• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో మహిళా చైతన్యం

కట్టుబాట్ల కాలంలో చైతన్య దీపికలు!


 హైదరాబాదు రాజ్యంలో ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాల సంకెళ్లతో స్త్రీలు సహజీవనం  సాగించేవారు. చాలామందికి చదువుకోడానికి అవకాశాలు ఉండేవికావు. ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆలోచించడం కూడా కష్టమే. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కొందరు మహిళలు సాధికారికంగా జీవించారు. ఉన్నత విద్యలు అభ్యసించారు. ఉద్యోగాలు చేశారు. పెద్ద పెద్ద పదవులు చేపట్టారు. విదేశాలకు వెళ్లారు. ఎన్నో గ్రంథాలు రచించారు. అనేక సంస్థలను ఏర్పాటు చేసి ఆడవారి అభివృద్ధికి పాటుపడ్డారు. ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. స్వాతంత్య్ర పోరాటాల్లో చురుకైన పాత్రలు పోషించారు. తెలంగాణ చరిత్ర అధ్యయనంలో భాగంగా ఇరవయ్యో శతాబ్దం తొలి భాగంలో సమాజంలో స్త్రీల పరిస్థితులు, వాటన్నింటినీ అధిగమించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన నారీమణుల వివరాలు, వారి సేవల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


హైదరాబాద్‌ రాజ్యంలో మహిళలు వివిధ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో వారిలో చైతన్యాన్ని రగిలించేందుకు అనేక సంస్థలు ఆవిర్భవించాయి. ఆంధ్ర యువతీ మండలి, లేడీ హైదరీ క్లబ్, సోదరీ సమాజం, ఆంధ్ర మహాసభ వంటి సంస్థలు మహిళలను చైతన్యవంతులను చేశాయి. సయ్యద్‌ బిల్‌గ్రామి, వడ్లకొండ నరసింహారావు, భాగ్యరెడ్డివర్మ, మాడపాటి హనుమంతరావు స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, టి.ఎస్‌.సదాలక్ష్మి, సంగం లక్ష్మీబాయి తదితరులు సంఘ సంస్కరణ కోసం పాటుపడ్డారు.


రూప్‌ఖాన్‌పేట రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంతోపాటు వితంతువులకు హాస్టళ్లు నెలకొల్పారు. అఘోరనాథ ఛటోపాధ్యాయ భార్య వరద సుందరీ దేవి నాంపల్లిలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికలో మారుపేర్లతో రచనలు చేసి మహిళలను చైతన్యపరిచారు. వారు తమను తాము సమర్థించుకునే రచనలు చేయడానికి ప్రేరణ ఇచ్చారు. 1917 ప్రాంతంలో వీర రాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మ ఆంధ్ర సోదరీ సమాజాన్ని ఏర్పాటు చేసి పలు సంస్కరణలకు కృషి చేశారు. ది ఉమెన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ సోషల్‌ అడ్వాన్స్‌మెంట్‌ అనే సంస్థ 1922లో మార్గరెట్‌ జేమ్స్‌ ప్రోత్సాహంతో ఏర్పడి పది సెమినార్లు నిర్వహించింది. 1907లో భారత మహిళా సమాజం ఏర్పడింది. ఇది హైదరాబాద్‌లో ఏర్పడిన మొదటి స్త్రీ సంఘం. మార్గరెట్‌ కజిన్స్, అమీనా బేగం, హైదరాబాద్‌ రుస్తుంజీ, ఫర్దూన్, సరోజినీ నాయుడు మొదలైనవారు 1916లో హైదరాబాద్‌ ఉమెన్స్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ అఖిల భారత మహిళా సమాఖ్యకు అనుబంధంగా పనిచేసేది. 1922లో యువతి శరణ్యాలయం అనే సంస్థను యామిని పూర్ణతిలకం ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సమాజ పీడితులు, వేశ్యలకు ఆశ్రయం ఇచ్చి, వారి అభివృద్ధికి సాయపడింది. 1930లో ఏర్పడిన ఆంధ్ర మహాసభలో భాగంగా ఆంధ్ర మహిళా సభ ఏర్పడి దాదాపు 13 సమావేశాలు నిర్వహించింది. ప్రతి సమావేశంలోనూ స్త్రీల సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. 1935లో ఆంధ్ర యువతి మండలి సంస్థను ఎల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లందుల సరస్వతీదేవి తదితరులు స్థాపించారు. 1935లో ఆంధ్ర నవజీవన మండలి ఏర్పడింది. హిందూ సంఘాలతోపాటు ముస్లిం సంఘాలు కూడా ఆవిర్భవించాయి. అంజుమన్‌-ఇ-ఖవాతిక్‌ దక్కన్‌; అంజుమన్‌-ఇ-ఇస్లాం, లేడీ హైదరీ క్లబ్, లేడీ బర్దన్స్‌ క్లబ్, అంజుమన్‌-ఇ-సిరజుల్‌ ఖవాతిక్‌ తదితర సంస్థలు వెలిశాయి. సరోజినీ నాయుడు, పద్మజా నాయుడు, సుగ్రా హుమాయున్‌ మీర్జా, శాంతాబాయి కిర్లోస్కర్, మాసుమా బేగం, ఆరుట్ల కమలాదేవి తదితరులు మహిళా ఉద్యమాలు నడిపారు. 1930లో ఆంధ్ర మహిళా సంఘాన్ని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మొదలైనవారు స్థాపించారు. ఆంధ్ర మహాసభలతో పాటు జరిగిన మహిళా సభలు ఆడవారి విద్య, స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డాయి. 1947లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో అహల్యాబాయి, విమలా మెల్కొటే, కమలమ్మ పాల్గొన్నారు.


ఖైరున్నీసా బేగం: ఖైరున్నీసా మాతామహుడు (తల్లి తండ్రి) బాకర్‌ అలీఖాన్‌ నిజాం దర్బారులో బక్షి. హైదరాబాద్‌ రాజ్య ప్రధాని మీర్‌ ఆలంకు దగ్గరి బంధువు. ఖైరున్నీసాను నాటి బ్రిటిష్‌ రెసిడెంట్‌ అయిన అచ్లిస్‌ కిర్క్‌ పాట్రిక్‌ ప్రేమించాడు. ఇతడిని నిజాం నవాబు  దత్తత చేసుకున్నట్లు ప్రకటించి, హస్మత్‌ జంగ్‌ బహదూర్‌ అనే బిరుదు ఇచ్చాడు. తర్వాత  ఖైరున్నీసాతో వివాహం జరిపించాడు. వీరి కోసం రెసిడెన్సీలో రంగమహల్‌ను కట్టించాడు. దానిచుట్టూ చార్‌బాగ్‌ను నిర్మించాడు. ఇది (చార్‌బాగ్‌) కశ్మీరులోని మొగల్‌ గార్డెన్‌కు నమూనా. ఈమె నాటి ప్రముఖ మహిళల్లో ఒకరుగా ప్రసిద్ధికెక్కారు.


మహాలఖా చందాబాయి:
మహాలఖా చందాబాయి గొప్ప సౌందర్య రాశి. నిజాం సంస్థానంలో నర్తకి. దర్బారులో అత్యున్నత ఉమ్రాన్‌ పదవిని అలంకరించారు. గుజరాత్‌ నుంచి దక్కన్‌కు వలస వచ్చారు. నృత్యం, సంగీతం నేర్చుకున్నారు. దేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రి. ఈమె కవిత్వాలు 1824లో మరణాంతరం గుల్జార్‌-ఎ-మహాలఖ (మహాలఖ ఉద్యానవన పూలు) పేరుతో ప్రచురితమయ్యాయి. ఉర్దూలో ఈమె రచించిన గజల్స్‌ లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియంలో ఉన్నాయి.


సుగ్రా హుమాయూన్‌ మీర్జా: ఈమె 1882, డిసెంబరులో హైదరాబాద్‌లో జన్మించారు. 1902 నుంచి సేవలను ప్రారంభించారు. 1912లో బేగం ఖేదివ్‌జంగ్‌తో కలిసి అంజుమన్‌-ఇ-ఖవాతిక్‌ దక్కన్‌ అనే సంస్థను స్థాపించి మూడేళ్లపాటు కార్యదర్శిగా పనిచేశారు. ఈ సంస్థ కింద రెండు బాలికల పాఠశాలలను స్థాపించారు. ఈమె గొప్ప రచయిత్రి. అనేక వార్తాపత్రికలు, పుస్తకాల్లో స్త్రీల సంస్కరణలపై ఎన్నో వ్యాసాలను రాసి ప్రచురించారు. ఈమె చేసిన రచనలను గుర్తించిన హైదరాబాద్‌ ప్రభు వర్గం ఆమెకు బంగారు పతకాలను ఇచ్చి సత్కరించింది. 1920లో హైదరాబాద్‌ టెక్ట్స్‌ గౌరవ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1923లో ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌-మోరల్‌ ఎడ్యుకేషన్‌ (లండన్‌) భారత శాఖకు గౌరవ సభ్యురాలిగా నియమితులయ్యారు. 1908లో మూసీ నది వరద బాధితుల కోసం నిధులు సమీకరించారు. అదే సంవత్సరం పర్షియా భూకంప బాధితుల కోసం కూడా విరాళాలు సేకరించారు. హిందూ ముస్లిం ఐక్యతపై, సాంఘిక దురాచారాలు ముఖ్యంగా పరదా పద్ధతి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడంపై, గోవధపై ఆమె ఉపన్యాసాలు, రచనలు సాగాయి. జాతీయ విద్యాలయాలు, స్థానిక భాషల్లో బోధనపై ఆమె రచనలు చేశారు. మాసాబ్‌ట్యాంక్‌లో పాఠశాల స్థాపనకు భూమిని విరాళంగా ఇచ్చారు. ఇప్పుడది సఫ్తరియా బాలికల పాఠశాలగా వెయ్యి మంది విద్యార్థులతో నడుస్తోంది. హైదరాబాద్‌ నగరంలోని హుమాయూన్‌ నగర్‌ ఈమె భర్త పేరు మీదుగా ఏర్పాటైనదే.


తయ్యబా బేగం సాహిబా బిల్‌గ్రామి: ఈమె సయ్యద్‌ హుస్సేన్‌ కుమార్తె. 1873లో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి 1908లో ఎఫ్‌.ఎ.ఆనర్స్‌ ఉత్తీర్ణులయ్యారు. 1910లో అదే వర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందారు. భారతదేశంలోనే డిగ్రీ తీసుకున్న మొదటి ముస్లిం మహిళ ఈమె. స్త్రీకి ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ మార్పు కేవలం విద్య వల్లే సాధ్యమవుతుందని విశ్వసించారు, ప్రచారం చేశారు. 


తయ్యబా బేగం: ఈమె స్త్రీ విద్య కోసం పాటుపడ్డారు. అప్పట్లో ముస్లిం స్త్రీలు పరదా పద్ధతి పాటిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం నామోషీగా భావించేవారు. అలాంటి సమయంలో ఈమె కో-ఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరి ఉద్యోగం చేస్తూనే మొదటి ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ పాఠశాలను హైదరాబాద్‌లో స్థాపించారు. తక్కువ కాలంలోనే ఆ పాఠశాల ప్రఖ్యాతిగాంచింది. దాని శాఖలు ఔరంగాబాద్, వరంగల్, నిజామాబాద్‌లో ఏర్పాటయ్యాయి. ఈమె హైదరాబాద్‌లో స్త్రీ విద్యకు, ముఖ్యంగా ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌లో అధ్యాపకురాలిగా ప్రసిద్ధికెక్కారు.హైదరాబాద్‌లో మొదటి డొమెస్టిక్‌ సైన్స్‌ కాలేజీని స్థాపించి, మొదటి ప్రిన్సిపల్‌గా పనిచేశారు.


సరోజినీ నాయుడు: ఈమె 1879, ఫిబ్రవరి 13న బెంగాల్‌లో జన్మించారు. వీరి కుటుంబం 1878లోనే హైదరాబాద్‌కు వలస వచ్చింది. సరోజినీ నాయుడు 12 ఏళ్ల వయసులో మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్‌లో ఈమె రచించిన ‘మహర్‌ మునీర్‌’ నాటకం ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌కు బాగా నచ్చి, 1895లో మొదటి తరగతి ప్రయాణంలో విదేశాలకు వెళ్లడానికి ఉపకార వేతనం ఇచ్చాడు. ఈమె ఇంగ్లండ్‌లో భారత విద్యార్థుల గురువైన మిస్‌ మానింగ్‌ శిష్యురాలిగా ఉన్నారు. హైదరాబాద్‌కు తిరిగి వస్తూ 1898లో డాక్టర్‌ ముత్యాల గోవింద నాయుడును వివాహం చేసుకున్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే స్వదేశానికి వచ్చారు. హిందూ - ముస్లిం ఐక్యత కోసం పాటుపడ్డారు. భారత స్త్రీల రాజకీయ సమానత్వం కోసం పోరాడారు. గాంధీజీతో, నెహ్రూ కుటుంబంతో చనువుగా ఉండేవారు. లండన్‌లో జరిగిన రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి గాంధీజీతో పాటుగా హాజరయ్యారు. 1905లో బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. 1917లో ఉమెన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ ఏర్పాటులో పాలుపంచుకున్నారు. 1925లో కాన్పుర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించారు. దక్షిణాఫ్రికాలో 1929లో తూర్పు ఆఫ్రికన్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. దేశంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఈమె చేసిన సేవకు బ్రిటిష్‌ ప్రభుత్వం కైజర్‌-ఎ-హింద్‌ పతకాన్ని (బిరుదు) ఇచ్చింది. బుల్‌-బుల్‌-ఎ హింద్‌ (భారత కోకిల)గా ప్రసిద్ధిగాంచిన సరోజినీ నాయుడు గొప్ప రచయిత్రి. 1908లో హైదరాబాద్‌లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు నిజాం మహబూబ్‌ అలీ ఖాన్‌ ప్రజల ఇక్కట్లు చూసి పడిన బాధను ‘టియర్‌ ఆఫ్‌ అసఫ్‌’ అనే కవితలో అద్భుతంగా వర్ణించారు. ఈమె రచనలన్నింటిలోకి గొప్పది ‘ద బర్డ్‌ ఆఫ్‌ టైమ్‌’. 1905లో ఈమె కవితలు ‘ద గోల్డెన్‌ థ్రెషోల్డ్‌’ పేరుతో ప్రచురితమయ్యాయి. తన జీవిత కాలంలో సరోజినీ నాయుడు ఆసియా ఖండంలోనే అగ్రశ్రేణి మహిళగా పేరు పొందారు. స్వాతంత్య్రానంతరం ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా సేవలందించారు. ఈమె కుమార్తె పద్మజా నాయుడు, కుమారుడు జయసూర్య జర్మనీలో వైద్యశాస్త్రం అభ్యసించారు. జయసూర్య రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాడు. పద్మజా నాయుడు హైదరాబాద్‌ రాష్ట్ర స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతరం పశ్చిమ బెంగాల్‌కు పదేళ్లు గవర్నర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని సరోజినీ నాయుడు స్వగృహం హిందూ-ముస్లింల మైత్రికి ఆలయంగా ఉండేది. ఆమె తదనంతరం ఆ ఇంటిని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి ఇచ్చారు.

 


రచయిత: డాక్టర్‌.ఎం.జితేందర్‌ రెడ్డి


 

 

Posted Date : 05-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌