం గంటకు 160 నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది.

 

బుల్లెట్‌ రైలు

ఈ ప్రాజెక్టును జపాన్‌ సహకారంతో నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ చేపడుతోంది. 2016లో ఈ సంస్థ ఏర్పాటైంది. బుల్లెట్‌ రైలు గరిష్ఠ వేగం గంటకు 320 కిలోమీటర్లు. మొదటగా ముంబయి - అహ్మదాబాద్‌ మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల సమయంలో చేరుకునేలా నిర్మించాలన్నది ప్రణాళిక. ప్రపంచంలో మొదటి బుల్లెట్‌ రైలును జపాన్‌ 1964లో ప్రారంభించింది.

 

బస్‌ - రోడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (బీఆర్‌టీఎస్‌)

రైల్వేస్టేషన్‌తో బస్సు రూట్లను అనుసంధానించే వ్యవస్థ. ఈ పథకం అహ్మదాబాద్, భోపాల్, ఇందౌర్, జయపుర, పుణె, రాజ్‌కోట్, సూరత్, కోల్‌కతా, విజయవాడ, విశాఖపట్టణంలో ఉంది. 

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌ 

 

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌