• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - పరిశ్రమలు

ఇనుము-ఉక్కు కర్మాగారాలు
స్వాతంత్య్రానికి ముందు దేశంలో ఉన్న ప్రధాన పరిశ్రమలు: టాటా ఇనుము ఉక్కు కర్మాగారం (1907), ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (1919), విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (1923).
            స్వాతంత్య్రానంతరం వివిధ ప్రణాళికా కాలాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక భారీ ఇనుము-ఉక్కు పరిశ్రమలను స్థాపించింది. 1991 తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలతో మన దేశంలో బహుళజాతి సంస్థలు కూడా ఇనుము-ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేశాయి. రెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఒకేసారి మూడు భారీ ఇనుము-ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేశారు. అవి: భిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాలు.

హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ - భిలాయ్: ఈ స్టీల్ ప్లాంట్‌ను సోవియట్ యూనియన్ సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఉంది. ఈ ప్లాంట్‌కు ఇనుప ధాతువు: దల్లి - రాజహర గనులు, బొగ్గు: కోర్బా, కార్గాలి గనులు, మాంగనీస్: చింద్వారా, బాలాఘాట్ గనులు, సున్నపురాయి: నందిని గనులు, విద్యుచ్ఛక్తి కోర్బా థర్మల్ పవర్ స్టేషన్ నుంచి సరఫరా అవుతున్నాయి.

హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ - రూర్కెలా: ఈ ప్లాంట్‌ను నాటి పశ్చిమ - జర్మనీ సహకారంతో ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌కు ఇనుప ధాతువు: కియోంజర్, సుందర్‌ఘర్ జిల్లాలు, బొగ్గు: ఝురియా, తాల్చేరు గనులు, మాంగనీస్: బారాజామ్డా గనులు, సున్నపురాయి: పూర్ణాపాణి గనులు, విద్యుచ్ఛక్తి: హీరాకుడ్ జలవిద్యుత్ కేంద్రం నుంచి సరఫరా అవుతున్నాయి.

హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ - దుర్గాపూర్: ఈ కర్మాగారం పశ్చిమ్ బంగ రాష్ట్రంలోని బర్ద్వాన్ జిల్లా, దుర్గాపూర్‌లో ఉంది. దీన్ని దామోదర్ నది ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు బ్రిటన్ సహకారం అందించింది. ఇది కోల్‌కతా - అసన్‌సోల్ రైలు మార్గంలో ఉంది. ఈ ప్లాంట్‌కు ఇనుపధాతువు: బొలాని గనులు (ఒడిశా), బొగ్గు: ఝరియా గనులు, సున్నపురాయి: బిర్మిత్రాపూర్ గనులు, మాంగనీస్: జామ్డా గనులు (ఒడిశా), విద్యుచ్ఛక్తి: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి సరఫరా అవుతున్నాయి.

బొకారో ఇనుము - ఉక్కు కర్మాగారం: ఈ కర్మాగారాన్ని సోవియట్ రష్యా సహకారంతో ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో బొకారో, దామోదర్ నదులు కలిసే ప్రాంతం వద్ద ఏర్పాటు చేశారు. ఇది దేశంలోని ప్రభుత్వరంగ ఇనుము-ఉక్కు కర్మాగారాల్లో అతి పెద్దది. ఈ ప్లాంట్‌కు ఇనుప ధాతువు: కిరుబురు గనులు (ఒడిశా), బొగ్గు: ఝరియా గనులు, సున్నపురాయి: పలమావు జిల్లా, విద్యుచ్ఛక్తి: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి సరఫరా అవుతున్నాయి.

విశాఖ ఇనుము - ఉక్కు కర్మాగారం: ఈ కర్మాగారం ఏర్పాటుకు 1971లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు (1992 లో పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా దీన్ని జాతీయం చేశారు). అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన ఈ కర్మాగారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సముద్ర తీరప్రాంతంలో ఉంది. ఈ ప్లాంట్‌ను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ స్టీల్‌ప్లాంట్‌కు బైలదిల్లా ఇనుప గనుల్లో ఉత్పత్తవుతున్న ఇనుప ధాతువు సరఫరా అవుతోంది.

           పైన పేర్కొన్నవే కాకుండా మరికొన్ని ఇనుము ఉక్కు కర్మాగారాలు దేశంలో విస్తరించి ఉన్నాయి. తమిళనాడులోని సేలం ఇనుము-ఉక్కు కర్మాగారం (ఇది స్టెయిన్‌లెస్ స్టీల్, నాణేల తయారీకి కావలసిన ముడి పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది), కర్ణాటకలోని హోసపేటె వద్ద ఉన్న విజయనగర ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారం, మహారాష్ట్రలోని సూరజ్‌ఘర్ వద్ద ఉన్న ఇనుము-ఉక్కు కర్మాగారం, తెలంగాణలోని పాల్వంచలో ఉన్న స్పాంజ్ ఐరన్ కర్మాగారాలు వీటిలో ప్రధానమైనవి.

సెయిల్ (SAIL)
          సెయిల్ పూర్తి పేరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీన్ని 1973లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న భారీ ఇనుము-ఉక్కు కర్మాగారాలను సమీకృతం చేసి సెయిల్ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుతం సెయిల్ పరిధిలో ఉన్న కర్మాగారాలు: భిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్, IISCO స్టీల్ కర్మాగారం, సేలం స్టీల్ ప్లాంట్, విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కు కర్మాగారం, చంద్రాపూర్ ఫెర్రో అల్లాయ్ కర్మాగారం మొదలైనవి.

సిమెంట్ కర్మాగారాలు
         దేశంలో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని చెన్నైకి సమీపంలో, 1904లో ఏర్పాటు చేశారు. అయితే ఇది కొద్దికాలానికే మూతపడింది. 1912లో గుజరాత్‌లోని పోర్‌బందర్ వద్ద పూర్తి సామర్థ్యంతో కూడిన సిమెంట్ కర్మాగారాన్ని నెలకొల్పారు. సిమెంట్ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అత్యధిక సంఖ్యలో సిమెంట్ కర్మాగారాలు ఉన్న రాష్ట్రం కూడా ఇదే.
* గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. సిమెంట్ ఉత్పత్తికి కావాల్సిన ముడి సరకుల్లో సున్నపురాయి, బంకమట్టి, జిప్సం, షెల్ ప్రధానమైనవి.

అల్యూమినియం పరిశ్రమ
         పశ్చిమ్ బంగలోని అసన్‌సోల్ సమీపంలో ఉన్న జామ్‌నగర్ ప్రాంతంలో అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 1938లో ఏర్పాటు చేశారు. దీన్ని 1944లో జాతీయం చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ పరిధిలో అయిదు ప్రభుత్వరంగ సంస్థలు అల్యూమినియాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అవి...
* బాల్కో (BALCO - భారత్ అల్యూమినియం కంపెనీ), కోర్బా (చత్తీస్‌గఢ్), రతన్‌గిరి (మహారాష్ట్ర)
* నాల్కో (NALCO - నేషనల్ అల్యూమినియం కంపెనీ), కోరాపుట్ (ఒడిశా)
* హిండాల్కో (HINDALCO - హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ), రేణుకూట్ (ఉత్తర్ ప్రదేశ్)
* మాల్కో (MALCO - మెట్టూర్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్), మెట్టూరు (తమిళనాడు)
* ఇండాల్కో (INDALCO - ఇండియన్ అల్యూమినియం కంపెనీ), హీరాకుడ్ (ఒడిశా), బెల్గామ్, ఆల్వే.

గాజు పరిశ్రమ
            దేశంలో తొలి గాజు పరిశ్రమను 1941లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో స్థాపించారు. ఉత్తర్ ప్రదేశ్ గాజు పరిశ్రమకు ప్రసిద్ధి. ఈ రాష్ట్రంలోని ఘజియాబాద్ గాజు పరిశ్రమకు ప్రధాన కేంద్రం. గాజు ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల్లో ఇసుక, సున్నపురాయి, సోడా యాష్, సిలికా ప్రధానమైనవి.

యంత్ర పరికరాల పరిశ్రమలు
హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT) లిమిటెడ్: దేశంలో మొదటి HMT కర్మాగారాన్ని 1953లో బెంగళూరులో స్థాపించారు. దేశంలోని ఏడు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన యూనిట్లు ఉన్నాయి. అవి:


భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
           మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ వద్ద దేశంలో మొదటి భెల్ కర్మాగారాన్ని 1956లో ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో అనేక ప్రాంతాల్లో దీనికి సంబంధించిన యూనిట్లను నెలకొల్పారు.
        ఇవి ప్రధానంగా ఎలక్ట్రికల్ పరికరాలైన జనరేటర్లు, టర్బైన్లు, బాయిలర్లు, ట్రాన్స్‌ఫార్మర్ లాంటి పరికరాలను ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో విస్తరించి ఉన్న ప్రధాన యూనిట్లు: భోపాల్ (మధ్యప్రదేశ్), హరిద్వార్ (ఉత్తరాఖండ్), తిరుచిరాపల్లి (తమిళనాడు), బెంగళూరు (కర్ణాటక), హైదరాబాద్ (తెలంగాణ), జగదీష్‌పూర్ (ఉత్తర్ ప్రదేశ్), ఝాన్సీ (మధ్యప్రదేశ్), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), జమ్ము (జమ్ము, కశ్మీర్), గోయిండ్వాల్ (పంజాబ్).

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
            బెంగళూరులో దేశంలో మొదటి హాల్ (HAL) కర్మాగారాన్ని 1964 లో ఏర్పాటు చేశారు. ఈ కర్మాగారాల్లో ఎయిర్ క్రాఫ్ట్‌లకు కావాల్సిన పరికరాలు తయారవుతుంటాయి. మిగ్ విమానాల విడి భాగాలు నాసిక్ (మహారాష్ట్ర), కొర్వా, లఖ్‌నవూ, కాన్పూర్ (ఉత్తర్ ప్రదేశ్)లలో, మిగ్ విమానాల ఇంజిన్ భాగాలు కోరాపుట్ (ఒడిశా)లో, మిగ్ విమానాల ఎలక్ట్రానిక్ భాగాలు హైదరాబాద్‌లో తయారవుతున్నాయి. మిగ్ విమానాల అసెంబ్లింగ్ బెంగళూరు (కర్ణాటక)లో జరుగుతోంది.

నౌకా నిర్మాణ కేంద్రాలు
          విశాఖపట్నంలో 1941లో ఏర్పాటు చేసిన సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీతో దేశంలో నౌకా నిర్మాణ పరిశ్రమ ప్రారంభమైంది. ఇది తయారుచేసిన మొదటి నౌక పేరు జల ఉష. దీన్ని 1948లో నిర్మించారు. స్వాతంత్య్రానంతరం (1952) సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీని జాతీయం చేసి, హిందుస్థాన్ షిప్‌యార్డ్‌గా పేరు మార్చారు.
హిందుస్థాన్ షిప్‌యార్డ్ (విశాఖపట్నం): దేశంలోనే అతిపెద్ద నౌకానిర్మాణ కేంద్రం. ఇక్కడ ప్రయాణికుల పడవలు, కార్గో పడవలు తయారవుతుంటాయి.

మజగావ్ డాక్‌యార్డ్ (ముంబయి): ఇక్కడ ప్రధానంగా యుద్ధ నౌకలు తయారవుతుంటాయి.

గోవా షిప్‌యార్డ్ (గోవా): లాంచీలు తయారవుతుంటాయి.

కొచ్చి షిప్‌యార్డ్ (కొచ్చి): ఇక్కడ స్టీమర్లు, వాణిజ్య పడవలు తయారవుతుంటాయి. ఈ షిప్‌యార్డ్‌ను జపాన్ సహకారంతో ఏర్పాటు చేశారు.

గార్డెన్ రీచ్ (కోల్‌కతా): ఇక్కడ ప్రధానంగా డ్రెడ్జర్స్, చిన్న చిన్న యుద్ధ నౌకలు తయారవుతుంటాయి.

ఐఎన్ఎస్ కదంబ (కర్ణాటక): ఇది దేశంలో అతిపెద్ద నౌకా స్థావరం. దీన్ని కేవలం రక్షణ అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ షిప్‌యార్డ్‌ను ఆపరేషన్ సీ బర్డ్ అని కూడా పిలుస్తారు.
వీటితోపాటు ముంబయిలో అలెగ్జాండ్రియా డాక్‌యార్డ్, విక్టోరియా డాక్‌యార్డ్ కూడా ఉన్నాయి.

 

రైల్వే కర్మాగారాలు
         రైల్వేలను అభివృద్ధి చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో లోకోమోటివ్స్ (రైలు ఇంజిన్లు), రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు.

దేశంలోని రైలు ఇంజిన్ కర్మాగారాలు (లోకోమోటివ్స్):

చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్: దీన్ని పశ్చిమ్ బంగలోని చిత్తరంజన్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఎలక్ట్రికల్ రైలు ఇంజిన్లు తయారవుతున్నాయి.

వారణాసి డీజిల్ లోకోమోటివ్స్: ఇక్కడ డీజిల్ ఇంజిన్లు తయారవుతుంటాయి.

టాటా ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ (టెల్కో): ఇది జంషెడ్‌పూర్‌లో ఉంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజిన్లు తయారవుతున్నాయి.

డీజిల్ లోకోమోటివ్స్ ఫ్యాక్టరీ-మార్‌హౌరా: బిహార్‌లోని ఈ ఫ్యాక్టరీలో డీజిల్ ఇంజిన్లు తయారవుతున్నాయి.

ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ - మాదేపుర: ఇది బిహార్‌లో ఉంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజిన్లు తయారవుతున్నాయి.

డీజిల్ లోకోమోటివ్ మోడ్రనైజేషన్ వర్క్స్ - పటియాల: ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ డీజిల్, ఎలక్ట్రానిక్ ఇంజిన్లు తయారవుతున్నాయి.

మెట్రోగేజ్ స్టీమ్ మోటివ్స్ - టాటానగర్: ఇది ఝార్ఖండ్‌లో ఉంది. ఇక్కడ ఆవిరి యంత్రాలు తయారవుతున్నాయి.

ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, పెరంబూర్: ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడ రైలు బోగీలు, ఏసీ కోచ్‌లు తయారవుతున్నాయి.

రైలు కోచ్ ఫ్యాక్టరీలు: ఇక్కడ రైలు కోచ్‌లు తయారవుతుంటాయి. ఇవి పంజాబ్‌లోని కపుర్తలా, కేరళలోని కోజికోడ్, ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలిలో ఉన్నాయి.

రైల్వే వీల్స్ అండ్ ఆక్సిల్ ప్లాంట్ - ఎలహంక: ఇది బెంగళూరు సమీపంలో ఉంది. ఇక్కడ రైలు చక్రాలు, ఇరుసులు తయారవుతుంటాయి.

రైల్వే వీల్ ఫ్యాక్టరీ - చాప్రా: ఇది బిహార్‌లో ఉంది. ఇక్కడ రైలు చక్రాలు తయారవుతుంటాయి.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌