• facebook
  • whatsapp
  • telegram

సమాచార సేవలు

   అన్ని ఆర్థిక, సాంఘిక కార్యకలాపాల్లో సమాచార సేవలు/ సాంకేతిక సమాచార రంగాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తయారీ, సేవా రంగాల్లో సామర్థ్యం, వేగం పెరుగుతున్నాయి. సమాచార సేవల వల్ల దేశాలు, వ్యక్తుల మధ్య భౌగోళిక అవధులు తొలగిపోతున్నాయి. దృశ్య, శ్రవణ రూపాల్లో సమాచారం తక్షణం బదిలీ అవుతోంది. వ్యాపార నిర్వహణ, ప్రభుత్వ పరిపాలనలో సైతం పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. 


పోస్టల్‌ వ్యవస్థ 
    భారతదేశంలో ఆధునిక పోస్టల్‌ వ్యవస్థ 18వ శతాబ్దపు అర్ధ భాగంలో ప్రారంభమైంది. 1766 లో లార్డ్‌ క్లైవ్‌ మొదట దీన్ని స్థాపించారు. తర్వాత వారెన్‌ హేస్టింగ్స్‌ కాలంలో కలకత్తా కేంద్రంగా పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో జనరల్‌ పోస్టాఫీస్‌ను నెలకొల్పి, అభివృద్ధి చేశారు. 1873 మొదటి రెగ్యులేటెడ్‌ యాక్ట్‌ ప్రకారం పోస్ట్‌ ఆఫీస్‌ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటుచేశారు. 1898 ఇండియా పోస్ట్‌ ఆఫీస్‌ యాక్ట్‌ ఆధారంగా ప్రస్తుత పోస్టల్‌ సర్వీసులు వినియోగదారులకు తమ సేవలను అందిస్తున్నాయి.
* 1854 అక్టోబరు 1న భారత్‌లో లార్డ్‌ డల్హౌసీ కాలంలో 701 పోస్టాఫీస్‌లను స్థాపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,55,015 తపాలా కార్యాలయాలు ఉన్నాయి. అలాగే 23 పోస్టల్‌ సర్కిళ్లలో సుమారు 4.33 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మన పోస్టల్‌ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం, పట్టణ ప్రాంతాల్లో 10 శాతం విస్తరించి ఉంది.
* 1972 ఆగస్టు 15న అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పిన్‌కోడ్‌ వ్యవస్థను ప్రారంభించారు. పిన్‌ (PIN) అంటే పోస్టల్‌ ఇండెక్స్‌ నెంబర్‌. ఇందులో మొత్తం ఆరు అంకెలు ఉంటాయి. ఈ పిన్‌ వ్యవస్థలో... 
a) మొదటి అంకె - జోన్‌
b) రెండో అంకె - సబ్‌ జోన్‌/ పోస్టల్‌ సర్కిల్‌
c) మూడో అంకె - జిల్లా ఇండెక్స్‌
d) చివరి మూడు అంకెలు - స్థానిక పోస్టాఫీస్‌లను సూచిస్తాయి. ఉదా: 500001 - హైదరాబాద్, సోమాజిగూడ.


* 1985 లో మొదట జనరల్‌ మెయిల్‌ వ్యవస్థ ప్రారంభమైంది. ఇది రెండు రకాలు:
a) ఫస్ట్‌ క్లాస్‌ మెయిల్‌ (FCM)  - ఇందులో పోస్ట్‌కార్డ్స్, ఇన్‌లాండ్‌ లెటర్స్, ఎన్వలప్‌ కవర్స్‌ను పంపొచ్చు. వీటిని వాయుమార్గాల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు చేరుస్తారు.
b) సెకండ్‌ క్లాస్‌ మెయిల్‌(SCM) - ఇందులో బుక్‌ ప్యాకెట్స్, రిజిస్టర్డ్‌ న్యూస్‌పేపర్, పీరియాడికల్స్‌ బట్వాడా చేస్తారు. వీటిని రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుస్తారు.
* 1990 లో మన దేశంలో స్పీడ్‌ పోస్ట్‌ను ప్రారంభించారు. దీన్ని వేగంగా చేరవేసేందుకు  అనేక రంగుల పోస్టల్‌ బాక్స్‌లు, ఛానల్స్‌ను ఏర్పాటు చేశారు.
a) ఎరుపు (రెడ్‌) రంగు బాక్స్‌ - అన్ని రకాల ఉత్తర, ప్రత్యుత్తరాలు పంపేందుకు
b) నీలం (బ్లూ) రంగు బాక్స్‌ - అన్ని మెట్రోపాలిటన్‌ సిటీలకు సంబంధించినవి
c) ఆకుపచ్చ (గ్రీన్‌) రంగు బాక్స్‌ - అన్ని నగరాల స్థానిక ఉత్తర, ప్రత్యుత్తరాల కోసం. 
d) పసుపుపచ్చ (ఎల్లో) రంగు బాక్స్‌ - కేవలం దిల్లీ నగర ఉత్తర, ప్రత్యుత్తరాల రవాణా కోసం
e) మెట్రో ఛానల్‌ - దేశంలో అన్ని మెట్రోపాలిటన్‌ నగరాలను అనుసంధానం చేయడానికి
f) రాజధాని ఛానల్‌ - దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులను దిల్లీకి అనుసంధానం చేయడానికి
g) బిజినెస్‌ ఛానల్‌ - ప్రత్యేక వ్యాపార కోడ్‌ నిమిత్తం
h) శాటిలైట్‌ ఛానల్‌ - మనీఆర్డర్  (MO)ను వేగవంతం చేయడానికి ఉపయోగించే ఛానల్‌
i) గ్రీన్‌ ఛానల్‌ - స్థానిక బట్వాడా లేదా స్థానిక తపాలా కార్యాలయాలను వేగవంతం చేయడానికి ఉపయోగిస్తున్నారు.


పోస్టల్‌ సర్వీసులు
    1897 మార్చి 7న కలకత్తాలో మొదటి స్టాంప్‌ సేకరణ ప్రారంభమైంది. అలాగే 1968 జులై 6న న్యూదిల్లీ కేంద్రంగా ‘‘నేషనల్‌ ఫిలాటెలిక్‌ (Philatelic) మ్యూజియం ఆఫ్‌ ఇండియా’’ను స్థాపించారు.
* 1884 ఫిబ్రవరి 1న పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (Postal Life Insurance)ను ప్రారంభించారు.
* 2018 సెప్టెంబరు 15న ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (IPPB)ను ప్రారంభించారు. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేస్తుంది.
* ప్రస్తుతం దేశ ప్రజలకు పోస్టల్‌ వ్యవస్థ అందిస్తున్న సర్వీసులు:
1) స్పీడ్‌ పోస్ట్‌
2) ఇండియా పోస్ట్‌  ATM 
3) రైల్వే మెయిల్‌ సర్వీస్‌
4) ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌
5) వెస్ట్రన్‌ యూనియన్‌ ఎక్స్ఛేంజీ
6) సేవింగ్‌ క్రాస్‌ సర్టిఫికెట్స్‌
7) స్టాంప్‌ అమ్మకం, పేమెంట్‌ బ్యాంక్‌


టెలీకమ్యునికేషన్‌ 
    భారతీయ టెలికాం రంగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం మనం ప్రపంచ టెలీకమ్యునికేషన్‌ వ్యవస్థలో 20% వినియోగదారుల వాటాతో రెండో స్థానంలో ఉన్నాం.
* భారత్‌లో మొదట 1850లో  టెలీకమ్యునికేషన్‌ వ్యవస్థ ప్రారంభమైంది. 1851 లో బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు కలకత్తా-డైమండ్‌ హార్బర్‌ మధ్య తొలి ఎలక్ట్రిక్‌ టెలిగ్రాఫ్‌ను స్థాపించారు. అయితే 163 సంవత్సరాల తర్వాత 2013 జులై 15న దేశంలో టెలిగ్రాఫ్‌ వ్యవస్థను రద్దు చేశారు.
* 1880 లో ఓరియంటల్, ఆంగ్లో - ఇండియన్‌ అనే రెండు టెలిఫోన్‌ కంపెనీ లిమిటెడ్‌లు ఏర్పడ్డాయి. 1882 జనవరి 28న మేజర్‌ ఇలియిం బేరింగ్‌ 93 కనెక్షన్లతో తొలి టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీని  కలకత్తాలో ప్రారంభించారు. దీన్నే సెంట్రల్‌ ఎక్స్ఛేంజీ అని పిలుస్తారు. ఆ తర్వాత బొంబాయి, మద్రాసు, అహ్మదాబాద్‌లకు వీటిని విస్తరించారు.
* తర్వాత 1902లో కేబుల్‌ టెలిగ్రాఫ్‌ వ్యవస్థ, మొదటి వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ స్టేషన్‌ను సాగర్‌ ద్వీపంలో ప్రారంభించారు.
1927: మొదటి రేడియో - టెలిగ్రాఫ్‌ వ్యవస్థ యూకే ్బగీర్శీ, భారత్‌ల మధ్య ప్రారంభమైంది. 
* 1933: యూకే(UK), భారత్‌ల మధ్య రేడియో టెలిఫోన్‌ వ్యవస్థను స్థాపించారు.
* 1947: మొదటి ఎలక్ట్రానిక్‌ అండ్‌ టెలీకమ్యునికేషన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీని జబల్‌పూర్‌లో ప్రారంభించారు.
* 1960: మొదటి సబ్‌స్క్రైబర్‌ ట్రంక్‌ డయలింగ్‌ లఖ్‌నవూ - కాన్పూర్‌ మధ్య ఏర్పాటైంది.
* 1976: మొదటి డిజిటల్‌ మైక్రోవేవ్, ఆప్టికల్‌ ఫైబర్‌ వ్యవస్థలను పుణెలో స్థాపించారు.
* 1980: మొదటి శాటిలైట్‌ ఎర్త్‌ స్టేషన్‌ (భూతల కేంద్రం)ను సికింద్రాబాద్‌లో ప్రారంభించారు.
* 1984: కమ్యునికేషన్‌ - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలిఫోన్‌ (C - DOT) ను అభివృద్ధి చేశారు. 1985లో పోస్టల్‌ వ్యవస్థ నుంచి టెలికాంను వేరుచేసి MTNL, VSNL అనే రెండు వ్యవస్థలుగా ఏర్పాటుచేశారు.
* 1995: మొదటి మొబైల్‌ టెలిఫోన్, అంతర్జాలాన్ని (Internet)  దిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఆగస్టు 15 న ప్రారంభించారు. 
* 1997: భారత ప్రభుత్వం  TRAI - టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేసింది.
* 2000: వాజపేయీ ప్రభుత్వం టెలికాం డిస్ప్యూట్‌ సెటిల్‌మెంట్‌ అండ్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (TDSAT)ను తీసుకొచ్చింది.
2000: ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) ను అక్టోబరు 1న ఏర్పాటు చేశారు.
* దేశంలో 2020  జనవరి నాటికి 1.18  బిలియన్‌ టెలిఫోన్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 1.15 బిలియన్ల మంది మొబైల్, 21.0 మిలియన్లు ఫిక్స్‌డ్‌లైన్, 661.9 మిలియన్‌ ప్రజలు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు కలిగి ఉన్నారు. ప్రతి నెలా 3,44,000 మంది కొత్త కనెక్షన్‌ పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న టెలిసాంద్రత 88.56 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 56.67 శాతం, పట్టణ ప్రాంతాల్లో 156.2 శాతం సాంద్రత ఉంది. అలాగే వైర్‌లెస్‌ కనెక్షన్లు 86.98 శాతం ఉన్నాయి.
* దేశంలో అత్యధిక టెలిసాంద్రత ఉన్న రాష్ట్రాలు: హిమాచల్‌ ప్రదేశ్‌ (141.3%), కేరళ (124.1%), పంజాబ్‌(124.1%), తమిళనాడు (116.0%). మెట్రో నగరాల్లో దిల్లీ (232.2%), కలకత్తా  (165.7%), ముంబయి (157.5%) ఉన్నాయి.
* అత్యల్ప టెలిసాంద్రత ఉన్న రాష్ట్రాలు: బిహార్‌ - (60%), , అసోం (63%).

 

రేడియో
 ఆల్‌ ఇండియా రేడియో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అతి పెద్ద బ్రాడ్‌కాస్టింగ్‌ ఆర్గనైజేషన్‌. 1923 జూన్‌ 21న బ్రిటిష్‌ వారి కాలంలో ‘బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్‌’ మొదటి ప్రసార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తర్వాత 1927 జులై 23న ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌గా మారింది. 1930 ఏప్రిల్‌ 1 నుంచి ఇండియా స్టేట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీస్‌గా ఏర్పడింది.
* 1932 లో 7వ హైదరాబాద్‌ నిజాం ప్రభువు దక్కన్‌ రేడియో ద్వారా 1935 ఫిబ్రవరి 3న ‘లైవ్‌ ఆన్‌ ఎయిర్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చివరిగా 1956 లో ఆల్‌ఇండియా రేడియోలో విలీనం చేశారు.
* 1936 జూన్‌ 8న భారత ప్రభుత్వం న్యూఢిల్లీ కేంద్రంగా ఆల్‌ ఇండియా రేడియోను ఏర్పాటు చేసింది. దీని మోటో (Motto)  బహుజన హితయ, బహుజన సుకియా.
* 1957 అక్టోబరు 3న రేడియో వ్యవస్థను ‘ఆకాశవాణి’ (సెలెస్టియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేదా వాయిస్‌ ఫ్రమ్‌ ద స్కై)గా మార్చి ‘వివిధ భారతి’ ద్వారా కార్యక్రమాలు ప్రారంభించారు.
* 1977 జులై 23న మొదటి ఎఫ్‌ఎం బ్రాడ్‌ కాస్టింగ్‌ రేడియో చెన్నైలో ప్రారంభించారు.
* 1997 నవంబరు 23 ప్రసార భారతి (బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేశారు.
* ప్రస్తుతం రేడియో వ్యవస్థ 99.1% భారతదేశ ప్రజలకు అందుబాటులో ఉంది. మొత్తం 30 భాషల్లో 108 దేశాలకు విస్తరించింది. ఇందులో 15 విదేశీ, 15 భారతీయ ప్రాంతీయ భాషలు ఉన్నాయి.


టెలివిజన్‌ (టీవీ)
    ఇండియాలో అంతర్గత టెలివిజన్‌ మొదటి టెలికాస్ట్‌ను 1959 సెప్టెంబరు 15న ఢిల్లీ ఆకాశవాణి భవన్‌లో ప్రారంభించారు. 1965 నుంచి నిరంతర ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1975 లో మొదటిసారి శాటిలైట్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ టెలివిజన్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ (SITE)  అభివృద్ధి చేశారు. 1976 లో ఆల్‌ ఇండియా రేడియో నుంచి టెలివిజన్‌ను వేరుచేసి దూరదర్శన్‌ (DD) గా మార్పు చేశారు. దీని మోటో (Motto) సత్యం, శివం, సుందరం.
* 1982 ఆగస్టు 15న నేషనల్‌ టెలికాస్ట్‌ పేరుతో మొదటిసారి శ్రీమతి ఇందిరాగాంధీ ‘రంగుల టెలివిజన్‌’ను ప్రారంభించారు.  1995 నుంచి డీడీ ఇంటర్నేషనల్‌ ఛానల్‌ను ప్రారంభించారు. 2012లో డైరెక్ట్‌ టు హోమ్‌ (DTH) వ్యవస్థ ప్రారంభమై, దేశమంతటా విస్తరించింది.
* ప్రస్తుతం దూరద్శన్‌ 46 స్టూడియోలు, 21 ఆపరేట్‌ ఛానల్స్, రెండు ఆల్‌ ఇండియా ఛానల్స్‌ (డీడీ నేషనల్, న్యూస్‌), 17 ప్రాంతీయ శాటిలైట్‌ ఛానల్స్, 11 స్టేట్‌ నెట్‌వర్క్‌లను కలిగి ఉంది. ప్రపంచంలో 146 దేశాలకు డీడీ అందుబాటులో ఉంది.
* ప్రస్తుతం దేశంలో 9 పోస్టల్‌ జోన్‌లు ఉన్నాయి. ఇందులో 8 భౌగోళిక ప్రాంతాలకు సంబంధించినవి. ఒకటి ఆర్మీకి చెందింది.
* దేశంలో అతిపెద్ద జోనల్‌ వ్యవస్థ ఏడో జోన్‌.

 

జోన్‌లు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు
మొదటి జోన్ దిల్లీ, హరియాణా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, చండీగఢ్‌
 రెండో జోన్ ఉత్తర్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్
మూడో జోన్ రాజస్థాన్, గుజరాత్, డామన్‌ డయ్యూ (దామన్‌ దీవ్‌), దాద్రానగర్‌ హవేలీ
నాలుగో జోన్ మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌
అయిదో జోన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
ఆరో జోన్ తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్‌
ఏడో జోన్‌ ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అండమాన్‌ నికోబార్
ఎనిమిదో జోన్ బిహార్, ఝార్ఖండ్‌
తొమ్మిదో జోన్‌ ఆర్మీ పోస్టాఫీస్‌ (ఏపీఓ), క్షేత్ర తపాలా కార్యాలయం (ఎఫ్‌పీఓ)
Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌