• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయం - పంటకాలాలు

* వర్షపాతం, శీతోష్ణస్థితిని బట్టి పంట కాలాలు మూడు రకాలు
ఖరీఫ్‌ కాలం: ఇది జూన్‌ నుంచి అక్టోబరు వరకు ఉంటుంది. కాలవ్యవధి 5 నెలలు. పూర్తిగా వర్షాధారమైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో సార్వా, తెలంగాణలో పునాస పంట అని అంటారు. ఈ కాలంలో వరి, జొన్న, సజ్జ, జనుము, చెరకు, పత్తి లాంటి పంటలు పండిస్తారు.

రబీ కాలం: ఇది నవంబరు నుంచి మార్చి వరకు ఉంటుంది. కాలవ్యవధి 4 నెలలు. ఈ కాలం వర్షం, తేమపై ఆధారపడుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో దాళ్వా, తెలంగాణలో యాసంగి పంట అని పిలుస్తారు. ఈ కాలంలో గోధుమ, బార్లీ, బఠానీ, పొగాకు, ఆవాలు, ధనియాలు లాంటివి పండిస్తారు.

జైద్‌/జయద్‌ కాలం: దీన్ని రబీ, ఖరీఫ్‌ల మధ్య స్వల్పకాలిక పంట అంటారు. ఇది మార్చి నుంచి జూన్‌ మధ్యలో 3 నెలల పాటు ఉంటుంది. ఈ కాలంలో నీటివసతులు ఉన్న ప్రాంతాల్లో పంటలు పండిస్తారు. ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశంలో అనుకూలమైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో వేసవి కాలం పంట, తెలంగాణలో కార్తీక పంట అంటారు. ఈ కాలంలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, పుచ్చకాయలు, కర్బూజ, పశువుల మేత పండిస్తారు.

సాగు పద్ధతులు
జూమ్‌ పద్ధతి: ఈ రకమైన వ్యవసాయ సాగు పర్వత పాదాల వద్ద చేస్తారు. ఇది ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉంది.
టెర్రస్‌ పద్ధతి: పర్వత సానువులు, పంక్తులు లేదా పర్వతాలపై సాగుచేసే పద్ధతి. ఇది ఎక్కువగా హిమాలయ పర్వత పైభాగంలో అమల్లో ఉంది.
బేవార్‌/బేర్‌ పద్ధతి: ఇది కొండ ప్రాంతాలు, పీఠభూమి పైన సాగుచేసే విధానం. దీన్ని ఎక్కువగా ద్వీపకల్ప ఉన్నత ప్రాంతంలో చేస్తారు.
పంట మార్పిడి: ఒక సంవత్సరంలో పండించిన పంటను మరుసటి సంవత్సరంలో మార్పు చేస్తూ కొనసాగించే విధానాన్నే పంట మార్పిడి అంటారు. ఇందులో ప్రధానంగా పప్పు ధాన్యాలు ఉంటాయి.
మిశ్రమ పద్ధతి: ఒక సంవత్సర కాలంలో రెండు అంతకంటే ఎక్కువ రకాల పంటలు పండించే విధానం. ఇందులో ఎక్కువగా వేరుశనగ, కంది, జనుము, గోగు పంటలు పండిస్తారు.

సాగు రకాలు
విస్తాపన వ్యవసాయం:
ఇది చిన్న కమతాల్లో ప్రత్యేకంగా గిరిజనులు పురాతన పనిముట్లతో అడవులను నరికివేస్తూ కాల్చివేత విధానం ద్వారా సాగు చేసే వ్యవసాయం. ఇది రుతుపవనాలు, పోషక పదార్థాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

విస్తృత వ్యవసాయం: ఈ రకమైన వ్యవసాయాన్ని తక్కువ జనాభా, ఎక్కువ భూభాగం ఉన్న ప్రాంతంలో చేస్తారు. యంత్రపరికరాలను వినియోగిస్తారు. ఎక్కువగా రష్యా, ఆస్ట్రేలియా, మధ్య భారత్‌లో ఉంది.

సాంద్ర వ్యవసాయం: అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ శ్రామికులను, జీవ రసాయనిక ఎరువులు, నీటిపారుదలను ఉపయోగించుకొని ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతి. ఇది ఉత్తర, దక్షిణ భారత్‌ల్లో అమల్లో ఉంది.
వాణిజ్య వ్యవసాయం: అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. ఇందులో అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, తెగులు నివారణ మందులు ఉపయోగిస్తారు. ఈ విధానం విస్తృతి ప్రాంతాన్ని బట్టి వేరుగా ఉంటుంది.
మిశ్రమ వ్యవసాయం: ఇది మన దేశంలో పురాతన వ్యవసాయ పద్ధతి. ఈ రకమైన సాగులో వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన పంటలు, పశుగణాభివృద్ధి, మత్స్య సంపద, కలప లాంటి వాటిని సాగు చేస్తారు.
ఉదా: ఈ రకమైన సాగు విధానంలో పంటలతోపాటు కూరగాయలు, పండ్లు, బావుల్లో చేపల పెంపకం, పశువులు, గొర్రెలు, బీడు భూముల్లో కలప చెట్లను పెంచుతారు.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌