• facebook
  • whatsapp
  • telegram

రవాణా

అంతా కలుపుతూ.. అన్నీ తరలిస్తూ!


ప్రజలను, ప్రాంతాలను కలుపుతాయి. పర్యాటకరంగం, పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తాయి. అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. అవే దేశమంతా గ్రామాలను అనుసంధానం చేస్తూ, జీవన ప్రమాణాలను పెంచుతూ, జాతి జీవనాడులుగా నిలిచిన రహదారులు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు రోడ్ల చరిత్ర సాగిన తీరు, దేశ వ్యాప్తంగా వాటి విస్తరణ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 


రవాణా అంటే వస్తువులను లేదా వ్యక్తులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించడం. ఒక దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి, త్వరితగతిన మార్పులు సంభవించడానికి రవాణానే కీలకం. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.


మన దేశ రవాణా వ్యవస్థ చాలా విశాలమైంది. పశ్చిమాన కాండ్లా నుంచి తూర్పున కొహిమా వరకు, ఉత్తరాన కశ్మీర్‌ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. విస్తృతంగా ఉన్న సహజ వనరుల వినియోగానికి, ఎక్కువ జనాభా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లేందుకు, పారిశ్రామిక రంగ సత్వర వృద్ధికి, తద్వారా ఉపాధి అవకాశాల పెరుగుదలకు రవాణా దోహదపడుతోంది. రవాణా సౌకర్యాలను మానవుల జీవనాడిగా (లైఫ్‌లైన్స్‌ ఆఫ్‌ హ్యుమన్‌ సొసైటీ) పేర్కొనవచ్చు.


మన దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి దోహదపడే రవాణా వ్యవస్థకు ఎంతో చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 3 వేల సంవత్సరాల క్రితమే మొహెంజోదారో, హరప్పా నాగరికత కాలంలోనే చక్కటి రహదారి వ్యవస్థలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. మౌర్యులు, మొగలుల పాలనా కాలాల్లో సామ్రాజ్య విస్తరణ కోసం రోడ్లు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1830ల్లో బ్రిటిష్‌-ఈస్ట్‌ ఇండియా కంపెనీ మన దేశంలో మెటల్‌ రోడ్ల నిర్మాణం చేపట్టింది. స్వాతంత్య్రానికి ముందే కలకత్తా - దిల్లీ - పెషావర్‌ మార్గం, బొంబాయి- పుణే మార్గం, బొంబాయి - ఆగ్రా, బొంబాయి - మద్రాసు మార్గాలను నిర్మించారు. 1934లో భారత రహదారుల అభివృద్ధి కమిటీ సిఫార్సుల మేరకు ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) ఏర్పడింది. 1988లో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) భారత పార్లమెంట్‌ చట్టం ద్వారా ఏర్పాటైంది. 1998లో నేషనల్‌ హైవే డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డీపీ) ప్రారంభమైంది. 2014లో భారత రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్‌ హైవేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) ఏర్పాటైంది. 2017లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘భారత్‌ మాల’ ప్రాజెక్టు మొదలైంది. దీనిద్వారా కొత్త రహదారులు, హైవేలు అభివృద్ధి చేస్తారు.

 

ప్రధానంగా మూడు రకాలు

రవాణా మార్గాలను ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు. 1) భూ మార్గాలు 2) జల మార్గాలు 3) వాయు మార్గాలు.

భూ మార్గాలను రోడ్డు, రైలు మార్గాలుగా విభజించారు. జల మార్గాలను అంతఃస్థలీయ, తీర ప్రాంత, సముద్ర మార్గాలుగా పేర్కొన్నారు. వాయు మార్గాలను జాతీయ, అంతర్జాతీయ వాయు మార్గాలుగా వర్గీకరించారు. ఇవేకాకుండా కొత్తగా గొట్టపు మార్గాలు (పైపులైన్లలో/ టన్నెల్‌ రవాణా) ఏర్పాటవుతున్నాయి. ఇలాంటి ఎన్నో రకాల రవాణా వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయి.


ప్రాచీన మానవుడు తన గమ్యస్థానానికి నడిచి వెళ్లేవాడు. తర్వాత కొంత ఆలోచన పెరిగి జలమార్గంలో ప్రయాణించాడు. జ్ఞానసంపన్నుడైన ఆధునిక మానవుడు స్టీమ్‌ ఇంజిన్లు కనుక్కున్న అనంతరం రవాణా వేగం పెరిగింది. నేడు శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి, అంతరిక్ష జ్ఞానం పెరగడంతో ధ్వని కన్నా వేగవంతమైన సూపర్‌సోనిక్‌ విమానాలను ఉపయోగించి గమ్యాన్ని చేరుకుంటున్నాడు.

 

 


రోడ్డు మార్గాలు:  సుమారు 5 వేల ఏళ్లుగా మన దేశంలో రోడ్డు మార్గాలు ఉన్నట్లు చరిత్ర వల్ల తెలుస్తోంది. హరప్పా నాగరికత కాలం మొదలుకొని, మౌర్యులు, మొగలులు, సుల్తాన్ల  పాలన వరకు రహదారుల అభివృద్ధి జరిగింది. బ్రిటిషర్లు తమ పరిపాలనకు, సహజ వరులను తరలించేందుకు, వర్తక, వాణిజ్యాలకు అనుకూలంగా ఉండే మార్గాల్లోనే రవాణా సౌకర్యాలు కల్పించారు. స్వాతంత్య్రానంతరం దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి ప్రారంభమైంది. గత రెండు, మూడు దశాబ్దాలుగా రోడ్లను వేగంగా వేస్తున్నారు. 1927లో జయశంకర్‌ కమిటీ రహదార్ల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ మేరకు 1929లో కేంద్ర రహదారుల నిధి ఏర్పాటైంది.


దేశంలో మొదటి ప్రణాళికాబద్ధమైన రోడ్ల అభివృద్ధి పథకం 1943లో తయారైన నాగ్‌పుర్‌ ప్లాన్‌. దీని ద్వారా దేశంలోని రోడ్లను జాతీయ, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారులు అని నాలుగు రకాలుగా విభజించారు. 1950లో సెంట్రల్‌ రోడ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభమైంది. 1961లో బొంబాయి ప్రణాళిక ద్వారా రహదారుల సాంద్రత లక్ష్యాన్ని 32 కి.మీ.లుగా నిర్ణయించారు. 1982లో లఖ్‌నవూ ప్రణాళిక ద్వారా దేశంలో రోడ్ల జాబితాలో పైనాలుగింటితో పాటు 5వ అంశంగా సరిహద్దు రోడ్లను చేర్చారు.


ప్రపంచంలో రహదారుల పొడవు అత్యంత ఎక్కువున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. 2023 లెక్కల ప్రకారం దేశంలో 67.73 లక్షల కిలోమీటర్ల మేర రహదారులున్నాయి. 68.03 లక్షల కిలోమీటర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. చైనా మూడో స్థానాన్ని పొందింది. జాతీయ రహదారులు అత్యధికంగా ఉన్న దేశం ఆస్ట్రేలియా,  రెండోది భారత్‌.

 

 


జాతీయ రహదారులు:  ఇవి దేశంలోని ప్రధాన నగరాలను, రాష్ట్రాల రాజధానులను, ముఖ్య పారిశ్రామిక పట్టణాలను, ఓడరేవులను కలుపుతాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం (2022) దేశంలో జాతీయ రహదారుల పొడవు 1,44,634 కి.మీ.లు. దేశంలోని మొత్తం రోడ్డు మార్గాల్లో జాతీయ రహదారులు 2%. కానీ రోడ్డు రవాణా, రద్దీ పరంగా వాటి వాటా 40 శాతం ఉంది. నేషనల్‌ హైవేల నిర్మాణం, పర్యవేక్షణ, మరమ్మతులన్నీ కేంద్ర ప్రభుత్వం (సెంట్రల్‌ పబ్లిక్‌ సర్వే డిపార్ట్‌మెంట్‌) ఆధ్వర్యంలోనే జరుగుతాయి.


జాతీయ రహదారుల నిడివి ఎక్కువున్న రాష్ట్రాలు: 1) మహారాష్ట్ర 2) ఉత్తర్‌ప్రదేశ్‌ 3) రాజస్థాన్‌.

కేంద్రపాలిత ప్రాంతాలు: 1) జమ్ము-కశ్మీర్‌ 2) అండమాన్, నికోబార్‌ దీవులు

జాతీయ రహదారుల నిడివి తక్కువ ఉన్న రాష్ట్రాలు: 1) గోవా 2) సిక్కిం 3) త్రిపుర.

కేంద్రపాలిత ప్రాంతాలు: 1) చండీగఢ్‌ 2) పుదుచ్చేరి.

జాతీయ రహదారులు లేని ప్రాంతం: లక్షదీవులు

* జాతీయ రహదారులు సంఖ్యాపరంగా ఎక్కువగా మహారాష్ట్రలో, తక్కువగా గోవాలో ఉన్నాయి. రోడ్డు సాంద్రత పరంగా జాతీయ రహదారులు ఎక్కువగా కేరళ, పశ్చిమ బెంగాల్‌లో; తక్కువగా జమ్ము - కశ్మీర్‌లో ఉన్నాయి.

రాష్ట్ర రహదారులు: ఇవి రాష్ట్ర రాజధానిని జిల్లా ప్రధాన కేంద్రాలతో, ఇతర ముఖ్య పట్టణాలతో, జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలతో కలుపుతాయి. వీటి నిర్మాణం, నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలే చూస్తాయి. ప్రస్తుతం దేశంలోని రాష్ట్ర రహదారుల పొడవు 1,86,908 కి.మీ.లు. రాష్ట్ర రహదారుల నిడివి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్‌. దేశం మొత్తం రోడ్లలో వీటి వాటా 2.8%.


జిల్లా రహదారులు: ఇవి జిల్లా ప్రధాన కేంద్రాన్ని మండల కేంద్రాలతో, గ్రామాలతో కలుపుతాయి. జిల్లా రహదారుల నిడివి ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక.


గ్రామీణ రహదారులు: ఇవి మండల కేంద్రాలను, జిల్లా రహదారులను కలుపుతాయి. దేశం మొత్తం రోడ్డు వ్యవస్థలో వీటి వాటా 71.4%. ప్రస్తుతం వీటి పొడవు 45,35,511 కి.మీ.లు. వీటి నిర్వహణను జిల్లా పరిషత్‌లు చూస్తాయి. 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం ప్రారంభించి, గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించింది. దేశంలో గ్రామీణ రహదారుల నిడివి ఎక్కువ ఉన్న రాష్టాలు మహారాష్ట్ర, అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్‌.


సరిహద్దు రహదారులు: వీటిని సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) నిర్వహిస్తుంది. ఆర్థికంగా వెనకబడిన హిమాలయ ప్రాంతాలు, థార్‌ ఎడారి, ఈశాన్య రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి 1960లో బీఆర్‌ఓను ఏర్పాటు చేశారు. ఇది స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ. భూటాన్, అఫ్గానిస్థాన్, తజికిస్థాన్, మయన్మార్, శ్రీలంక దేశాలను కలుపుతూ రోడ్లు నిర్మిస్తుంది.


ఎక్స్‌ప్రెస్‌ రహదారులు:  ఇవి ఎగువ తరగతికి చెందినవి. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్మిస్తుంది. ఏవైనా రెండు ప్రాంతాల మధ్య ఆగకుండా గమ్యస్థానాన్ని చేరే విధంగా సహకరించడం వీటి ఉద్దేశం. ప్రస్తుతం దేశంలో ఈ తరహా రోడ్లు 10 ఉన్నాయి. వాటిలో హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఒకటి.


సూపర్‌ నేషనల్‌ హైవేలు: ఇవి ట్రాఫిక్‌ను వేగవంతం చేయడానికి ఉద్దేశించినవి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (బీఓటీ) ఉపరితల రవాణా శాఖ నిర్మిస్తుంది. దేశంలో ఈ రకమైన రోడ్లు ఏడు నిర్మాణంలో ఉన్నాయి.


అంతర్జాతీయ రహదారులు: భారత్‌ను పొరుగు దేశాలతో కలుపుతూ నిర్మించే రహదారులు. ప్రపంచ బ్యాంకు ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక, సామాజిక సహకార ఒప్పందంపై మన దేశానికి ఇచ్చిన నిధులతో వీటిని నిర్మించారు.


భారత్‌ మాల పరియోజన: దేశంలోని అతిపెద్దదైన రోడ్ల మౌలిక వసతుల కోసం రూపొందించిన కార్యక్రమం ఇది. దీని ద్వారా దేశంలోని ముఖ్యమైన తీర ప్రాంతాలు, ఓడరేవులు, సరిహద్దు ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రోడ్లు నిర్మిస్తున్నారు. వీటిని ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతుంది.


స్వర్ణ చతుర్భుజి: దేశంలోని నాలుగు ప్రధాన నగరాలైన దిల్లీ- ముంబయి- చెన్నై- కోల్‌కతా నగరాలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి పేరిట 5,846 కి.మీ.లు మేర హైవే నిర్మించారు. ఈ ప్రాజెక్టు 13 రాష్ట్రాలను అనుసంధానిస్తుంది. ఉత్తర-దక్షిణ కారిడార్‌లో పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-44 హైదరాబాదు మీదుగా పోతుంది. దీని పొడవు దాదాపు 4 వేల కి.మీ.లు. తూర్పు- పశ్చిమ దిశల్లో ఎన్‌హెచ్‌-27 పోరుబందర్‌ (గుజరాత్‌) నుంచి సీల్చేరు (అస్సాం)ను కలుపుతుంది. దీని పొడవు 3,300 కి.మీ. ఉత్తర-దక్షిణ కారిడార్, తూర్పు-పడమర కారిడార్‌ ‘ఝాన్సీ’ వద్ద కలుస్తాయి.


గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే: ఇవి వేగవంతమైన అంతర్జాతీయ స్థాయి రహదారులు. ఎక్కువ మలుపులు ఉండవు. దేశంలో మొత్తం 22 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలు 1) విశాఖ - రాయ్‌పుర్‌ 2) విజయవాడ - నాగ్‌పుర్‌ 3) చెన్నై - సూరత్‌ 4) చిత్తూరు - తచ్చూరు 5) దేవరపల్లి - సూర్యాపేట


ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నెంబర్లు:  16, 216, 216A, 716, 26, 326, 326A, 30, 40, 140, 340, 340C, 42, 44, 544D, 150A, 65, 165, 516D, 565, 765, 67, 167, 69, 71, 75, 167A, 516E, 167B, 365BB, 365BG, 544DD, 544E, 130CD, 716A, 716B, 516C, 167BG, 544F, 167K, 342, NE7.


తెలంగాణలో జాతీయ రహదారుల నెంబర్లు: 30, 44, 150, 353C, 61, 161, 63, 563, 65, 365, 365A, 365B, 363, 565, 765, 167, 353B, 161B, 365BB, 365BG, 765D, 161AA, 161BB, 167K.

* ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే జాతీయ రహదారులకు ‘సరిసంఖ్య’, తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్లే జాతీయ రహదారులకు ‘బేసిసంఖ్య’ కేటాయిస్తారు.

* దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి: ఎన్‌హెచ్‌-44 (3745 కి.మీ.)

* దేశంలో అతిచిన్న జాతీయ రహదారి: ఎన్‌హెచ్‌ 548 (5 కి.మీ.) (మహారాష్ట్రలోని కాలంబోలి నుంచి ఎన్‌హెచ్‌ 348 కూడలి వరకు)

* దేశంలో రెండో అతిచిన్న జాతీయ రహదారి - ఎన్‌హెచ్‌-966బి (8 కి.మీ.) కొచ్చిలోని కుండనూర్‌ - వెల్లింగ్డన్‌ దీవి.

* థార్‌ ఎడారిలో వెళ్లే జాతీయ రహదారి - ఎన్‌హెచ్‌-68 (జైసల్మీర్‌ - కువదార)

* తూర్పు తీరం మీదుగా ప్రయాణించే జాతీయ రహదారి - ఎన్‌హెచ్‌-16

* పశ్చిమ తీరం మీదుగా ప్రయాణించే జాతీయ రహదారి - ఎన్‌హెచ్‌-66

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌