• facebook
  • whatsapp
  • telegram

నిరుద్యోగిత

పని దొరకదు.. ప్రగతి సాగదు!

 

సామర్థ్యం ఉన్నా సరైన పని దొరకదు. ఉత్పత్తికి అవకాశం ఉన్నా డిమాండ్‌ ఉండదు, ఉద్యోగాలు ఉండవు. అవసరానికి మించి కార్మికులు, వ్యవసాయంపైనే అధికంగా ఆధారపడిన శ్రామికులు. చదువుకి, చేసే కొలువుకి సంబంధం కనిపించదు. అరకొర వేతనాలకు సిద్ధపడినా ఉపాధి లభించదు. ఈ విధంగా ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ఏదో ఒక రూపంలో పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. దీని ప్రభావంతో పారిశ్రామిక, సేవారంగాల ప్రగతి కుంటుపడుతోంది. నవకల్పనలు జరగడం లేదు. అభివృద్ధికి అతి పెద్ద ఆటంకంగా, ఆర్థిక, సామాజిక రుగ్మతగా మారిన ఆ నిరుద్యోగం, దాని రూపాలు, కారణాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

 

ఒక దేశ వర్తమాన, భవిష్యత్తు జీవనాన్ని ప్రభావితం చేసే సమస్యల్లో ప్రధానమైంది నిరుద్యోగం. పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది తీవ్రరూపం దాల్చి అనేక సరికొత్త ఇబ్బందులకు కారణమవుతోంది. నిరుద్యోగం అనేది సమస్యల సమస్య. నిరుద్యోగుల రూపంలో అపార మానవ వనరులు నిరుపయోగంగా ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. అంటే నిరుద్యోగం ఒక సాంఘిక, ఆర్థిక సమస్య.

 

నిర్వచనం: పని చేసే వయసులో అంటే 15 - 60 సంవత్సరాల మధ్య వయసు ఉండి, పని చేయగలిగే సామర్థ్యం, చేయాలనే కోరిక ఉన్న వ్యక్తులకు మార్కెట్‌లోని వేతన రేట్ల వద్ద పని లభించని పరిస్థితిని నిరుద్యోగ స్థితి అంటారు. అంటే 15 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్న పిల్లలు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల్లో సామర్థ్యం ఉండి, పని లేకపోయినా వారిని నిరుద్యోగులుగా పరిగణించరు. అదే విధంగా 15 - 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్లకు అంగవైకల్యం లేదా మానసిక లోపం ఉండి, పనిచేసే సామర్థ్యం లేని వారిని నిరుద్యోగుల లెక్కల్లోకి తీసుకోరు. 

 

శ్రమ శక్తి (లేబర్‌ ఫోర్స్‌): పని చేయాలనే కోరిక, చేసే సామర్థ్యం ఉన్న జనాభాను శ్రమశక్తిగా పరిగణించవచ్చు. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ఐఎల్‌ఓ) ప్రకారం 15 - 65 సంవత్సరాల మధ్య వయసు వారిలో పనిచేయాలనే ఆసక్తితో పాటు చేయగలిగే సామర్థ్యం కూడా ఉంటే, వారిని శ్రామిక శక్తిగా పేర్కొంటారు. అమెరికాలో 16 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిని లేబర్‌ఫోర్స్‌లో లెక్కిస్తారు. భారత్‌లో 15 - 64 సంవత్సరాల మధ్య వయసున్న వారిని లేబర్‌ఫోర్స్‌గా భావిస్తున్నారు. 

* శ్రమశక్తి పాల్గొనే రేటు = ((ఉద్యోగంలో ఉన్నవారు + నిరుద్యోగులు)/మొత్తం జనాభా) x 100

ఉదాహరణకు మొత్తం జనాభా 1000 అనుకుంటే అందులో 500 మంది ఉద్యోగం చేస్తున్నారని, 200 మంది నిరుద్యోగులు అనుకుంటే శ్రమ శక్తి 700 అవుతుంది. శ్రమశక్తి పాల్గొనే రేటు 70%.

 

పని శక్తి (వర్క్‌ ఫోర్స్‌): 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనేవారిని వర్క్‌ఫోర్స్‌ అంటారు. లేబర్‌ఫోర్స్‌ నుంచి వర్క్‌ఫోర్స్‌ను తీసివేస్తే నిరుద్యోగిత వస్తుంది.

పనిలో పాల్గొనే రేటు = (వాస్తవంగా పని పొందినవారు/మొత్తం జనాభా) x 100

పైన పేర్కొన్న ఉదాహరణలో పనిలో పాల్గొనే రేటు 50 శాతం అవుతుంది.

నిరుద్యోగిత = శ్రమశక్తి - పనిశక్తి 

నిరుద్యోగిత రేటు = (నిరుద్యోగులు/శ్రామికశక్తి) x 100



ఎన్‌ఎస్‌ఎస్‌ఓ: 68వ రౌండ్‌ నివేదిక ప్రకారం (2011 - 12) 

     దేశ జనాభా  ----- 122.74 కోట్లు

     లేబర్‌ఫోర్స్‌   ----- 44.04  కోట్లు

     వర్క్‌ఫోర్స్‌  ------ 41.57 కోట్లు

     నిరుద్యోగులు  ------ 2.47 కోట్లు

     నిరుద్యోగిత రేటు ------- 5.6 శాతం

 

నిరుద్యోగాల్లో రకాలు

నిరుద్యోగ సమస్య అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉండదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక విధంగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరో రకంగా ఉంటుంది. ఆర్థికవేత్తలు నిరుద్యోగితను వివిధ రకాలుగా విభజించి విశ్లేషించారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో: నిరుద్యోగిత మూడు రకాలుగా ఉంటుంది. 1) ఇచ్చారహిత నిరుద్యోగిత 2) సంఘృష్ట నిరుద్యోగిత  3) చక్రీయ నిరుద్యోగిత

1) ఇచ్చారహిత నిరుద్యోగిత: అభివృద్ధి చెందిన దేశాల్లో సార్థక డిమాండ్‌ కొరత వల్ల నిరుద్యోగం ఏర్పడుతుంది. అంటే ఉత్పత్తి అయిన వస్తువులకు తగినంత డిమాండ్‌ లేకపోవడం వల్ల ఉత్పత్తికి ప్రోత్సాహం తగ్గి శ్రామికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

2) సంఘృష్ట నిరుద్యోగిత: ఆర్థిక వ్యవస్థలో మెరుగైన ఉపాధి కోసం ఎదురు చూసేటప్పుడు ఏర్పడే నిరుద్యోగితను సంఘృష్ట నిరుద్యోగిత అంటారు. శ్రామికులు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారేటప్పుడు ఈ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది.

3) చక్రీయ నిరుద్యోగిత: అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాపార చక్రాల వల్ల ఈ రకమైన నిరుద్యోగం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఏర్పడినప్పుడు వస్తువులకు డిమాండ్‌ తగ్గడంతో ఉద్యోగస్థాయి పడిపోతుంది.

 

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో: నిరుద్యోగిత ఎనిమిది రకాలుగా ఉంటుంది.

1) వ్యవస్థాపరమైన నిరుద్యోగిత: ఆర్థిక వ్యవస్థలో గత 30 లేదా 40 సంవత్సరాల్లో పెరిగిన శ్రామికుల సంఖ్యా రేటు కంటే ఉద్యోగ అవకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉండటం వల్ల ఏర్పడే నిరుద్యోగితను వ్యవస్థాపరమైన నిరుద్యోగిత అంటారు. ఆర్థికాభివృద్ధి రేటు మందకొడిగా ఉండటం, మూలధనం కొరత ఇందుకు ప్రధాన కారణాలు. దీన్ని బహిరంగ నిరుద్యోగిత అని కూడా అంటారు. 

2) ప్రచ్ఛన్న నిరుద్యోగిత: ప్రచ్ఛన్న నిరుద్యోగిత సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ రంగంలో కనిపిస్తుంటుంది. ఒక రంగంలో లేదా వృత్తిలో సమర్థంగా ఉత్పత్తిని సాధించడానికి అవసరమైన శ్రామికుల కంటే ఎక్కువమంది శ్రామికులు పనిలో పాలు పంచుకునే పరిస్థితిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అంటే అవసరానికి మించిన ఉద్యోగులను పని నుంచి తొలగించినా మొత్తం ఉత్పత్తి క్షీణించదు. వీరి ఉపాంత ఉత్పత్తి నామమాత్రంగా లేదా శూన్యంగా లేదా రుణాత్మకంగా ఉంటుంది. ఈ పరిస్థితిని దాగి ఉన్న నిరుద్యోగం అని కూడా అంటారు.

 

కారణాలు: 1) జనాభా పెరుగుదల 2) ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడం

* ఈ నిరుద్యోగ భావనను మొదటిసారి ప్రవేశపెట్టినవారు జోన్‌ రాబిన్‌సన్‌. 

* ప్రచ్ఛన్న నిరుద్యోగులను నిజ పొదుపుగా ఉపయోగించి మూలధన కల్పనకు దోహదపడేలా చేయాలని చెప్పినవారు రాగ్నర్‌ నర్క్స్‌. 

* ప్రచ్ఛన్న నిరుద్యోగాన్ని శాస్త్రీయంగా విశ్లేషించినవారు ఆర్థర్‌ లూయిస్‌. 

* భారత్‌లో ప్రచ్ఛన్న నిరుద్యోగితను అంచనా వేసినవారు శకుంతల మెహ్రా, అమర్త్యసేన్‌.

 

3) అల్ప ఉద్యోగిత: ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉత్పాదక పనుల్లో పని చేయడాన్ని అల్ప ఉద్యోగిత అంటారు.

ఉదా: పీజీ చదివిన అభ్యర్థి తక్కువ జీతంతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేయడం.

 

4) రుతు సంబంధిత నిరుద్యోగిత: దీన్నే కాలిక నిరుద్యోగం అని కూడా అంటారు. ఇది వ్యవసాయ రంగంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో కొన్ని రుతువుల్లో పని లభించి, మరికొన్ని రుతువుల్లో పని లభించకపోవడం వల్ల నిరుద్యోగం ఏర్పడుతుంది.

 

5) విద్యావంతుల్లో నిరుద్యోగం: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం, గృహవసతి, వైద్యంతో పాటు విద్యను బోధించడం ఆధునిక సంక్షేమ ప్రభుత్వాల కనీస బాధ్యత. విద్యాబోధనను సమకూర్చిన ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో వారికి తగిన ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమవుతాయి. దీంతో విద్యావంతులైన యువకుల్లో నిరుద్యోగిత ఏర్పడుతుంది. వృత్తి విద్య కాకుండా సాధారణ విద్య అభ్యసించిన వారిలో ఈ రకమైన నిరుద్యోగిత అధికంగా ఉంటుంది.

 

6) పారిశ్రామిక నిరుద్యోగిత: పట్టణాల్లో గ్రామీణ వలసల వల్ల పెరుగుతున్న శ్రామికుల కంటే పారిశ్రామిక రంగంలో కల్పించే ఉపాధి రేటు తక్కువగా ఉండటంతో పారిశ్రామిక నిరుద్యోగం ఏర్పడుతుంది. దీనినే పట్టణ నిరుద్యోగిత అని అంటారు.

 

7) సాంకేతిక నిరుద్యోగిత: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసేవారు ఉపాధి కోల్పోతారు. దీన్నే సాంకేతిక నిరుద్యోగిత అంటారు. ఉదా: ఆటో రావడం వల్ల రిక్షా లాగేవారు ఉపాధి కోల్పోవడం.

 

8) అనిశ్చాపూర్వక నిరుద్యోగిత: అమల్లో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధపడినప్పటికీ పని దొరకని పరిస్థితిని అనిశ్చాపూర్వక నిరుద్యోగం అంటారు. ఈ భావనను అభివృద్ధి చేసినవారు జె.ఎం.కీన్స్‌.

 

మాదిరి ప్రశ్నలు


1. విద్యావంతులైన యువకులు పొందాల్సిన సౌకర్యాలను పొందలేక వారిలో పెరుగుతున్న అసంతృప్తి వల్ల తీవ్రవాదులుగా మారతారని చెప్పిన మాజీ రాష్ట్రపతి?

1) ఎ.పి.జె.అబ్దుల్‌ కలామ్‌        2) వి.వి.గిరి  

3) జ్ఞానీ జైల్‌సింగ్‌     4) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

జ: వి.వి.గిరి  

 

2. కిందివాటిలో నిరుద్యోగం ఏ రకమైన సమస్య?

1) సాంఘిక సమస్య     2) ఆర్థిక సమస్య

3) 1, 2         4) పర్యావరణ సమస్య

జ: 1, 2 

 

3. కిందివాటిలో సరైంది?

ఎ) 15 - 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి పనిచేయాలనే కోరిక, సామర్థ్యం ఉన్న వ్యక్తులకు పని లభించని స్థితి నిరుద్యోగం.

బి) 15 సంవత్సరాలకు తక్కువ వయసు, 60 సంవత్సరాలకు పైబడిన వారిని ఉత్పాదక శ్రామికులు అంటారు.

సి) అంగవైకల్యం, మానసిక లోపం ఉండేవారిని అనుత్పాదక శ్రామికులు అంటారు. 

1) ఎ మాత్రమే     2) బి మాత్రమే      3) సి మాత్రమే      4) ఎ, సి

జ: ఎ, సి

 

4. ఐఎల్‌ఓ (ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌) ప్రకారం లేబర్‌ ఫోర్స్‌ ఏ సంవత్సరాల మధ్య ఉంటుంది?

1) 15 - 65 సంవత్సరాలు        2) 16 - 65 సంవత్సరాలు  

3) 15 - 64 సంవత్సరాలు      4) 15 - 62 సంవత్సరాలు

జ: 16 - 65 సంవత్సరాలు

 

5. శ్రామిక శక్తికి సంబంధించి సరైంది?

1) ఉద్యోగంలో ఉన్నవారు + నిరుద్యోగులు   2) ఉద్యోగంలో ఉన్నవారు - నిరుద్యోగులు

3) ఉద్యోగులు/నిరుద్యోగులు             4) ఉద్యోగులు × నిరుద్యోగులు

జ: ఉద్యోగంలో ఉన్నవారు + నిరుద్యోగులు​​​​​​​

 

6. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 68వ రౌండ్‌ ప్రకారం భారత్‌లో నిరుద్యోగిత రేటు? 

1) 5.6%      2) 5.8%     3) 3.7%     4) 5.9%

జ: 5.6%​​​​​​​

 

7. అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించని నిరుద్యోగం?

1) చక్రీయ      2) సంఘృష్ట     3) ఇచ్చారహిత     4) వ్యవస్థాపూర్వక

జ: వ్యవస్థాపూర్వక​​​​​​​

 

8. వ్యాపార చక్రాలకు సంబంధించి సరైన వరుసక్రమం.

ఎ) సౌభాగ్య దశ  బి) మాంద్య దశ   సి) తిరోగమన దశ   డి) పునర్‌వ్యవస్థ దశ

1) ఎ, సి, బి, డి     2) బి, ఎ, సి, డి     3) సి, బి, ఎ, డి      4) ఎ, సి, డి, బి

జ: ఎ, సి, బి, డి ​​​​​​​

 

9. ప్రచ్ఛన్న నిరుద్యోగానికి కారణం?

ఎ) అధిక జనాభా      బి) ఇతర రంగాల్లో ఉపాధి లేకపోవడం  

సి) సాంకేతిక విజ్ఞానం     డి) మూలధనం కొరత

1) ఎ, బి     2) డి మాత్రమే     3) బి, సి మాత్రమే      4) ఎ, బి, సి, డి

జ: ఎ, బి​​​​​​​

 

10. జె.ఎం.కీన్స్‌తో ముడిపడి ఉన్న నిరుద్యోగిత 

1) సాంకేతిక నిరుద్యోగిత      2) అనిశ్చాపూర్వక నిరుద్యోగిత  

3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత      4) అన్నీ

జ: అనిశ్చాపూర్వక నిరుద్యోగిత​​​​​​​


రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 20-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌