• facebook
  • whatsapp
  • telegram

నేలలు/ మృత్తికలు

భూమి ఉపరితల, అంతర్గత శిలలు భూ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ప్రభావితమవడంతోపాటు భౌతిక, రసాయనిక మార్పుల ఫలితంగా శిథిలమవుతాయి. ఈ శిలాశైథిల్యాలతోపాటు చిన్న చిన్న ఖనిజ పదార్థాలు, రసాయన వ్యర్థాలు, జీవ సంబంధమైన వృక్ష, జంతుజాలాలు అంతరించడం వల్ల ఏర్పడిన పదార్థాలతో నీరు, గాలి కలిసి నేలలు ఏర్పడతాయి. ఇవి అనేక మీటర్ల మందంతో భూ అంతర్భాగం వరకు విస్తరించి ఉంటాయి.


* నేలలు ఏర్పడే విధానం: నేలలు ఏర్పడే విధానం చాలా నెమ్మదిగా జరుగుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 500 - 1000 సంవత్సరాలకు ఒక అంగుళం మందంలో నేలలు ఏర్పడతాయి. నేలలు ఎక్కువగా శిలలు, ఖనిజాల క్రమక్షయం వల్ల తయారైనవే. వర్షపునీరు లేదా నీటి ప్రవాహాలు గులకరాళ్లు, ఇసుక రేణువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకు వెళ్లడమనే క్రమక్షయ ప్రక్రియ ద్వారా శిలలు శైథిల్యం చెంది నిక్షేపాలు, నేలలుగా ఏర్పడుతున్నాయి.
* రసాయనిక ప్రక్రియ ద్వారా కూడా నేలలు ఏర్పడతాయి. గాలిలోని ఆక్సిజన్, కార్బన్‌డై ఆక్సైడ్‌లు నీటితో కలిసి శిలలను ప్రభావితం చేస్తాయి. వర్షపు నీటిలోని రసాయనాలు కూడా శిలలు కరగడానికి తోడ్పడతాయి. ఈ ప్రక్రియ శిలలు పూర్తిగా కరిగిపోవడం లేదా మెత్తబడటానికి దోహదపడుతుంది. కొన్నిసార్లు శిలల మధ్య పగుళ్లు ఏర్పడి మాతృ శిలల నుంచి విడిపోతాయి. ఇలా భౌతిక, రసాయన చర్యల వల్ల శిలలు శైథిల్యం చెంది వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల నేలలను ఏర్పరుస్తాయి.
* నేల: భూగోళంపై ఎగువ పొరలో వృక్షాలు పెరిగే భాగాన్ని నేల అంటారు. నేలలను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని పెడాలజీ (Pedology) అంటారు. నేలలు ఏర్పడే విధానం ముఖ్యంగా రెండు రకాలు.
అవి.. 1) స్థానబద్ధ మృత్తికలు    2) స్థాన గమన లేదా వాహక మృత్తికలు

 

* స్థానబద్ధ మృత్తికలు: భూ ఉపరితలంపై ఉన్న శిలలు వాతావరణ ప్రభావంతో శిథిలమై మెత్తటి నేలలుగా మారతాయి. వీటిని స్థానబద్ధ మృత్తికలు అంటారు. ఉదాహరణకు నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, జిగురు నేలలు మొదలైనవి.
* స్థానగమన (లేదా) వాహక మృత్తికలు: భూమిపై ఉన్న శిలలు వాతావరణ ప్రభావం వల్ల మెత్తటి మన్నుగా మారతాయి. ఇవి నీటితో కలిసి లేదా ధూళి రూపంలో గాలి ద్వారా కొట్టుకుని పోయి, వేరొక చోట మేటవేసి మృత్తికలు/ నేలలుగా ఏర్పడతాయి. వీటినే స్థానగమన మృత్తికలు అంటారు. ఉదాహరణకు ఒండ్రు నేలలు, తీరప్రాంత ఇసుక నేలలు, డెల్టా ప్రాంతాలు మొదలైనవి.
* హ్యూమస్: శైథిల్యం వల్ల విచ్ఛిన్నమైన మాతృశిలలు గాలి, నీరు మొదలైన కారకాలతో ఒక ప్రాంతంలో నిక్షిప్తమవుతాయి. ఇవి చిన్న చిన్న జీవరాశులు, వృక్షజాలం, పంటచేలు మొదలైనవి పెరగడానికి దోహదపడతాయి. ఈ విధంగా పెరిగిన వృక్షజాలం కాలక్రమేణ సూక్ష్మజీవులతో కలిసి అంతరించిపోతుంది. జీవరాశులతో కలిసి అంతరించిపోయిన వృక్షజాలాల సముదాయాన్ని హ్యూమస్ అంటారు. వృక్ష, జంతు సంబంధ రసాయన పదార్థాల వల్ల ఏర్పడిన నేలలను హ్యూమస్ నేలలు అంటారు

నేలలు - రకాలు
         భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) భారతదేశంలోని నేలలను ప్రధానంగా 11 రకాలుగా వర్గీకరించింది. నేలల మొత్తం విస్తీర్ణం 330 మిలియన్ హెక్టార్లు. ఇందులో ఒండ్రు నేలల విస్తీర్ణం 143.1 మిలియన్ హెక్టార్లు. ఇవి 43.36 శాతంతో విస్తీర్ణ పరంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఎర్ర నేలలు రెండో స్థానంలో, నల్లరేగడి నేలలు మూడో స్థానంలో నిలిచాయి.

ఒండ్రు మృత్తికలు: ఇవి నదుల ప్రవాహం వల్ల కొట్టుకుని వచ్చి, మేట మేసిన మన్ను వల్ల ఏర్పడిన డెల్టా భూములు. ఈ మృత్తిక పార్శ్వరేఖాకృతిలో ఒండలి, ఇసుక పొర విడచి ఏర్పడుతుంది. ఈ రెండు పొరలూ నదుల ద్వారా కొట్టుకుని వచ్చి అంటే నదులు మెత్తటి రేణుయుత అవక్షేపాలను నిక్షేపించడం వల్ల ఏర్పడతాయి. ఒండ్రు మృత్తికలు ముఖ్యంగా రెండు రకాలు. అవి.. 1) భంగర్, 2) ఖాదర్.
భంగర్ అంటే పురాతన ఒండలి నేలలు. ఇవి ఎక్కువ బంకమన్నుతో, ముదురు వర్ణంలో ఉంటాయి. ఖాదర్ అంటే నవీన ఒండలి నేలలు. ఇవి సాధారణంగా ఇసుకలా లేత రంగులో ఉంటాయి.
సాధారణంగా ఒండ్రు మృత్తికల్లో సున్నపురాయి, పొటాష్ సమృద్ధిగా ఉంటాయి. నైట్రోజన్, హ్యూమస్ చాలా తక్కువ. అందువల్ల ఈ మృత్తికల్లో నైట్రోజన్ ఎరువులను ఎక్కువగా వాడతారు. డెల్టా భూములు అతిసారవంతంగా ఉండటంతోపాటు బంకమట్టి, ఇసుకతో కలిసి ఉండటం వల్ల నేలలోకి గాలిపోవడం, నీటి గ్రహణశక్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో సహజంగానే నేల సారవంతమవుతుంది.
* ఒండ్రు నేలలు ఉత్తరాన పంజాబ్ నుంచి అసోం వరకు ఉన్న గంగా-సింధూ మైదానంలో బాగా విస్తరించి ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమిలోని తీర మైదానాల్లో, నర్మద, తపతి, మహానది, గోదావరి, కృష్ణా, కావేరీ నదీ లోయల్లో విస్తరించి ఉన్నాయి. దేశంలోని వ్యవసాయ సంపదలో ఎక్కువభాగం ఈ నేలలవల్లే సమకూరుతోంది.

 

నల్లరేగడి నేలలు
         అర్ధ శుష్క పరిస్థితులు ఉండే దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్ శిలలపై నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. అవక్షేప, రూపాంతర శిలలు, సున్నపురాళ్లు, షేల్స్ ప్రాంతాల్లో క్రమక్షయం వల్ల నల్లమృత్తికలు ఏర్పడతాయి. నల్లనేలలు లేదా ఉష్ణమండల చెర్నోజమ్ మృత్తికలుగా పిలిచే ఈ నేలలు ముదురు గోధుమరంగు లేదా నల్లరంగును కలిగి ఉంటాయి.
* నల్లరేగడి నేలలో మెత్తటి ఇనుప పదార్థం ఉండటంతో ఇవి నల్లగా ఉంటాయి. ఇవి ఎక్కువగా బంకమన్నును కలిగి ఉండటంతో నీటిని అధికమొత్తంలో పీల్చుకుంటాయి. భారతదేశంలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి.
* నల్లరేగడి నేలలు భూసారానికి పెట్టింది పేరు. ఈ నేలల్లో పత్తి బాగా పండుతుంది. తేమను నిల్వ ఉంచుకునే శక్తి ఉండటంతో అనార్ధ్ర వ్యవసాయానికి ఇవి చాలా అనుకూలం. వర్షాకాలంలో జిగటగా ఉండటంవల్ల వీటిని దున్నడం కష్టం. ఎండాకాలంలో ఈ మృత్తికల్లో పగుళ్లు (నెర్రలు) ఏర్పడటం వల్ల లోపలి పొరల్లోకి వాయు ప్రసరణ జరిగి, వాతావరణంలోని నైట్రోజన్‌ను స్వీకరిస్తాయి. అందువల్ల నల్లమృత్తికలకు 'తమను తాము దున్నుకుంటాయి' అనే లోకోక్తి ఏర్పడింది.
ఎర్ర నేలలు: గ్రానైట్ రాళ్ల నుంచి రూపాంతరం చెంది ఎర్ర నేలలు ఏర్పడతాయి. ఐరన్ కాంపౌండ్స్ (ఇనుప ధాతువు) అత్యధిక శాతంలో ఉండటంవల్ల ఈ నేలలకు ఎర్ర రంగు నేలలు అనే పేరు వచ్చింది. ఈ నేలల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఎర్ర నేలలకు త్వరగా తేమను కోల్పోయే గుణం ఉంటుంది. అందుకే ఈ నేలల్లోకి తరచూ నల్లమట్టి, ఇతర ఎరువులను కలుపుతూ ఉండాలి. వేసవి కాలంలో చెరువులు, కుంటల్లోని ఒండ్రుమట్టిని ఎర్ర నేలలకు కలపాలి.
* ఈ మృత్తికలకు మంచి నీటిపారుదల సౌకర్యం ఉంటే అధిక పంట దిగుబడిని ఇస్తాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎర్ర మృత్తికలను 1) చుల్క, 2) దుబ్బ నేలలుగా వర్గీకరిస్తారు.
* ఎర్ర చుల్క నేలలు: ఈ నేలలు గ్రానైట్, నీస్ సమూహాలతోపాటు క్వార్ట్‌జైట్, ముడిగ్రానైట్ నుంచి ఆవిర్భవిస్తాయి. ఇవి ముఖ్యంగా ఎత్తయిన ప్రదేశాలు, గుట్టల మధ్యభాగం, వాలు భూముల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ చాలా తక్కువగా ఉంటాయి. వీటిని సారరహిత భూములుగా పరిగణిస్తారు.
* దుబ్బ నేలలు: గండ్ర ఇసుక, రాళ్లతో కూడిన ఎర్ర నేలలు ఎండాకాలంలో పూర్తిగా బీడువారి పోయి, దుమ్ము, ధూళి అధికంగా లేస్తూ ఉంటాయి. ఈ నేలల మందం చాలా తక్కువ. ఇవి పేలిపోయిన బూడిదరంగులో ఉంటాయి. వీటిలో జీవ సంబంధ పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి.

లేటరైట్ నేలలు:
        ఎక్కువ వర్షపాతం, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాల్లో వాతావరణ ప్రభావంవల్ల ఈ మృత్తికలు ఏర్పడతాయి. వీటిని జేగురు నేలలు అని కూడా అంటారు. వీటి రంగు లేత పీత వర్ణంలో ఉండి, గోధుమ ఎరుపును కలిగి ఉంటాయి. ఈ నేలలు చాలా లోతుగా ఉంటాయి. వీటిలోపలి భాగంలో సన్నటి దిండు రాళ్లు, బంకమట్టి ఉంటాయి. లేటరైట్ నేలల్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది.

ఎడారి నేలలు:
        ఈ నేలలు శుష్క, అర్ధ శుష్క పరిస్థితుల్లో ఏర్పడతాయి. ఈ తరహా నేలల్లో ఇసుక ఎక్కువగా ఉంటుంది. గాలికి ఎగిరొచ్చి కుప్పలుగా ఏర్పడిన లోయెస్ మట్టిదిబ్బలు ఎడారి మృత్తికల్లో ఒక భాగం. సేంద్రియ పదార్థాలు, తేమ తక్కువగా ఉండటం ఈ తరహా నేలల్లోని ప్రధాన సమస్య. నీటిలో కరిగే లవణాలు, కాల్షియం కార్బొనేట్‌లు విభిన్న మోతాదుల్లో ఉండటం ఈ నేలల ప్రత్యేకత. ఈ నేలల్లో గోధుమ, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు ఎక్కువగా పండిస్తారు.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌