• facebook
  • whatsapp
  • telegram

విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు - సౌరకుటుంబం

విశ్వం అనంతమైంది. దీన్ని అంతరిక్షం, బ్రహ్మాండమని కూడా పిలుస్తారు. విశ్వ ఆవిర్భావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అమెరికన్ పరిభాషలో ఆస్ట్రానమీ, రష్యన్ పరిభాషలో కాస్మాలజీ అని  పిలుస్తారు. విశ్వంలో గెలాక్సీలు, నీహారికలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోక చుక్కలు, ఆస్టరాయిడ్స్ మొదలైనవి అంతర్భాగంగా ఉంటాయి. 
విశ్వం ఆవిర్భావాన్ని గురించి చాలామంది శాస్త్రవేత్తలు అనేక రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు.
* 'హెర్షల్' అనే ఖగోళ శాస్త్రవేత్త సౌరకుటుంబాన్ని విశ్వంలో భాగంగా పేర్కొనగా, 'హబుల్' అనే మరో ఖగోళ శాస్త్రవేత్త విశ్వం కొన్ని మిలియన్ గెలాక్సీలను కలిగి ఉందని పేర్కొన్నారు.

గెలాక్సీలు
నక్షత్రాల సమూహాన్ని ఇంగ్లిష్‌లో 'గెలాక్సీ' అంటారు. దీన్నే నక్షత్ర మండలం అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఒక గెలాక్సీలో కొన్ని మిలియన్‌ల నక్షత్రాలు ఉంటాయి. సూర్యుడు ఉన్న నక్షత్ర మండలాన్ని 'పాలపుంత' లేదా 'పాలవెల్లి' అని పిలుస్తారు. పాలపుంతకు దగ్గరగా ఉన్న నక్షత్ర మండలం  ఆండ్రోమెడా గెలాక్సీ. విశ్వంలో ఉన్న అతి పెద్ద గెలాక్సీ హైడ్రా.

పాలపుంతను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.
* భారతీయులు   -     పాలపుంత/ఆకాశ గంగ
* చైనీయులు      -     ఖగోళ నదులు
* గ్రీకులు            -      స్వర్గానికి దారులు
* ఎస్కిమోలు      -     తెల్లని భస్మీపటలాలు
* హిబ్రూలు         -       కాంతి నదులు

నక్షత్రాలు

     కేంద్రక సంలీనం కారణంగా స్వయం ప్రకాశకాలుగా ఉండే వాటినే నక్షత్రాలు అంటారు. నక్షత్రాలను మొదటగా హ్యూజిన్ కనుక్కున్నారు. నక్షత్రాల జన్మస్థానాలు నిహారికలు. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంటారి. అత్యంత ప్రకాశవంతమైంది  సిరియస్. అతిపెద్ద నక్షత్రం బెటిల్ గ్లక్స్.

నోవా: నక్షత్రాలు పాకిక్షంగా బద్దలు కావడాన్ని నోవా అంటారు.
సూపర్ నోవా: నక్షత్రం పూర్తిగా బద్దలు కావడాన్ని సూపర్ నోవా అంటారు.
నెబ్యులా (నిహారిక): వాయువులతో కూడి ఉన్న అతిపెద్ద మేఘావృతమైన భాగాన్నే నెబ్యులా అంటారు.
శూన్య ప్రదేశాలు: గెలాక్సీలకు, నిహారికలకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలను శూన్య ప్రదేశాలు అంటారు. మన విశ్వంలో దాదాపు 97 శాతం శూన్యమే ఉంది.
కృష్ణబిలం (బ్లాక్‌హోల్): నక్షత్రాల్లో అణు సంలీనం చర్య పూర్తిగా అంతరించిన తర్వాత నక్షత్రంలోని పదార్థమంతా కేంద్రం దిశగా ఆకర్షణకు గురయ్యే ఖగోళ వస్తువునే కృష్ణబిలం అంటారు. ఇది అత్యధిక సాంద్రతను, గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది.  వీటిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. 1983లో ఈయనకు నోబెల్ బహుమతి లభించింది.
సౌర కుటుంబం: సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్ మొదలైన వాటన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబానికి ఆధారం సూర్యుడు. ఇది ఒక నక్షత్రం.

సూర్యుడు
* పాలపుంతలో ఉన్న నక్షత్రాల్లో సూర్యుడు ఒక నక్షత్రం. ఇది పాలపుంత కేంద్రం నుంచి సుమారు 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది రెండు రకాల చలనాలను కలిగి ఉంటుంది. అవి భ్రమణం, పరిభ్రమణం.
* సూర్యుడికి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేకాలం 25 రోజులు కాగా, పరిభ్రమణానికి (పాలపుంత చుట్టూ తిరగడానికి) 250 మిలియన్ సంవత్సరాల (భూమిపై) సమయం పడుతుంది. అంటే భూమిపై 25 రోజుల సమయం సూర్యుడిపై ఒక రోజైతే, భూమిపై 250 మిలియన్ సంవత్సరాల సమయం సూర్యుడిపై ఒక సంవత్సరంతో సమానం. దీన్నే ఒక కాస్మిక్ సంవత్సరంగా పేర్కొంటారు.
* సూర్యుడిలో కేంద్రక సంలీనం కారణంగా శక్తి జనిస్తుంది. ఆ శక్తి కాంతి రూపంలో (హ్రస్వ తరంగాల రూపంలో) ఇరువైపులకీ ప్రసరిస్తుంది.
* కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు లేదా 3 × 108 మీ/సెకను. ఈ వేగంతో కాంతి ప్రయాణించి 7.56 సెకన్లలో సూర్యుడి నుంచి భూమికి చేరుతుంది.
* సూర్యుడి వాతావరణంలో అధికంగా ఉండే వాయువు హైడ్రోజన్. ఇది హీలియం వాయువుగా మారే క్రమంలో జరిగే కేంద్రక సంలీనం కారణంగా శక్తి జనిస్తుంది.
* సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత 6000oC. కేంద్రంలో ఉష్ణోగ్రత సుమారు 1,00,000oC. సూర్యుడి వయసు సుమారు 5 బిలియన్ సంవత్సరాలు.  భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దగా ఉంటాడు. సూర్యుడి బరువు భూమి కంటే 330 రెట్లు అధికం. దీని గురుత్వాకర్షణశక్తి భూమి కంటే 28 రెట్లు అధికం. సూర్యుడికి, భూమికి మధ్య దూరం 149.5 మి.కి.మీ. దీన్ని ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అంటారు.

* సూర్యుడి వాతావరణాన్ని మూడు పొరలుగా విభజించవచ్చు.
అవి:  1. ఫొటోస్ఫియర్ (కాంతి మండలం)
        2. క్రోమోస్ఫియర్ (వర్ణావర్ణం)
        3. కరోనా (సూర్యకాంతి ప్రదేశం)
ఫొటోస్ఫియర్: సూర్యుడిలో కనిపించే అత్యంత ప్రకాశవంతమైన భాగాన్ని ఫొటోస్ఫియర్ అంటారు. ఈ ప్రాంతంలోని నల్లటి కాంతిహీనమైన మచ్చలను సూర్యాంకాలు లేదా సన్‌స్పాట్స్ అంటారు.
* సూర్యాంకాల నుంచి విడుదలయ్యే ఆవేశపూరిత విద్యుత్ కణాల సమూహాన్ని 'సౌర జ్వాలలు' అని పిలుస్తారు. ప్రతి 10 నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఒకసారి సూర్యాంకాల నుంచి అత్యధిక పరిమాణంలో సౌర జ్వాలలు విడుదల అవుతుంటాయి. వీటినే సౌర సునామీలు లేదా సౌర తుపానులు అని అంటారు.
* సూర్యుడి ఫొటోస్ఫియర్ ప్రాంతంలో న్యూట్రాన్ అణువుల ఉద్గారం తక్కువ స్థాయిలో జరిగితే, వాటిని 'సౌర పవనాలు' అంటారు. ఇవి భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు అక్కడున్న దుమ్ము, ధూళి కణాలపై పడి, వివర్తనం చెందుతాయి. ఫలితంగా ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద మంచుపై ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ వర్ణ పుంజాలు ఏర్పడతాయి. వీటినే 'అరోరాలు' అంటారు. వీటిని ఉత్తరార్ధ గోళంలో 'అరోరా బొరియాలిస్', దక్షిణార్ధ గోళంలో 'అరోరా ఆస్ట్రాలిస్' అని పిలుస్తారు.

క్రోమోస్ఫియర్: ఇది ఫొటోస్ఫియర్ పైభాగంలో ఎరుపు, ఆరెంజ్ రంగులో ఉండే భాగం. ఈ ప్రాంతం సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మూలకాల ఉనికిని తెలిపే నల్లటి కాంతిహీనమైన రేఖలు ఉంటాయి. వీటిని 'ప్రాన్‌హోపర్ రేఖలు' అంటారు.  ఈ ప్రాంతంలోని సూర్యుడి వాతావరణంలో మచ్చలు అధికంగా ఉంటాయి.
కరోనా: సూర్య, చంద్ర గ్రహణాల సమయాల్లో సూర్యుడిలో కనిపించే భాగాన్నే 'కరోనా' అంటారు. ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. సూర్యుడిలోని థర్మో న్యూక్లియర్ చర్యలన్నీ ఈ ప్రాంతంలోనే జరుగుతాయి.

 

సౌరకుటుంబ పరిధి
సౌరకుటుంబ పరిధిని మూడు భాగాలుగా విభజించవచ్చు.

అవి: 1) గ్రహాల పరిధి
        2) కూపియర్ బెల్ట్ / పరిధి
        3) ఊర్ట్‌క్లౌడ్ పరిధి
గ్రహాల పరిధి: ఈ పరిధిలో ప్రధానంగా గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్ మొదలైనవి ఉంటాయి. సూర్యుడి చుట్టూ 8 గ్రహాలు, వాటి ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి.
కూపియర్ బెల్ట్/ పరిధి: గ్రహాల పరిధికి అవతల ఉన్న సౌరకుటుంబంలోని ప్రాంతాన్ని కూపియర్ బెల్ట్ అంటారు. ఇందులో తోకచుక్కలు, మరుగుజ్జు గ్రహాలు  ఉంటాయి. మరుగుజ్జు గ్రహాలకు ఉదాహరణగా ప్లూటో, సెరస్, ఎరిస్, డిస్మోనియా, సెడ్నీ లాంటి వాటిని పేర్కొనవచ్చు.

ఊర్ట్‌క్లౌడ్ పరిధి: సౌరకుటుంబంలో కూపియర్ బెల్ట్ పరిధికి అవతల ఉన్న ప్రాంతాన్ని ఊర్ట్‌క్లౌడ్ పరిధి అంటారు. ఇది సౌరకుటుంబంలో చివరి భాగం. దీనితో సౌరకుటుంబం పరిధి అంతమవుతుంది. ఈ ప్రాంతంలో సుదూరంగా ఉండే తోకచుక్కలు ఉంటాయి.

గ్రహాల సమాచారం
* సౌరకుటుంబంలో తమ చుట్టూ తాము తిరుగుతూ, సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరిగే ఖగోళ పదార్థాలను గ్రహాలు అంటారు.
* ప్రస్తుతం సౌరకుటుంబంలో సుర్యుడి చుట్టూ తిరుగుతూ 8 గ్రహాలు ఉన్నాయి. అవి:
1) బుధుడు         2) శుక్రుడు    3) భూమి          4) అంగారకుడు
5) బృహస్పతి      6) శని           7) యముడు     8) ఇంద్రుడు
(2006 అక్టోబరు 24న చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ప్లూటోను గ్రహం హోదా నుంచి తొలగించి, మరుగుజ్జు గ్రహంగా (134340) పేర్కొన్నారు).
ఈ గ్రహాలను వాటి సాంద్రత, పరిమాణం, లక్షణాలను బట్టి రెండు వర్గాలుగా విభజించారు.
అవి:   1) అంతర గ్రహాలు                   
         2) బాహ్య గ్రహాలు
* సూర్యుడి నుంచి మొదటి నాలుగు గ్రహాలను అంతర గ్రహాలు, చివరి నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలని విభజించారు.

బుధుడు: సౌరకుటుంబంలోని అతి చిన్న గ్రహం. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటుంది. దీనికి  సూర్యుడి చుట్టూ తిరగడానికి అతి తక్కువ సమయం (88 రోజులు) పడుతుంది. దీనికి ఉపగ్రహాలు లేవు. దీన్ని రోమన్‌ల వ్యాపార దేవతగా పేర్కొంటారు.
శుక్రుడు: భూమికి ఉన్న కవల గ్రహం. దీన్ని ఉదయకాంతపు తార, సంధ్యాతారగా పేర్కొంటారు. ఇది భూమికి అత్యంత సమీపంలో ఉంటుంది. సౌరకుటుంబంలో అత్యంత వేడిగా ఉండే  గ్రహం. ఈ గ్రహ వాతావరణంలో అత్యధిక శాతం కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ఉంటుంది. భ్రమణానికి అధిక సమయం, పరిభ్రమణానికి తక్కువ సమయం తీసుకునే ఏకైక గ్రహం. ఇది తూర్పు నుంచి పశ్చిమానికి భ్రమణం చెందడం వల్ల దీనిపై సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడు. ప్రాచీన గ్రీకులు దీన్ని 'గాడ్ ఆఫ్ బ్యూటీ'గా భావించేవారు. దీనికి ఉపగ్రహాలు లేవు.
భూమి: సౌరకుటుంబంలో జీవరాశిని కలిగిన ఏకైక గ్రహం. అత్యధిక సాంద్రత కలిగి ఉంటుంది (5.52 శాతం). భూమిపై నీరు అధికశాతం విస్తరించి ఉండటం వల్ల దీన్ని 'నీలి గ్రహం' అని పిలుస్తున్నారు.
* ఇది అంతర గ్రహాల్లో అతిపెద్ద గ్రహం. భూ వాతావరణంలో నైట్రోజన్ 78.07 శాతం, ఆక్సిజన్ 20.98 శాతం, ఆర్గాన్ 0.98 శాతం, కార్బన్ డై ఆక్సైడ్ 0.03 శాతం, మిగిలిన వాయువులు అత్యల్ప శాతాల్లో ఉన్నాయి.
* భూ భ్రమణానికి పట్టే సమయం 23 గంటల 56 నిమిషాల 4 సెకన్లు. పరిభ్రమణానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. భ్రమణ వేగం గంటకు 1610 కి.మీ. కాగా, పరిభ్రమణ వేగం సెకనుకు 29.8 కి.మీ., భూ పలాయన వేగం సెకనకు 11.8 కి.మీ.

* సౌరకుటుంబంలో భూమి అయిదో అతిపెద్ద గ్రహం. భూమి సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగడం వల్ల భూమికి, సూర్యుడికి మధ్య దూరం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు.
* భూమికి, సూర్యుడికి మధ్య దూరం తక్కువగా ఉన్న సందర్భాన్ని పరిహేళి  అని పిలుస్తారు. ఇది సాధారణంగా జనవరి 3న సంభవిస్తుంది. ఈ సమయంలో భూమికి సూర్యుడికి మధ్య దూరం 147 మి. కి.మీ. ఉంటుంది.
* సూర్యుడికి, భూమికి మధ్య దూరం ఎక్కువగా ఉన్న సందర్భాన్ని అపహేళి  అని పిలుస్తారు. ఇది సాధారణంగా జులై 4న సంభవిస్తుంది. ఈ సమయంలో వీటి మధ్య దూరం 152 మి. కి.మీ.
* భూమి వయసు సూమారు 4.5 బిలియన్ సంవత్సరాలు. భూమి సరాసరి ఉష్ణోగ్రత సుమారు 14.5oC. భూమధ్య రేఖ వద్ద భూమి చుట్టుకొలత సుమారు 40,066 కి.మీ., ధృవాల వద్ద చుట్టుకొలత 39,992 కి.మీ. ఉత్తర - దక్షిణ ధృవాల మధ్య దూరం 12,714 కి.మీ., తూర్పు- పడమరల మధ్య దూరం 12,756 కి.మీ. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు.

చంద్రుడు

* భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. చంద్రుడి కాంతి భూమిని చేరడానికి పట్టేకాలం 1.3 సెకన్లు. భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి 1/6వ వంతు ఉంటుంది. చంద్రుడి ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 1/81వ వంతు ఉంటుంది. చంద్రుడి వ్యాసం 3,475 కి.మీ.

* చంద్రుడు కూడా గ్రహాల మాదిరిగానే  తన చుట్టూ తాను తిరుగుతూ, తన అక్షమైన భూమి చుట్టూ తిరుగుతుంది. అయితే, చంద్రుడు భ్రమణానికి, పరిభ్రమణానికి ఒకే సమయం తీసుకోవడం వల్ల భూమిపై ఉన్నవారికి చంద్రుడిలోని 59 శాతం భాగం మాత్రమే కనిపిస్తుంది.
* చంద్రుడి భ్రమణ, పరిభ్రమణ కాలాలను రెండు రకాలుగా లెక్కించవచ్చు. అవి:
1) స్థిర నక్షత్రాల సాపేక్షత ద్వారా చంద్రుడు భూమిని 27  రోజుల్లో చుట్టివస్తాడు. దీన్నే 'చంద్ర నక్షత్ర మాసం' అని పిలుస్తారు.
2) సూర్యుడి సాపేక్షత ద్వారా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 29  రోజులు తీసుకుంటాడు. దీన్నే 'చాంద్ర మాసం' అని పిలుస్తారు.


విశ్వం/ గ్రహాల ఆవిర్భావ సిద్ధాంతాలు

* బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం         -           అబ్బై జార్జ్ లెమిత్రి (బెల్జియం)
* డోలనా సిద్ధాంతం              -           అలెస్ శాండేజ్
* స్టడీస్టేట్ సిద్ధాంతం             -           హెర్మన్ బోండీ, థామస్ గోల్డ్, ఫ్రెడ్ హయ్‌లే
* వాయు సిద్ధాంతం              -           ఇమాన్యువల్ కౌంట్ (జర్మనీ)
* గ్రహాల పరికల్పన సిద్ధాంతం  -          బాంబర్లీన్, మౌల్టన్ (అమెరికా)
* నెబ్యులార్ (నిహారిక పరికల్పన) సిద్ధాంతం  -  లాప్లెస్ (ఫ్రెంచ్)
* టైడల్ (తరంగాల) హైపోథీసిస్  -  జీన్స్, జెఫ్రీన్ (బ్రిటన్)
* బైనరీస్టార్ (ద్వి నక్షత్ర) థియరీ   -        లిటిల్‌టన్, రసెల్
* ఫొటో ప్లానెట్ సిద్ధాంతం             -        కూపియర్
* డస్ట్ అండ్ గాసియస్ థియరీ      -       అట్టోమన్ × స్కిమిడ్
* ఫిజన్ సిద్ధాంతం                        -       రాసేగన్
* విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం   -        ఆల్ఫ్‌వెన్
* ద్రవీభవన పరికల్పన                -         హెరాల్డ్ సి ఉరే
* భూకేంద్ర సిద్ధాంతం                   -          టాలమీ (క్రీ.శ. 140)
* సూర్యకేంద్ర సిద్ధాంతం               -         కోపర్నికస్ (క్రీ.శ. 1543)

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌