• facebook
  • whatsapp
  • telegram

కుల‌వ్య‌వ‌స్థ‌

హిందూ సమాజంలో వ్యక్తి సామాజిక అంతస్తును కులం నిర్ధారిస్తుంది. ఇది ఇప్పటికీ చాలామేర ఆచరణలో ఉంది. కులవ్యవస్థ సూచించే వృత్తిని ఆచరించడం కూడా ఇంకా ఉంది. ఒక రకంగా కులం అనేది వ్యక్తి జీవనోపాధికి సంబంధించిన భద్రతను కల్పించింది. కులం ప్రజల్ని విభజించినా.. పరస్పరం ఆధారపడే తత్వం సమాజంలో కనిపిస్తుంది. ప్రతి కులం ఇతర కులాలపై ఆధారపడి జీవిస్తుంది. ముఖ్యంగా జాజ్‌మానీ (యాజమాన్య) వ్యవస్థను పరిశీలిస్తే.. గ్రామీణ సమాజాల్లో వివిధ కులాలవారు పరస్పరం వృత్తిపరమైన సేవలను అందించుకోవడం, వృత్తిపరమైన సేవలను స్వీకరించడం హక్కుగా, బాధ్యతగా భావిస్తారు. సేవలు స్వీకరించే వ్యక్తి యజమాని అయితే అందించే వ్యక్తిని 'కామిన్' అంటారు.. అంటే సేవకుడు. కొన్ని సందర్భాల్లో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి యజమాని అయితే, మరో సందర్భంలో కామిన్ అవుతాడు. ఉదాహరణకు ఉన్నత కులస్థుడుగా భావించే ఒక వ్యక్తి ఇతర కులస్థుల ఇంటికి వెళ్లి సేవలందించే క్రమంలో యజమాని అయితే, ఆ సేవలకు ప్రతిఫలం తీసుకునే క్రమంలో కామిన్ అవుతాడు. ఈ జాజ్‌మానీ వ్యవస్థలో శ్రమవిభజన సూత్రం కూడా కనిపిస్తుంది. ప్రతి కులానికీ ఓ వృత్తి ఉంటుంది. ఆ వృత్తికి సంబంధించిన నైపుణ్యం ద్వారా సేవలందిస్తారు. తద్వారా జీవనోపాధి పొందుతారు. పరస్పర ఆధారితత్వం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆయా వృత్తులవారి నైపుణ్య ఆసరాలు లేకుండా కార్యక్రమాలు, సంస్కారాలు జరిగే అవకాశమే లేదు. ఉదాహరణకు వివాహాన్ని తీసుకుంటే.. పెళ్లి అదే కులంలోని వారితో జరిగినా, ఇతర కులాల ప్రమేయం ఇందులో వివిధ రూపాల్లో కనిపిస్తుంది. జాజ్‌మానీ వ్యవస్థ కులవృత్తులకు సంబంధించినవారు పరస్పరం ఆదానప్రదానం చేసుకోవడం కనిపిస్తుంది. ఉదాహరణకు వ్యవసాయదారుడు వివిధ కులాల వారి నుంచి పలు రూపాల్లో సేవల్ని తీసుకుంటాడు. వారందరికీ ఏదో ఒక రూపంలో ప్రతిఫలం ఇస్తాడు. అంటే ప్రతి వృత్తి సేవలను అందించడంతో పాటు సేవలకు ప్రతిఫలం కూడా పొందుతుంది.

సమతౌల్య జీవనం... మానసిక స్థిరత్వం
కులవ్యవస్థ జాజ్‌మానీ(యాజమాన్య) వ్యవస్థ ద్వారా సామాజిక సుస్థిరతకు దోహదం చేసిందనేది సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతేకాకుండా వ్యక్తుల ప్రవర్తనను కూడా నియంత్రిస్తుంది. ప్రతివ్యక్తి నిర్దేశించుకున్న నియమనిబంధనలు, కట్టుబాట్లకు లోబడి ఉండాలి. వాటిని అతిక్రమిస్తే కుల నియమ నిబంధనలకు అనుగుణంగా శిక్షిస్తారు. కాబట్టి సమాజంలో అశాంతి, అస్థిరత ప్రబలకుండా ఈ వ్యవస్థ దోహదం చేసేది. ప్రతి కులానికి కులసంఘం ఉంటుంది. కుల పంచాయతీకి అందులోని సభ్యులందరిపైనా అధికారం ఉంటుంది. కులంలోనివారి మధ్య వచ్చే విభేదాలను (ఆస్తులు, వివాహ సంబంధ తగవులు వంటివి), ఇతర కులాలతో వచ్చే సమస్యలను ఈ కుల పంచాయతీలు తీర్చేవి. గ్రామీణ సమాజంలో ఒక రకమైన సమతౌల్య జీవనం ఉండేలా కుల పంచాయతీలు దోహదపడేవి. రెండు కులాల మధ్య ఘర్షణ వస్తే రెండు కులాల పెద్దలు కలిసి తీర్మానాలు చేసుకొని పరిష్కరించుకునేవారు. భారతీయ సమాజంలో సమతౌల్య జీవన విధానం కొనసాగడానికి ఈ కులవ్యవస్థ ఈ రకంగా దోహదపడేది. కులం ప్రజలను కొన్ని అంశాల్లో విడదీసినా సంఘర్షణలు ఏర్పడినప్పుడు కుల పంచాయతీలు, సంఘాల ద్వారా వాటిని పరిష్కరించుకునే వెసులుబాటు కులవ్యవస్థలో ఉండేది.
కులవ్యవస్థ వ్యక్తులకు మానసిక స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. వ్యక్తికి సామాజిక అంతస్తు, వృత్తి, కులంలోనే వివాహం చేసుకునే హక్కు, ఏ రకమైన పరిస్థితుల్లోనైనా కుల సభ్యుల మద్దతు.. తదితరాలను అందిస్తుంది. కాబట్టి సమాజంలో వ్యక్తికి ఒంటరితనం ఉండదు. అస్థిరత్వం లేకుండా, ఒక రకమైన మానసిక శాంతిని కులం కల్పిస్తుంది. వృత్తి, జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతుల పరంగా ఆధారపడేలా తీర్చిదిద్దింది కాబట్టి సంప్రదాయ పరిస్థితుల్లో కులం సామాజిక స్థిరత్వానికి కొంత దోహదం చేసింది.

అనర్థాలు.. సమస్యలు
కులవ్యవస్థ సృష్టించిన ప్రధానమైన సమస్య అస్పృశ్యత. నిమ్న కులాలకు సంబంధించిన వారిని సమాజానికి దూరంగా ఉంచే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి వారంతా అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో దూరంగా ఉన్నారు. విద్య, ఉపాధి వంటి అవకాశాల్లోనే కాదు, భూమిపై యాజమాన్య హక్కు లేకపోవడం వంటి అంశాల్లో కూడా సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ఉన్నత, నిమ్న వర్గాలుగా విభజితమవడం అనేది - కొందరు ఇతర మతాల్లోకి మారడానికి దారి తీసింది.
కులవ్యవస్థలోని మరో అవలక్షణం పురుషాధిక్యత. స్త్రీల అంతస్తుల్లో చాలా తగ్గుదల.. వేదకాలంలో స్త్రీల అంతస్తు అధికమనే చెప్పినా, సంప్రదాయ కులవ్యవస్థలో మాత్రం అది అంతగా కనిపించలేదు. బాల్య వివాహాలు చేయడం, చిన్నతనంలోనే వైధవ్యం వచ్చిన వారికి పునర్‌వివాహం చేయకపోవడం, మహిళలకు విద్యను అంతగా అందుబాటులో ఉంచకపోవడం.. ఇలాంటివన్నీ వారిపట్ల వివక్షకు ఉదాహరణలే. కులాలకు అతీతంగా అన్నిచోట్ల స్త్రీలది దాదాపు ఇదే పరిస్థితి.
ఒక కులానికి సంబంధించిన వారు ఆ కులవృత్తినే చేపట్టాలనే నిబంధన వల్ల ఇతర అంశాల్లో నైపుణ్యం సంపాదించే శక్తియుక్తులుండి కూడా చాలామంది వాటికి దూరమైపోవాల్సి రావడం కులవ్యవస్థ ఫలితమే. దేశ ఆర్థికాభివృద్ధి వేగవంతం కాకపోవడానికీ కులవ్యవస్థ ఆటంకంగా మారింది.
కులం ఒకప్పుడు సమాజం సంఘటితంగా ఉండేదుకు దోహదం చేసినా ఆధునిక కాలంలో సమాజం విచ్ఛిన్నం కావడానికి కారణమవుతోంది. కులాలు - ఉపకులాలు, వాటికున్న వివిధ వృత్తులు, ఆచార వ్యవహారాలు విభిన్న కులాల మధ్య ఘర్షణకు దారితీసే పరిస్థితులున్నాయి. కొన్ని కులాలకే ప్రత్యేక అర్హతలున్న కారణంగా కులవ్యవస్థ కొన్ని సందర్భాల్లో ఆర్థిక, సామాజిక అసమానతలను సృష్టించింది. ఈ అసమానతల వల్ల సమాజంలో ఘర్షణలు మొదలయ్యాయి. సాంప్రదాయిక కులవ్యవస్థలో ఘర్షణలు తక్కువ.. ఎందుకంటే అంతా భూమిపైనే ఆధారపడి ఉండేవారు. కానీ నగరీకరణ, పారిశ్రామికీకరణ తర్వాత వాటి ఫలాలు కొన్ని కులాలకే ఎక్కువగా చేరడంతో సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల ఉన్నత - నిమ్న కులాలకు మధ్య సంఘర్షణలు జరుగుతున్న పరిస్థితులున్నాయి. బిహార్‌లో కుల పోరాటాలు కూడా జరుగుతున్నాయి.
రాజకీయపరమైన అనైక్యత మరో సమస్యగా మారింది. కులం రాజకీయ రంగంలో ప్రముఖపాత్రను పోషిస్తోంది. ప్రతి కులంలోనూ తమ వారిని సభ్యులుగా సమీకరించి రాజకీయపరమైన ఆధిపత్యాన్ని పొందాలనే పరిస్థితి ఆధునిక సమాజంలో ఏర్పడింది. దీంతో రాజకీయ సంఘర్షణలు కూడా కులం ప్రాతిపదికన జరుగుతున్నాయి. కులం ఆధారంగా రాజకీయ అధికారం పొందాలనుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ప్రజల అవసరాలు, సమస్యలు ప్రాతిపదికగా కాకుండా కుల ప్రాతిపదికగా అధికారం పొందాలనే భావన ఈ కులవ్యవస్థ సృష్టించిందే.

మారుతోంది సమాజం
కులం అనేది అనేక సందర్భాల్లో సామాజిక, ఆర్థిక పరివర్తనకు ఆటంకంగా ఉంది. దీన్ని అధిగమించాలనే వాదన క్రమంగా పెరిగింది. కులవ్యవస్థ లక్షణాలను ప్రాతిపదికగా తీసుకొని స్వాతంత్య్రానంతర కాలంలో మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఫలితంగా పలు మార్పులొచ్చాయి కూడా. అందుకే స్వాతంత్య్రం నాటి కులవ్యవస్థకు ఇప్పటి కులవ్యవస్థకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా కులాలు, వివాహాలు.. మహిళలు, బాల బాలికలకు సంబంధించి ప్రవేశపెట్టిన చట్టాల ఫలితంగా చాలా మార్పులొచ్చాయి. బ్రిటిష్ కాలంలో ప్రముఖ సంఘ సంస్కర్తలు రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వీరేశలింగం పంతులు వంటివారి కృషి వల్ల హిందూ సమాజంలో కులవ్యవస్థకు సంబంధించిన సాంఘిక దురాచారాలను రూపుమాపే కార్యక్రమాలు చేపట్టారు. సతీ సహగమనాన్ని, బాల్యవివాహాలను వ్యతిరేకించడం; మూఢ నమ్మకాలను పారదోలడం; వితంతు వివాహాలను ప్రోత్సహించడం వంటివాటివల్ల సమాజంలో అనేక ప్రయోజనకర మార్పులు వచ్చాయి. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వంటివారు అస్పృశ్యతను లేకుండా చేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. వివిధ కులాల్లో చేతనాత్మకమైన దృష్టిని, ఆలోచనను తీసుకు రావడానికి విశేషంగా కృషి చేశారు.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక పారిశ్రామికీకరణ, నగరీకరణ వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి నగర ప్రాంతాలకు వలస వెళ్లారు. అన్ని కులాల వారు కలసి ఒకేచోట పనిచేయడం వల్ల కుల వివాదాలు తగ్గాయి. సామాజిక వివక్షలు, ఆంక్షలు తగ్గాయి. వివిధ కులాల వ్యక్తులు కలసి పనిచేయడం వల్ల అంతకుముందున్న అగాధం తగ్గింది. పారిశ్రామికీకరణలో కులాన్ని బట్టికాకుండా వ్యక్తి సామర్థ్యం, నైపుణ్యం ఆధారంగా జీవనోపాధి దొరుకుతుండటం వల్ల కుల ప్రాధాన్యం తగ్గింది. దీంతో చాలామంది వ్యక్తులు సాంప్రదాయిక కులవృత్తుల నుంచి సంప్రదాయేతర వృత్తుల్లోకి మారుతున్నారు. కులానికి, వృత్తికున్న అవినాభావ సంబంధం కూడా మారుతోంది. ఒక కులానికి చెందిన వృత్తిని మరో కులానికి చెందినవారు స్వీకరిస్తున్నారు. కులవృత్తులు అందరికీ అనుకూలంగా మారాయి. ఎవరైనా ఏ వృత్తినైనా స్వీకరించవచ్చు.. కావాల్సింది నైపుణ్యమే. మరో కీలక పరిణామం.. కులాంతర వివాహాలు. ఒకప్పుడు ఒక కులంలోని వారు అదే కులంలోని వారిని వివాహం చేసుకోవాలనే నియమం బలంగా ఉండేది. ఆధునిక సమాజంలో చట్టాలతో పాటు సమాజం కూడా కులాంతర వివాహాలను ఆమోదించే పరిస్థితి ఏర్పడింది. నేటి సామాజిక పరిస్థితుల్లో కులాంతర వివాహాలు పెరిగాయి. నాగరికత, విద్యలో వస్తున్న మార్పులు ఇందుకు కారణం కావొచ్చన్నది సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం.
స్వాతంత్య్రం వచ్చిన తొలి దశల్లో రాజకీయ, ఆర్థికాధికారం ప్రాబల్య కులాల చేతుల్లోనే ఉండేవి. సాంప్రదాయికంగా ఉన్నత కులాలు వేరు.. ప్రాబల్య కులాలు వేరు. రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ప్రాబల్య కులాలే శాసించేవి. భారత రాజ్యాంగం ప్రసాదించిన కొన్ని హక్కుల వల్ల, రాజ్యాంగం ప్రవేశపెట్టిన కొన్ని అవకాశాల వల్ల అన్ని కులాలకు సంబంధించినవారు కూడా రాజకీయ, ఆర్థికరంగంలో ఉన్నత స్థితికి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ రంగాల్లో ఉన్నతస్థితిలో ఉన్నవారిలో అన్ని కులాలవారూ ఉన్నారు. నిమ్న కులాల్లోనూ మార్పులొచ్చాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 17ల ప్రకారమే కాకుండా అంటరానితనాన్ని నిషేధిస్తూ 1955లో వచ్చిన చట్టం; పౌరహక్కుల భద్రత చట్టం, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం; మహిళలకు ఆస్తిహక్కు; బాల్యవివాహాల రద్దు; హిందూ వివాహ చట్టంలో మార్పులు.. తదితర కొన్ని చట్టాల వల్ల నిమ్న కులాల హక్కులకు సంరక్షణ ఏర్పడింది. అప్పటివరకు ఉన్న సాంప్రదాయికతకు ఆంక్షలు తగ్గిపోయాయి.

సంస్కృతీకరణ.. పాశ్చాత్యీకరణ
ఎం.ఎన్.శ్రీనివాసన్ అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పిన ప్రకారం.. నిమ్న కులాల వ్యక్తులు ఉన్నత కులాల జీవనవిధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి, వారి ఆచార వ్యవహారాలను అనుకరించడం ద్వారా తాము కూడా ఉన్నత కులస్థాయికి చేరే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు చాలామంది నిమ్నకులాలవారు ఉన్నత కులస్థాయిని కోరుకుంటున్నారు. మరోవైపు ఉన్నత కులాలు, నిమ్నకులాలవారు విదేశీ జీవనవిధానాన్ని అనుకరించడం ద్వారా పాశ్చాత్యీకరణ పొందుతున్నారు. బ్రిటిష్ పరిపాలన కాలంలోని పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల జీవన విధానంలో, ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. ఈ రెండింటివల్ల కులవ్యవస్థలో చాలామార్పులు చోటుచేసుకున్నాయి.

అలాంటిదేం లేదు!
మరి కులం అంతరిస్తోందా? అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. సరికదా.. కులం రాజకీయ రూపం సంతరించుకుంటోంది. కులం రాజకీయ రంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. కుల సంఘాలు ఆయా సభ్యులను సంఘటితం చేస్తున్నాయి. కులం వ్యక్తి పురోగతికి ఆటంకం కాదు. కానీ కులం కులసంఘాల రూపంలో శక్తిగా అవతరిస్తోంది. ముఖ్యంగా దక్షిణభారతంలో కులసంఘాలు విద్యాసంస్థల్ని, హాస్టళ్లను ప్రారంభిస్తున్నాయి. సేవారంగంలోనూ ఉన్నాయి. రాజకీయ అధికారాన్ని కూడా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కులాలు నేటికి వ్యవస్థీకృతమై పోయాయి.

ప్రాబల్య కులాలు
ఎం.ఎన్.శ్రీనివాస్ ప్రాబల్య కులాల గురించి కూడా చెప్పారు. భారతదేశంలో రాజకీయ అధికారం సాంప్రదాయికంగా ఉన్న ఉన్నత కులస్థుల నుంచి సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న మధ్యస్థ కులాల చేతుల్లోకి మారుతోందన్నది ఆయన మాట. ఐదు లక్షణాలున్న వాటిని ప్రాబల్య కులాలుగా ఆయన వర్గీకరించారు. అవి..
1. సంఖ్యాపరంగా అధికంగా ఉండటం
2. గ్రామీణ ప్రాంతాల్లో భూమిపై ఆధిపత్యం, యాజమాన్య హక్కు
3. రాజకీయ, పరిపాలన అధికారానికి సామీప్యంగా ఉండటం
4. నగరాల నుంచి వచ్చే ఆదాయం
5. ఉన్నత విద్య
వీటిలో తొలి మూడూ కీలకం. సంఖ్యాబలం, భూమిపై ఆధిపత్యం, రాజకీయ, పరిపాలన యంత్రాంగానికి దగ్గరగా ఉండేవారే ప్రాబల్య కులాలు. అధికారం వీరి చేతుల్లో ఉంటోంది. ఇప్పటికే కొన్ని కులాలు ప్రాబల్య కులాలుగా ఆవిర్భవించాయి. మరికొన్ని తమ సభ్యులను సమీకరించుకొని ఆవిర్భవించే ప్రయత్నం చేస్తున్నాయని శ్రీనివాస్ విశ్లేషించారు. ఉదాహరణకు కర్ణాటకలోని వక్కళిగులు, లింగాయత్‌లు ప్రాబల్య కులాలుగా ఆవిర్భవించారు. హరియాణాలో జాట్లు, తమిళనాట నాడార్లు, కేరళలో ఎజవాలు (ఒకప్పుడు అంటరానితనం అనుభవించినవారు), బిహార్‌లో భూమిహార్లు, యాదవ, కుర్మిలు; గుజరాత్‌లో పాటిదార్లు, తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి, కమ్మ, కాపు కులాలు ప్రాబల్యంలో ఉన్నాయి. ఈ ప్రాబల్య కులాలు భూమిని నియంత్రణలో ఉంచుకోవటంతో పాటు, సంఖ్యాబలాన్ని సమీకరించుకొని రాజకీయశక్తులుగా ఎదుగుతున్నాయి.

సామాజిక ఉద్యమాలు
కులవ్యవస్థలో ఓ 50 సంవత్సరాల కిందటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. సామాజిక సంస్కరణ ఉద్యమాలు, ఆర్య సమాజం కులవ్యవస్థను ఖండించాయి. వీటితో పాటు అనేక ఉద్యమాలు కులం మార్పుల్లో చాలా కీలకపాత్ర పోషించాయి. మహాత్మా జ్యోతిబా పూలే ఆరంభించిన సత్యశోధక్ సమాజ్ ఉద్యమం, అస్పృశ్యతకు, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన బీఆర్ అంబేడ్కర్ ఆరంభించిన అంబేడ్కరేట్ ఉద్యమం, తమిళనాట వచ్చిన ఆత్మగౌరవ ఉద్యమాలు (రామస్వామి నాయకర్ సారథ్యంలో), కేరళలో శ్రీనారాయణ గురు ధర్మపరిపాలన ఉద్యమం, దళిత్ పాంథర్స్ ఉద్యమం (మహారాష్ట్ర), బహుజన్ సమాజ్ ఉద్యమం (ఉత్తర్‌ప్రదేశ్) ఫలితంగా కూడా కులవ్యవస్థలో మార్పులొచ్చాయి.

కులవ్యవస్థలో మార్పులకు కారణాలు..
* బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పాశ్చాత్య విద్య
* సాంకేతిక పరిజ్ఞానం
* నగరీకరణ, పారిశ్రామికీకరణ
* సాంఘిక శాసనాలు
* సామాజిక ఉద్యమాలు
* ఆధునిక విద్యావ్యాప్తి
* వివిధ చట్టాలు
''దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో మార్పులొచ్చాయి.. వాటి ప్రభావం కులవ్యవస్థపై, కుల ప్రకార్యాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉందన్నది ఎం.ఎన్. శ్రీనివాసన్, కేట్కర్, హట్టన్ డేవిడ్ జి. మాండెల్‌బమ్, ఎస్.సి. దూబేలాంటి సామాజిక శాస్త్రవేత్తల అభిభాషణ."

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌